భువనగిరి/యాదగిరిగుట్ట
దేశప్రథమ పౌరుడి రాక కోసం యాదాద్రి ముస్తాబైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా రాష్ట్రపతి ఆదివారం గుట్టకు వస్తుండడంతో ప్రభుత్వం రెడ్‌కార్పెట్‌తో స్వాగతం పలికేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. గర్భాలయాన్ని పూలమాలలతో అందంగా అలంకరించింది. అలాగే రాష్ట్రపతి బసచేసే ఆం డాళ్ నిలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఉదయం 11.10 నిమిషాలకు భువనగిరి మండలం వడాయిగూడెంలో హెలికాప్టర్ దిగుతారు. అంతకు గంటముందు సీఎం కేసీఆర్ గుట్టకు చేరుకుని రాష్ట్రపతికి స్వాగతం పలుకనున్నారు. అక్కడినుంచి ప్రత్యేక కాన్వాయ్‌లో గుట్ట ప్రధాన రహదారి మీదుగా కొండపైకి వెళతారు.
ఆలయ అర్చకులు రాష్ట్రపతితో పాటు గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్‌కు పూర్ణకుంభంతో స్వాగతం పలుకుతారు. రాష్ట్రపతి 11.50కి ఆలయంలో స్వామిఅమ్మవార్లనుదర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వేదపండితులతో ప్రత్యేక ఆశీర్వచనం పొందుతారు. ఆలయంలోని విశేషాలను, ప్రత్యేకతలను, స్వామివారి చరిత్ర, మహత్యాన్ని సీఎం కేసీఆర్, ఆలయ అధికారులు, అర్చకులు రాష్ట్రపతికి వివరిస్తారు. అక్కడి నుంచి ఆయన ఆండాళ్ అతిథిగృహానికి చేరుకుని అక్కడ కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటారు. అనంతరం ఆయనకు గుట్ట చరిత్ర, ఇటీవల గుట్ట అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను రాష్ట్రపతికి సీఎం వివరిస్తారు. అనంతరం ఆయనను సత్కరించి గుట్ట స్వామి వారి చిత్రపటాలను, జ్ఞాపికలను అందిస్తారు. అనంతరం ఒంటిగంటకు రాష్ట్రపతి హైదరాబాద్‌కు తిరిగి వెళతారు.
హెలిప్యాడ్‌లను పరిశీలించిన ప్రభుత్వ విప్, అధికారులు
రాష్ర్టపతి రాక సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వడాయిగూడెం వద్ద మూడు హెలిప్యాడ్‌లను సిద్ధం చేసింది. సీఎం కేసీఆర్ కోసం హరిత మాలగుట్ట పక్కన మరో హెలిప్యాడ్‌ను అధికారులు సిద్ధం చేశారు. శనివారం సాయంత్రం ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గొంగిడి సునితారెడ్డి, కలెక్టర్ సత్యనారాయణరెడ్డి, ఎస్సీ విక్రమ్‌జీత్ దుగ్గల్, జేసీ సత్యనారాయణ, ఏఎస్పీ గంగారాం, ఆర్డీవో మధుసూదన్ ఇతర అధికారుల బృందం హెలిప్యాడ్‌లను పరిశీలించారు. రాష్ట్రపతి, గవర్నర్, సీఎం రాక సందర్భంగా వారు హెలిప్యాడ్ వద్ద తీసుకోవాల్సిన చర్యలను సూచించారు. రాష్ర్టపతి రాక సందర్భంగా రోడ్లకు మరమ్మత్తులు చేశారు. వడాయిగూడెం నుంచి గుట్ట వరకు పలు చోట్ల పాడైన రోడ్డు స్థానంలో కొత్త రోడ్డును వేశారు. పలు చోట్ల మొరం పోసి రోలర్‌లతో తొక్కించారు.
పర్యటన ఇలా..
11.30 గుట్టపైన అతిథిగృహానికి చేరుకుంటారు. 11.45వరకు అక్కడే ఉంటారు. మధ్యాహ్నం 12.20వరకు అక్కడే ఉంటారు. 12.25 నుంచి 12.40వరకు అతిథిగృహంలో ఉంటారు. 12.50కి హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. ఒంటిగంటకు తిరుగుప్రయాణమవుతారు.
రాష్ట్రపతి రాకకోసం..
Published Sun, Jul 5 2015 2:46 AM | Last Updated on Wed, Aug 8 2018 6:12 PM
Advertisement