workers lost
-
లిథియం బ్యాటరీ ఫ్యాక్టరీలో పేలుడు
సియోల్: దక్షిణ కొరియాలోని లిథియం బ్యాటరీ తయారీ కర్మాగారంలో జరిగిన అగ్నిప్రమాదంలో 22 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఎనిమిది మంది గాయపడ్డారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం దేశరాజధాని సియోల్ దగ్గర్లోని హవాసియాంగ్ సిటీలో ఎరీసెల్ కంపెనీకి చెందిన లిథియం బ్యాటరీ ఫ్యాక్టరీ ఉంది. సోమవారం ఉదయం 10.30గంటలపుడు 102 మంది కార్మికులు పనిచేస్తున్న సమయంలో అక్కడి కొన్ని బ్యాటరీలు పేలాయి. దీంతో రెండో అంతస్తుల్లో మంటలంటుకుని ఫ్యాక్టరీలో దావానంలా వ్యాపించాయి. దీంతో 22 మంది అగి్నకి ఆహుతయ్యారు. వీరిలో 18 మంది చైనా కార్మికులు ఉన్నారు. తయారైన బ్యాటరీలను తనిఖీచేసి ప్యాక్ చేస్తుండగా ఈ ఘటన జరిగిందని తెలుస్తోంది. అయితే పేలుడుకు ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అని అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా ఒకరి జాడ తెలీడంలేదు. ఘటనాస్థలిని ప్రధాని హాన్ డ్యూక్ సో సందర్శించారు. -
కూలీలను కబళించిన మృత్యువు
పామిడి (అనంతపురం): సద్ది కట్టుకుని ఆటోలో బయల్దేరిన పత్తి కూలీలను లారీ రూపంలో మృత్యువు కబళించింది. అనంతపురం జిల్లా పామిడి పట్టణంలోని జాతీయ రహదారిపైకి వెళ్లే మలుపు వద్ద ఆటోను లారీ ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు కూలీలు మృత్యువాత పడ్డారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. గార్లదిన్నె మండలం కొప్పలకొండకు చెందిన దాదాపు వంద కుటుంబాలు వ్యవసాయ పనులపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. వీరంతా సమీపంలోని పామిడి, పెద్దవడుగూరు మండలాల్లో పత్తి తొలగింపు పనులకు వెళ్తుంటారు. శుక్రవారం వేకువజామున పెద్దవడుగూరు మండలం కొట్టాలపల్లి పొలాల్లో పత్తి తీసేందుకు కొప్పలకొండ నుంచి 14 మంది కూలీలు తమ గ్రామానికే చెందిన డ్రైవర్ నల్లబోతుల లక్ష్మీనారాయణ ఆటోలో బయలుదేరారు. ఆటో పామిడి పట్టణం మీదుగా జాతీయ రహదారిపైకి చేరుకుంటుండగా.. హైదరాబాద్ వైపు నుంచి లారీ ఎదురుగా దూసుకొచ్చి ఆటోను ఢీకొట్టింది. ప్రమాదంలో కూలీలు గూడు చౌడమ్మ (32), గోసుల సుబ్బమ్మ (47), గోసుల సావిత్రి (37), మీనుగ నాగవేణి (47), గోసుల శంకరమ్మ (43) అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. కూలీలు రామలక్ష్మి, సుబ్బరాయుడు, లక్ష్మీదేవి, ఆదిలక్ష్మి, రమాదేవి, నాగవేణి, రేవంత్, జయమ్మతోపాటు ఆటో డ్రైవర్ లక్ష్మీనారాయణ గాయాల పాలయ్యారు. స్పందించిన స్థానికులు క్షతగాత్రులను వెంటనే అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో నల్లబోతుల నాగవేణి (23) మృతి చెందింది. ఆటో డ్రైవర్ లక్ష్మీనారాయణ భార్య జయమ్మ (40) పరిస్థితి విషమంగా ఉంది. పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ సీఈవో ఆలూరి సాంబశివారెడ్డి, ఆర్డీవో మధుసూదన్‌లు ఘటనా స్థలంలో సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారు. -
డేటావిండ్ ఉద్యోగుల తొలగింపు: ఆందోళన
హైదరాబాద్: తక్కువ ధరల టాబ్లెట్ తయారీ సంస్థ డాటా విండ్ ఉద్యోగులపై వేటు వేసింది. ముఖ్యంగా అమ్మకాలు భారీగా పడిపోవడంతో డజన్లకొద్దీ ఉద్యోగులను తొలగించిందని ఉద్యోగులు ఆందోళకు దిగారు. ఉత్పత్తిలో 50శాతం కోత పెట్టిందని ఆరోపిస్తూ దాదాపు 200 మంది కార్మికులు లేబర్ కమిషన్‌ను ఆశ్రయించారు. తమకు న్యాయం చేయాల్సిందిగా కోరుతూ పిటిషన్ ఇచ్చారని తెలంగాణా జాయింట్ కమిషనర్(లేబర్) చంద్ర శేఖరం పీటీఐకి చెప్పారు. తాము ఉద్యోగుల నుంచి పిటిషన్‌ను స్వీకరించామని సంస్థ వెర్షన్ వినడానికి త్వరలోనే వారిని పిలవనున్నామని చంద్రశేఖరం తెలిపారు. ఎంత మంది కార్మికులు అనేది స్పష్టతలేనప్పటికీ, అయితే వీరి సంఖ్య 200 కన్నా ఎక్కువ ఉంటుందని ఆయన అన్నారు అయితే ఈ వ్యవహారంపై కంపెనీని సంప్రదించినపుడు సంస్థ భిన్నంగా స్పందించింది. హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో పనిచేస్తున్న కొంతమంది కార్మికులు తమ ఆఫీసును ధ్వంసం చేశారని కంపెనీ ఆరోపించింది. విమానాశ్రయ విస్తరణలో భాగంగా జీఎంఆర్‌కు కొంత స్థలం అవసరమైందనీ, ఈ నేపథ్యంలో సికింద్రాబాద్‌లో ఒక కొత్త కార్యాలయాన్ని ప్రారంభించాలని తాము యోచిస్తున్నట్టు చెప్పినా వినలేదనీ, చాలామంది శంషాబాద్ చుట్టూ పక్కలేఉండడంతో ఆందోళన చెందారని చెప్పారు. ఈ తరలింపు ఇష్టంలేని కొందరు తమపై ఫిర్యాదు చేసినట్టు వివరించారు. అందుకే వారిని తొలగించినట్టు చెప్పారు. ఉత్పత్తి 50శాతం క్షీణించిందనీ, అయితే హైదరాబాద్‌ను ప్లాంట్ ను మూసివేయడంలేదని స్పష్టం చేసింది. హైదరాబాద్ ప్లాంట్ భాగాల ఎగుమతికోసం ఎదురుచూస్తుండగా, అమృత్సర్ ఉత్పత్తిని కొనసాగిస్తూనే ఉందని చెప్పింది. 2017 ఆర్థిక సంవత్సరం చివరి రెండు త్రైమాసికాల్లో అమ్మకాలు గణనీయంగా తగ్గాయని డాటావిండ్ సీఈవో సునీత్ సింగ్ తులి మార్కెట్ ఫైలింగ్ లో పేర్కొన్నారు. కాగా హైదరాబాద్‌లో 100 కోట్ల రూపాయల పెట్టుబడులతో మొదలైన డేటావిండ్ సంస్థ మొదటి సంవత్సరంలో రెండు మిలియన్ యూనిట్లు (టాబ్లెట్లు, స్మార్ట్ ఫోన్లు) ఉత్పత్తి చేయనున్నామని ప్రకటించింది. తమ పూర్తి సామర్థ్యం 5 మిలియన్ యూనిట్లకు చేరుకోనుందని 2016 నవంబరులో ప్రకటించింది. మరోవైపు తక్కువ ధర డేటా ప్రణాళికలను ప్రారంభించనున్నామని, వచ్చే నెల లో ఫీచర్ ఫోన్ల కోసం మొబైల్ బ్రౌజర్ ప్రారంభించటానికి సిద్ధమవుతున్నామని డేటా విండ్ చెప్పింది. ఇది కూడా జావా ఆధారిత ఫీచర్ ఫోన్ లో వినియోగదారులు వేగవంతమైన డేటా అనుభవాన్ని అందించేలా లాంచ్ చేయనున్నామని ప్రకటించింది.