Womens quota seats
-
ఐఐటీల్లో పెరిగిన విద్యార్థినులు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)ల్లో సూపర్‌న్యూమరీ మహిళా కోటాను ప్రవేశ పెట్టాక విద్యార్థినుల సంఖ్య మూడు రెట్లు పెరిగిందని కేంద్ర విద్యాశాఖ పరిధిలోని అడ్మిషన్స్ స్టాటస్టిక్స్–2021 తాజా నివేదిక పేర్కొంది. ఈ కోటా కింద 2021–22 ఏడాది బ్యాచ్‌లో 20 శాతం మంది విద్యార్థినులే ఉన్నారని, 2017లో ఐఐటీల్లో విద్యార్థినులు కేవలం 995 మంది ఉండగా, ప్రస్తుతం వీరి సంఖ్య 2,990కి పెరిగిందని తెలిపింది. ప్రతిష్టాత్మక ముంబై ఐఐటీలో 2017లో కేవలం 100 మంది విద్యార్థినులు చేరగా, ప్రస్తుతం 271కి, ఐఐటీ ఢిల్లీలో ఈ సంఖ్య 90 నుంచి 246కి, హైదరాబాద్ ఐఐటీలో 43 నుంచి 94కు పెరిగిందని వెల్లడించింది. 2017–2021 కాలంలో ఐఐటీల్లో ప్రవేశం పొందిన మొత్తం విద్యార్థులు 10,988 నుంచి 16,296కి పెరగ్గా, విద్యార్థినుల సంఖ్య మూడు రెట్లు పెరిగిందని వివరించింది. ‘ఐఐటీల్లో విద్యార్థినుల సంఖ్య పెరగడం సామాజికంగా, దీర్ఘకాలికంగా తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. వీరిలో చాలా మంది అగ్రశ్రేణి స్థానాల్లో ఉంటారు. అత్యున్నత బ్యాంకర్లలో వీరి సంఖ్య పెరుగుతుంది’అని ఐఐటీ బాంబే డైరెక్టర్ సుభాశీష్ చౌదరి పేర్కొన్నారు. -
మహిళా కోటాపై ఐఐటీలకే అధికారం
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లోని వివిధ కోర్సుల్లో మహిళల ప్రాతినిధ్యం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రత్యేక సీట్ల కేటాయింపు ఈ విద్యాసంవత్సరం నుంచి మారనుంది. ఇప్పటివరకు అన్ని ఐఐటీల్లోని సీట్లకు అదనంగా 20 శాతం సీట్లను మహిళలకు కేటాయిస్తూ వచ్చారు. ఈ ఏడాది మాత్రం ఈ విధానాన్ని తొలగించి జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించిన మహిళల సంఖ్యను అనుసరించి ఆయా ఐఐటీలే 20 శాతం కోటా సీట్లను నిర్ణయించుకునేలా కొత్త విధానాన్ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఇటీవల ఈ మార్పులను ప్రకటించింది. అర్హులైన మహిళా అభ్యర్థుల అందుబాటును అనుసరించి సూపర్ న్యూమరరీ సీట్లు ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ఆయా ఐఐటీలకు కల్పించింది. ఐఐటీల్లో మహిళల సంఖ్య తక్కువగా ఉండటంతో కేంద్ర ప్రభుత్వం ఐఐటీల్లో వారి ప్రాతినిధ్యం పెంచేందుకు 2018 నుంచి కొత్త విధానాన్ని తీసుకువచ్చింది. ఐఐటీల్లోని మొత్తం సీట్లకు అదనంగా మరికొన్ని సీట్లను సూపర్ న్యూమరరీ కోటాలో కేవలం మహిళలకు కేటాయించేలా అదనపు సీట్లను ఏర్పాటు చేయించింది. 2018–19లో 14 శాతం సీట్లను ఇలా కేటాయించగా, 2019–20లో ఈ సంఖ్యను 17 శాతానికి పెంచింది. 