చేవెళ్ల: రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీమేరకు రైతు రుణమాఫీలో భాగంగా మొదటి విడతగా రూ.ఐదువేల కోట్లు విడుదల చేసిందని అన్నారు. కూరగాయలు, పూలు, ఇతర పంట ఉత్పత్తుల రవాణాకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నైట్‌హాల్ట్ బస్సును (ప్రతిరోజు ఉదయం 4 గంటలకు చేవెళ్ల నుంచి నగరంలోని గుడిమల్కాపూర్ మార్కెట్‌కు వెళ్తుంది) ఆయన చేవెళ్లలో గురువారం ప్రారంభించారు.
ఈ సందర్భగా మాట్లాడుతూ.. కూరగాయలు, పూలు ఎక్కువగా పం డించే గ్రామాలకు మరిన్ని బస్సులను నడపాలని నిర్ణయించినట్లు తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్‌కు త్వరలో 100 వోల్వో బస్సులు రానున్నాయని చెప్పారు. ఐటీ కంపెనీల్లో 75వేల మంది మహిళా ఉద్యోగులు పనిచేస్తున్నారని, వీరికోసం కొత్తగా 15బస్సులు నడపనున్నట్లు వెల్లడించారు. ప్రతి పల్లెకు బస్సు సౌకర్యాన్ని కల్పిస్తామని పునరుద్ఘాటించారు.
రోడ్లు బాగాలేని గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించి బస్సులను వేయనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎమ్మెల్సీ పి.నరేందర్‌రెడ్డి, ఎంపీపీ ఎం. బాల్‌రాజ్, జెడ్పీటీసీ చింపుల శైలజ, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు సామ మాణిక్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ దేవర వెంకట్‌రెడ్డి, ఎంపీటీసీలు సున్నపు పద్మవసంతం, అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ప్రొటోకాల్ రగడ..
బస్సు ప్రారంభ కార్యక్రమానికి తమకు కనీస సమాచారంలేదని, ప్రొటోకాల్ పాటించలేదని ఎంపీపీ బాల్‌రాజ్, సర్పంచ్ నాగమ్మ తీవ్ర నిరసన వ్యక్తంచేశారు. బస్సు ప్రారంభానికి విచ్చేసిన మంత్రికి ఈ విషయంపై ఫిర్యాదుచేశారు. టీఆర్‌ఎస్ నాయకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. స్పందించిన మంత్రి మరోసారి ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని అధికారులు, పార్టీ నాయకులకు సూచించారు.
రైతు సంక్షేమానికి ప్రాధాన్యం
Published Thu, Oct 2 2014 11:42 PM | Last Updated on Wed, Mar 28 2018 11:05 AM
Advertisement
Advertisement