భువనగిరి : యాదాద్రికి వచ్చే నాలుగులేన్ల రోడ్ల విస్తరణలో భాగంగా భూసేకరణతో పాటు రోడ్లకు ఇరువైపులా కళకళలాడే పచ్చని చెట్లను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.73 కోట్ల నిధులు విడుదల చేసింది. యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ అభివృద్ధి పనుల్లో భాగంగా నాలుగు దిక్కుల రోడ్ల విస్తరణకు అవసరమైన భూసేకరణ కోసం ఈ నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు భూసేకరణ చేయాలని ఆర్‌ఆండ్‌బీశాఖ రెవెన్యూ అధికారులను కోరింది.
ఎక్కడెక్కడి నుంచి అంటే ..
సీఎం కేసీఆర్ యాదగిరిగుట్టకు వచ్చిన ప్రతిసారి రోడ్ల అబివృద్ధి ప్రాధాన్యతను అధికారులకు వివరించారు. ఇందులో ముఖ్యంగా యాదగిరిగుట్ట నుంచి రాయగిరి వరకు 6.3 కిలోమీటర్లు, యాదగిరిగుట్ట నుంచి చేర్యాల రోడ్డు 18 కిలోమీటర్లు, యాదగిరిగుట్ట నుంచి తుర్కపల్లిరోడ్డు 16 కిలోమీటర్లు, యాదగిరిగుట్ట నుంచి వంగపల్లి వరకు ఐదున్నర కిలో మీటర్లు రోడ్డు విస్తరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి నిధులు మంజూరు చేసింది.
రోడ్డుకు ఇరువైపులా మూడు వరుసల్లో మొక్కలు
ప్రస్తుతం ఆర్‌అండ్‌బీకి సంబంధించిన రోడ్డు 66 ఫీట్లు ఉంది. దానికి అదనంగా మరో 34 ఫీట్లు సేకరించాలని నిర్ణయించారు. రోడ్డుకు రెండువైపులా 17 ఫీట్ల చొప్పున ప్రస్తుతం భూసేకరణ చేయాలని నిర్ణయించారు. దీని ద్వారా ప్రస్తుతం ఉన్న రోడ్డును నాలుగు లేన్లుగా అభివృద్ధి చేస్తారు. దీంతోపాటు రోడ్డుకు ఇరువైపులా మూడు వరుసల్లో మొక్కలు నాటి వాటిని పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం అటవీ శాఖ అధికారులకు ఆదేశాలు అందాయి. నీడనిచ్చే చెట్లు, పూల మొక్కలు, ఔషధ మొక్కలను పెంచాలని నిర్ణయించారు. భక్తులు ఈ మార్గాల్లో వచ్చేటప్పుడు పచ్చని ఆహ్లాదకరమైన వాతావరణంలో స్వామి వారిని దర్శించుకుని వెళ్లాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు అధికారులు భూసేకరణ పనులకు శ్రీకారం చుట్టారు.
సాగుతున్న రాయగిరి- గుట్ట రోడ్డు విస్తరణ పనులు
రూ. 1.10 కోట్ల అంచనా విలువతో చేపట్టిన భువనగిరి మండలం రాయగిరి నుంచి యాదగిరిగుట్ట వరకు విస్తరిస్తున్న రోడ్డు పనులు సాగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న రోడ్డును నాలుగులేన్లుగా విస్తరణ పనులు సాగుతున్నాయి. దీంతో పాటు రాయగిరి రైల్వే ట్రాక్‌పై రెండో రైల్వే ట్రాక్ నిర్మాణ పనులను చేపట్టారు.
భూసేకరణకు రూ. 73 కోట్లు
Published Wed, Jul 15 2015 12:09 AM | Last Updated on Sun, Sep 3 2017 5:29 AM
Advertisement