ఓటు బ్యాంకు బడాయి.. మహిళల మెడకు బకాయి! | the tdp government ignore the homies | Sakshi
Sakshi News home page

ఓటు బ్యాంకు బడాయి.. మహిళల మెడకు బకాయి!

Published Tue, Dec 30 2014 3:57 AM | Last Updated on Sat, Jul 28 2018 6:35 PM

ఓటు బ్యాంకు బడాయి.. మహిళల మెడకు బకాయి! - Sakshi

ఓటు బ్యాంకు బడాయి.. మహిళల మెడకు బకాయి!

మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా చెప్పుకుంటున్న ప్రభుత్వం.. వాస్తవంలో వారి జీవితాలను ఫణంగా పెట్టింది. రుణమాఫీ హామీని ఓటు బ్యాంకుగా మార్చుకున్న చంద్రబాబు.. అధికారంలోకి రాగానే అసలు రంగు బయటపెట్టారు. మాఫీ కాస్తా రివాల్వింగ్ ఫండ్‌గా మారిపోయింది. రుణాలపై తొమ్మిది నెలల బకాయి స్వయం సహాయక సంఘాల మహిళల మెడకు చుట్టుకుంది. రెక్కలు ముక్కలు చేసుకున్న సొమ్ము బ్యాంకు వడ్డీలకే సరిపోని పరిస్థితుల్లో.. కొత్త రుణాల విషయంలో బ్యాంకర్లూ మొండికేయడంతో బతుకు బజారున పడుతోంది.
 
కర్నూలు(అగ్రికల్చర్):  జిల్లాలోని 43,525 స్వయం సహాయక సంఘాల్లో 4.76 లక్షల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. సంఘాలకు లింకేజీ రుణాల మంజూరుకు బ్యాంకర్లు విముఖత చూపుతున్నారు. స్త్రీనిధి కోసం ప్రతి మండల సమాఖ్య నుంచి రూ.10 లక్షలు చొప్పున షేర్ ధనం వసూలు చేశారు. అయితే రుణాలను 24 మండలాలకే పరిమితం చేశారు. ఇందులోనూ ఏ-గ్రేడ్ పొందిన గ్రామైక్య సంఘాలకే స్త్రీనిధి కింద రుణాలు ఇస్తుండటం గమనార్హం.

2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.10కోట్ల రుణ పంపిణీ లక్ష్యం కాగా.. 550 సంఘాలకు రూ.3.29 కోట్లతో సరిపెట్టారు. సంఘాల్లోని మహిళలకు వ్యవసాయానికి రూ.20వేలు, ఆరోగ్యపరమైన సమస్యలకు రూ.25వేలు, ఆదాయం పెంపు పనులకు రూ.25వేలు, పాడి అభివృద్ధికి రూ.20వేలు, పిల్లల వివాహాలకు రూ.25వేలు చొప్పున అందజేస్తారు. మండలాల్లో కోత పెట్టడం.. అందులోనూ ఏ-గ్రేడ్ సంఘాలకే పరిమితం చేయడంతో వేలాది మంది మహిళలు రుణాలను సద్వినియోగం చేసుకోలేని పరిస్థితి నెలకొంది.

అదేవిధంగా 2014-15 సంవత్సరంలో జిల్లా మొత్తం మీద 24,663 స్వయం సహాయక సంఘాలకు రూ.712 కోట్లు బ్యాంకుల ద్వారా లింకేజీ రుణాలు ఇప్పించి మహిళల అభ్యున్నతి చేయూతనివ్వాలనేది లక్ష్యం. ఏప్రిల్ నుంచి నవంబర్ నెల వరకు 12,719 సంఘాలకు రూ.357.47 కోట్లు రుణాల్సి ఉండగా.. పురోగతి లోపించింది. 5,703 సంఘాలకు రూ.152.04 కోట్లు మాత్రమే పంపిణీ చేయడం గమనార్హం. డీఆర్‌డీఏ-వెలుగులో దాదాపు 17 కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ప్రధానంగా బ్యాంకు లింకేజీపైనే దృష్టి సారించారు.

ఏరియా కోఆర్డినేటర్లు 11 మంది, 54 మంది ఏపీఎంలు, 220 మంది సీసీలు పనిచేస్తున్నా బ్యాంకు లింకేజీ రుణాల పంపిణీలో పురోగతి లేకుండాపోయింది. ఇదే సమయంలో బ్యాంకర్లు స్వయం సహాయక సంఘాలకు చుక్కలు చూపుతున్నారు. గ్రామంలోని ఏ ఒక్క సంఘం రుణాన్ని సక్రమంగా చెల్లించలేకపోయినా.. మిగిలిన వాటన్నింటికీ రుణ పంపిణీ నిలిపేస్తున్నారు. సంఘాల్లో చిన్న, సన్నకారు రైతుల కుటుంబాలకు చెందిన మహిళలే సభ్యులుగా ఉంటున్నారు. పంట రుణాలకు సంబంధించి బ్యాంకుల్లో రైతుల అప్పులు పెండింగ్‌లో ఉంటే.. సంబంధిత రైతుల భార్యలు సభ్యులుగా ఉన్న సంఘాలకూ రుణాలు నిలిపేస్తుండటం విమర్శలకు తావిస్తోంది.

రుణమాఫీ హామీతోనే సమస్య
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన రుణమాఫీ హామీ స్వయం సహాయక సంఘాల మహిళలకు శాపంగా మారింది. బాబు హామీ నేపథ్యంలో మహిళలు గత మార్చి నుంచి రుణాలు చెల్లించడం మానేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మాఫీపై సీఎం మాట మార్చడంతో మార్చి నుంచి ఇప్పటి వరకు బకాయిలను అపరాధ వడ్డీ సహా చెల్లించాల్సి వస్తోంది. ఇప్పటికే మహిళల ఖాతాల్లోని పొదుపు మొత్తాలను బ్యాంకర్లు అప్పుకు జమేసుకున్నారు.

అతీగతీ లేని రివాల్వింగ్ ఫండ్
డ్వాక్రా రుణాల మాఫీపై చేతులెత్తేసిన ముఖ్యమంత్రి సంఘానికి రూ.లక్ష రివాల్వింగ్ ఫండ్ ఇస్తానంటూ కొత్త రాగం అందుకున్నారు. ఈ ప్రకారం జిల్లాలోని 228 సంఘాలకు రూ.352 కోట్ల రివాల్వింగ్ ఫండ్ రావాల్సి ఉంది. ప్రభుత్వానికి సెర్ఫ్ ప్రతిపాదనలు పంపినా ఫండ్ విడుదల ప్రశ్నార్థకంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement