హ్యాపీ బర్త్ డే.. వెబ్సైట్!
ఇప్పుడు ఇంటర్నెట్ అంటే అందరికీ సుపరిచితమే. అందులో వెబ్సైట్ అంటే ప్రపంచవ్యాప్త సమాచారాన్ని క్షణాల్లో మన చేతుల్లో పెట్టే సాధనం. మరి తొలి వెబ్సైట్ ఎప్పుడు ప్రారంభమైందంటే.. అక్షరాల 25 సంవత్సరాల కిందట. డిసెంబర్ 20, 1990న ప్రపంచంలోని మొట్టమొదటి వెబ్సైట్ ప్రారంభమైంది. టిమ్బెర్నర్స్ లీ వరల్డ్‌వైడ్ వెబ్ (Tim Berners-Lee's World Wide Web) పేరిట యూరప్ అణు పరిశోధన కేంద్రం సెర్న్‌లో ఇది మొదట ఆన్‌లైన్‌లోకి వెళ్లింది. అయితే ఈ వెబ్సైట్ అదేరోజున ప్రజల్లోకి వెళ్లలేదు. కొన్ని నెలల అనంతరం ఆగస్టు 6, 1991న ఈ వెబ్సైట్ తొలిసారిగా ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.
అయినప్పటికీ మొట్టమొదటిసారిగా వెబ్సైట్ ప్రారంభమైన తేదీగా డిసెంబర్ 20, 1990 సమాచార నెట్వర్క్ చరిత్రలో మైలురాయిగా నిలిచిపోయింది. అత్యంత ప్రాథమిక దశలో బెసిక్ ఫీచర్స్‌తో ఉన్న ఈ వెబ్సైట్ 1992 వెర్షన్ ఇప్పటికీ ఆన్లైన్లో అందుబాటులో ఉంది. నిజానికి అత్యంత ప్రాథమిక దశలో ఉన్న వెబ్సైట్ ఇతరుల పత్రాల యాక్సెస్ పొందడానికి, సొంత సర్వర్‌ను ఏర్పాటుచేసుకోవడానికి వీలుగా రూపొందింది.
బ్రిటిష్ శాస్త్రవేత్త అయిన బెర్నర్స్ లీ 1989లో తొలిసారి ఈ వెబ్‌సైట్‌ను రూపొందించారు. నిజానికి వరల్డ్‌వైడ్ వెబ్ (WWW)కి ఇంటర్నెట్కు సన్నిహిత సంబంధమున్నా.. చాలామంది పొరపడుతున్నట్టు ఇవి రెండు ఒకటి కావు. బీబీసీ వివరణ ప్రకారం ఒకదానికొకటి అనుసంధానమై ఉన్న భారీ పెద్దసంఖ్యలోని కంప్యూటర్ల భారీ నెట్వర్క్ ఇంటర్నెట్. ఈ కంప్యూటర్ నెట్‌వర్క్‌లో లభించే వెబ్‌పేజీల కలెక్షన్ వరల్డ్‌వైడ్ వెబ్.