Womens Hockey World League
-
ఎట్టకేలకు ఒక విజయం.. ప్రపంచకప్‌లో భారత్ బోణీ
థెరస (స్పెయిన్): మహిళల ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్లో భారత జట్టు ఎట్టకేలకు ఒక విజయాన్ని సాధించింది. ఇప్పటికే పతకం రేసుకు దూరమైన అమ్మాయిల జట్టు వర్గీకరణ మ్యాచ్‌లో షూటౌట్లో కెనడాను కంగుతినిపించింది. 9 నుంచి 16 స్థానాల కోసం మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో సవిత పూనియా సేన షూటౌట్లో 3–2తో విజయం సాధించింది. హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్‌లో నిర్ణీత సమయం ముగిసే సమయానికి ఇరు జట్లు 1–1తో సమ ఉజ్జీలుగా నిలిచాయి. కెప్టెన్ సవిత గోల్‌పోస్ట్ వద్ద అడ్డుగోడగా మారి షూటౌట్లో భారత్‌ను గెలిపించింది. షూటౌట్ సహా మ్యాచ్ మొత్తమ్మీద ఆమె ఏకంగా ఆరు గోల్స్‌ను చాకచక్యంగా అడ్డుకుంది. మ్యాచ్ ఫలితాన్ని తేల్చిన షూటౌట్లో భారత్ తరఫున నవ్‌నీత్ కౌర్, సోనిక, నేహా గోల్స్ సాధించారు. 11వ నిమిషంలోనే మ్యాడిలైన్ సికో కెనడా తరఫున ఖాతా తెరిచింది. ఆ తర్వాత పలు పెనాల్టీ కార్నర్ అవకాశాలు వచ్చినా భారత రక్షణ పంక్తి సమర్థంగా అడ్డుకుంది. అయితే రెండు క్వార్టర్లు ముగిసినా గోల్ చేయడంలో వెనుకబడిపోయిన భారత అమ్మాయిలపై ఒత్తిడి పెరిగింది. మూడో క్వార్టర్లో స్కోరును సమం చేసేందుకు సువర్ణావకాశం వచ్చింది. కానీ నవ్‌జ్యోత్ కౌర్ కొట్టిన షాట్ గోల్‌పోస్ట్ బార్‌ను తాకుతూ బయటికి వెళ్లిపోయింది. మరోవైపు కెనడా ఫార్వర్డ్ లైన్ దాడులను కొనసాగించింది. ఈ క్రమంలో ప్రత్యర్థి జట్టుకు మరో పెనాల్టీ కార్నర్ లభించగా, సవిత అసాధారణ డైవింగ్‌తో వారి ప్రయత్నాన్ని విఫలం చేసింది. ఎట్టకేలకు భారత అమ్మాయిలు ఆఖరి క్వార్టర్లో అది కూడా మ్యాచ్ ముగిసే సమయంలో కెనడా గెలుపుదిశను మార్చేశారు. 58వ నిమిషంలో పెనాల్టీ కార్నర్‌ను గోల్‌పోస్ట్ దిశగా గుర్జీత్ కౌర్ కొట్టిన షాట్ రీబౌండ్ కాగా సలిమా టేటే సమయస్ఫూర్తితో గోల్‌గా మలిచింది. దీంతో స్కోరు 1–1తో సమమై షూటౌట్‌కు దారితీసింది. బుధవారం 9 నుంచి 12 స్థానాల కోసం జరిగే పోరులో భారత్... జపాన్‌తో తలపడుతుంది. -
‘రాణి’ లేని జట్టుతో ప్రపంచకప్‌కు..
