పనిమనుషులకు రూ. 9వేల జీతం
న్యూఢిల్లీ: ఇళ్లలో పనిచేసే పనిమనుషుల సామాజిక భద్రత కోసం కేంద్రం జాతీయ విధానాన్ని రూపొందించేందుకు కసరత్తుచేస్తోంది. ఫుల్‌టైమ్ పనిమనుషులకు నెలకు కనీసం రూ.9వేల జీతాన్ని, ఏడాదికి 15 చెల్లింపు సెలవులను, అదనంగా ప్రసూతి సెలవులను ఇచ్చేలా కొత్త విధానాన్ని తయారుచేస్తోంది. వారి ప్రయోజనాలను కాపాడుతూ, సామాజిక భద్రతను, లైంగిక వేధింపుల నుంచి రక్షణ, వెట్టిచాకిరీ నుంచి విముక్తి కల్పించేలా రూపొందిస్తున్న ‘జాతీయ పనిమనుషుల విధానాన్ని’ త్వరలోనే కేబినెట్ ముందుకు తీసుకురానున్నారు.
వయసు పెరిగేకొద్దీ బలహీనంగా మారే పనిమనుషులను యజమానులు పని నుంచి తొలగిస్తారు... దీంతో వారి భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో యజమాని వారికి కచ్చితంగా తోడ్పాటునిచ్చేలా కొత్త విధానం అండగా ఉంటుంది. యజమానులు, పనిమనుషులు సంఘాలను ఏర్పరచుకునేందుకు ఇది దోహదం చేస్తుంది. కార్మిక సంక్షేమ విభాగం డెరైక్టర్ ముసాయిదాను రూపొం దించి కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయకు సమర్పించారు. పనిమనుషులు శ్రమదోపిడీకి గురికాకుండా చూడడం ముఖ్యమని ప్రభుత్వం తెలిపింది.