women workplace index
-
ఈ రంగాలపై మక్కువ చూపుతున్న మగువలు
న్యూఢిల్లీ: ఇంజినీరింగ్, తయారీ, ఆపరేషన్స్ తదితర విభాగాల్లో మరిన్ని బాధ్యతలు తీసుకోవాలని, కీలక విధులు నిర్వహించాలని మహిళలు భావిస్తున్నారు. అదే సమయంలో మహిళా సిబ్బంది సంఖ్య పెరగడం వల్ల ఆయా రంగాలు గణనీయంగా ప్రయోజనం పొందగలవని పురుషులు కూడా అభిప్రాయపడుతుండటం గమనార్హం. జీఈ, అవతార్ రీసెర్చ్ నిర్వహించిన సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ మధ్యలో జీఈ కోసం అవతార్ ఈ సర్వే నిర్వహించింది. 500 మంది ప్రొఫెషనల్స్ (మహిళలు, పురుషులు) ఇంజినీరింగ్ విద్యార్థినులు, ఆపరేషన్స్.. తయారీ.. ఇంజినీరింగ్ సర్వీసుల సంస్థల్లో బిజినెస్, మానవ వనరుల విభాగాల అధిపతులు ఇందులో పాల్గొన్నారు. పురోగతికి సామర్థ్యాలపై అపోహలే అడ్డంకి.. సర్వే ప్రకారం ఇంజినీరింగ్ సర్వీసులు, ఆపరేషన్స్, తయారీ వంటి రంగాల్లో ప్రస్తుతం 12 శాతం మందే మహిళలు ఉన్నారు. సామర్థ్యాలపై గల అపోహలే ఈ రంగాల్లో తమ కెరియర్ పురోగతికి అవరోధాలుగా ఉంటున్నాయని 63 శాతం మంది మహిళలు అభిప్రాయపడ్డారు. ఉద్యోగుల సామర్థ్యాల మదింపు ప్రక్రియలో పక్షపాత ధోరణులు కూడా కారణమని మరికొందరు పేర్కొన్నారు. మరోవైపు, ప్రభుత్వ నియంత్రణలే ఆయా విభాగాల్లో మహిళల వృద్ధికి ఆటంకాలుగా ఉన్నాయని 54 శాతం మంది పురుషులు, సూపర్వైజర్ల నుంచి మద్దతు లేకపోవడం కారణమని 51 శాతం మంది పురుషులు అభిప్రాయపడ్డారు. లింగవివక్ష వివిధ విభాగాల్లో లింగ వివక్షకు తావులేకుండా పరిస్థితి మెరుగుపర్చాల్సిన అవసరాన్ని ఈ సర్వే తెలియజేస్తోందని జీఈ దక్షిణాసియా ఐఅండ్‌డీ కౌన్సిల్ లీడర్ శుక్ల చంద్రా తెలిపారు. అటు, పెద్ద సంస్థలు ఈ దిశగా చర్యలు తీసుకుంటే మరింత మంది మహిళలు సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మెడిసిన్ వంటి విభాగాలను ఎంచుకునేందుకు, తయారీ.. ఇంజినీరింగ్ రంగాల్లో కెరియర్ ఏర్పర్చుకునేందుకు ప్రోత్సాహం లభించగలదని అవతార్ వ్యవస్థాపక ప్రెసిడెంట్ సౌందర్య రాజేశ్ తెలిపారు. చదవండి:అబల కాదు.. ఐరన్ లేడీ! ఆమె చేతిలో పడితే చిత్తు చిత్తే!! -
మహిళా ఉద్యోగుల భద్రతలో తెలంగాణకు రెండోర్యాంకు
ఉద్యోగాలు చేసే మహిళలకు ఢిల్లీ నగరం పరమ వేస్ట్ అని, ఈశాన్య రాష్ట్రమైన సిక్కిం బెస్ట్ అని తేలింది. రెండోస్థానంలో తెలంగాణ నిలవగా, ఆంధ్రప్రదేశ్‌కు ఆరోస్థానం లభించింది. అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ (సీఎస్ఐఎస్), నాథన్ అసోసియేట్స్ సంస్థలు సంయుక్తంగా చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. మహిళల ఉద్యోగాలకు అనువైన నగరాల విషయంలో ఢిల్లీకి కేవలం 8.5 పాయింట్లు రాగా, సిక్కింకు అత్యధికంగా 40 పాయింట్లు వచ్చాయి. ప్రధానంగా నాలుగు అంశాల ఆధారంగా రాష్ట్రాలకు ర్యాంకులు ఇచ్చారు. ఫ్యాక్టరీలు, రీటైల్, ఐటీ పరిశ్రమలో మహిళల పని గంటలపై చట్టబద్ధమైన నియంత్రణలు, ఉద్యోగాలు చేసే మహిళల మీద జరిగే నేరాలను (లైంగిక వేధింపుల లాంటివి) అరికట్టేందుకు తగిన న్యాయ వ్యవస్థ, రాష్ట్రంలో ఉన్న మొత్తం ఉద్యోగులలో మహిళల శాతం, మహిళా వ్యాపారవేత్తలకు రాష్ట్ర ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలు.. ఈ నాలుగు అంశాల ఆధారంగా వివిధ రాష్ట్రాలు మహిళలకు ఎంతవరకు అనుకూలమో తేల్చారు. సిక్కిం తర్వాతి స్థానంలో తెలంగాణ (28.5), పుదుచ్చేరి (25.6), కర్ణాటక (24.7), హిమాచల్ ప్రదేశ్ (24.2), ఆంధ్రప్రదేశ్ (24.0), కేరళ (22.2), మహారాష్ట్ర (21.4), తమిళనాడు (21.1), ఛత్తీస్‌గఢ్ (21.1) వరుసగా ఉన్నాయి. సిక్కిం, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలలో అయితే.. మహిళలు రాత్రిపూట పనిచేయడంపై ఉన్న నియంత్రణలను పూర్తిగా ఎత్తేశాయి. ఏపీ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు కోర్టు తీర్పు కారణంగా ఇలా చేశాయి. మహారాష్ట్రలో మహిళలు కేవలం రాత్రి 10 గంటల వరకు మాత్రమే పనిచేయాలంది కాబట్టి ఆ రాష్ట్రానికి తగినంత స్కోరు రాలేదు. దేశంలో తొమ్మిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అసలు రాత్రిపూట ఏ రంగంలోనూ మహిళలతో పని చేయించడానికి ఒప్పుకోవు. 15 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మహిళా వ్యాపారవేత్తలకు ఎలాంటి ప్రోత్సాహకాలు అందజేయవు. ఢిల్లీలో మొత్తం ఉద్యోగులలో మహిళల సంఖ్య చాలా తక్కువని, అలాగే అక్కడ న్యాయం అందడం కూడా చాలా ఆలస్యం అవుతుందని నివేదికలో పేర్కొన్నారు.