న్యూఢిల్లీ: మాజీ కెప్టెన్, స్టార్ స్ట్రయికర్ రాణి రాంపాల్ ఫిట్నెస్ సమస్యలతో ప్రపంచకప్ ఆడే జట్టుకు దూరమైంది. సీనియర్ గోల్ కీపర్ సవిత సారథ్యంలోని మహిళల భారత హాకీ జట్టును హాకీ ఇండియా (హెచ్ఐ) సెలక్టర్లు మంగళవారం ప్రకటించారు. తొడ కండరాల గాయం నుంచి రాణి పూర్తిగా కోలుకోలేదు. దీంతో ఆమెను ఎంపిక చేయలేదని హెచ్ఐ వర్గాలు వెల్లడించాయి. గతేడాది టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌ను తొలిసారి నాలుగో స్థానంలో నిలిపిన ఘనత రాణిది. ఆ తర్వాత గాయం కారణంగా ఆమె ఏ టోర్నీ ఆడలేదు. ఇటీవలే ప్రొ లీగ్ మ్యాచ్‌లకు ఎంపిక చేసినా... పూర్తి ఫిట్నెస్ లేక తొలి నాలుగు మ్యాచ్‌ల్లో ఆడలేకపోయింది. దీంతో భారత ప్రపంచకప్ జట్టు నుంచి తప్పించారు. నెదర్లాండ్స్, స్పెయిన్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న మహిళల ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్ వచ్చే నెల 1 నుంచి 17 వరకు జరుగుతుంది. భారత జట్టు: సవిత (కెప్టెన్, గోల్‌కీపర్), దీప్ గ్రేస్ ఎక్కా (వైస్ కెప్టెన్), బిచూ దేవి, గుర్జీత్ కౌర్, నిక్కీ ప్రధాన్, ఉదిత, నిషా, సుశీల చాను, మోనిక, నేహా, జ్యోతి, నవ్‌జ్యోత్ కౌర్, సోనిక, సలిమా టేటే, వందన కటారియా, లాల్రెమ్సియామి, నవ్‌నీత్ కౌర్, షర్మిలా దేవి. -
ఇంగ్లండ్‌తో భారత మహిళల తొలి పోరు
ప్రపంచకప్ మహిళల హాకీ టోర్నమెంట్లో భారత జట్టు తమ గ్రూప్ ‘బి’ తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో తలపడుతుంది. ఈ ఏడాది జూలై 1 నుంచి 17 వరకు స్పెయిన్, నెదర్లాండ్స్‌లలో ఈ మెగా ఈవెంట్ జరుగుతుంది. జూలై 3న ఇంగ్లండ్‌తో తొలి మ్యాచ్ అనంతరం 5న చైనాతో... 7న న్యూజిలాండ్ తో భారత్ ఆడుతుంది. లీగ్ దశ తర్వాత నాలుగు గ్రూపుల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. చదవండి: Womens World Cup 2022: టాయిలెట్లో చిక్కుకుపోయిన మహిళా క్రికెటర్.. మ్యాచ్ కోసం -
హాకీ ప్రపంచకప్ నిర్వాహాకులపై ఫ్యాన్స్ ఫైర్
లండన్ : మహిళల హాకీ ప్రపంచకప్ టోర్నీ నిర్వాహకులపై భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లండన్ వేదికగా శనివారం నుంచి ఆగస్టు 5 వరకు కొనసాగే ఈ టోర్నీలో రాణి రాంపాల్ నేతృత్వంలోని భారత్ జట్టు పాల్గొంటుంది. అయితే ఈ టోర్నీకి ముందు నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో నిర్వాహకులు ఘోర తప్పిదం చేశారు. భారత జాతీయ పతాకంలో అశోక చక్రాన్ని మరిచారు. దీంతో అభిమానులు టోర్నీ నిర్వహకులపై మండిపడుతున్నారు. టోర్నీ ప్రచారంలో భాగంగా నిర్వాహకులు ఏర్పాటు చేసిన ఫొటోషూట్‌లో 16 దేశాలకు చెందిన కెప్టెన్లు పాల్గొన్నారు. మిగతా సారథులతో కలిసి భారత కెప్టెన్ రాణి సైతం ఫొటోషూట్‌కు హాజరయ్యారు. ఇందులో భాగంగా ఆయా కెప్టెన్లు తమ దేశానికి సంబంధించిన జాతీయ పతాకాల పక్కన నిల్చొని ఫొటోలకు ఫోజులిచ్చారు. అయితే, నిర్వాహకులు భారత జాతీయ పతాకంలో అశోకచక్రాన్ని ఉంచడం మరిచారు. మన జాతీయ పతాకం పక్కన రాణి రాంపాల్ నిల్చున్న ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దీంతో భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. ప్రతిష్టాత్మక ప్రపంచకప్ టోర్నీలో ఇలాంటి తప్పులు చేయడం ఏమిటని మండిపడుతున్నారు. ఇక పూల్-బిలో చోటు దక్కించుకున్న భారత్ శనివారం తొలి మ్యాచ్‌ను ఇంగ్లండ్‌తో తలపడనుంది. Ashok Chakra missing from the Indian flag. Is it a mistake or done intentionally? — Nilesh Tandon (@nileshtandon) July 19, 2018 -
జపాన్ చేతిలో భారత్ పరాజయం
