ఆసియా క్రీడలకు ముందు భారత్‌కు బిగ్ షాక్.. స్టార్ రెజ్లర్ ఔట్
2023 ఆసియా క్రీడలకు ముందు భారత్‌కు బిగ్ షాక్ తగిలింది. ఏషియన్ గేమ్స్ నుంచి స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్ తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. మోకాలి గాయం కారణంగా పోటీల్లో పాల్గొనడం లేదని ట్విటర్ ద్వారా వెల్లడించింది. ఆగస్ట్ 13న రిహార్సల్స్ సమయంలో ఎడమ మోకాలికి తీవ్ర గాయమైందని.. స్కాన్లు, పరీక్షల అనంతరం డాక్టర్లు సర్జరీ అనివార్యమని చెప్పారని, ఆగస్ట్ 17న ముంబైలో సర్జరీ చేయించుకోబోతున్నానని పేర్కొంది.
కాగా, చైనాలోని హ్యాంగ్ఝౌలో త్వరలో (సెప్టెంబన్ 23-అక్టోబర్ 8) జరుగనున్న ఆసియా క్రీడల్లో వినేశ్ ఫోగట్‌పై భారీ అంచనాలే ఉన్నాయి. మహిళల రెజ్లింగ్‌లో ఆమె స్వర్ణం సాధించడం ఖాయమని అంతా ఆశించారు. ఇప్పుడు వినేశ్ గాయపడటంతో భారత్ తప్పక గెలవాల్సిన గోల్డ్ మెడల్‌ను కోల్పోవాల్సి వచ్చింది. వినేశ్ స్థానంలో అంతిమ్ పంగాల్ ఆసియా క్రీడల్లో పాల్గొనవచ్చని తెలుస్తుంది. 28 ఏళ్ల వినేశ్ 2018 ఏషియన్ గేమ్స్ 50 కేజీల విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన విషయం తెలిసిందే.