కోల్పోయింది చెయ్యిని మాత్రమే.. ధైర్యాన్ని కాదు
బెథానీ హామిల్టన్ కు అప్పుడు 13 ఏళ్లు .. షార్క్ దాడి చేసిన ఘటనలో ఎడమ చేతిని కోల్పోయింది. అయితే తాను కోల్పోయింది చెయ్యిని మాత్రమే అని, తన ధైర్యాన్ని, సాహసాన్ని కాదని నిరూపించింది. ప్రస్తుతం ఆమె వయసు 26 ఏళ్లు. సరిగ్గా ఆ ఘటన జరిగి 13 ఏళ్లు గడిచాయి. సర్ఫింగ్ గేమ్ లో మకుటం లేని మహరాణిలా దూసుకుకోతోంది. సర్ఫింగ్ అంటేనే రాకాసి అలలు, ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. ముఖ్యంగా అలలపై అలా దుసుకెళ్లాలంటే ఎంతో ధైర్యం ఉండాలి. కానీ, ఒక్క చేతితోనే అద్భుతాలను చేస్తోంది హామిల్టన్.
గత నెలలో వరల్డ్ సర్ఫింగ్ లీగ్ లో సంచలనమే చేసింది. సర్ఫింగ్ లీగ్ కమిషనర్ జెస్సీ మిలీ డైయర్ ఫిజీలో జరిగిన ఈవెంట్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హామిల్టన్ కు అవకాశాన్ని కల్పించింది. మూడో స్థానంలో నిలిచి తోటి సర్ఫర్స్ కు ప్రేరణగా నిలిచింది. కొడుకును ఎంతో ప్రేమగా పెంచుకున్నట్లు చెప్పిన హామిల్టన్, తన జీవితాన్ని కథాంశంగా చేసుకుని డాక్యుమెంటరీ తీస్తానంటోంది. తాను ఒక చేతితో సర్ఫింగ్ చేయడాన్ని మాత్రమే కాదు, తల్లి అయిన తర్వాత కాంపిటీషన్స్ లో పాల్గొనడాన్ని కూడా ప్రస్తావిస్తానని చెప్పింది. వచ్చే సీజన్లో 'సర్ఫ్ లైక్ ఏ గర్ల్' విడుదల చేస్తానని, ఏ వ్యక్తిని తక్కువగా అంచనా వేయరాదని.. ఒకసారి మనం మాస్టర్ అయితే అందరూ గౌరవిస్తారని అభిప్రాయపడింది.
చేతిని కోల్పోయిన 13 వారాలకే సర్ఫింగ్ చేసి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. అది ఆమె పట్టుదలకు నిదర్శనంగా నిలుస్తోంది.హామిల్టన్ సర్ఫింగ్ స్కిల్స్ ను 11 సార్లు పురుషుల విభాగంలో విజేతగా నిలిచిన కెల్లీ స్లేటర్ ప్రశంసించాడు. ఆమె తెగువను నిజంగానే మెచ్చుకోవాలన్నాడు. తనలాగే ఒక చెయ్యి ఉన్నవారు సర్ఫింగ్ ట్రై చేయాలని, తాను కూడా మొదట్లో ఎంతో భయపడ్డా చివరికి సాధించానంటూ హామిల్టన్ పిలుపునిచ్చింది.