World Elephant Day
-
గజరాజా మజాకా! ఈ ఫోటో జాగ్రత్తగా చూడండి!
సాక్షి, హైదరాబాద్: గజరాజు అంటే మక్కువ లేనిదెవరికి.భార్యామణిని సైతం లెక్కచేయకుండా సాక్షాత్తూ విష్ణుమూర్తినే తనవైపు రప్పించుకున్న కరి .. సరిలేరు నాకెవ్వరు అని నిరూపించుకుంది కదా. అందుకే దానింత గజరాజుల రాజసం. ఆ దర్వాన్ని చూసి తీరాల్సిందే. ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలతో నెటిజన్లు సందడి చేస్తున్నారు. ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నందా తల్లి పిల్లల ఏనుగుల వీడియోను ట్విటర్లో షేర్ చేశారు. వీడియో ఎప్పుడు తీశారో స్పష్టత లేనప్పటికీ, మొదటి రోజు స్కూలుకి డ్రాప్ చేస్తున్న తల్లి అనే క్యాప్షన్‌తో ఈ వీడియోను ట్వీట్ చేశారు. బుజ్జి ఏనుగును తల్లి ఏనుగు బుజ్జిగిస్తున్న ఈ వీడియో నెట్లో హల్ చల్ చేస్తోంది. ఇప్పటికే దాదాపు 14వేల వ్యూస్, దాదాపు 2,200 లైక్‌లను సాధించింది. "హహహ. నా కొడుకు చిన్నప్పటి రోజులను గుర్తు చేస్తుంది!" ఒక యూజర్ రాశారు. "రిపీట్ మోడ్‌లో చూడటానికి ఎంత ఆనందంగా ఉంది !!" మరొకరు సంతోషాన్నిప్రకటించారు. అలాగే ఏనుగులు రోడ్డు దాటడం లేదు. రోడ్డే అడవిని దాటుతోంది .జాగ్రత్తగా చూడండి అంటూ ఒక అద్భుతమైన ఫోటోను పర్వీన్ కాశ్వాన్ అనే యూజర్ ట్వీట్ చేశారు. Look carefully. #Elephants are not crossing the road. Road is crossing the #forest. #WorldElephantDay pic.twitter.com/rfQspVybS5 — Parveen Kaswan (@ParveenKaswan) August 12, 2021 Mother on way to drop the kid on the 1st day of the school pic.twitter.com/5dVTD7kxjR — Susanta Nanda IFS (@susantananda3) August 9, 2021 -
పుట్టిన 20 నిమిషాలకే నిలబడి.. గంటకే నడక!!
‘ఏనుగమ్మ ఏనుగు ఎంతో పెద్ద ఏనుగూ.. అంటూ రోజూ ఒకే పాటను యూట్యూబ్‌లో చూసి చూసి విసిగిపోయి ఉన్నాడు చిట్టిగాడు. ఫోన్ పక్కనపడేసి కిచెన్‌లో ఉన్న అమ్మ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లాడు. ‘అమ్మా.. మంచి ఏనుగు కథ చెప్పమ్మా? అంటూ మారాం చేశాడు. చిట్టిగాడి అల్లరి భరించలేం అనుకున్న లలిత.. పద్నాలుగు సింహాలను తరిమిన గున్న ఏనుగు కథ చెప్పడం మొదలుపెట్టింది. అనగనగా ఒక అడవి. ఒకనాడు ఒక గున్న ఏనుగు తన తల్లి నుంచి తప్పిపోయింది. ఆకలితో ఉన్న ఓ సింహాల గుంపు కంట పడడంతో.. ఆ పిల్లను తరమడం ప్రారంభించాయి. ఒకేసారి 14 సింహాలను చూసినా అది భయపడలేదు. ధైర్యంగా తన శక్తిమేర ప్రాణాల కోసం పోరాడింది. అక్కడే ఉన్న వాగు నీళ్లలోకి అస్తమానం పరిగెడుతూ.. బయటకు వస్తూ సింహాలను తరిమి కొట్టింది. చేసేది ఏం లేక సింహాలు దూరంగా నిల్చుని చూస్తూ ఉండిపోయాయి.. అంటూ చెప్తూ పోతోంది. ఇంతకీ ఆ గున్న వాళ్ల అమ్మతో కలిసిందా అమ్మా? అని ఆత్రుతగా అడిగాడు చిట్టిగాడు. అయితే ఇది వాస్తవ ఘటన. ఏడేళ్ల క్రితం జాంబియా సౌత్ లువాంగ్వా ‘నార్మన్ కార్’ సఫారీలో జరిగిందని వార్తలో చదివింది లలిత. ఆపద సమయంలో ధైర్యం ప్రదర్శించిన ఆ గున్న ఏనుగు పేరు ‘హెర్క్యులస్’(గ్రీకు పురాణగాథల్లో వినిపించే వీరుడి పేరు)గా ప్రపంచం మొత్తం మారుమోగిపోయింది కూడా. ఆ వివరాలను సెల్ఫోన్లో వెతుకుతున్నప్పుడు.. ఇవాళ(ఆగష్టు12న) World Elephant Day అని కనిపించింది లలితకు. ‘చిట్టీ.. ఇవాళ వరల్డ్ ఎలిఫెంట్ డే రా. అంటే ఇవాళ ఏనుగుల రోజు. కాబట్టి, వాటి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్తా’ అంటూ మొదలుపెట్టింది వాళ్ల అమ్మ. ► ఏనుగును వాళ్ల అమ్మ 22 నెలలు కడుపులో మోస్తుంది. పుట్టిన వెంటనే అవి నడుస్తాయి చిట్టీ(చిట్టీ నోరెళ్ల బెట్టి చూస్తూ.. వింటున్నాడు). అమ్మ కడుపు నుంచి బయటకు వచ్చిన 20 నిమిషాలకే లేచి నిలబడతాయి. గంటకే నడుస్తాయి కూడా. రెండు రోజుల తర్వాత మందలో కలిసి ముందుకెళ్తాయి. అలా ఉన్నాయి కాబట్టే అవి గుంపుగా బతకగలుగుతున్నాయి. తిండి-నీళ్ల కోసం ఎంతో దూరం వెళ్లగలుగుతున్నాయి. చైనాలో వందల కిలోమీటర్లు ప్రయాణించిన ఏనుగుల మంద.. హాయిగా విశ్రాంతి తీసుకున్న ఫొటో ►ఈ భూమ్మీద అతిపెద్ద జీవి.. ఆఫ్రికన్ ఏనుగు చిట్టీ. పుట్టినప్పుడే వాటి బరువు 120 కేజీలు ఉంటుంది. పెద్దవి 3 మీటర్ల ఎత్తు.. 6000 కేజీలకు పైగా బరువు ఉంటాయవి. ఏనుగులు పూర్తిగా ఎదగడానికి 35-40 సంవత్సరాల టైం పడుతుంది. అలాగే అవి 60-70 సంవత్సరాలు బతుకుతాయి. ►ఈ భూమ్మీద ఏనుగులు రెండు రకాలు ఉన్నాయి చిట్టీ. ఒకటి ఆఫ్రికన్ ఏనుగులు.. రెండోది ఆసియన్ ఏనుగులు. ఇవే చాలా దేశాల్లో విస్తరించి ఉన్నాయి. ‘మరి వాటిని ఎలా గుర్తుపట్టడం అమ్మా?’ అంటూ అడిగాడు చిట్టి. ఆఫ్రికన్ ఏనుగుల తొండం చివర రెండు వేళ్ల మాదిరి ఉంటుంది. అదే ఆసియన్ ఏనుగులకు ఒకటే ఉంటుంది. ఇక ఈ తొండంలో ఎనిమిది లీటర్ల నీళ్ల దాకా పడతాయి. తొండం సాయంతోనే నీళ్లు తాగుతాయి. ఆహారం తీసుకుంటాయి. స్నానాలు చేసేటప్పుడు మగ్గులా కూడా వాడుకుంటాయి. ►ఏనుగుల శరీరంపై చర్మం చాలా భాగాల్లో మందంగా(2.5 సెంటీమీటర్ల) ఉంటుంది. దుమ్ము, బురద స్నానాలతో సూర్య కిరణాల నుంచి వేడి నుంచి తమను తాము కాపాడుకుంటాయవి. ►ఏనుగులు మంచి తిండిబోతులు. రోజూలో 18 గంటలు తింటూనే ఉంటాయి. వదిలేస్తే ఒకరోజులో 150 కేజీల ఫుడ్డు తినేస్తాయి. అందులో సగం అరగకుండానే బయటకు వచ్చేస్తుంది. ►ఏనుగుల ఎముకలు భూమి నుంచి వచ్చే శబ్దాలను కూడా గ్రహిస్తాయి తెలుసా?.. చిట్టీ. అవి మాట్లాడుకోవడం అంతా వేరేలా ఉంటుంది. ఏనుగు అరిస్తే(ఘీంకారం) మైళ్ల దూరం వినిపిస్తుంది. వీటి సాయంతోనే అవి మాట్లాడుకుంటాయి. అలాగే వాటికంటూ ఒక వాసన పెట్టుకుంటాయి. కుక్కల కంటే ఇవి వాసనను బాగా పసిగడతాయి. పేడ సాయంతో వాటి మంద ఎటు వెళ్లాయనే విషయాన్ని తెలుసుకుంటాయి కూడా. ►ఏనుగులు ఎమోషనల్ జీవులు. తొందరగా మనుషులతో కలిసిపోతాయి. ప్రేమగా ఉంటాయి. జ్ఞాపకశక్తి ఎక్కువ. ఏ విషయాన్నైనా బాగా గుర్తు పెట్టుకుంటాయి.(మెదడులో ఉండే టెంపోరల్ లోబ్ వల్లే ఇదంతా). థాయ్‌లాండ్‌లో ఆ మధ్య ఒక ఏనుగు ఓ ఇంటి వంటగది పగలకొట్టి.. అంతా తినేసింది. ఆ ఏనుగు ఇప్పుడు మళ్లీ అదే ఇంటికి వచ్చి గోడను పగలకొట్టి.. మళ్లీ తినేసింది చూడు. అంత బాగా ఉంటుంది వాటికి మెమరీ. Remember the elephant that went viral in June for smashing through a home in Thailand? Well the same elephant just did it again — to the same people. pic.twitter.com/BxZjHux68n — NowThis (@nowthisnews) August 10, 2021 ►ఏనుగులు మచ్చిక జీవులు. సాధారణంగా వాటికి కోపం రాదు. ఎవరైనా కవ్వించాలని ప్రయత్నిస్తేనే.. అవి ప్రతిదాడులకు దిగుతాయి. పాపం.. ఒక ఏనుగును కాపాడుకోవడానికి.. మిగతావి ప్రాణాలను పణంగా పెడుతుంటాయి కూడా. ►పాపం.. ఎంత పెద్ద జీవి అయినా ఏం లాభం. ఒకప్పుడు ఎంతో పెద్దగా ఉండే ఏనుగుల సంఖ్య.. బాగా తగ్గిపోయింది. ఆఫ్రికన్-ఆసియన్ ఏనుగులు చాలా తగ్గిపోయాయి(90,50 శాతాలు) ఆఫ్రికన్ ఏనుగులు 4 లక్షల దాకా ఉండగా, ఆసియన్ ఏనుగులు కేవలం 45 వేలే ఉన్నాయి!. అందుకే వాటిని కాపాడేందుకు ఆగష్టు 12న వరల్డ్ ఎలిఫెంట్ డే చేస్తున్నారు చిట్టీ. వాటర్ టబ్‌లో ఇరుకున్న గున్న ఏనుగును కాపాడే ప్రయత్నం(పాత ఫొటో) ►‘మరి ఏనుగు తెల్ల కొమ్ముల సంగతి ఏంటమ్మా?’ అంటూ అమాయకంగా అడిగాడు చిట్టి. దానికి లలిత నవ్వుతూ.. వాటిని కొమ్ములు అనరు.. దంతాలు అంటారు. అంటే నీ నోట్లో పండ్లలాంటివి. ఏనుగులకు రెండేళ్ల నుంచి ఇవి పెరగడం మొదలవుతుంది. తినేటప్పుడు కొమ్మల్ని చీల్చడానికి, వేళ్లను పెకలించడానికి సాయపడతాయి. అంతేకాదు ఒకాదానితో మరొకటి కొట్లాడుకున్నప్పుడు ఆత్మ రక్షణ కోసం ఉపయోగించుకుంటాయి. పాపం.. వీటి కోసమే వేటగాళ్లు వాటిని చంపుతుంటారు అనడంతో ‘అయ్యో పాపం’ అంటూ జాలిగా ‘ఊ’ కొట్టాడు చిట్టీ. అన్నట్లు కథలో ముందు చెప్పుకున్న హెర్క్యులస్ వయసు ఇప్పుడు ఎనిమిదేళ్లు. తన మందతో ప్రశాంతంగా జీవిస్తోందని చెప్పడంతో చిట్టీ ముఖంలో నవ్వు కనిపించింది. ఏనుగుల సంరక్షణ.. ఈ మాట వినగానే ముందు గుర్తొచ్చే దేశం థాయ్‌లాండ్. ఇక్కడ ఉన్న ఎలిఫెంట్ రీఇంట్రడక్షన్ ఫౌండేషన్=కెనడా ఫిల్మ్‌మేకర్ పాట్రిసియా సిమ్స్ కలిసి ఈ డేను 2012 నుంచి నిర్వహిస్తున్నారు. సిమ్స్ వరల్డ్ ఎలిఫెంట్ సొసైటీకి అధ్యక్షురాలు కూడా. ఏనుగుల పరిరక్షణ, వేటను అడ్డుకోవడం, వాటి దంతాల అక్రమ రవాణాను నివారించడం, జనావాస ప్రాంతాల్లో వాటి దాడులను ఎలా అడ్డుకోవడం, మదం(హార్మోనుల రిలీజ్) టైంలో ఎలా ప్రవర్తించడం, వాటి మానాన వాటిని ఎలా బతకనివ్వడం.. ఇలాంటి అంశాలపై సుమారు 100కి పైగా పని చేస్తున్న సంస్థలు ప్రజల్లో అవగాహన నింపడానికి ప్రయత్నిస్తుంటాయి ఇవాళ. -సాక్షి, వెబ్‌డెస్క్ ప్రత్యేకం -
World Elephant Day 2021: మనిషి దుర్మార్గానికి ఏమని పేరు పెట్టగలం?
ఏనుగమ్మ ఏనుగు... బాల్యం ఏనుగుతో మొదలవుతుంది. తాతలు, నానమ్మలు వీపు మీద పిల్లలను కూచోబెట్టి ఏనుగాట ఆడతారు. ఏనుగును విఘ్నేశ్వరుడిగా పూజించుకుంటాం. కాని ఏనుగుల గురించి పట్టించుకుంటున్నామా? ప్రపంచంలో 40 వేల ఆసియా ఏనుగులు ఉంటే వాటిలో దాదాపు 27 వేలు మన దేశంలో ఉన్నాయి. వీటిలో మగ ఏనుగుల శాతం దారుణంగా పడిపోయింది. వినోదం కోసం, సాంస్కృతిక ఉత్సవాల కోసం వాటిని బంధించి పెట్టే సంస్కృతి ఉంది. అవన్నీ ఏనుగుల స్వేచ్ఛను హరించేవే అంటారు సంగీతా అయ్యర్. ‘ఏనుగుల రక్షకురాలి’గా పేరుపొందిన సంగీత ఏనుగుల కోసం ఎన్నో పోరాటాలు చేసి ఏనుగమ్మ అయారు. ఆమె తీసిన 26 భాగాల డాక్యు సిరీస్ నేడు టీవీలో టెలికాస్ట్ కానుంది. డైనోసార్లు అంతరించి పోయాయంటే మన కాలంలో కాదు కనుక కారణాలు కచ్చితంగా