పొలం నుంచి ఒలింపిక్ పోడియం వరకు రైతు బిడ్డ సరబ్‌జోత్ ప్రస్థానం
‘కిసాన్ ద పుత్తర్ హై... దిల్ థోడా చడీ దా’... శనివారం 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో త్రుటిలో ఫైనల్ చేరే అవకాశం కోల్పోయిన తర్వాత సరబ్‌జోత్‌తో అతని తండ్రి జతీందర్ సింగ్ చెప్పిన మాట ఇది. ‘రైతు బిడ్డవు నువ్వు...బేలగా మారిపోయి బాధపడవద్దు’ అంటూ నాన్న స్ఫూర్తి నింపే ప్రయత్నం చేయగా... సరిగ్గా మూడు రోజుల తర్వాత ఆ బిడ్డ మళ్లీ తన తుపాకీని లక్ష్యంపై సరిగ్గా గురి పెట్టాడు.
‘నా కొడుకు షూటింగ్‌ను చాలా ఇష్టపడ్డాడు. గత పదేళ్లుగా అందులో ఎంతో కష్టపడ్డాడు. గత ఈవెంట్‌లో ఫైనల్ అవకాశం కోల్పోయినప్పుడు అదే గుర్తు చేశాను. గతం మరిచి భవిష్యత్తుపై దృష్టి పెట్టమని చెప్పాను. ఆ నిరాశను దూరం చేసి అతను ఇప్పుడు ఒలింపిక్ పతకం గెలవడం చాలా గర్వంగా ఉంది’ అని జతీందర్ సంతోషం వ్యక్తం చేశాడు.
నాన్న అండతో...
హరియాణా రాష్ట్రం అంబాలాలోని ధీన్ గ్రామం సరబ్‌జోత్ స్వస్థలం. ఐదు ఎకరాల వ్యవసాయదారుడు అయిన తండ్రి అక్కడి చాలా కుటుంబాలలాగే తన పెద్ద కొడుకు కూడా పొలంలో సహాయకారిగా ఉంటే చాలనుకున్నాడు. కానీ సరబ్‌జోత్ ఆలోచనలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. స్థానికంగా జరిగిన వేసవి శిబిరంలో కొంత మంది కుర్రాళ్ల చేతుల్లో ఉన్న ఎయిర్ గన్స్ అతడిని ఆకర్షించాయి. కాగితాలపై చిత్రించిన లక్ష్యాలను వారు కొడుతున్న తీరు మరింత ఇష్టాన్ని పెంచింది.
కొన్నాళ్లకు ఆ శిబిరం ముగిసిపోయినా... ఆ టీనేజర్ మనసులో పిస్టల్ ముద్రించుకుపోయింది. దాంతో ధైర్యం చేసుకొని 13 ఏళ్ల ఆ కుర్రాడు తాను షూటింగ్ నేర్చుకుంటానంటూ తండ్రితో చెప్పేశాడు. ముందుగా సందేహించినా...ఆ తర్వాత తండ్రి తనను అంబాలాలోని షూటింగ్ అకాడమీలో చేరి్పంచాడు. అక్కడ ఓనమాలు నేర్పించిన కోచ్ అభిషేక్ రాణా ఇప్పటి వరకు కూడా కోచ్‌గా ఉంటూ సరబ్‌జోత్ ఒలింపిక్ పతక ప్రస్థానంలో కీలకపాత్ర పోషించడం విశేషం. ఆ వయసులోనే పొలంలో కష్టం చేసే అలవాటు ఉన్న ఆ అబ్బాయి తనకు సూపర్‌ఫిట్‌గా అనిపించాడని, నిర్విరామంగా గంటలకొద్దీ కదలకుండా నిలబడి సాధన చేసేవాడని రాణా గుర్తు చేసుకున్నాడు.
అలా మొదలై...
