టీ బిల్లును అడ్డుకునే కుట్ర
అసెంబ్లీలో చర్చ జరగకుండా సీఎం అడ్డుకుంటున్నారు
రాష్ట్రపతికి తెలంగాణ కాంగ్రెస్ నేతల ఫిర్యాదు
సీఎం తీరుపై జానారెడ్డి, వీహెచ్ ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష నెరవేరనున్న తరుణంలో దాన్ని అడ్డుకునేందుకు పెద్ద ఎత్తున కుట్రలు జరుగుతున్నాయని తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి ఫిర్యాదు చేశారు. అసెంబ్లీలో రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లుపై చర్చ జరగకుండా కావాలనే జాప్యం చేయిస్తున్నారని.. సీమాంధ్ర నేతలు అడుగడుగునా అడ్డుపడుతున్నారని.. ప్రధానంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి బిల్లుపై ఓటింగ్ అని, ఓడిస్తామని, తద్వారా రాష్ట్రపతి తెలంగాణ ప్రక్రియను నిలుపుచేయడానికి వీలుంటుందంటూ పదేపదే ప్రకటనలు చేస్తున్నారని వారు ఆరోపించారు. ఈమేరకు తెలంగాణ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మంగళవారం రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని ఇక్కడి రాష్ట్రపతి నిలయంలో కలుసుకున్నారు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు కె.జానారెడ్డి, డి.శ్రీధర్‌బాబు, డి.కె.అరుణ, సునీతా లక్ష్మారెడ్డి, గీతారెడ్డి, సారయ్య, పొన్నాల లక్ష్మయ్య, చీఫ్‌విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, విప్ అనిల్, ఎంపీలు పొన్నం ప్రభాకర్, మధుయాష్కీ, సురేష్ షేట్కార్, గుత్తా సుఖేందర్‌రెడ్డి, వి.హనుమంతరావు, ఎమ్మెల్సీలు షబ్బీర్ అలీ, జగదీశ్వర్‌రెడ్డి, యాదవరెడ్డి, భానుప్రసాదరావు, మాజీ మంత్రి సబితారెడ్డి తదితరులు రాష్ట్రపతిని కలసి ఒక వినతిపత్రం సమర్పించారు.
అదనపు గడువు అనటం.. వెన్నుపోటే!
‘‘తెలంగాణ ఏర్పాటు ప్రక్రియలో భాగంగా రాష్ట్ర చట్టసభల అభిప్రాయం కోరుతూ మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లును అసెంబ్లీకి పంపించినందుకు మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. చట్టసభలకు 11 రోజుల కిందటే బిల్లు చేరినా ఇప్పటి వరకు ఒక్క రోజు కూడా అర్థవంతమైన చర్చకు అవకాశం లభించలేదు. ఉభయ సభల్లోనూ సీమాంధ్రకు చెందిన మా సోదర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభా కార్యక్రమాలను అడ్డుకోవటం తీవ్ర విచారకరం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవాలని, సకాలంలో పార్లమెంటుకు బిల్లు చేరకుండా ఉండాలని ఉద్దేశపూర్వకంగా ఇలా చేస్తున్నారు. పత్రికలు, మీడియాలో వస్తున్న వార్తల్లో బిల్లుపై చర్చించడానికి మీరిచ్చిన 42 రోజుల గడువు కాకుండా అదనపు గడువు కోసం వారు అలా చేస్తున్నట్లు తెలిసింది. చర్చ కోసం మీరిచ్చిన గడువు సవివర చర్చకు సరిపోతుంది. అదనపు గడువు కోరడం అంటే.. రాష్ట్రం ఏర్పాటు కాకుండా వెన్నుపోటు పొడవడానికి తప్ప మరే ఇతర కారణం లేదు. గడువు పొడిగించాలని విజ్ఞప్తులు వచ్చే పక్షంలో పై పరిస్థితులను పరిగణలోకి తీసుకోవాలి’’ అని ఆ వినతిపత్రంలో విజ్ఞప్తి చేశారు.
సీఎం కుట్రదారుడే: జానారెడ్డి
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకుంటున్న సీఎం కిరణ్ కూడా కుట్రదారుడేనని మంత్రి జానారెడ్డి ధ్వజమెత్తారు. కిరణ్ ఒక వ్యక్తి మాత్రమేనని, తెలంగాణ రాష్ట్రం ఇచ్చే కేంద్ర ప్రభుత్వమనే శక్తి తమ వెనుక ఉందని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రపతిని కలసిన అనంతరం జానారెడ్డి సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘‘పంచాయతీలను నగర పంచాయతీలుగా మార్చే అధికారం ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు రాష్ట్రాన్ని విభజించే అధికారం కేంద్రానికి ఉండదా..?’’ అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకంగా కుట్రలు, కుతంత్రాలు మానుకోవాలని.. చర్చను అడ్డుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగించడమేనని పేర్కొన్నారు. సీమాంధ్ర నాయకులు చేస్తున్న ఆందోళనకు హేతుబద్ధత లేదని, ఉద్దేశపూర్వకంగానే విభజనబిల్లుపై చర్చను అడ్డుకుంటున్నారని ఎంపీ రాజయ్య, మంత్రి సారయ్య, ఎమ్మెల్సీ షబ్బీర్‌అలీలు ఆరోపించారు. సీఎం సీమాంధ్ర ప్రజలను మభ్యపెడుతూ గందరగోళానికి గురిచేస్తున్నారని.. గ్రౌండ్ లేనప్పుడు ఆఖరి బంతి ఎలా ఆడతారని వీహెచ్ ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి కిరణకుమార్‌రెడ్డా, అశోక్‌బాబా అనేది అర్ధం కావడంలేదన్నారు. విభజన బిల్లుపై అసెంబ్లీ అభిప్రాయ సేకరణకు 40 రోజుల గడువు ఇచ్చారని.. ఇంకా అదనంగా సమయం కేటాయించరాదని రాష్ట్రపతిని కోరామని మరో మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు.