Womens reservation quota
-
Lok Sabha Election 2024: మహిళలు 10 శాతమైనా లేరు!
ఈ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో మహిళల సంఖ్య 10 శాతం కంటే తక్కువే ఉంది! ఈసారి మహిళా అభ్యర్థులు కేవలం 797 మందేనని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) వెల్లడించింది. అంటే 9.5 శాతం! తొలి విడతలో 1,618 మంది అభ్యర్థుల్లో మహిళలు 135 మంది. రెండో విడతలో 1,192 మంది అభ్యర్థుల్లో 100 మంది, మూడో విడతలో 1,352 మందిలో 123, నాలుగో విడతలో 1,717 మందిలో 170, 5వ విడతలో 695 మందిలో 82 మంది మహిళలున్నారు. పోలింగ్ జరగాల్సిన ఆరో విడతలో 869 మంది అభ్యర్థుల్లో 92 మంది మహిళలున్నారు. ఏడో విడతలో కూడా 904 మంది అభ్యర్థుల్లో మహిళలు కేవలం 95 మందే. మహిళా రిజర్వేషన్ల అమలుపై పారీ్టల చిత్తశుద్ధి ఏపాటితో చెప్పేందుకు ఈ ఉదంతం ఒక్కటి చాలని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఈసారి మొత్తం 8,337 మంది అభ్యర్థులు లోక్‌సభ బరిలో నిలిచారు. ఇంతమంది పోటీలో ఉండటం 1996 తర్వాత ఇదే తొలిసారి. 1996లో రికార్డు స్థాయిలో 13,952 మంది పోటీ చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మహిళలకు 33 శాతం రిజర్వేషన్
హోషంగాబాద్: అధికారంలోకి వచ్చిన వెంటనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ తెలిపారు. లోక్‌సభ, రాజ్యసభతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లో ఈ కోటాను అమలుచేస్తామని వెల్లడించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్‌లో ఉన్న పిపరియాలో నిర్వహించిన ర్యాలీలో రాహుల్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘దేశంలోని నిరుపేదలందరికీ న్యాయ్ పథకం కింద ఏటా రూ.72 వేలు అందజేస్తాం. ఈ మొత్తాన్ని మహిళల బ్యాంకు ఖాతాల్లో జమచేస్తాం. ఈ పథకం మన ఆర్థిక వ్యవస్థను పునరుత్తేజం చేస్తుంది. పెద్దనోట్ల రద్దు కారణంగా సామాన్యుల దగ్గర నగదు లేకుండా పోయింది. న్యాయ్ వల్ల ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది. తద్వారా ఆర్థిక వ్యవస్థలోకి నగదు ప్రవాహం జోరందుకుంటుంది’ అని పేర్కొన్నారు. 2014 తర్వాత దేశంలో బాంబు పేలుళ్లు విన్పించలేదన్న మోదీ వ్యాఖ్యలపై రాహుల్ ..‘పఠాన్‌కోట్, ఉడీ, పుల్వామా, గడ్చిరోలి.. గత ఐదేళ్లలో మొత్తం 942 ఉగ్రదాడులు జరిగాయి. చెవులు తెరిచి వింటే ఈ పేలుళ్లు విన్పిస్తాయి’ అని చురకలు అంటించారు. -
కూరగాయలమ్మి కాదు.. సర్పంచ్
⇒ తుళ్లూరు మండలం మల్కాపురం సర్పంచ్ పార్వతి దయనీయ స్థితి ⇒ నా విధులు, బాధ్యతలు ఏంటో తెలియవు ⇒ పదవులు కూడు పెట్టవంటూ ఆవేదన తుళ్లూరు (తాడికొండ): ఏపీ రాజధానిలో ఆమె ఓ గ్రామ సర్పంచ్. అయితే రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి. తుళ్లూరు మండలం మల్కాపురం గ్రామ సర్పంచ్ భూక్యా పార్వతి తుళ్లూరులో చాలా కాలంగా కూరగాయలు అమ్ముకుంటూ జీవిస్తున్నారు. దీనిపై ఆమెను ‘సాక్షి’ పలుకరించగా.. సర్పంచ్ పదవి ఉన్నా అలంకార ప్రాయంగానే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబం గడవటం కష్టమవ్వడంతో కూరగాయలు అమ్ముకుంటున్నట్లు తెలిపారు. సర్పంచ్‌లకు నెలకు రూ.3,000 వేతనం ఇస్తున్నారని, ఈ నగదుతో ఎలా కుటుంబాన్ని నెట్టుకురావాలని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఎంత ఖర్చయిందని ఆమెను అడగ్గా.. తాను పెద్దగా ఖర్చు చేయలేదని అంతా అధికార పార్టీ నాయకులే చూసుకున్నారన్నారు. మీ గ్రామంలో అభివృద్ధి పనులు ఏమైనా చేశారా అంటే.. రోజూ దగ్గరుండి మురుగు కాలువలు, చెత్త కుప్పలు తీయిస్తానని చెప్పారు. ఇవి తప్ప నాకు ఇంకా ఏ పనులు ఉంటాయి చేయడానికి అని ఆమె బదులిచ్చారు. పేరు ఒకరిది.. పాలన మరొకరిది ఎస్టీ రిజర్వేషన్ కోటాతో పాటు మహిళా రిజర్వేషన్ కోటాలో పార్వతి మల్కాపురం సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. అయితే ఆ పదవికి సంబంధించిన విధులు, బాధ్యతలు, గ్రామ పంచాయతీ నిధుల గురించి ఆమెకు తెలియకపోవడం స్థానికంగా చర్చనీ యాంశంగా మారింది. పార్వతికి తన బాధ్యతలు తెలియనీ యకుండా కొందరు షాడో నేతలు పాలన చేస్తున్నారు. సర్పంచ్‌గా పేరు ఒకరిది.. పాలన మరొకరిది అనడానికి ఈ ఘటనే నిదర్శనం. రిజర్వేషన్ కేటగిరీలో చదువు, సామర్థ్యం ఉన్నవారికి రాజకీయాల్లో అవకాశం కల్పిస్తే షాడో నేతల ఆటలు సాగవని అమాయకులను గెలిపించుకుంటున్నారని చెప్పడానికి పార్వతి ప్రత్యక్ష సాక్ష్యం. రానున్న ఎన్నికల్లో అయినా ప్రభుత్వం తీరు మారాలని ప్రజలు కోరుకుంటున్నారు.