16 ఏళ్ల వయసులో తొలిసారి జాతీయ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలవడంతో ఈ హరియాణా అబ్బాయి వెలుగులోకి వచ్చాడు. అప్పుడే అతను తన తండ్రి వద్ద తొలిసారి సొంతంగా కొత్త పిస్టల్ కొనివ్వమని అడిగే ధైర్యం చేశాడు. అదే సమయంలో నోట్లు రద్దు కారణంగా కొంత ఇబ్బందులు ఉన్నా... కొడుకు కోసం దాదాపు రూ. 2 లక్షలతో తండ్రి పిస్టల్ కొనిచ్చాడు. తనపై తండ్రి ఉంచిన నమ్మకాన్ని సరబ్‌జోత్ నిలబెట్టుకున్నాడు.
తర్వాతి రెండేళ్ల పాటు ఆటలో మరింత రాటుదేలిన అతను 2019లో జర్మనీలో జరిగిన జూనియర్ వరల్డ్ కప్‌లో స్వర్ణం సాధించి అంతర్జాతీయ స్థాయిలో విజయాన్ని రుచి చూశాడు. అదే ఏడాది ఆసియా చాంపియన్‌షిప్‌లలో 2 స్వర్ణాలు, ఒక కాంస్యం సరబ్‌ను భారత్ నుంచి మంచి భవిష్యత్తు ఉన్న పిస్టల్ షూటర్లలో ఒకడిగా మార్చింది.
రెండేళ్ల తర్వాత పెరూలోని లిమాలో జరిగిన జూనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో రెండు స్వర్ణాలతో అతను ఆకట్టుకున్నాడు. ఇదే జోరులో వరల్డ్ కప్‌లో రెండు స్వర్ణాలు, ఆసియా క్రీడల్లో స్వర్ణ, రజతాలు సరబ్ ఖాతాలో చేరాయి. గత ఏడాది చాంగ్వాన్‌లో ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్‌లో పతకం గెలిచి ఒలింపిక్స్‌కు అర్హత సాధించినప్పుడే అతనిపై అంచనాలు పెరిగాయి. చివరకు అతను వాటిని నిలబెట్టుకున్నాడు.
లక్ష్యం చేరిన బుల్లెట్...
‘నాకు వరల్డ్ కప్ విజయాలు అవసరం లేదు... వేరే ఇతర టోర్నీ ల్లో పతకాలు అవసరం లేదు... నాకు ఒలింపిక్స్ పతకం మాత్రమే కావాలి... గత ఎనిమిదేళ్లుగా నేను దీని గురించి కలగన్నాను... ఇప్పుడు నా గుండెల్లో ఒక రకమైన అగ్ని జ్వలిస్తోంది’... పారిస్ ఒలింపిక్స్‌కు వెళ్లే ముందు సరబ్‌జోత్ సింగ్ ఆత్మవిశ్వాసంతో చెప్పిన మాట ఇది. శనివారం 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ వ్యక్తిగత విభాగంలో పోటీ పడినప్పుడు కూడా అతను అంతే ఉత్సాహంగా కనిపించాడు.
క్వాలిఫయింగ్‌లో జర్మనీ షూటర్ రాబిన్ వాల్టర్‌తో కలిసి 577 పాయింట్లతో సంయుక్తంగా ఎనిమిదో స్థానంలో నిలిచాడు. అయితే 10 పాయింట్ల షాట్‌లు వాల్టర్‌కంటే ఒకటి తక్కువగా కొట్టడంతో అనూహ్యంగా ఫైనల్ చేరే అవకాశం చేజారింది. దాంతో ఆవేదనగా ని్రష్కమించిన అతను ఇప్పుడు మిక్స్‌డ్‌లో కాంస్యంతో ఆ భారం కాస్త దించుకున్నాడు. వేగంగా దూసుకెళ్లే కార్లు, పంజాబీ పాప్ సంగీతాన్ని ఇష్టపడే ఈ 23 ఏళ్ల షూటర్ తన ఇంట్లో, పరిసరాల్లో, సరదాగా ఆడే వీడియో గేమ్‌లపై కూడా ఒలింపిక్ రింగ్‌లను ఎల్‌ఈడీ లైట్లతో అలంకరించుకున్నాడు.