తెలియవు కనుక ఏమిటో అనుకోవచ్చు. కాని ఆఫ్రికా ఏనుగులు ‘ప్రమాదం’లో ఉన్నాయని, ఆసియా ఏనుగులు ‘అంతరించిపోయే’ జాబితాలో ఉన్నాయని తెలిస్తే అందుకు కారణం వర్తమానంలో మనిషి తప్పిదం తప్ప, మనిషి నిర్దాక్షిణ్యం తప్ప, మనిషి బాధ్యతారాహిత్యం తప్ప మరొకటి కాదు. అంత పెద్ద జంతువును వేటాడి, వెంటాడి, చంపి, దాని దంతాల కోసం దారుణంగా నిర్మూలించాలని చూసే మనిషి దుర్మార్గానికి ఏమని పేరు పెట్టగలం? అడవుల్లో ఉన్న ఏనుగుల బాధ ఒకవైపు ఉంటే మనిషి తన మాలిమి కోసం వాటిని చేరదీసి, బంధించి వాటికి పెట్టే బాధ మరోవైపు. ఇవన్నీ ఎంతకాలం అని అడుగుతారు సంగీతా అయ్యర్. ‘నేనే గనుక ప్రధానిని అయితే ఈపాటికి దేశంలోని ఏనుగులన్నీ స్వేచ్ఛాగాలులు పీలుస్తూ ఉండేవి’ అంటారామె. బాల్యం నుంచి బంధం కేరళ పాలక్కాడ్ జిల్లాలోని అళత్తూరులో పుట్టి పెరిగిన సంగీత చిన్నప్పుడు తన తాతయ్య, నానమ్మతో దగ్గరిలోని దేవస్థానానికి వెళ్లేవారు. అక్కడ పెద్దలు గుడి దర్శనంలో ఉంటే సంగీత దేవస్థానంలో కట్టేసి ఉన్న ఏనుగును చూస్తుండేవారు. ‘ఏనుగు కాళ్లకు ఉన్న పెద్ద పెద్ద సంకెళ్లను చూసి మా నానమ్మను అవి ఎందుకున్నాయి అని అడగడం మొదలుపెట్టాను. వాళ్లు ఏం చెప్పినా నేను సమాధాన పడలేదు. అప్పుడు మా నానమ్మ నా కాళ్లకు పట్టీలు వేసి ఇప్పుడు నీకూ ఉన్నాయిగా అని చెప్పింది. కాని ఏనుగులకు ఉన్న సంకెళ్లు రెండు కాళ్లను కదలకుండా చేసేలా ఉన్నాయి. నాకు అలా లేవు అని చెప్పాను. అప్పుడే ఏనుగుల గురించి నా మనసులో పడింది’ అంటారు సంగీత. కెనడా నుంచి తిరిగి వచ్చి కాలక్రమంలో సంగీత జర్నలిస్ట్, వీడియోగ్రాఫర్ అయ్యి కెనడాలో స్థిరపడ్డారు. కాని 2013లో భారత్‌కు వచ్చినప్పుడు కేరళలోని దేవస్థానాలు తిరుగుతున్నప్పుడు దారుణంగా గాయాలైనా సరే సంకెళ్లతో బంధించి ఉన్న ఏనుగులను చూసి చలించిపోయారు. ‘కేరళలో ఉత్సవాల కోసం మగ ఏనుగులను మాలిమి చేస్తారు. కాని అవి వయసులోకి వచ్చినప్పుడు మదంతో ప్రవర్తించకుండా ఉండేందుకు సంకెళ్లతో కట్టి దారుణంగా కడుపు మాడుస్తారు. జబ్బు చేసినా, చూపు మందగించినా ఉత్సవాల్లో నిలబెడతారు. దీని మీద గొంతెత్తాలని నిశ్చయించుకున్నాను’ అంటారు సంగీత. అప్పుడే ఆమె ‘గాడ్స్ ఇన్ షాకల్స్’ డాక్యుమెంటరీ తీశారు. మానవ హింస వల్ల ఆ తర్వాతి కాలంలో పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్‌తో ఏనుగులు ఎలా బాధ పడతాయో ఈ డాక్యుమెంటరీలో చూపించారు. ఆమె తీసిన ఈ డాక్యుమెంటరీ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో స్క్రీన్ అయ్యింది. అంత గొప్పగా ఆమె సమస్యను ప్రపంచం దృష్టికి తీసుకెళ్లింది. మనిషే శత్రువు ‘ఏనుగులకు మనిషే శత్రువు. నిజానికి ఏనుగులు మనిషిని ఎంతో ప్రేమిస్తాయి. మనిషికి సాయం చేసేందుకు చూస్తాయి. గిరిజనులకు వాటితో పాటు ఎలా అడవిలో జీవించాలో తెలుసు. కాని నాగరీకులు అడవిగా ఉండాల్సిన దానిని వ్యవసాయంలోకి తెచ్చి ఏనుగులు తిరగాల్సిన భూమిని కుదిస్తున్నారు. వాటి నీటి ఆవాసాలను ఆక్రమిస్తున్నారు. అవి తిరుగాడే స్థలంలో పంటలు వేసి ఆ పంటల్ని అవి తినకుండా కరెంటు తీగలు ఏర్పాటు చేస్తున్నారు. కరెంట్ షాక్ కొట్టి ఏనుగులు చనిపోవడం ఎంత అన్యాయం’ అంటారు సంగీత. ‘ఎక్కడైతే ఏనుగులు తిరగాల్సిన భూమి ప్రయివేటు వ్యక్తుల చేతుల్లో ఉందో ఆ భూమిని ప్రభుత్వం తిరిగి కొని ఏనుగులకు వదిలిపెడితే సగం సమస్య తీరుతుంది’ అంటారు సంగీత. ‘రైల్వే అధికారులు ఏనుగులు ఉండే ప్రాంతంలో రైళ్ల వేగం అదుపు చేస్తే, ట్రాన్స్పోర్ట్ అధికారులు రోడ్లపై వాహనాల వేగం అదుపు చేస్తే, విద్యుత్ అధికారులు కంచెలకు కరెంట్ లేకుండా అడ్డుకుంటే చాలా ఏనుగులు ప్రాణాలతో మిగులుతాయి’ అంటారు సంగీత. ఆసియన్ ఎలిఫెంట్స్ 101 సంగీత అయ్యర్ తీసిన తాజా డాక్యు సిరీస్ ‘ఏసియన్ ఎలిఫెంట్స్ 101’ మనిషి–ఏనుగు కలిసి చేయాల్సిన సహవాసం గురించి చర్చిస్తుంది. మనిషి బంధనాల్లో దారుణంగా దెబ్బ తిన్న ఏనుగుల కోసం, అడవి నుంచి బయటపడిన ఏనుగు పిల్లల కోసం అస్సాంలో, కర్నాటకలో, కేరళలో రిహాబిలేషన్ సెంటర్లు ఉన్నాయి. అక్కడ వాటి బాగోగులను చూపిస్తుంది. అంతే కాదు వాటి బాగు కోసం పర్యావరణ కార్యకర్తలకు శాంక్చరీలను తెరిచే అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది. మావటీలకు ఇవ్వాల్సిన శిక్షణ, ఏనుగుల కాళ్లకు అవసరమైన కేరింగ్, వాటి ఆహారం, స్నానం, ప్రాణాంతక జబ్బుల గురించి వైద్యం... వీటన్నింటినీ చర్చిస్తుంది. ఈ సిరీస్‌లోని కొన్ని భాగాలు నేడు జియో టీవీ ఇండియాలో ప్రసారం కానున్నాయి. ఏనుగుల సంరక్షణ కోసం ‘వాయిస్ ఆఫ్ ఏసియన్ ఎలిఫెంట్స్ సొసైటీ’ అనే సంస్థ నడుపుతున్న సంగీత ఏనుగులకు సిసలైన రక్షకురాలు. కాని ప్రజలు ఇలాంటి వారికి తోడు నిలిచినప్పుడే గజరాజు నిజంగా అడవికి రాజయ్యి మనుగడ సాగిస్తాడు.