Womens Economic Development
-
ఆకాశమే హద్దుగా.. ఆమె
ఆమె నిస్వార్థం పలువురికి బతుకు నిచ్చింది. తానొక మహిళగా.. మరికొందరి మహిళలకు చేతనైన సాయాన్ని అందించాలని తపన పడింది. ఆ తపనే... నేడు వందలాది మంది మహిళలను చిన్న పాటి పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దింది. ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన ఆమె... గంగలక్ష్మమ్మ. మహిళల ఆర్థికాభివృద్ధికి ఆమె చేస్తున్న కృషిని గుర్తించిన సంఘ సంస్థలు పలు వేదికలపై సత్కరించాయి. - గౌరిబిదనూరు తండ్రి ఆశయాలను పుణికిపుచ్చుకుని ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు ఇడగూరు చౌడయ్య కుమార్తె గంగలక్ష్మమ్మ. దేశ స్వాతంత్య్రం కోసం తన తండ్రి పడిన తపన ఆమెలోనూ జీర్ణించుకుపోయాయి. 1978లో కల్లూడికి చెందిన గంగప్పను ఆమె పెళ్లి చేసుకున్నారు. ఆ సమయంలో గ్రామంలోని మహిళలు పడుతున్న కష్టాలను చూసిన ఆమె చలించిపోయారు. వారి ఆర్థికాభివృద్ధిని మెరుగుపరచాలని భావించారు. ఆ దిశలోనే 1988లో ఝాన్సీరాణి ఆదర్శ మహిళా సమాజాన్ని ఏర్పాటు చేసి, కుట్టు పనిపై శిక్షణ, వైర్లతో వివిధ రకాల అల్లికలు నేర్పారు. అప్పడాలు, సొండిగలు, పచ్చళ్లు, సాంబారు పొడి, చట్నీ పొడి తయారు చేసి విక్రయించడం వంటి కార్యక్రమాల ద్వారా పురోగతి సాధించారు. మహిళల ఉత్పత్తులకు మార్కెట్ సౌకర్యం గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు తయారు చేసిన పలు రకాల వస్తువులకు బెంగళూరులోని జనతా బజారు తదితర ప్రదేశాలకు తరలించి మార్కెట్ సౌకర్యాన్ని కల్పించడంలో గంగలక్ష్మమ్మ క్రియాశీలకంగా వ్యవహరించారు. అనంతరం అయా కార్యక్రమాలను ఒక్కొక్కటిగా గ్రామీణ మహిళలకు అప్పగిస్తూ వారిని చిన్న పాటి పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దారు. 2009లో మహిళలే సభ్యులుగా మహిళలే ఉద్యోగులుగా ఉండేలా సమృద్ధి మహిళా సౌహార్ధ సహకార బ్యాంక్‌ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 567 మంది సభ్యులున్న ఈ బ్యాంక్ ఏడాదికి రూ. మూడు కోట్లకు పైగా లావాదేవీలను కొనసాగిస్తోంది. మహిళలకు రుణాలివ్వడమే కాకుండా, సంపాదనలో కొంత మొత్తాన్ని పొదుపు చేసుకునేలా ప్రోత్సహిస్తూ పలు కార్యక్రమాలను రూపొందించారు. బ్యాంక్ లాభాలను డివిడెండ్ల రూపంలో సభ్యులందరికీ సమానంగా పంచారు. నేడు 1,300 జనాభా కలిగిన కల్లూడి గ్రామంలో ఉన్న సుమారు 610 కుటుంబాలలో 500కు పైగా కుటుంబాల వారు అప్పడాల తయారీ, వ్యాపారంలో నిమగ్న మైనారు. మహిళకు రుణాలివ్వడమే కాకుండా వారు తయారు చేసిన వస్తువుల విక్రయాలకు బ్యాంక్ ప్రాంగణంలోనే కొద్దిపాటి స్థలాన్ని గంగలక్ష్మమ్మ కేటాయించారు. -
ఓటు బ్యాంకు బడాయి.. మహిళల మెడకు బకాయి!
మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా చెప్పుకుంటున్న ప్రభుత్వం.. వాస్తవంలో వారి జీవితాలను ఫణంగా పెట్టింది. రుణమాఫీ హామీని ఓటు బ్యాంకుగా మార్చుకున్న చంద్రబాబు.. అధికారంలోకి రాగానే అసలు రంగు బయటపెట్టారు. మాఫీ కాస్తా రివాల్వింగ్ ఫండ్‌గా మారిపోయింది. రుణాలపై తొమ్మిది నెలల బకాయి స్వయం సహాయక సంఘాల మహిళల మెడకు చుట్టుకుంది. రెక్కలు ముక్కలు చేసుకున్న సొమ్ము బ్యాంకు వడ్డీలకే సరిపోని పరిస్థితుల్లో.. కొత్త రుణాల విషయంలో బ్యాంకర్లూ మొండికేయడంతో బతుకు బజారున పడుతోంది. కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలోని 43,525 స్వయం సహాయక సంఘాల్లో 4.76 లక్షల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. సంఘాలకు లింకేజీ రుణాల మంజూరుకు బ్యాంకర్లు విముఖత చూపుతున్నారు. స్త్రీనిధి కోసం ప్రతి మండల సమాఖ్య నుంచి రూ.10 లక్షలు చొప్పున షేర్ ధనం వసూలు చేశారు. అయితే రుణాలను 24 మండలాలకే పరిమితం చేశారు. ఇందులోనూ ఏ-గ్రేడ్ పొందిన గ్రామైక్య సంఘాలకే స్త్రీనిధి కింద రుణాలు ఇస్తుండటం గమనార్హం. 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.10కోట్ల రుణ పంపిణీ లక్ష్యం కాగా.. 550 సంఘాలకు రూ.3.29 కోట్లతో సరిపెట్టారు. సంఘాల్లోని మహిళలకు వ్యవసాయానికి రూ.20వేలు, ఆరోగ్యపరమైన సమస్యలకు రూ.25వేలు, ఆదాయం పెంపు పనులకు రూ.25వేలు, పాడి అభివృద్ధికి రూ.20వేలు, పిల్లల వివాహాలకు రూ.25వేలు చొప్పున అందజేస్తారు. మండలాల్లో కోత పెట్టడం.. అందులోనూ ఏ-గ్రేడ్ సంఘాలకే పరిమితం చేయడంతో వేలాది మంది మహిళలు రుణాలను సద్వినియోగం చేసుకోలేని పరిస్థితి నెలకొంది. అదేవిధంగా 2014-15 సంవత్సరంలో జిల్లా మొత్తం మీద 24,663 స్వయం సహాయక సంఘాలకు రూ.712 కోట్లు బ్యాంకుల ద్వారా లింకేజీ రుణాలు ఇప్పించి మహిళల అభ్యున్నతి చేయూతనివ్వాలనేది లక్ష్యం. ఏప్రిల్ నుంచి నవంబర్ నెల వరకు 12,719 సంఘాలకు రూ.357.47 కోట్లు రుణాల్సి ఉండగా.. పురోగతి లోపించింది. 5,703 సంఘాలకు రూ.152.04 కోట్లు మాత్రమే పంపిణీ చేయడం గమనార్హం. డీఆర్డీఏ-వెలుగులో దాదాపు 17 కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ప్రధానంగా బ్యాంకు లింకేజీపైనే దృష్టి సారించారు. ఏరియా కోఆర్డినేటర్లు 11 మంది, 54 మంది ఏపీఎంలు, 220 మంది సీసీలు పనిచేస్తున్నా బ్యాంకు లింకేజీ రుణాల పంపిణీలో పురోగతి లేకుండాపోయింది. ఇదే సమయంలో బ్యాంకర్లు స్వయం సహాయక సంఘాలకు చుక్కలు చూపుతున్నారు. గ్రామంలోని ఏ ఒక్క సంఘం రుణాన్ని సక్రమంగా చెల్లించలేకపోయినా.. మిగిలిన వాటన్నింటికీ రుణ పంపిణీ నిలిపేస్తున్నారు. సంఘాల్లో చిన్న, సన్నకారు రైతుల కుటుంబాలకు చెందిన మహిళలే సభ్యులుగా ఉంటున్నారు. పంట రుణాలకు సంబంధించి బ్యాంకుల్లో రైతుల అప్పులు పెండింగ్‌లో ఉంటే.. సంబంధిత రైతుల భార్యలు సభ్యులుగా ఉన్న సంఘాలకూ రుణాలు నిలిపేస్తుండటం విమర్శలకు తావిస్తోంది. రుణమాఫీ హామీతోనే సమస్య ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన రుణమాఫీ హామీ స్వయం సహాయక సంఘాల మహిళలకు శాపంగా మారింది. బాబు హామీ నేపథ్యంలో మహిళలు గత మార్చి నుంచి రుణాలు చెల్లించడం మానేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మాఫీపై సీఎం మాట మార్చడంతో మార్చి నుంచి ఇప్పటి వరకు బకాయిలను అపరాధ వడ్డీ సహా చెల్లించాల్సి వస్తోంది. ఇప్పటికే మహిళల ఖాతాల్లోని పొదుపు మొత్తాలను బ్యాంకర్లు అప్పుకు జమేసుకున్నారు. అతీగతీ లేని రివాల్వింగ్ ఫండ్ డ్వాక్రా రుణాల మాఫీపై చేతులెత్తేసిన ముఖ్యమంత్రి సంఘానికి రూ.లక్ష రివాల్వింగ్ ఫండ్ ఇస్తానంటూ కొత్త రాగం అందుకున్నారు. ఈ ప్రకారం జిల్లాలోని 228 సంఘాలకు రూ.352 కోట్ల రివాల్వింగ్ ఫండ్ రావాల్సి ఉంది. ప్రభుత్వానికి సెర్ఫ్ ప్రతిపాదనలు పంపినా ఫండ్ విడుదల ప్రశ్నార్థకంగా మారింది. -
మహిళాభివృద్ధికి రూ.500 కోట్లు
మొయినాబాద్: జిల్లాలోని మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం రూ.500 కోట్లు కేటాయించిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని చిలుకూరు మహిళా ప్రాంగణం ఆవరణలో డీఆర్డీఏ ఆధ్వర్యంలో నిర్మించిన సాంకేతిక శిక్షణ, అభివృద్ధి కేంద్రం సమావేశ మందిర భవనాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. సమావేశ మందిరంలో తెలంగాణ తల్లి చిత్రపటాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ ఈ ఏడాది జిల్లాలోని మహిళాసంఘాలకు రూ.500 కోట్లు బ్యాంకులింకేజీ రుణాలు అందజేస్తున్నామన్నారు. జిల్లాలో 37 వేల సంఘాలలోని 4 లక్షల మందికి రుణాలు ఇస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు తీసుకున్న రుణాల రికవరీ 98 శాతం ఉందని, దాన్ని వంద శాతం పూర్తి చేయాలన్నారు. జిల్లా మహిళా సమాఖ్య భవన నిర్మాణం పూర్తి చేయడానికి రూ.40 లక్షలు జిల్లా పరిషత్ నుంచి మంజూరు చేయిస్తామన్నారు. తెలంగాణలో ఏర్పడిన తొలి ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, పేదల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందన్నారు. 19న సమగ్ర సర్వే... ఈ నెల 19న నిర్వహించే సమగ్ర సర్వేకు ప్రతి ఒక్కరు సహకరించాలని మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. ఈ సర్వే ఆధారంగానే ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు అమలవుతాయని చెప్పారు. అధికారులు సైతం సర్వేను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పకడ్బందీగా చేయాలన్నారు. మన ఊరు-మన ప్రణాళిక ద్వారా అభివృద్ధికి కావాల్సిన ప్రణాళిక సిద్ధమయ్యిందన్నారు. రాబోయే రోజుల్లో వికారాబాద్‌ను జిల్లా కేంద్రంగా చేసి ఎక్కువ నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామని మంత్రి పేర్కొన్నారు. ఐటీఐఆర్ ప్రాజెక్టులో భాగంగా జిల్లాలో ఐటీ కంపెనీలు, సంస్థలు రావడానికి అవకాశం ఉందని, మొయినాబాద్, శంషాబాద్, షాబాద్, చేవెళ్ల, శంకర్పల్లి ప్రాంతాల్లో కంపెనీలు ఏర్పాటు చేయించి అభివృద్ధి చేస్తామని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా జిల్లా అభివృద్ధి: ఎమ్మెల్యే కాలె యాదయ్య రాజకీయాలకు అతీతంగా జిల్లాను అభివృద్ధి చేయాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. చిలుకూరు మహిళా ప్రాంగణం ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మొయినాబాద్‌లో ఆర్టీసీ డిపో ఏర్పాటు చేయాలని, మంజీరా నీళ్లు అందించాలని మంత్రిని కోరారు. ఈ సందర్భంగా మండల ప్రజాప్రతినిధులు 111 జీవోతోపాటు ఇతర సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం జిల్లా మహిళా సమాఖ్యకు రూ.13.51 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాల చెక్కును మంత్రి చేతులు మీదుగా అందజేశారు. ప్రాంగణం ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి, జెడ్పీటీసీ చంద్రలింగంగౌడ్, ఎంపీపీ అనిత, వైస్ ఎంపీపీ పద్మమ్మ, డీఆర్డీఏ పీడీ వరప్రసాద్‌రెడ్డి, ఏపీడీ ఉమారాణి, జేడీఎం హమీద్, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు శకుంతల, ఎంపీడీఓ సుభాషిణి, తహసీల్దార్ గంగాధర్, ఏఈలు భాస్కర్‌రెడ్డి, బల్వంత్‌రెడ్డి, నాగరాజు, సర్పంచ్‌లు సంగీత, సుధాకర్, మల్లేష్, నవీన్, రాంచంద్రయ్య, ఎంపీటీసీలు సహదేవ్, పెంటయ్య, మాణిక్‌రెడ్డి, రాంరెడ్డి, నాయకులు అనంతరెడ్డి, గోపాల్‌రెడ్డి, కొండల్‌గౌడ్, హన్మంత్‌రెడ్డి, శ్రీహరియాదవ్, సంజీవరెడ్డి, రమేష్, హన్మంత్‌యాదవ్, దర్శన్, రవీందర్‌రెడ్డి, నీలకంఠం, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.