ఎక్కువ గంటలు పనిచేస్తే సక్సెస్‌ వస్తుందా? | Celebrities, Politicians Slam LandT Chief SN Subramanian 90-Hour Work | Sakshi
Sakshi News home page

ఎక్కువ గంటలు పనిచేస్తే సక్సెస్‌ వస్తుందా?

Jan 11 2025 6:34 AM | Updated on Jan 11 2025 6:34 AM

Celebrities, Politicians Slam LandT Chief SN Subramanian 90-Hour Work

ఎల్‌అండ్‌టీ చైర్మన్‌ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు 

న్యూఢిల్లీ: ‘‘ఆదివారాలు కూడా ఆఫీస్‌కు రండి. వారానికి 90 గంటలు పనిచేయండి’’అంటూ ఎల్‌అండ్‌టీ చైర్మన్‌ ఎస్‌ఎన్‌ సుబ్రమణియన్‌ చేసిన వ్యాఖ్యలపై ప్రముఖ పారిశ్రామికవేత్తలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువ గంటలు పనిచేస్తే విజయం వస్తుందన్న గ్యారంటీ ఏమీ లేదని, కష్టపడి పనిచేయడం ముఖ్యమని, ఏది ఉన్నా ఉన్నత స్థాయి మేనేజ్‌మెంట్‌ నుంచే ఇది అమలు కావాలన్న అభిప్రాయాలు వినిపించాయి.

 అంతేకాదు, ఎల్‌అండ్‌టీ ఉద్యోగుల సగటు మధ్యస్త వేతనం కంటే 534 రెట్లు అధికంగా రూ.51 కోట్ల వేతనాన్ని 2023–24 ఆర్థిక సంత్సరానికి సుబ్రమణియన్‌ తీసుకోవడంపైనా సోషల్‌ మీడియాలో చర్చ నడుస్తోంది. ‘‘వారంలో 90 గంటలా? సండేని సన్‌ టు డ్యూటీగా ఎందుకు పేరు మార్చకూడదు. వారంలో ఒకరోజు సెలవుదినాన్ని ఒక భావనగా మార్చేయండి’’ అంటూ ఆర్‌పీజీ ఎంటర్‌ ప్రైజెస్‌ చైర్మన్‌ హర్ష గోయెంకా ‘ఎక్స్‌’లో పోస్ట్‌ పెట్టారు. కష్టపడి, స్మార్ట్‌గా పనిచేయడాన్ని తాను విశ్వసిస్తానన్నారు. జీవితాన్ని పూర్తిగా కార్యాలయానికే అంకింత చేయడం వల్ల విజయం రాకపోగా, అగ్గి రాజుకుంటుందన్నారు.

 ఉద్యోగం–జీవితం మధ్య సమతుల్యత అన్నది ఐచి్ఛకం కాదని, తప్పనిసరి అని పేర్కొన్నారు. మారికో చైర్మన్‌ హర్‌‡్ష మారివాలా కూడా ఇదే మాదిరి అభిప్రాయాన్ని ఎక్స్‌పై వ్యక్తం చేశారు. ‘‘విజయానికి కష్టపడి పనిచేయడం అన్నది కీలకం. ఇందుకు ఎన్ని గంటలు పనిచేశామన్నది ముఖ్యం కాదు. నాణ్యత, ఆ పని పట్ల అభిరుచి విజయాన్ని నిర్ణయిస్తాయి’’అని పేర్కొన్నారు. బజాజ్‌ ఆటో ఎండీ రాజీవ్‌ బజాజ్‌ ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడిన సందర్భంగా దీనిపై స్పందించారు. ‘‘ఇది అగ్ర స్థాయి ఉద్యోగుల నుంచి ప్రారంభిద్దాం. ఫలితమిస్తుందని తేలితే అప్పుడు మిగిలిన వారికి అమలు చేద్దాం’’అని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement