పార్టీలకు యూనియన్ల ఝులక్
శ్రీరాంపూర్(ఆదిలాబాద్), న్యూస్‌లైన్ : సింగరేణి పరిధి కోల్‌బెల్ట్ ప్రాంతాల్లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థలు, మునిసిప ల్, సార్వత్రిక ఎన్నికల్లో గని కార్మికుల ఓట్లే కీలకంగా మారనున్నాయి. ఎన్నికల్లో అభ్యర్థుల ను గెలిపించుకోవాలంటే పార్టీలు యూనియన్లపైనే ఆధారపడాలి. ఓటర్లను ప్రభావితం చేయడంలో కార్మిక సంఘాల పాత్ర ఎంతో ఉంటుంది.
ప్రస్తుతం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులకు వాటి అనుబంధ కార్మిక సంఘాల నేతలు ఏమాత్రం సహకరించడం లేదు. ఎన్నికల ప్రచారానికి ఆయా సంఘాల నేతలు దూరంగా ఉంటున్నా రు. దీంతో అభ్యర్థులు ఆందోళనలు చెందుతున్నారు. ముఖ్యంగా సింగరేణిలో అతిపెద్ద డివిజన్ అయిన శ్రీరాంపూర్‌లో ఈ పరిస్థితి నెలకొంది.
టీబీజీకేఎస్‌లో గ్రూపుల తలనొప్పి
సింగరేణి గుర్తింపు సంఘంగా ఎన్నికైన టీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం(టీబీజీకేఎస్)లో నెలకొన్న అంతర్గత నాయకత్వ సమస్య నెలకొంది. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్టీ మద్దతిచ్చిన మల్లయ్య వర్గం ఓడిపోవడం, పార్టీకి సంబం ధం లేదన్న రాజిరెడ్డివర్గం గెలుపొందింది. తరువాత క్రమంలో రాజిరెడ్డి వర్గం కూడా టీఆర్ఎస్ అధ్యక్షుడిని కలిసి పార్టీకి టచ్‌లో ఉండటం తో మల్లయ్య శిబిరంలో ఆందోళన మొదలైంది.
ఇప్పుడు ఈ రెండు గ్రూపులను సమన్వయం చేయడం స్థానిక పార్టీ నేతలకు తలనొప్పిగా మారింది. ఇప్పటి వరకు ఏ వర్గం నేతలు కూడా పార్టీ అభ్యర్థుల ప్రచారంలో పాల్గొనడం లేదు. మల్లయ్య వర్గం మద్దతు తీసుకుంటే రాజిరెడ్డి వర్గం వ్యతిరేకం అవుతుంది. రాజిరెడ్డి వర్గం మద్దతు తీసుకుందామంటే మల్లయ్య వర్గం నుంచి సహకారం ఉండదు.. ఎటోచ్చి కొంప మునుగుతుందనే ఆందోళన పార్టీ నేతల మెదళ్లను తొలుస్తోంది.
ఇదిలా ఉంటే మంచిర్యాల మండలంలో టీఆర్ఎస్, సీపీఐ పొత్తు ఉంది. మొత్తం 31 స్థానాలు ఉంటే అందులో కోల్‌బెల్ట్‌లో ఆరు స్థానాలను సీపీఐకి ఇచ్చారు. ఉమ్మడి అభ్యర్థుల గెలుపుకోసం టీబీజీకేఎస్ నేతలు ప్రచారం చేయకున్నా ఏఐటీయూసీ నేతలు అక్కడక్కడా ప్రచారం చేయడం గమనార్హం.
ఐఎన్టీయూసీలోనూ అదే పరిస్థితి
సింగరేణిలో ఒకప్పుడు ఐఎన్టీయూసీ అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే ఐఎన్టీయూసీ అనే విధంగా ఉండేది. ఏడాదిన్నర కాలంగా పార్టీకి, యూనియన్‌కు మధ్య సమన్వయం లోపించిం ది. గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఐఎన్టీయూసీకి కాంగ్రెస్‌కు సంబంధం లేదని మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు ప్రకటన చేయడంతో పార్టీకి, యూనియన్‌కు మధ్య వివాదం మొదలైంది.
అప్పటి నుంచి ఐఎన్టీయూసీ శ్రే ణులు ప్రేంసాగర్‌రావుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నా రు. అంతే కాకుండా కోల్‌బెల్ట్‌లో తాము సూచించిన వారికి టికెట్ ఇవ్వలేదని డివిజన్ నేతలు గుర్రుగా ఉన్నారు. ఆ కోపాన్ని కాంగ్రెస్ పార్టీపై పరోక్షంగా చూపుతూ అభ్యర్థులకు సహకరించడం లేదు. దీంతో ఎన్నికల్లో ప్రత్యర్థులకు లాభం చేకూరుతుందని పార్టీ శ్రేణులు ఆందోళ న చెందుతున్నాయి.