చెత్తకు టెక్నాలజీ
సేకరణ వాహనాలకు వీటీఎస్ పారిశుద్ధ్యం కోసం ప్రత్యేక యాప్
కేంద్ర ప్రభుత్వ కొత్త పథకం తొలిదశలో ఎంపికైన వరంగల్ జూన్ కల్లా అందుబాటులోకి..
హన్మకొండ : వరంగల్ కార్పొరేషన్ పరిధిలో చెత్త రవాణా వ్యవస్థలో ప్రక్షాళన జరగనుంది. రోజువారీగా ఎక్కడి నుంచి ఎంత చెత్తను తీస్తున్నారనే విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకునే ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా చెత్త కుండీలు, చెత్తను రవాణా చేసే వాహనాలకు జీపీఎస్ ఆధారిత వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్ (వీటీఎస్) ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. రాబోయే రెండు నెలల్లో ఈ మార్పులు చోటు చేసుకోనున్నాయి. పరిశుభ్ర తకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తూ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ చెత్త నిర్వహణలో సరికొత్త పద్ధతులు ప్రవేశపెడుతోంది. ప్రతీరోజు పోగయ్యే చెత్తను ఎప్పటికప్పుడు తీసేయడం ద్వారా వీధులను శుభ్రంగా ఉంచాలని ప్రణాళిక రూపొందించింది. ఇందుకు అవసరమైన సాంకేతిక సహకారాన్ని భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ సంస్థ అందిస్తోంది. దీని ప్రకారం చెత్త కుండీలు, చెత్తను డంప్ యార్డులకు తీసుకెళ్లే వాహనాలకు గ్లోబల్ పోజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్) పరికరాలను అమర్చాలని నిర్ణయించారు. ఒక్కో వాహనం, చెత్తకుండీలకు ప్రత్యేక కోడ్లను కేటాయిస్తారు. ఈ మొత్తాన్ని సెంట్రల్ సర్వర్‌కు అనుసంధానం చేస్తారు. ప్రతీరోజు చెత్తను కుండీల వారీగా సేకరిస్తున్నారా లేదా ? సేకరించిన చెత్తను డంప్ యార్డులకు తీసుకెళ్తున్నారా లేదా మధ్యలో పారబోస్తున్నారా అనే అంశాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. రోజుల తరబడి చెత్తను సేకరించని ప్రాంతాలను గుర్తించి, అందుకు సంబంధించిన బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు ఆస్కారం ఉంది.
తొలిదశలో వరంగల్
మున్సిపాలిటీల్లో చెత్త సేకరణలో జీపీఎస్ ఆధారిత వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టేందుకు తొలిదశలో దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 75 నగరాల్లో గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఉంది. ప్రస్తుతం కార్పొరేషన్ పరిధిలో ఉన్న 70 వాహనాలకు వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్‌ను అమరుస్తారు. చెత్త వాహనాల డ్రైవర్లకు ప్రత్యేక కెమెరాలు అందిస్తారు. జీపీఎస్, కెమెరాల ఉపయోగంపై వీరికి శిక్షణ ఇస్తారు. 2016 మే చివరి కల్లా నగరంలో ఉన్న వాహనాలకు జీపీఎస్ పరికరాలను అమర్చాలని నిర్ణయించారు. డస్ట్బిన్ల వారీగా చెత్త సేకరణకు ముందు, చెత్త సేకరణకు తర్వాత అనే విధంగా ప్రతీరోజు రెండు ఫొటోలను తీసి ఇంటర్నెట్ ద్వారా అప్లోడ్ చేస్తారు. ఈ మొత్తం సమచారం ఎప్పటికప్పుడు సెంట్రల్ సర్వర్‌లో నిక్షిప్తమవుతుంది. సెంట్రల్ సర్వర్ నిర్వహణ బాధ్యతలు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ప్రత్యేక సంస్థ చూసుకుంటుంది.
కుంటిసాకులు కుదరవు
చెత్త సేకరణ విధానంలో వీపీఎస్ (వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్)కు అనుగుణంగా స్మార్ట్ఫోన్లపై పనిచేసే అప్లికేషన్‌ను అందుబాటులోకి తెస్తారు. ఏదైనా ప్రాంతంలో చెత్త సేకరణలో లోపాలు ఉంటే ఫొటో తీసి యాప్ (అప్లికేషన్) ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. నిర్ణీత సమయంలోగా కార్పొరేషన్ అధికార యంత్రాంగం ఈ ఫిర్యాదుపై స్పందించి .. తగు చర్యలు తీసుకోవాలి. ఇందుకు సంబంధించిన ఫొటోలు, ఇతర సమాచారాన్ని యాప్ ద్వారా అందించాలి. ఈ అప్లికేషన్ నిర్వహణ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సంస్థ చూస్తుంది. కాబట్టి స్థానిక అధికారుల పాత్ర స్వల్పం. ఫలితంగా సమస్య పరిష్కారంలో కుంటి సాకులు చెప్పడం వీలుకాదు. ఈ విధానం వల్ల చెత్త సేకరణలో పారదర్శకత ఏర్పడుతుంది. సమస్యను పరిష్కరించడంలో పారిశుద్ధ్య సిబ్బంది అశ్రద్ధ చేయడం తగ్గిపోతుంది. ప్రస్తుతం గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్లో 45 వాహనాలకు జీపీఎస్ వ్యవస్థ ఉన్నప్పటికీ, పారదర్శకతపై సందేహాలు ఉన్నాయి. అంతేకాకుండా ప్రస్తుతం 45 వాహనాల నిర్వహణకు సంబంధించి ప్రతీనెల ఖర్చు అవుతున్న దాదాపు రూ.50వేలు మిగులుతారుు.
డస్ట్బిన్ల వారీగా చెత్త సేకరణకు ముందు, చెత్త సేకరణకు తర్వాత అనే విధంగా ప్రతీరోజు రెండు ఫొటోలను తీసి ఇంటర్నెట్ ద్వారా అప్లోడ్ చేస్తారు. ఈ మొత్తం సమాచారం ఎప్పటికప్పుడు సెంట్రల్ సర్వర్‌లో నిక్షిప్తమవుతుంది. సెంట్రల్ సర్వర్ నిర్వహణ బాధ్యతలు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ప్రత్యేక సంస్థ చూసుకుంటుంది.