టోక్యో ఒలింపిక్ పతకంపైనే దృష్టి
ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించాం ∙‘ఫోగట్ సిస్టర్స్’ గీత, బబిత
న్యూఢిల్లీ: ఫోగట్ సిస్టర్స్‌గా పేరుతెచ్చుకున్న గీత, బబిత జీవితాలపై బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ ఇటీవల ‘దంగల్’ సినిమా తీసిన విషయం తెలిసిందే. సూపర్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రంతో అందరి దృష్టీ తమపైనే ఉన్నా 2020 టోక్యో ఒలింపిక్స్‌లో పతకం సాధించే లక్ష్యాన్ని విస్మరించబోమని స్పష్టం చేశారు. ‘మా సన్నాహాలను ఇప్పటికే ప్రారంభించాం. ఆసియా చాంపియన్‌షిప్‌తో పాటు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో మెరుగ్గా రాణించడం ప్రస్తుతం మా ముందున్న లక్ష్యం. 2018లో ఆసియా గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్ ఉన్నా మా అంతిమ లక్ష్యం మాత్రం 2020లో జరిగే టోక్యో ఒలింపిక్స్‌లో పతకం సాధించడంపైనే ఉంది’ అని రెజ్లర్ గీతా ఫోగట్ తెలిపింది. వచ్చే నెల 2 నుంచి ఆరంభమయ్యే ప్రొ రెజ్లింగ్ లీగ్ (పీడబ్ల్యూఎల్)లో యూపీ దంగల్ తరఫున ఆడనుంది.
బబిత కూడా ఇదే జట్టుకు ఆడుతోంది. ఈ సీజన్లో తమ జట్టు ప్రత్యర్థులకు గట్టి పోటీనివ్వడం ఖాయమని ధీమా వ్యక్తం చేసింది. ‘దంగల్’ చిత్రం పబ్లిసిటీ ఈవెంట్స్‌లో పర్యటిస్తున్నప్పటికీ శిక్షణను నిర్లక్ష్యం చేయడం లేదని పేర్కొంది. రెజ్లింగ్ కారణంగానే తామీ స్థాయిలో ఉన్నామని గుర్తుచేసింది. అయితే గతంలో చాలామందికి తమ పేర్లు తెలిసినా ఈ సినిమాతో తాము కూడా సెలబ్రిటీలుగా మారామని సంతోషం వ్యక్తం చేసింది. 2010 కామన్వెల్త్ గేమ్స్∙అనంతరం దంగల్ దర్శకుడు నితేష్ తివారి జాతీయ శిబిరంలో తనను కలిశాడని తెలిపింది. రెజ్లర్‌గా మారేందుకు చిన్నతనంలో అత్యంత కఠినంగా శిక్షణ తీసుకున్నామని, మరోసారి అలాంటి పరిస్థితి రాకూడదనే అనుకుంటున్నట్టు గీత చెప్పింది.