వాటిని చూడగానే తన లక్ష్యం ఏమిటో, తాను పడిన శ్రమ ఏమిటో ఇవి పదే పదే గుర్తుకొస్తుందని, తన కలను నెరవేర్చుకోవాలనే పట్టుదలను పెంచడం కోసం ఇలా చేసినట్లు అతను చెప్పుకున్నాడు. ఇప్పుడు ఒలింపిక్ పతకం గెలుచుకున్న క్షణాన ‘నేను ఎన్నో ఫాస్ట్ కార్లను అద్దెకు తీసుకొని నోయిడా సర్క్యూట్‌లో వేగంగా డ్రైవింగ్ చేశాను. ఇప్పుడు నా కోసం ఒకటి కొనుక్కుంటాను. అది ఎంతో వేగంగా దూసుకెళ్లాలంటే 3–4 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగం అందుకోవాలి’ అంటూ తన కోరికను అతను బయటపెట్టాడు. –సాక్షి క్రీడా విభాగం
నేడు భారత క్రీడాకారుల షెడ్యూల్
టేబుల్ టెన్నిస్
మహిళల సింగిల్స్ రెండో
రౌండ్ మ్యాచ్: ఆకుల శ్రీజ X జియాన్ జెంగ్ (సింగపూర్) (మధ్యాహ్నం గం. 2:20 నుంచి).
ఆర్చరీ
మహిళల వ్యక్తిగత 1/32 ఎలిమినేషన్ రౌండ్: దీపిక X రీనా పర్నట్ (ఎస్తోనియా) (మధ్యాహ్నం గం. 3:56 నుంచి). పురుషుల వ్యక్తిగత 1/32 ఎలిమినేషన్ రౌండ్: తరుణ్‌దీప్ రాయ్X టామ్ హాల్ (బ్రిటన్) (రాత్రి గం. 9:15 నుంచి).
ఈక్వె్రస్టియన్
డ్రెసాజ్ వ్యక్తిగత గ్రాండ్ ప్రి: అనూష్ అగర్వల్లా (మధ్యా హ్నం గం. 1:30 నుంచి).
బాక్సింగ్
మహిళల 75 కేజీల ప్రిక్వార్టర్స్: లవ్లీనా బొర్గొహైన్ X సునీవా హాఫ్‌స్టడ్ (నార్వే) (మధ్యాహ్నం గం. 3:50 నుంచి). పురుషుల 71 కేజీల ప్రిక్వార్టర్స్: నిశాంత్ దేవ్ X జోస్ గాబ్రియల్ రోడ్రిగ్జ్ (ఈక్వెడార్) (అర్ధరాత్రి గం. 12:18 నుంచి).
బ్యాడ్మింటన్
మహిళల సింగిల్స్ గ్రూప్ లీగ్ మ్యాచ్: పీవీ సింధు X క్రిస్టిన్ కూబా (ఎస్తోనియా) (మధ్యాహ్నం గం. 12:50 నుంచి). పురుషుల సింగిల్స్ గ్రూప్ లీగ్ మ్యాచ్: లక్ష్యసేన్ X జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా) (మధ్యాహ్నం గం. 1:40 నుంచి). పురుషుల
సింగిల్స్ గ్రూప్ లీగ్ మ్యాచ్): హెచ్‌ఎస్ ప్రణయ్ ్ఠ డక్ పాట్ లీ (వియత్నాం) (రాత్రి గం. 11:00 నుంచి).
షూటింగ్
50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ పురుషుల క్వాలిఫికేషన్ రౌండ్: ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్, స్వప్నిల్ (మధ్యాహ్నం గం. 12:30 నుంచి). మహిళల ట్రాప్ క్వాలిఫికేషన్ రౌండ్: శ్రేయసి సింగ్, రాజేశ్వరి కుమారి (మధ్యాహ్నం గం. 12:30 నుంచి).
Comments
Please login to add a commentAdd a comment