
ప్యారిస్ ఒలింపిక్స్-2024లో భారత యువ షూటర్ సరబ్జోత్ సింగ్ సత్తాచాటాడు. సరబ్జోత్ 10 మీటర్ల పిస్టల్ మిక్స్‌డ్ ఈవెంట్‌లో మను భాకర్‌తో కలిసి కాంస్య పతకాన్ని భారత్‌కు అందించాడు. మూడు రోజుల క్రితం పురుషుల 10 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో తృటిలో ఫైనల్‌కు చేరే ఛాన్స్ కోల్పోయిన సరబ్జోత్.. మిక్స్‌డ్ ఈవెంట్‌లో మాత్రం తన గురితప్పలేదు.
విశ్వవేదికపై మను భాకర్‌తో కలిసి భారత పతాకాన్ని రెపరెపలాడించాడు. దీంతో దేశవ్యాప్తంగా సరబ్జోత్ సింగ్ పేరు మారుమ్రోగుతోంది. ప్యారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు రెండో పతకం అందించిన సరబ్జోత్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో ఎవరీ సరబ్జోత్ సింగ్ అని నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు.
ఎవరీ సరబ్జోత్ సింగ్.. ?
22 ఏళ్ల సరబ్జోత్ సింగ్ హర్యానా రాష్ట్రం అంబాలాలోని ధీన్ అనే చిన్న గ్రామంలో జన్మించాడు. అతడి తల్లిదండ్రులది వ్యవసాయ కుటుంబం. సరబ్జోత్ తన చిన్నతనంలో ఫుట్‌బాలర్ కావాలని కలలు కన్నాడు. ఆ విధంగానే ముందుకు అడుగులు వేశాడు. కానీ తన 13 ఏళ్ల వయస్స్సులో ఒక రోజు స్కూల్ సమ్మర్ క్యాంప్‌లో కొంత మంది పిల్లలు ఎయిర్ గన్‌లతో తాత్కాలిక రేంజ్‌లో టార్గెట్‌ను గురిపెట్టడం సరబ్జోత్ చూశాడు.
ఆ దృశ్యం(షూటింగ్) అతడిని ఎంతో గానో ఆకట్టుకుంది. దీంతో సరబ్జోత్ కూడా షూటర్ కావాలని అప్పుడే నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో తన తండ్రి జతీందర్ సింగ్ కూడా సరబ్జోత్‌కు మద్దతుగా నిలిచాడు. సరబ్జోత్ చండీగఢ్‌లోని డీఏవీ కాలేజీలో చదువును కొనసాగిస్తూ కోచ్ అభిషేక్ రాణా దగ్గర శిక్షణ పొందాడు.
ఖేలో ఇండియా, టార్గెట్ ఒలింపిక్ పోడియం వంటి స్కీమ్ వంటి ప్రభుత్వ పథకాలు కూడా అతడు షూటర్‌గా ఎదగడంలో కీలక పాత్ర పోషించాయి. 2019లో జరిగిన జూనియర్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించడం సరబ్జోత్ కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా చెప్పుకోవాలి. ఆ తర్వాత సరబ్జోత్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇప్పుడు ఏకంగా విశ్వక్రీడల్లో కూడా తన తుపాకీ పవర్‌ను సరబ్జోత్ చూపించాడు.
సరబ్జోత్ సింగ్ సాధించిన విజయాలు ఇవే..
2023 ఆసియా ఛాంపియన్‌షిప్, కొరియా: 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకం, (ఒలింపిక్ కోటా)
2023 ప్రపంచ కప్, భోపాల్: వ్యక్తిగత ఈవెంట్‌లో బంగారు పతకం
2023 ప్రపంచ కప్, బాకు: మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో బంగారు పతకం
2022 ఆసియా క్రీడలు: టీమ్ ఈవెంట్‌లో బంగారు పతకం, మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో రజత పతకం
2022 జూనియర్ ప్రపంచ కప్, సుహ్ల్: టీమ్ ఈవెంట్‌లో బంగారు పతకం, వ్యక్తిగత, మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లలో రజత పతకాలు
2021 జూనియర్ వరల్డ్ ఛాంపియన్‌షిప్, లిమా: టీమ్, మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లలో బంగారు పతకాలు
2019 జూనియర్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్