యాదాద్రిలో హరితహారం
* 3న రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రారంభం
* కార్యక్రమ ప్రారంభానికి స్థలం ఎంపిక
భువనగిరి: యాదగిరిగుట్టలో మరో మహత్తర కార్యక్రమానికి ప్రభుత్వం అంకురార్పణ చుట్టింది. సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి అథారిటీ పరిధిలోని భువనగిరి మండలం రాయగిరిలో ప్రారంభించడానికి చర్యలు ప్రారంభించారు. రాయగిరిలోని ఆటవీశాఖకు చెందిన 489 సర్వేనంబర్‌లో గల ప్రభుత్వ భూమిలో జూలై 3న రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు.
సురేంద్రపురి ఎదురుగా గల గుట్టలపై ఉన్న చదునైన స్థలంలో రాష్ర్టపతి, గవర్నర్, ముఖ్యమంత్రి మొక్కలు నాటి హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అయితే వైటీడీఏ కోసం సేకరించాల్సిన రెండు వేల ఎకరాల భూమిలో ఆటవీ శాఖకు చెందిన 380 ఎకరాల భూమి రాయగిరిలో ఉంది. రాయగిరి నుంచి యాదగిరిగుట్ట వర కు నాలుగులేన్ల రోడ్డును రూ.110 కోట్ల వ్యయంతో అభివృద్ధి పరుస్తున్నారు. 9 మీటర్ల విస్తీర్ణంలో మూడు అంచెల్లో మొక్కలు నాటాలని నిర్ణయించారు.
ముందు వరుసలో పూల మొక్కలు రెండో వరుసలో రేల, బహిన్య పర్పూరియాతోపాటు మరికొన్ని చెట్లు పెంచుతారు. మూడో వరుసలో రావి, మర్రి, వేప, నల్లమద్ది చెట్లు పెంచనున్నారు. గుట్ట సమీపంలోని సురేంద్రపురి ఎదురుగా గల గుట్టల ప్రాంతంలో సుమారు 5 వేల మొక్కలు నాటాలని నిర్ణయిం చారు. ఇక్కడే రాష్ట్రపతి చేత శిలాఫలకం వేయించడానికి పనులు కూడా ప్రారంభించారు. రాయగిరి చెరువు అలుగు నుంచి గుట్ట పక్కగా నిర్దేశిత స్థలం వరకు రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేస్తున్నారు. శిలాఫలకం వేయడానికి రాష్ట్రపతి నేరుగా వచ్చేందుకు ఇబ్బందులూ లేకుండా చర్యలు తీసుకుంటున్నారు.