ఆమె నిస్వార్థం పలువురికి బతుకు నిచ్చింది. తానొక మహిళగా.. మరికొందరి మహిళలకు చేతనైన సాయాన్ని అందించాలని తపన పడింది. ఆ తపనే... నేడు వందలాది మంది మహిళలను చిన్న పాటి పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దింది. ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన ఆమె... గంగలక్ష్మమ్మ. మహిళల ఆర్థికాభివృద్ధికి ఆమె చేస్తున్న కృషిని గుర్తించిన సంఘ సంస్థలు పలు వేదికలపై సత్కరించాయి. - గౌరిబిదనూరు
తండ్రి ఆశయాలను పుణికిపుచ్చుకుని
ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు ఇడగూరు చౌడయ్య కుమార్తె గంగలక్ష్మమ్మ. దేశ స్వాతంత్య్రం కోసం తన తండ్రి పడిన తపన ఆమెలోనూ జీర్ణించుకుపోయాయి. 1978లో కల్లూడికి చెందిన గంగప్పను ఆమె పెళ్లి చేసుకున్నారు. ఆ సమయంలో గ్రామంలోని మహిళలు పడుతున్న కష్టాలను చూసిన ఆమె చలించిపోయారు. వారి ఆర్థికాభివృద్ధిని మెరుగుపరచాలని భావించారు. ఆ దిశలోనే 1988లో ఝాన్సీరాణి ఆదర్శ మహిళా సమాజాన్ని ఏర్పాటు చేసి, కుట్టు పనిపై శిక్షణ, వైర్లతో వివిధ రకాల అల్లికలు నేర్పారు. అప్పడాలు, సొండిగలు, పచ్చళ్లు, సాంబారు పొడి, చట్నీ పొడి తయారు చేసి విక్రయించడం వంటి కార్యక్రమాల ద్వారా పురోగతి సాధించారు.
మహిళల ఉత్పత్తులకు మార్కెట్ సౌకర్యం
గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు తయారు చేసిన పలు రకాల వస్తువులకు బెంగళూరులోని జనతా బజారు తదితర ప్రదేశాలకు తరలించి మార్కెట్ సౌకర్యాన్ని కల్పించడంలో గంగలక్ష్మమ్మ క్రియాశీలకంగా వ్యవహరించారు. అనంతరం అయా కార్యక్రమాలను ఒక్కొక్కటిగా గ్రామీణ మహిళలకు అప్పగిస్తూ వారిని చిన్న పాటి పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దారు. 2009లో మహిళలే సభ్యులుగా మహిళలే ఉద్యోగులుగా ఉండేలా సమృద్ధి మహిళా సౌహార్ధ సహకార బ్యాంక్‌ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 567 మంది సభ్యులున్న ఈ బ్యాంక్ ఏడాదికి రూ. మూడు కోట్లకు పైగా లావాదేవీలను కొనసాగిస్తోంది.
మహిళలకు రుణాలివ్వడమే కాకుండా, సంపాదనలో కొంత మొత్తాన్ని పొదుపు చేసుకునేలా ప్రోత్సహిస్తూ పలు కార్యక్రమాలను రూపొందించారు. బ్యాంక్ లాభాలను డివిడెండ్ల రూపంలో సభ్యులందరికీ సమానంగా పంచారు. నేడు 1,300 జనాభా కలిగిన కల్లూడి గ్రామంలో ఉన్న సుమారు 610 కుటుంబాలలో 500కు పైగా కుటుంబాల వారు అప్పడాల తయారీ, వ్యాపారంలో నిమగ్న మైనారు. మహిళకు రుణాలివ్వడమే కాకుండా వారు తయారు చేసిన వస్తువుల విక్రయాలకు బ్యాంక్ ప్రాంగణంలోనే కొద్దిపాటి స్థలాన్ని గంగలక్ష్మమ్మ కేటాయించారు.
ఆకాశమే హద్దుగా.. ఆమె
Published Sun, Mar 8 2015 1:03 AM | Last Updated on Sat, Sep 2 2017 10:28 PM
Advertisement
Advertisement