జొహన్నెస్‌బర్గ్: మహిళల హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్స్ టోర్నీ వర్గీకరణ మ్యాచ్‌లో భారత్ 0–2 గోల్స్ తేడాతో జపాన్ చేతిలో ఓడిపోయింది. 5 నుంచి 8 స్థానాల కోసం జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి చెందడంతో... ఇక శనివారం ఐర్లాండ్‌తో 7–8 స్థానాల కోసం తలపడుతుంది. జపాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ దూకుడుగా ఆడినా అందివచ్చిన అవకాశాలను గోల్స్‌గా మల్చుకోవడంలో విఫలమైంది. మరోవైపు జపాన్‌కు 7వ నిమిషంలో కానా నొమురా, 29వ నిమిషంలో నహో ఇచితాని ఒక్కో గోల్ అందించారు. భారత్‌కు తొలి పెనాల్టీ కార్నర్ 51వ నిమిషంలో లభించగా... గుర్జీత్ కౌర్ కొట్టిన షాట్‌ను జపాన్ గోల్‌కీపర్ అడ్డుకుంది. జపాన్‌కు పది పెనాల్టీ కార్నర్లు లభించగా, రెండింటిని గోల్స్‌గా మలిచింది. -
భారత్‌కు తొలి గెలుపు
జొహన్నెస్‌బర్గ్: మహిళల హాకీ వరల్డ్ లీగ్ (హెచ్‌డబ్ల్యూఎల్) సెమీఫైనల్స్ టోర్నమెంట్లో భారత జట్టు తొలి విజయం నమోదు చేసింది. చిలీతో బుధవారం జరిగిన గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 1–0 గోల్‌తో గెలిచింది. ఆట 38వ నిమిషంలో ప్రీతి దూబే ఏకైక గోల్ చేసి భారత విజయంలో కీలకపాత్ర పోషించింది. ఈనెల 16న జరిగే తమ చివరి లీగ్ మ్యాచ్‌లో అర్జెంటీనాతో భారత్ ఆడుతుంది. -
భారత్, దక్షిణాఫ్రికా హాకీ మ్యాచ్ డ్రా
మహిళల హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్స్ టోర్నమెంట్లో భాగంగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య శనివారం జరిగిన మ్యాచ్ 0–0తో డ్రాగా ముగిసింది. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ దక్కింది. ప్రారంభం నుంచి హోరాహోరీగా తలపడిన రెండు జట్లు గోల్స్ కోసం తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదు. తమకు లభించిన రెండు పెనాల్టీ కార్నర్లను భారత్ సద్వినియోగం చేసుకోలేకపోయింది. అటు ప్రొటీస్ ఎదురుదాడికి దిగడంతో చాలా అవకాశాలు వచ్చినా వాటిని గోల్స్‌గా మలచలేకపోయింది. -
సెమీస్‌లో భారత అమ్మాయిలు
వెస్ట్ వాంకోవర్ (కెనడా): మహిళల హాకీ వరల్డ్ లీగ్ రౌండ్–2 టోర్నమెంట్లో భారత జట్టు సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. బెలారస్‌తో జరిగిన గ్రూప్ ‘ఎ’ రెండో లీగ్ మ్యాచ్‌లో భారత్ 1–0 గోల్ తేడాతో గెలిచి వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. మ్యాచ్ 26వ నిమిషంలో వందన కటారియా బ్యాక్‌హ్యాండ్ షాట్‌తో కళ్లు చెదిరేరీతిలో భారత్‌కు ఏకైక గోల్‌ను అందించింది. మూడు జట్లున్న గ్రూప్ ‘ఎ’లో భారత్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచి ఐదు పాయింట్లతో సెమీఫైనల్ బెర్త్‌ను దక్కించుకుంది. -
భారత్ శుభారంభం
వెస్ట్ వాంకోవర్ (కెనడా): మహిళల హాకీ వరల్డ్ లీగ్ రౌండ్–2 టోర్నమెంట్లో భారత జట్టు శుభారంభం చేసింది. ఉరుగ్వే జట్టుతో జరిగిన గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో భారత్ పెనాల్టీ షూటౌట్లో 4–2తో విజయం సాధించింది. నిర్ణీత సమయం పూర్తయ్యాక రెండు జట్లు 2–2తో సమఉజ్జీగా నిలిచాయి. భారత్ తరఫున రాణి రాంపాల్ (6వ ని.లో), వందన కటారియా (49వ ని.లో) ఒక్కో గోల్ చేయగా... ఉరుగ్వే జట్టుకు మరియా తెరిసా వియానా (45వ ని.లో), మనుయెలా విలార్ (54వ ని.లో) ఒక్కో గోల్ అందించారు. ఫలితం తేలడానికి షూటౌట్‌ను నిర్వహించగా... భారత్ తరఫున మోనిక, దీపిక, నవజ్యోత్ కౌర్, రాణి రాంపాల్ సఫలంకాగా... గుర్జీత్ కౌర్ విఫలమైంది. ఉరుగ్వే తరఫున మనుయెలా విలార్, మిలాగ్రోస్ గోల్స్ చేయగా... కాన్స్టాంజా, లూసియా, మాటిల్డి షాట్లను భారత గోల్‌కీపర్ సవిత నిలువరించింది.