World Surf League
-
భయానక దాడి; ప్రపంచ స్థాయి టోర్నీ రద్దు
పెర్త్: రంపంలాంటి పళ్లతో మనుషుల్ని నమిలిమింగే సొర చేపలు(షార్క్‌లు) బీభత్సం సృష్టించాయి. వేర్వేరు ఘటనల్లో ఇద్దరు సర్ఫర్లపై భయకరంగా దాడిచేశాయి. దీంతో అట్టహాసంగా జరగాల్సిన ప్రపంచ స్థాయి సర్ఫింగ్ పోటీలు అనూహ్యంగా రద్దయ్యాయి. వరల్డ్ సర్ఫ్ లీగ్(డబ్ల్యూఎస్‌ఎల్) ఈ మేరకు బుధవారం ఉదయం అధికారిక ప్రకటన చేసింది. మనిషి నెత్తురు కోసం ఆరాటంగా: ఔత్సాహిక సర్ఫర్లను ప్రోత్సహిస్తూ, సాహసక్రీడను వ్యాప్తి చేయాలన్న ఉద్దేశంతో వరల్ట్ సర్ఫ్ లీగ్ ప్రపంచ స్థాయి టోర్నీలను నిర్వహిస్తుంది. తాజాగా ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో ‘మార్గరేట్ రివర్ ప్రో’ కు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. అక్కడి గ్రేస్ టౌన్ చుట్టుపక్క తీరాల్లో సర్ఫర్లు తమ విన్యాసాలు చేశారు. ఏప్రిల్ 22 వరకు జరుగనున్న ఈ ఈవెంట్ సొర చేపల దాడితో అర్ధాంతరంగా రద్దైపోయింది. సర్ఫింగ్ చేస్తోన్న క్రీడాకారులపై వరుసగా సోమ, మంగళవారాల్లో దాడులు జరిగాయి. మనిషి నెత్తురు కోసం ఆరాటపడే షార్క్‌లు చాకచక్యంగా దాడులు చేస్తాయన్న సంగతి తెలిసిందే. షార్క్‌ల దాడిలో తృటిలో ప్రాణాలను దక్కించుకున్న సర్ఫర్లను హుటాహుటిన ఆస్పత్రులకు తరలించారు. వెరీ సారీ: ‘‘సాధ్యమైనన్ని రక్షణ చర్యలు తీసుకున్నప్పటికీ సొర చేపలు దాడిని అడ్డుకోలేకపోయాం. క్రీడాకారుల భద్రత దృష్ట్యా ఈ దఫా పోటీలను రద్దు చేస్తున్నాం. గాయపడ్డ ఇద్దరిలో ఒకరి పరిస్థితి కాస్త విషమంగా ఉంది. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. టోర్నీని రద్దు చేయడం బాధాకరమే అయినా, తప్పడంలేదు. క్రీడాకారులందరికీ సారీ.’’ అని డబ్ల్యూఎస్‌ఎల్ అధికారిక ప్రతినిధి సోఫీ మీడియాకు వివరించారు. -
సొర చేపలు బీభత్సం సృష్టించాయి
-
కోల్పోయింది చెయ్యిని మాత్రమే.. ధైర్యాన్ని కాదు
బెథానీ హామిల్టన్ కు అప్పుడు 13 ఏళ్లు .. షార్క్ దాడి చేసిన ఘటనలో ఎడమ చేతిని కోల్పోయింది. అయితే తాను కోల్పోయింది చెయ్యిని మాత్రమే అని, తన ధైర్యాన్ని, సాహసాన్ని కాదని నిరూపించింది. ప్రస్తుతం ఆమె వయసు 26 ఏళ్లు. సరిగ్గా ఆ ఘటన జరిగి 13 ఏళ్లు గడిచాయి. సర్ఫింగ్ గేమ్ లో మకుటం లేని మహరాణిలా దూసుకుకోతోంది. సర్ఫింగ్ అంటేనే రాకాసి అలలు, ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. ముఖ్యంగా అలలపై అలా దుసుకెళ్లాలంటే ఎంతో ధైర్యం ఉండాలి. కానీ, ఒక్క చేతితోనే అద్భుతాలను చేస్తోంది హామిల్టన్. గత నెలలో వరల్డ్ సర్ఫింగ్ లీగ్ లో సంచలనమే చేసింది. సర్ఫింగ్ లీగ్ కమిషనర్ జెస్సీ మిలీ డైయర్ ఫిజీలో జరిగిన ఈవెంట్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హామిల్టన్ కు అవకాశాన్ని కల్పించింది. మూడో స్థానంలో నిలిచి తోటి సర్ఫర్స్ కు ప్రేరణగా నిలిచింది. కొడుకును ఎంతో ప్రేమగా పెంచుకున్నట్లు చెప్పిన హామిల్టన్, తన జీవితాన్ని కథాంశంగా చేసుకుని డాక్యుమెంటరీ తీస్తానంటోంది. తాను ఒక చేతితో సర్ఫింగ్ చేయడాన్ని మాత్రమే కాదు, తల్లి అయిన తర్వాత కాంపిటీషన్స్ లో పాల్గొనడాన్ని కూడా ప్రస్తావిస్తానని చెప్పింది. వచ్చే సీజన్లో 'సర్ఫ్ లైక్ ఏ గర్ల్' విడుదల చేస్తానని, ఏ వ్యక్తిని తక్కువగా అంచనా వేయరాదని.. ఒకసారి మనం మాస్టర్ అయితే అందరూ గౌరవిస్తారని అభిప్రాయపడింది. చేతిని కోల్పోయిన 13 వారాలకే సర్ఫింగ్ చేసి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. అది ఆమె పట్టుదలకు నిదర్శనంగా నిలుస్తోంది.హామిల్టన్ సర్ఫింగ్ స్కిల్స్ ను 11 సార్లు పురుషుల విభాగంలో విజేతగా నిలిచిన కెల్లీ స్లేటర్ ప్రశంసించాడు. ఆమె తెగువను నిజంగానే మెచ్చుకోవాలన్నాడు. తనలాగే ఒక చెయ్యి ఉన్నవారు సర్ఫింగ్ ట్రై చేయాలని, తాను కూడా మొదట్లో ఎంతో భయపడ్డా చివరికి సాధించానంటూ హామిల్టన్ పిలుపునిచ్చింది.