వికారాబాద్: కామారెడ్డిగూడలో ఏర్పాటు చేయతలబెట్టిన ఆర్టీసీ డ్రైవింగ్ శిక్షణ కేంద్రం కాగితాలకే పరిమితమైంది. ఆర్టీసీ డ్రైవర్ల శిక్షణకు ఎంతో ఉపయోగపడేవిధంగా రాష్ట్రంలోనే తొలి సారిగా అల్ట్రా మోడల్ టెస్ట్ ట్రాక్‌ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిర్ణయించినప్పటికి అది అమలుకు నోచుకోలేదు. జిల్లాకు చెందిన పి.మహేందర్‌రెడ్డి రోడ్డురవాణాశాఖ మంత్రిగా ఉన్న ప్రస్తుత తరుణంలోనైనా ఈ కల సాకారం కాగలదని జిల్లావాసులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
ఆర్టీసీకి సుశిక్షితులైన డ్రైవర్ల వ్యవస్థ కీలకం. వీరికి ప్రత్యేకంగా డ్రైవింగ్ శిక్షణ ట్రాక్ లేకపోవడంతో రోడ్లపైనే మెళకువలు నేర్పుతున్నారు. కొత్తగా విధుల్లో చేరే ఆర్టీసీ డ్రైవర్లు మెరుగైన శిక్షణను అందించాలంటే రోజురోజుకు రోడ్లపై ట్రాఫిక్‌పెరిగిపోవడంతో అది అంత సులువుగా సాధ్యం కావడం లేదు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేకంగా డ్రైవింగ్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఇందుకుగానూ మూడేళ్ల కిందట వికారాబాద్ మండలపరిధిలో కామారెడ్డిగూడలో 30ఎకరాల ప్రభుత్వభూమిని పరిశీలించింది.
ఇందులో రాష్ట్రంలోనే తొలిసారిగా అల్ట్రా మోడల్ టెస్ట్ ట్రాక్‌ను ఏర్పాటుచేయాలనేది లక్ష్యం. ముఖ్యంగా ఉద్యోగశ్రీ, ఆర్టీసీ ఎంపికచేసిన డ్రైవర్లకు ఇక్కడ శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. దానికి అనుగుణంగా అప్పట్లోనే ఆర్టీసీ, రెవెన్యూ అధికారులు సర్వేనంబర్ 101లోని 30ఎకరాలను పరిశీలించారు. ఆ భూమిని తమకు అప్పగించాలంటూ రెవెన్యూశాఖకు రూ.30లక్షల నిధులను ఆర్టీసీ అధికారులు అందజేశారు. అయితే ఆ తర్వాత ఆ ఫైల్‌ను పట్టించుకునేవారే కరవయ్యారు.
రెవెన్యూ అధికారుల అలసత్వం వల్లే జిల్లా కలెక్టరేట్లో స్థలానికి సంబంధించిన ఫైల్ రెండేళ్లపాటు మూలిగిందని పేరు తెలపడానికి ఇష్టపడని ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. తమశాఖ సిబ్బంది పదేపదే విజ్ఞప్తి చేసిన తర్వాతే ఆరునెలల కిందట ఆ ఫైల్ వికారాబాద్ సబ్‌కలెక్టర్ కార్యాలయానికి వచ్చిందని సదరు అధికారి పేర్కొన్నారు. రెండు నెలల కిందట సబ్‌కలెక్టర్ స్థలాన్ని పరిశీలించి సాధ్యమైనంత తొందరలో ఆర్టీసీకి అప్పగించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు కానీ అమలుకు నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ అవరోధం.....
రైతులకు సంబంధించిన నాలుగు ఎకరాల పట్టాభూమి ఆర్టీసీకి కేటాయించిన 30 ఎకరాల భూమి మధ్యలో ఉంది. ఈ నేపథ్య ంలో సబ్‌కలెక్టర్ ఆమ్రపాలి రైతులతో పలుమార్లు మాట్లాడి ‘నష్టపరిహారం ఇస్తాం, వెంటనే మీ భూమిని మాకు అప్పగించాల’ని కోరినప్పటికి రైతులు ససేమిరా అంటున్నట్లు సమాచారం.భూమికి బదులు భూమే ఇవ్వండి, నష్ట పరిహారం కింద డబ్బులు అక్కర్లేదని రైతులు సబ్‌కలెక్టర్‌తో పేర్కొన్నట్లు సమాచారం.
మంత్రిపైనే భారం
ఉమ్మడి రాష్ట్రంలో ఎలాగూ ప్రాజెక్టు అమలుకు నోచుకోలేదు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాతనైనా ఆర్టీసీ డ్రైవర్ల శిక్షణ కేంద్రాన్ని త్వరగా ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులు కోరుతున్నారు.రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రిగా జిల్లాకు చెందిన మహేందర్‌రెడ్డి ఉన్నందున వెంటనే దీనిపై దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. ఈ మేరకు వెంటనే చర్యలు చేపట్టాలని ఆర్టీసీ అధికారులు మంత్రిని కోరినట్లు తెలిసింది.
ఇంకెన్నాళ్లీ నిరీక్షణ!
Published Wed, Sep 10 2014 11:07 PM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM
Advertisement
Advertisement