Yadagirigutta temple Development Authority
-
యాదాద్రికి సీఎం డిజైనింగ్
సాక్షి, హైదరాబాద్: యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధి పనులు వారం, పది రోజుల్లో ప్రారంభం కావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. ఆహ్లాదం, ఆనందం, పచ్చదనం వెల్లివిరిసేలా ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా ఆలయాన్ని తీర్చిదిద్దాలని సూచించారు. లక్ష్మీ నరసింహస్వామి కొలువైన ప్రధాన యాదాద్రితో పాటు అక్కడున్న నవ గిరులను అభివృద్ధి చేసేందుకు సిద్ధం చేసిన ప్రణాళికలు, నమూనాలపై సీఎం బుధవారం క్యాంపు కార్యాలయంలో సమీక్ష జరిపారు. అయిదు గంటల పాటు జరిగిన ఈ సమీక్షలో మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీ బూర నర్సయ్య, సీఎస్ రాజీవ్‌శర్మ, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, దేవాలయ స్పెషల్ ఆఫీసర్ కిషన్‌రావు, మున్సిపల్ శాఖ కార్యదర్శి ఎం.జి.గోపాల్, దేవాదాయ శాఖ కమిషనర్ శివశంకర్, నల్లగొండ జేసీ సత్యనారాయణ, ఆర్కిటెక్ట్‌లు జగన్, ఆనందసాయి పాల్గొన్నారు. యాదాద్రి చుట్టూ ఇప్పటికే 943.2 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించామని, మరో వంద ఎకరాలు సేకరించి ఆలయ అభివృద్ధికి వినియోగిస్తామని సీఎం అన్నారు. వరుసగా రెండు బడ్జెట్లలో ప్రభుత్వం తరఫున రూ.200 కోట్లు కేటాయిస్తే.. టాటా, అంబానీ, జెన్కో, బెల్ లాంటి సంస్థలు దాదాపు రూ.500 కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. కావాల్సినంతభూమి, సరిపడేన్ని నిధులు సిద్ధంగా ఉన్నందున వెంటనే పనులు ప్రారంభించాలని స్పష్టంచేశారు. సీఎం సూచనలివీ.. యాదాద్రి గుట్టపై 15 ఎకరాల స్థలం ఉంది. అందులో 5 ఎకరాలు ప్రధాన గుడి కిందకు వస్తుంది. ఈ ఐదెకరాల్లోనే ప్రాకారం, మాడ వీధులు నిర్మించాలి. లక్ష్మీ నరసింహస్వామి 32 అవతారాల ప్రతిమలు ఇందులోనే రావాలి. యాదాద్రి గుట్ట విస్తీర్ణం దాదాపు 180 ఎకరాల వరకు ఉంటుంది. ప్రధాన గుట్ట చుట్టూ గౌరీ ప్రదక్షిణ రోడ్ నిర్మించాలి. యాదాద్రిపై పుష్కరిణి, కల్యాణ కట్ట, అర్చకుల నివాస గృహాలు, రథ మండపం, క్యూ కాంప్లెక్స్, వీఐపీ గెస్ట్‌హౌజ్ నిర్మించాలి. దేవుడి ప్రసాదాలు తయారు చేసే వంటశాల, అద్దాల మందిరం ఇక్కడే రావాలి. యాదాద్రి కింది భాగంలో బస్టాండ్, కల్యాణ మంటపం, షాపింగ్ కాంప్లెక్స్, పూజకు వినియోగించే పూల మొక్కలతో కూడిన ఉద్యానవనం, మండల దీక్షలు తీసుకునే వారికి వసతి కేంద్రాలు నిర్మించాలి. చుట్టూ ఉన్న ఇతర కొండలు, ఖాళీ ప్రదేశాల్లో ఉద్యానవనాలు, కాటేజీలు, గెస్ట్ హౌస్‌లు, పార్కింగ్ ప్లేస్‌లు, గోశాల, అన్నదానానికి భోజనశాల, పర్మెనెంట్ హెలిప్యాడ్ ఏర్పాటు చేయాలి. సమీపంలోనే ఉన్న బస్వాపూర్ చెర్వును రిజర్వాయర్‌గా మార్చాలి. హైదరాబాద్ ట్యాంక్‌బండ్ తరహాలో కట్టను అభివృద్ధి చేయాలి. అక్కడే బోటింగ్, వాటర్ గేమ్స్ ఏర్పాటు చేయాలి. గుట్ట ప్రాంతమంతా నాలుగు లేన్ల రోడ్లు ఏర్పాటు చేయాలి. ప్రతి రోడ్డుకు డివైడర్, పుట్పాత్తో పాటు పలుచోట్ల ఐలాండ్స్ నిర్మించాలి. గుట్ట పరిసరాలన్నీ చెట్లతో పచ్చగా కళకళలాడాలి. భక్తి భావన పెంపొందేలా ఈ ప్రాంతమంతా మార్మోగేలా సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలి. మొత్తం వెయ్యి ఎకరాల స్థలానికి లే అవుట్ సిద్ధం చేయాలి. పున్నమి గెస్ట్‌హౌస్‌ను ఆధునీకరించాలి. యాదాద్రి సమీపంలోని 11 ఎకరాల స్థలంలో 3 గెస్ట్ హౌస్‌లు నిర్మించాలి. పుష్కరిణిని విస్తరించాలి. గుట్టలోని వివిధ దేవాలయ ప్రాంతాలను అభివృద్ధి చేయాలి. పాత యాదగిరిని కూడా దర్శించుకునే ఏర్పాట్లు చేయాలి. గుట్ట కింద పెళ్లిళ్లు చేసుకునేందుకు వీలుగా కల్యాణ మంటపాలు కట్టాలి. -
భూసేకరణకు రూ. 73 కోట్లు
భువనగిరి : యాదాద్రికి వచ్చే నాలుగులేన్ల రోడ్ల విస్తరణలో భాగంగా భూసేకరణతో పాటు రోడ్లకు ఇరువైపులా కళకళలాడే పచ్చని చెట్లను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.73 కోట్ల నిధులు విడుదల చేసింది. యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ అభివృద్ధి పనుల్లో భాగంగా నాలుగు దిక్కుల రోడ్ల విస్తరణకు అవసరమైన భూసేకరణ కోసం ఈ నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు భూసేకరణ చేయాలని ఆర్ఆండ్బీశాఖ రెవెన్యూ అధికారులను కోరింది. ఎక్కడెక్కడి నుంచి అంటే .. సీఎం కేసీఆర్ యాదగిరిగుట్టకు వచ్చిన ప్రతిసారి రోడ్ల అబివృద్ధి ప్రాధాన్యతను అధికారులకు వివరించారు. ఇందులో ముఖ్యంగా యాదగిరిగుట్ట నుంచి రాయగిరి వరకు 6.3 కిలోమీటర్లు, యాదగిరిగుట్ట నుంచి చేర్యాల రోడ్డు 18 కిలోమీటర్లు, యాదగిరిగుట్ట నుంచి తుర్కపల్లిరోడ్డు 16 కిలోమీటర్లు, యాదగిరిగుట్ట నుంచి వంగపల్లి వరకు ఐదున్నర కిలో మీటర్లు రోడ్డు విస్తరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి నిధులు మంజూరు చేసింది. రోడ్డుకు ఇరువైపులా మూడు వరుసల్లో మొక్కలు ప్రస్తుతం ఆర్‌అండ్‌బీకి సంబంధించిన రోడ్డు 66 ఫీట్లు ఉంది. దానికి అదనంగా మరో 34 ఫీట్లు సేకరించాలని నిర్ణయించారు. రోడ్డుకు రెండువైపులా 17 ఫీట్ల చొప్పున ప్రస్తుతం భూసేకరణ చేయాలని నిర్ణయించారు. దీని ద్వారా ప్రస్తుతం ఉన్న రోడ్డును నాలుగు లేన్లుగా అభివృద్ధి చేస్తారు. దీంతోపాటు రోడ్డుకు ఇరువైపులా మూడు వరుసల్లో మొక్కలు నాటి వాటిని పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం అటవీ శాఖ అధికారులకు ఆదేశాలు అందాయి. నీడనిచ్చే చెట్లు, పూల మొక్కలు, ఔషధ మొక్కలను పెంచాలని నిర్ణయించారు. భక్తులు ఈ మార్గాల్లో వచ్చేటప్పుడు పచ్చని ఆహ్లాదకరమైన వాతావరణంలో స్వామి వారిని దర్శించుకుని వెళ్లాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు అధికారులు భూసేకరణ పనులకు శ్రీకారం చుట్టారు. సాగుతున్న రాయగిరి- గుట్ట రోడ్డు విస్తరణ పనులు రూ. 1.10 కోట్ల అంచనా విలువతో చేపట్టిన భువనగిరి మండలం రాయగిరి నుంచి యాదగిరిగుట్ట వరకు విస్తరిస్తున్న రోడ్డు పనులు సాగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న రోడ్డును నాలుగులేన్లుగా విస్తరణ పనులు సాగుతున్నాయి. దీంతో పాటు రాయగిరి రైల్వే ట్రాక్‌పై రెండో రైల్వే ట్రాక్ నిర్మాణ పనులను చేపట్టారు. -
యాదాద్రిలో హరితహారం
* 3న రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రారంభం * కార్యక్రమ ప్రారంభానికి స్థలం ఎంపిక భువనగిరి: యాదగిరిగుట్టలో మరో మహత్తర కార్యక్రమానికి ప్రభుత్వం అంకురార్పణ చుట్టింది. సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి అథారిటీ పరిధిలోని భువనగిరి మండలం రాయగిరిలో ప్రారంభించడానికి చర్యలు ప్రారంభించారు. రాయగిరిలోని ఆటవీశాఖకు చెందిన 489 సర్వేనంబర్‌లో గల ప్రభుత్వ భూమిలో జూలై 3న రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. సురేంద్రపురి ఎదురుగా గల గుట్టలపై ఉన్న చదునైన స్థలంలో రాష్ర్టపతి, గవర్నర్, ముఖ్యమంత్రి మొక్కలు నాటి హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అయితే వైటీడీఏ కోసం సేకరించాల్సిన రెండు వేల ఎకరాల భూమిలో ఆటవీ శాఖకు చెందిన 380 ఎకరాల భూమి రాయగిరిలో ఉంది. రాయగిరి నుంచి యాదగిరిగుట్ట వర కు నాలుగులేన్ల రోడ్డును రూ.110 కోట్ల వ్యయంతో అభివృద్ధి పరుస్తున్నారు. 9 మీటర్ల విస్తీర్ణంలో మూడు అంచెల్లో మొక్కలు నాటాలని నిర్ణయించారు. ముందు వరుసలో పూల మొక్కలు రెండో వరుసలో రేల, బహిన్య పర్పూరియాతోపాటు మరికొన్ని చెట్లు పెంచుతారు. మూడో వరుసలో రావి, మర్రి, వేప, నల్లమద్ది చెట్లు పెంచనున్నారు. గుట్ట సమీపంలోని సురేంద్రపురి ఎదురుగా గల గుట్టల ప్రాంతంలో సుమారు 5 వేల మొక్కలు నాటాలని నిర్ణయిం చారు. ఇక్కడే రాష్ట్రపతి చేత శిలాఫలకం వేయించడానికి పనులు కూడా ప్రారంభించారు. రాయగిరి చెరువు అలుగు నుంచి గుట్ట పక్కగా నిర్దేశిత స్థలం వరకు రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేస్తున్నారు. శిలాఫలకం వేయడానికి రాష్ట్రపతి నేరుగా వచ్చేందుకు ఇబ్బందులూ లేకుండా చర్యలు తీసుకుంటున్నారు.