విభజన వేగవంతం చేయండి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వేగంగా పూర్తి చేయడానికి జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి తెలంగాణ జేఏసీ విజ్ఞప్తి చేసింది. అసెంబ్లీలో బిల్లుపై చర్చకు గడువు పొడిగించవద్దని కోరింది. ఈ మేరకు రాష్ట్రపతికి వినతి పత్రం అందజేసింది. తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం నేతృత్వంలో వివిధ సంఘాల ప్రతి నిధులు సోమవారం హైదరాబాద్‌లోని రాష్ట్రపతి నిలయంలో ప్రణబ్‌ను కలిశారు. అసెంబ్లీకి టీ బిల్లును పంపినందుకు కృతజ్ఞతగా పుష్పగుచ్ఛాన్ని అందజేశారు. అనంతరం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాల్సిన అవసరం, తెలంగాణకు జరిగిన వివక్ష, నీళ్లు-నిధులు-నియామకాల్లో జరిగిన అన్యాయం, వాటిపై పోరాటాలు, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు, కేసులు, ఆత్మహత్యలు, 2009 నాటి ప్రకటన పూర్వాపరాలు, ఆ తరువాత ఉద్యమం గురించి సుమారు 15 నిమిషాల పాటు కోదండరాం వివరించారు.
తెలంగాణ ఏర్పాటుకు 2003లోనే అన్ని పార్టీలు అంగీకరించాయని, దాంతో 2009లో తెలంగాణ ఏర్పాటు దిశగా కేంద్రం నిర్ణయం తీసుకుందని చెప్పారు. అప్పటి సీఎం రోశయ్య ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలోనూ అన్ని పార్టీలు తెలంగాణకు అంగీకరించాయని గుర్తుచేశారు. కానీ, ఆ తర్వాత ప్రజాస్వామ్య విలువలకు వ్యతిరేకంగా పార్టీల వ్యవహారం మారిందన్నారు. ఈ ఏడాది జూలై 30న కేంద్రం నిర్ణయం తీసుకున్న తరువాత.. ప్రజాస్వామ్య విలువలను, రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించే విధంగా సీమాంధ్ర నేతలు, ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ తెలంగాణ ఏర్పాటు కోసం తీర్మానించి, 2009 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకున్నదని కోదండరాం చెప్పారు. కాంగ్రెస్‌లో విలీనమైన ప్రజారాజ్యం పార్టీ కూడా సామాజిక తెలంగాణ కావాలని మేనిఫెస్టోలో చెప్పిందని గుర్తుచేశారు.
అయితే, కాంగ్రెస్ అధిష్టానం, కేంద్రం తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా పనిచేస్తానని చెప్పిన సీఎం కిరణ్ మాట మార్చి తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని ఫిర్యాదు చేశారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు వల్ల తెలంగాణలో భూమిలేని నిరుపేదలు, సన్నకారు రైతులు, కూలీలు, వెట్టిచాకిరీ, రైతాంగ ఆత్మహత్యలు వంటి అంశాలకు పరిష్కారం దొరుకుతుందన్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, ఇప్పటిదాకా వివక్షకు గురైన సామాజిక వర్గాలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. సీమాంధ్రలోనూ పరిపాలన దగ్గర అవుతుందన్నారు. కానీ, కొందరు సీమాంధ్ర పెట్టుబడిదారులు తమ ప్రయోజనాలకోసం ప్రజాస్వామ్య నిబంధనలకు విరుద్ధంగా ఉద్యమాలను ఎగదోస్తున్నారని కోదండరాం ఆరోపించారు. రాష్ట్రపతిగా అసెంబ్లీ అభిప్రాయం కోసం పంపించిన బిల్లుపై చర్చించకుండా.. ఆ బిల్లు ప్రతులను బహిరంగంగానే చింపడం సీమాంధ్ర ప్రజా ప్రతినిధుల అప్రజాస్వామిక పోకడలకు పరాకాష్ట అని పేర్కొన్నారు. అసెంబ్లీలో బిల్లుపై చర్చించకుండా ఇంకా గడువు పెంచాలని కోరుతున్నారని.. తద్వారా అడ్డుకోవడానికి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. బిల్లుపై గడువును ఎట్టిపరిస్థితుల్లోనూ పొడిగించొద్దని రాష్ట్రపతికి కోదండరాం విజ్ఞప్తి చేశారు. జేఏసీ నేతలు చెప్పిన అంశాలను ప్రణబ్ పూర్తిగా ఆలకించారు. రాష్ట్రపతిని కలిసినవారిలో జేఏసీ అగ్రనేతలు మల్లేపల్లి లక్ష్మయ్య, సి.విఠల్, కత్తి వెంకటస్వామి, అద్దంకి దయాకర్, దేవీప్రసాద్, వి.శ్రీనివాస్‌గౌడ్, కె.రవీందర్ రెడ్డి, మాదు సత్యం, పిట్టల రవీందర్, కృష్ణ యాదవ్ తదితరులున్నారు.
నథింగ్ టు సే..
రాష్ట్రపతి ప్రణబ్‌కు తెలంగాణ ఏర్పాటు గురించి కోదండరాం పూర్తిగా వివరించిన తరువాత... ‘‘మా విజ్ఞప్తికి మీరు ఎలా స్పందించారని మీడియా అడిగితే ఏం చెప్పమంటారు? మీడియా ద్వారా మీ సందేశాన్ని ఏమని ఇవ్వమంటారు?’’ అని కోదండరాం అడిగారు. దానికి సమాధానంగా ప్రణబ్.. ‘‘నో మెసేజ్. నథింగ్ టు సే. లెటజ్ హావ్ ఏ ఫోటో’’ అంటూ దాటవేశారు. అయితే తెలంగాణ ముసాయిదా బిల్లులో సవరణలకు సంబంధించిన అంశాలను లిఖితపూర్వకంగా రాష్ట్రపతికి అందిస్తామని కోదండరాం వెల్లడించారు.