ఆత్మసాక్షిగా ప్రణబ్ సంతకం పెట్టలేదనుకుంటా: టీజీ
తెలంగాణ బిల్లును రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదించడంపై సీమాంధ్ర ప్రాంత ప్రజా ప్రతినిధులు తమ స్పందన తెలిపారు. రాష్ట్రపతి ప్రణబ్ ఆత్మసాక్షిగా బిల్లుపై సంతకం పెట్టలేదని అనుకుంటున్నాం అని మంత్రి టీజీ వెంకటేశ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు-2013ను రాజ్యసభలో ప్రవేశపెడితే పార్టీ నుంచి తప్పుకుంటామని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.
సీమాంధ్ర ప్రాంత ప్రజల మనోభావాల్ని పట్టించుకోకుండా రాష్ట్రాన్ని విభజించాలని కాంగ్రెస్ హైకమాండ్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టారు. పార్లమెంట్ లో బిల్లును ప్రవేశపెడితే మంత్రి పదవికి, పార్టీకి రాజీనామా సమర్పిస్తాను అని టీజీ స్పష్టం చేశారు. సీమాంధ్ర ప్రాంతంలో ఉద్యమాన్ని లెక్కలోనికి తీసుకోకుండా రాష్ట్రాన్ని విభజించడానికే నిర్ణయం తీసుకోవడం కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టం కలిగిస్తుందని టీజీ వెంకటేశ్ అన్నారు.