2020–21లో దీనిని 20 శాతం చేసింది. ఇక 2021–22 సంవత్సరానికి వచ్చేసరికి ఈ కొత్త మార్పును తీసుకువచ్చింది. ఆయా ఐఐటీలే ఈ 20 శాతం కోటాపై నిర్ణయం తీసుకునేలా చేసింది. గత ఏడాది కరోనా వల్ల జేఈఈ మెయిన్‌లో అర్హులైన అభ్యర్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ను రాయలేకపోయారు. వారికి ఈసారి జేఈఈ అడ్వాన్స్‌డ్‌ను నేరుగా రాసుకునే అవకాశాన్ని ఎన్టీఏ కల్పించింది. వీరు గత ఏడాది జేఈఈ మెయిన్ అర్హతతోనే ఈ అడ్వాన్స్‌డ్‌ను రాసే అవకాశం వచ్చింది. ఈ విద్యా సంవత్సరం జేఈఈ మెయిన్ నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించిన 2.50 లక్షల మందికి వీరు అదనం. ఈ కారణంగానే మహిళలకు సూపర్ న్యూమరరీ సీట్ల కేటాయింపును ఆయా ఐఐటీలకు అర్హత సాధించే మహిళల సంఖ్యను అనుసరించి నిర్ణయం తీసుకునేలా కొత్త మార్పు చేశారు. గత ఏడాదిలో అర్హులైన మహిళలు లేకపోవడం వల్ల పలు ఐఐటీల్లో సూపర్ న్యూమరరీ కోటా సీట్లు పూర్తిగా భర్తీకి నోచుకోలేదు. కొన్ని ఐఐటీల్లో ఎక్కువ మంది మహిళలు ఉన్నా సూపర్ న్యూమరరీ కోటాను అనుసరించి సీట్లకేటాయింపు చేశారు. ఈనేపథ్యంలో అర్హులైన మహిళా అభ్యర్థుల సంఖ్యను అనుసరించి ఆయా ఐఐటీలే నిర్ణయం తీసుకునేలా ఈసారి మార్పులు చేశారు. టాప్ 100 అభ్యర్థులకు పూర్తి రాయితీ జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మెరిట్ సాధించిన వారిలో మొదటి 100 మంది ఆల్ ఇండియా ర్యాంకర్లు తమ ఐఐటీలో చదువులు పూర్తి చేసేందుకు అయ్యే ఖర్చు మొత్తాన్ని స్కాలర్షిప్ కింద అందించేందుకు ఐఐటీ ఖరగ్‌పూర్ నిర్ణయించింది. ఈ విద్యాసంవత్సరం నుంచి ఈ విధానాన్ని అమలు చేయనున్నట్టు వెల్లడించింది. ఏడాదికి రూ.20 లక్షలలోపు ఆదాయం ఉన్న కుటుంబాల్లోని విద్యార్థులు ఫుల్ స్కాలర్‌షిప్‌నకు అర్హులని వివరించింది. ‘పండిట్ ఈశ్వర చంద్ర విద్యాసాగర్ ఫుల్ స్కాలర్షిప్ ఫర్ టాప్ 100 జేఈఈ ర్యాంకర్స్’ పేరిట అందించనుంది. దీనికింద ఇనిస్టిట్యూషన్ ఫీజు, వసతి భోజన ఖర్చులు, పాఠ్యపుస్తకాలు, కంప్యూటర్ వంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, ప్రయాణ ఖర్చులు, వ్యక్తిగత ఖర్చులతో పాటు ఇతర వ్యయాలను కూడా ఐఐటీయే భరిస్తుంది. వీటితోపాటు ప్రతినెలా పాకెట్ మనీ కూడా అందిస్తుంది. -
మహిళా రిజర్వేషన్‌కు లాటరీ విధానం!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: గ్రామ పంచాయతీల రిజర్వేషన్ల కేటాయింపుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. జిల్లా మొత్తంగా ఏ కేటగిరీకి ఎన్ని పంచాయతీలనేది స్పష్టం కావడంతో.. ఇక ఏ పంచాయతీ ఏ కేటగిరీకి కేటాయిస్తారోనని అందరూ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. పంచాయతీలు, వార్డులకు రిజర్వేషన్ వర్తింపుపై కసరత్తు చేస్తున్న యంత్రాంగం బుధవారం స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే