World T20 match
-
పాక్ మ్యాచ్‌తో పాటు ఐపీఎల్ కూడా..
ధర్మశాల: చుట్టూ పర్వతాలు, ప్రకృతి సౌందర్యం మధ్య ధర్మశాల క్రికెట్ స్టేడియం మనోహరంగా ఉంటుంది. ఏ అవాంతరాలూ ఎదురుకాకుండా ఉన్నట్టయితే ఈ వేదికలో ఈ నెల 19న చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ల మ్యాచ్ జరిగేది. అయితే భద్రత కల్పించలేమని హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయడం, ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కూడా మ్యాచ్‌ను వ్యతిరేకించడం.. ఈ పర్యవసానాల వల్ల ధర్మశాలలో తాము ఆడబోమని పాకిస్తాన్ షరతుపెట్టడంతో వేదికను కోల్‌కతాకు తరలించారు. అయితే ఈ విషయంలో ధర్మశాల స్టేడియం నిర్వాహకులకు గాని, స్థానిక క్రికెట్ బోర్డుకు గానీ సంబంధం లేదు. భారత్-పాక్ మ్యాచ్ జరగాలనే కోరుకున్నారు. ఆ రాష్ట్ర రాజకీయాల కారణంగా ధర్మశాల స్టేడియం మూల్యం చెల్లించుకుంటోంది. ఈ ఏడాది ఐపీఎల్ మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చే అవకాశాన్ని ఈ స్టేడియం కోల్పోయింది. హోమ్ టీమ్ కింగ్స్ లెవెన్ పంజాబ్ తమ మ్యాచ్‌లను ధర్మశాల నుంచి నాగ్‌పూర్‌కు తరలించాలని బీసీసీఐని కోరింది. ఇందుకు బీసీసీఐ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఐపీఎల్ షెడ్యూల్లో ధర్మశాలను వేదికగా చేర్చలేదు. ఆటగాళ్లకు భద్రత ఏర్పాటు చేసినందుకుగాను హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం భారీ మొత్తంలో చార్జీలు వసూలు చేయడం, వినోదపు పన్ను కారణంగా ఈ వేదికలో ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడేందుకు కింగ్స్ లెవెన్ పంజాబ్ ఆసక్తి చూపడం లేదు. హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ సంఘం ప్రతినిధి సంజయ్ శర్మ మాట్లాడుతూ.. కాంగ్రెస్ సారథ్యంలోని ప్రభుత్వం రాజకీయాలే దీనికి కారణమన్నారు. -
బీసీసీఐని తప్పుబట్టిన సీఎం!
సిమ్లా: భారత్-పాక్ మ్యాచ్ వేదిక అంశంపై ప్రతిరోజు ఏదో ఓ వార్త వస్తూనే ఉంది. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ లో భాగంగా హిమాచల్ ప్రదేశ్ ధర్మశాలలో ఈ నెల19న దాయాదుల మధ్య పోరు జరగనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఆ వెంటనే మేము ఇక్కడ భద్రత కల్పించలేము, ఇక్కడ మ్యాచ్ అనేది చాలాకష్టమని హిమాచల్ ప్రదేశ్ సీఎం వీరభద్రసింగ్, బీసీసీఐతో పాటు కేంద్ర ప్రభుత్వానికి తెలిపారు. నిన్న ఈ మ్యాచ్ వేధికను ధర్మశాల నుంచి కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ లో నిర్వహిస్తామని ఐసీసీ ప్రకటించింది. ఆ మరుసటి రోజు వీరభద్రసింగ్ ఈ విషయంపై మాట్లాడుతూ.. హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ కు కూడా డబ్బులు అవసరమే కానీ పరిస్థితులు అనుకూలించలేదన్నారు. దాయాదుల మ్యాచ్ కు సెక్యూరిటీ మేం అందించలేమని ఎప్పుడూ పేర్కొనలేదని సీఎం వీరభద్రసింగ్ మాటమార్చారు. అంతటితో ఆగకుండా బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ పై విమర్శలకు దిగారు. మ్యాచ్ వేదిక మారడానికి ఠాకూర్ ప్రధాన కారణమంటూ వ్యాఖ్యానించారు. పఠాన్ కోట్ ఉగ్రదాడి, కార్గిల్ అమరవీరుల అంశాన్ని ప్రస్తావించారు. ఈ దాడుల్లో మృతిచెందిన వారి కుటుంబసభ్యులు మ్యాచ్ ఇక్కడ నిర్వహించవద్దని కోరినట్లు మాత్రమే తాను కేంద్రానికి తెలిపినట్లు వివరించాడు. గతంలో ఎన్నో మ్యాచ్ లను నిర్వహించాం అన్నారు. అయితే ప్రజల సెంటిమెంట్లను గౌరవించాలని మాత్రమే తాను పేర్కొన్నట్లు వీరభద్రసింగ్ చెప్పుకొచ్చారు.