మొయినాబాద్: జిల్లాలోని మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం రూ.500 కోట్లు కేటాయించిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని చిలుకూరు మహిళా ప్రాంగణం ఆవరణలో డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో నిర్మించిన సాంకేతిక శిక్షణ, అభివృద్ధి కేంద్రం సమావేశ మందిర భవనాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. సమావేశ మందిరంలో తెలంగాణ తల్లి చిత్రపటాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ ఈ ఏడాది జిల్లాలోని మహిళాసంఘాలకు రూ.500 కోట్లు బ్యాంకులింకేజీ రుణాలు అందజేస్తున్నామన్నారు. జిల్లాలో 37 వేల సంఘాలలోని 4 లక్షల మందికి రుణాలు ఇస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు తీసుకున్న రుణాల రికవరీ 98 శాతం ఉందని, దాన్ని వంద శాతం పూర్తి చేయాలన్నారు. జిల్లా మహిళా సమాఖ్య భవన నిర్మాణం పూర్తి చేయడానికి రూ.40 లక్షలు జిల్లా పరిషత్ నుంచి మంజూరు చేయిస్తామన్నారు. తెలంగాణలో ఏర్పడిన తొలి ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, పేదల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందన్నారు.
19న సమగ్ర సర్వే...
ఈ నెల 19న నిర్వహించే సమగ్ర సర్వేకు ప్రతి ఒక్కరు సహకరించాలని మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. ఈ సర్వే ఆధారంగానే ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు అమలవుతాయని చెప్పారు. అధికారులు సైతం సర్వేను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పకడ్బందీగా చేయాలన్నారు. మన ఊరు-మన ప్రణాళిక ద్వారా అభివృద్ధికి కావాల్సిన ప్రణాళిక సిద్ధమయ్యిందన్నారు. రాబోయే రోజుల్లో వికారాబాద్‌ను జిల్లా కేంద్రంగా చేసి ఎక్కువ నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామని మంత్రి పేర్కొన్నారు. ఐటీఐఆర్ ప్రాజెక్టులో భాగంగా జిల్లాలో ఐటీ కంపెనీలు, సంస్థలు రావడానికి అవకాశం ఉందని, మొయినాబాద్, శంషాబాద్, షాబాద్, చేవెళ్ల, శంకర్‌పల్లి ప్రాంతాల్లో కంపెనీలు ఏర్పాటు చేయించి అభివృద్ధి చేస్తామని చెప్పారు.
రాజకీయాలకు అతీతంగా జిల్లా అభివృద్ధి: ఎమ్మెల్యే కాలె యాదయ్య
రాజకీయాలకు అతీతంగా జిల్లాను అభివృద్ధి చేయాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. చిలుకూరు మహిళా ప్రాంగణం ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మొయినాబాద్‌లో ఆర్టీసీ డిపో ఏర్పాటు చేయాలని, మంజీరా నీళ్లు అందించాలని మంత్రిని కోరారు. ఈ సందర్భంగా మండల ప్రజాప్రతినిధులు 111 జీవోతోపాటు ఇతర సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
అనంతరం జిల్లా మహిళా సమాఖ్యకు రూ.13.51 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాల చెక్కును మంత్రి చేతులు మీదుగా అందజేశారు. ప్రాంగణం ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి, జెడ్పీటీసీ చంద్రలింగంగౌడ్, ఎంపీపీ అనిత, వైస్ ఎంపీపీ పద్మమ్మ, డీఆర్‌డీఏ పీడీ వరప్రసాద్‌రెడ్డి, ఏపీడీ ఉమారాణి, జేడీఎం హమీద్, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు శకుంతల, ఎంపీడీఓ సుభాషిణి, తహసీల్దార్ గంగాధర్, ఏఈలు భాస్కర్‌రెడ్డి, బల్వంత్‌రెడ్డి, నాగరాజు, సర్పంచ్‌లు సంగీత, సుధాకర్, మల్లేష్, నవీన్, రాంచంద్రయ్య, ఎంపీటీసీలు సహదేవ్, పెంటయ్య, మాణిక్‌రెడ్డి, రాంరెడ్డి, నాయకులు అనంతరెడ్డి, గోపాల్‌రెడ్డి, కొండల్‌గౌడ్, హన్మంత్‌రెడ్డి, శ్రీహరియాదవ్, సంజీవరెడ్డి, రమేష్, హన్మంత్‌యాదవ్, దర్శన్, రవీందర్‌రెడ్డి, నీలకంఠం, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మహిళాభివృద్ధికి రూ.500 కోట్లు
Published Tue, Aug 5 2014 12:27 AM | Last Updated on Wed, Mar 28 2018 11:05 AM
Advertisement
Advertisement