కలెక్టర్ నుంచి ఆర్డీఓలకు ప్రతిపాదనలు వెళ్లినట్లు తెలిసింది. అయితే రిజర్వేషన్లు ఎలా అమలు చేయాలన్న అంశంపై పూర్తిస్థాయిలో స్పష్టత లేదు. ప్రధానంగా ఏ ప్రాతిపదికన పంచాయతీలు, వార్డులు మహిళలకు కేటాయించాలన్న విషయమై అధికారులు దృష్టిపెట్టారు. తాజాగా దీనిపై మార్గదర్శకాలు వెలువడ్డాయి. ప్రభు త్వం నోటిఫికేషన్ విడుదల చేయగానే రిజర్వేషన్ల వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు. లాటరీ విధానమే... స్థానిక సంస్థల్లో 50 శాతం సీట్లను మహిళలకు కేటాయించాలని కోర్టు తీర్పు మహిళా రిజర్వేషన్‌కు లాటరీ విధానం! చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లాలోని 560 గ్రామ పంచాయతీల్లో 280 జీపీలు మహిళా కోటాలోకి వెళ్లాయి. అయితే ఏయే పంచాయతీలు, వార్డులు మహిళలకు కేటాయించాలన్న అంశంపై అధికారుల వద్ద నిర్ధిష్ట గైడ్‌లైన్స్ లేవు. ఇదే విషయాన్ని సర్కారు దృష్టికి తీసుకెళ్లడంతో మంగళవారం కాస్త పురోగతి లభించింది. మహిళలకు లాటరీ విధానంలో జీపీలు, వార్డులను కేటాయించాలని స్పష్టతనిచ్చింది. కలెక్టర్ నేతృత్వంలో ఆర్డీఓలు లాటరీ విధానంలో ఆయా జీపీలను మహిళలకు రిజర్వ్ చేయనున్నారు. తుది దశలో.. పంచాయతీలకు రిజర్వేషన్ల వర్తింపుపై యంత్రాంగం వేగంగా చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే అన్ని మండలాలకు సంబంధించి కేటగిరీల వారీగా రిజర్వేషన్ల సంఖ్యను కలెక్టర్ ఖరారు చేయగా.. పంచాయతీల వారీగా వార్డుల రిజర్వేషన్ల సంఖ్యను ఆర్డీఓలు ఫైనల్ చేసినట్లు తెలిసింది. జీపీలకు ఆయా కేటగిరీల కింద రిజర్వ్ చేసే అంశం ఆర్డీఓల పరిధిలో ఉంది. ఇదే తరహాలో వార్డులను సంబంధిత ఎంపీడీఓలు కేటగిరీల వారీగా రిజర్వ్ చేయనున్నారు. ఆయా వార్డుల్లో ఓటర్ల సంఖ్యను ప్రామాణికంగా తీసుకుని ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు. బేసి సంఖ్య ఉంటే ఎలా.. ఆయా జీపీల్లో వార్డులు బేసి సంఖ్యలో ఉన్నాయి. ఇటువంటి సందర్భంలో మహిళా కోటా కింద 50 శాతం వార్డులుపోగా అన్‌రిజర్వ్ కింద ఒక వార్డు అదనంగా మిగులుతోంది. ఈ స్థానాన్ని మహిళలకు రిజర్వ్ చేయాలా.. లేక జనరల్‌కు కేటాయించాలా? అనే అంశంపై అధికారుల వద్ద స్పష్టత లేదు. ఉదాహరణకు ఒక పంచాయతీలో 23 వార్డులు ఉంటే.. మహిళలకు 50 శాతం కోటా కింద 11.5 వార్డులను కేటాయించడం అసాధ్యం. అంటే మహిళలకు 11 లేదా 12 కేటాయించాల్సి ఉంటుంది. ఇలా బేసి అంకెగా మిగులుతున్న వార్డుని ఎవరికి కేటాయించాలని ప్రభుత్వాన్ని యంత్రాంగం కోరినట్లు తెలిసింది. దీనిపై బుధవారం స్పష్టత వచ్చే అవకాశముందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఆ తర్వాత వార్డుల రిజర్వ్ ప్రక్రియ కూడా పూర్తి కానుంది. -
వారంలోగా మహిళల కోటా స్థానాలు!
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ల నియామకంలో తొలిసారిగా రిజర్వేషన్ విధానానికి శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా మహిళలకు 33శాతం కోటా ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు మార్కెటింగ్ చట్టానికి సవరణలు ప్రతిపాది స్తూ.. రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపాదించిన తీర్మానం ఆమోదం పొందిం ది. తాజా సవరణ మేరకు రాష్ట్రంలోని 168 వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో మహిళలకు 55 మార్కెట్లకు చైర్పర్సన్ స్థానాలు దక్కనున్నాయి. అయితే కేటగిరీల వారీగా మహిళలకు దక్కే మార్కెట్ కమిటీలను గుర్తించడంపై మార్కెటింగ్‌శాఖ దృష్టి సారించింది. గతంలో కేటగిరీల వారీగా కేటాయించిన కోటా నుం చే.. మహిళలకు దక్కే స్థానాలను గుర్తించాలని మార్కెటింగ్‌శాఖ ప్రాథమికంగా నిర్ణయించిం ది. నామినేటెడ్ పదవుల భర్తీని ప్రభుత్వం నెలాఖరులో చేపడుతుందనే వార్తల నేపథ్యం లో.. వీలైనంత త్వరగా మార్కెట్ కమిటీల్లో మహిళా కోటా స్థానాలను గుర్తించనున్నారు. నిజానికి గడాది సెప్టెంబర్‌లోనే కేటగిరీల వారీగా రిజర్వేషన్ కోటా ఖరారు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు దక్కే మార్కెట్ కమిటీలను రిజర్వేషన్ కోటాకు అనుగుణంగా లాటరీ ద్వారా ఎంపిక చేశారు. తొలి ఏడాది లాటరీ పద్ధతిలో రిజర్వేషన్లు ఖరారు చేయగా.. తర్వాతి ఏడాది నుంచి రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్ విధానాన్ని అనుసరిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కొత్తగా ఏర్పాటయ్యే కమిటీల పదవీకాల పరిమితి ఏడాది కాగా.. ఈ కమిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్‌తో 14 మంది సభ్యులు వుంటారు. లాటరీ విధానంలో రిజర్వేషన్లు కొత్తగా ఏర్పాటవుతున్న మార్కెట్ యార్డులను కూడా పరిగణనలోకి తీసుకుని.. వ్యవసాయశాఖ కార్యదర్శి పార్థసారథి చైర్మన్‌గా, మార్కెటింగ్ శాఖ డెరైక్టర్ డాక్టర్ శరత్, అదనపు డెరైక్టర్ లక్ష్మీబాయి, వ్యవసాయశాఖ అదనపు కార్యదర్శి సూర్యప్రభ సభ్యులుగా వున్న కమిటీలాటరీ విధానంలో వ్యవసాయ మార్కెట్ కమిటీలకు రిజర్వేషన్లు ఖరారు చేసింది. 179 వ్యవసాయ మార్కెట్ కమిటీల కుగాను..పీసా చట్టం-1996 ప్రకారం ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో షెడ్యూలు ఏరియాలోని 11 కమిటీలను ఎస్టీలకు కేటాయించారు. మిగతా 168 మార్కెట్ కమిటీల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తూ ఎస్టీలకు - 6 శాతం, ఎస్సీలకు - 15 శాతం, బీసీలకు- 29 శాతం చొప్పున మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులు కేటాయించారు. మిగతా 84 కమిటీలను అన్ రిజర్వుడు (ఓసీ)గా పరిగణిస్తూ రిజర్వేషన్లు ఖరారు చేశారు. తాజా సవరణ నేపథ్యంలో షెడ్యూలు ఏరియాలోని మార్కెట్ కమిటీలను మినహాయిస్తే.. మిగతా 168 కమిటీల్లో 33శాతాన్ని మహిళలకు రిజ ర్వు చేయాల్సి వుంటుంది. ఈ లెక్కన మహిళలకు 55 స్థానాలు దక్కే అవకాశం వుందని మార్కెటింగ్‌శాఖ వర్గాలు వెల్లడించాయి. వారంలోగా మహిళలకు రిజర్వు చేసిన కమిటీల గుర్తింపు ప్రక్రియ పూర్తిచేస్తామని మార్కెటింగ్‌శాఖ డెరైక్టర్ శరత్ వెల్లడించారు.