విశ్వసనీయత కోసమే మద్దతిచ్చాం: సుష్మా స్వరాజ్
* లోక్‌సభలో సుష్మా స్వరాజ్ స్పష్టీకరణ
* రాజ్‌నాథ్ సింగ్, అద్వానీ ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నాం
* 2004లో తెలంగాణ ఇస్తామన్న సోనియా.. సొంతవారినే ఒప్పించకుండా లాగి లాగి ఇంతదాకా తెచ్చారు
* ప్రధాని కేబినెట్‌లో బిల్లు ఆమోదిస్తే.. వారి సీఎం తిప్పిపంపారు
* ఏ సభ్యుడూ చూడని దృశ్యాలను ఈ సభలో చూశాం
* మేం 3 రాష్ట్రాలు ఇచ్చినా ఒక్క రక్తపు బొట్టు కారలేదు
* సీమాంధ్రుల డిమాండ్లను కూడా బిల్లులో పెట్టాలి
* లేకుంటే మేం అధికారంలోకి వచ్చాక వారి డిమాండ్లు పరిష్కరిస్తాం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడానికే రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ బిల్లుకు మద్దతు ఇచ్చినట్టు లోక్‌సభలో ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చింది ఒక్క సోనియా గాంధీ మాత్రమేనని అనుకోవద్దని, ‘ఈ చిన్నమ్మ’ను కూడా గుర్తుపెట్టుకోవాలని తెలంగాణ ప్రజలను కోరారు. అదే సమయంలో సీమాంధ్రుల డిమాండ్లను బిల్లులో చేర్చాలని హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేను డిమాండ్ చేశారు. లేకుంటే వచ్చేది తమ ప్రభుత్వమేనని, సీమాంధ్రులకు భద్రత కల్పిస్తూ వారి డిమాండ్లను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. హోం మంత్రి షిండే మంగళవారం లోక్‌సభలో పరిశీలన కోసం తెలంగాణ బిల్లు పెట్టిన సందర్భంగా సుష్మా మాట్లాడారు. సుష్మా ప్రసంగం ఆమె మాటల్లోనే..
విశ్వాసఘాతుకానికి పాల్పడతామా?
‘‘రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లుకు బీజేపీ తరఫున మద్దతు ఇస్తున్నాం. బిల్లును ఆమోదించే పక్షంలో ఓటింగ్‌లో కూడా పాల్గొంటాం. ఎందుకంటే ఈ అంశం మా విశ్వసనీయతతో ముడిపడి ఉంది. ప్రభుత్వం తెలంగాణ బిల్లు తెస్తే మద్దతు ఇస్తామని ఇప్పటికే పార్లమెంటు లోపల, బయట, తెలంగాణలో, తెలంగాణ వెలుపల అనేక సార్లు చెప్పాం. ఒక వేళ ప్రభుత్వం ఈ బిల్లును తీసుకురాకుంటే మేం అధికారంలోకి వచ్చాక వంద రోజుల్లో ఇస్తామని హామీ కూడా ఇచ్చాం. ‘తెలంగాణ కోసం ఆత్మబలిదానాలు చేసుకోవద్దు. తెలంగాణ చూడటానికి బతకాలి బతకాలి’ అని గతంలో సభలో చెప్పాను. దానికి స్పీకర్ కూడా సాక్షి. తెలంగాణ ప్రజల కలసాకారమయ్యేందుకు వచ్చిన బిల్లును మేం వ్యతిరేకించి విశ్వాసఘాతుకం ఎలా చేస్తాం? విపక్షాలన్నీ వ్యతిరేకిస్తున్నప్పటికీ తెలంగాణ ఏర్పాటుతో వారి కల నెరవేరాలనే బిల్లుకు మద్దతు ఇస్తున్నాం.
మొదటి ఫిర్యాదు కాంగ్రెస్ నేతృత్వంపైనే..
బిల్లు పెట్టిన సందర్భంగా మేం కొన్ని విషయాలు రికార్డుల్లో చేర్చాలని కోరుకుంటున్నాం. మా మొదటి ఫిర్యాదు కాంగ్రెస్ నేతృత్వంపైనే. 2004లో తెలంగాణ ఇవ్వడానికి సోనియా హామీ ఇచ్చారు. కానీ 2014 వచ్చింది. తన మొదటి ఐదేళ్ల పాలనలో ఏమీ చేయలేదు. రెండో ఐదేళ్లలో.. 15వ లోక్‌సభ ముగింపుదశలోని చివరి వారంలో బిల్లు తెచ్చారు. 21న సభలు నిరవధిక వాయిదా పడతాయి. ఇంకా మూడు రోజులే మిగిలి ఉన్నాయి. ఈ అంశంపై సొంతవారినే ఒప్పించకుండా లాగి లాగి ఇంతదాకా తెచ్చారు. ఎంపీలను ఒప్పించలేదు.. మంత్రులను ఒప్పించలేదు.. సీఎంను ఒప్పించలేదు.
ప్రధాని సభలో ఉండగానే వారి మంత్రులు వెల్‌లోకి వచ్చి నిల్చుంటారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా సభలో ఉండగానే వారి ఎంపీలు లెక్కచేయకుండా వెల్‌లోకి వచ్చి నిల్చుంటారు. వారి సీఎం ధర్నాలో కూర్చుంటారు. ప్రధాని తన కేబినెట్‌లో బిల్లును ఆమోదిస్తారు. వారి సీఎం బిల్లును తిరస్కరించి వెనక్కి పంపుతారు. ఏ సభ్యుడూ గతంలో చూడని ఇలాంటి దృశ్యాలను ఈ సభలో చూశాం. మేం కూడా మూడు రాష్ట్రాలు నిర్మించాం. ఒక్క రక్తపు చుక్క కారలేదు.
పార్టీలు చీలిపోయాయి..
ఆంధ్రప్రదేశ్‌లో నేడు అన్ని పార్టీలూ విడిపోయాయి. సీమాంధ్ర, తెలంగాణకు చెందిన ఏ పార్టీ ఎంపీలైనా ఒకచోట కలసి కూర్చోరు. నామా నాగేశ్వరరావు పాపం ఇక్కడకు వచ్చారు. నేను ఆయనను ‘శాండ్‌విచ్’ అని పిలుస్తుంటాను. తెలంగాణ నేతలను, తెలంగాణ వ్యతిరేకులను వెంట తీసుకుని నా వద్దకు వస్తుంటారు. ఇదే పరిస్థితి కాంగ్రెస్‌లోనూ ఉంది. ఈ పరిస్థితే జగన్ పార్టీలో కూడా. అన్ని పార్టీలు చీలి పోయాయి. కానీ బీజేపీలో అలాంటి పరిస్థితి లేదు.’’
చిన్నమ్మనూ గుర్తు పెట్టుకోండి..
‘‘తెలంగాణ ప్రజలకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. బిల్లు ఆమోదం పొందిన వెంటనే కాంగ్రెస్ నేతలు బయటకు వెళ్లి.. ‘కాంగ్రెస్, సోనియమ్మ తెలంగాణ ఇచ్చింది’ అని పాటపాడుతారు. వారి రాగానికి తాళం కలపవద్దు. ఒక వేళ సోనియాను గుర్తు పెట్టుకోవాలనుకుంటే ఈ ‘చిన్నమ్మ’ను కూడా గుర్తు పెట్టుకోండి. మేం ఈ బిల్లుకు మద్దతు ఇవ్వడానికి కారణం.. రాజ్‌నాథ్ సింగ్, జన చేతన యాత్రలో అద్వానీ హామీ ఇచ్చారు. ప్రజల నమ్మకాన్ని నిలుపుకోవడం కోసమే మద్దతు ఇచ్చాం.’’
రాజ్యసభలో సవరణలు ఇస్తాం
లోక్‌సభలో తెలంగాణబిల్లుకు బీజేపీ ఎలాంటి సవరణలూ ఇవ్వలేదని సుష్మా స్వరాజ్ స్పష్టం చేశారు. బిల్లులోని 38 సవరణలన్నీ ప్రభుత్వ అధికారిక సవరణలని చెప్పారు. రాజ్యసభలో బిల్లుకు తమ సభ్యులు సవరణలు ఇస్తారని చెప్పారు. పార్లమెంటు వద్ద సుష్మా మీడియాతో మాట్లాడారు. ‘కమల్‌నాథ్ డబుల్ గేమ్ ఆడుతున్నారు. కాంగ్రెస్ నేతలెవరి ప్రమేయం లేకుండానే సీఎం కిరణ్, మంత్రులు ఇదంతా చేస్తున్నారా?’ అని ప్రశ్నిం చారు. సభలో ప్రభుత్వ తీరుపై అద్వానీ బాధపడ్డారని చెప్పారు. ‘‘గవర్నర్‌కు శాంతిభద్రతల ప్రత్యేక బాధ్యతలు ఇస్తామనడం సరికాదు. దీనిపై ఎవరైనా కోర్టుకు వెళ్లవచ్చు.. రాజ్యాంగ సవరణ కోరాం’’ అని అన్నారు.
ఆ లోటు ఎవరు పూడుస్తారు?
రాయలసీమ, కోస్తాంధ్రకు సంబంధించి నాలుగు ప్రధాన అంశాలను సుష్మా లోక్‌సభలో ప్రస్తావించారు..
1. హైదరాబాద్‌కు రూ.15 వేల కోట్ల సర్‌ప్లస్ ఆదాయం ఉంటే.. తెలంగాణ లోటు 7వేల కోట్లు పూడుతుంది. కానీ కోస్తాంధ్ర, రాయలసీమ లోటును ఎవరు పూడుస్తారు? దీన్ని కేంద్రమే పూరించాలి. హోంమంత్రి హామీలే కాకుండా నిధుల ప్రతిపాదనలు చేసి లోటు పూరించాలి.
2. 10 ఏళ్ల వరకు ఉమ్మడి రాజధానిగా ఉండే హైదరాబాద్‌లో 148 ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి. సీమాంధ్రలోనూ సంస్థలను ఏర్పాటు చేయడానికి సూత్రబద్ధంగా ప్రణాళిక సంఘం ఆమోదం ఇవ్వాలి. కొంత టోకెన్ ధనాన్ని మధ్యంతర బడ్జెట్‌లో కేటాయించాలి.
3. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టు చేయడానికి కేంద్రం అంగీకరించింది. మండలాల బదలాయింపునకు సంబంధించి మా నేత వెంకయ్యనాయుడుతో జైరాం చర్చల సందర్భంగా ఒప్పందం జరిగింది. కానీ ఆ తరువాత జరిగిన కేబినెట్ సమావేశంలో దాన్ని మార్చారు. వెంకయ్యతో చేసిన ఒప్పందాన్ని బిల్లులో పెట్టాలి.
4. ఈ బిల్లులో చట్టపరంగా ఒక లోపం ఉంది. ఈ బిల్లు రాజ్యాంగ ‘స్కీం’ను మార్చి గవర్నర్‌కు కొన్ని అధికారాలు ఇస్తోంది. అవి రాజ్యాంగ సవరణ ద్వారానే ఇవ్వాల్సి ఉంటుంది. సాధారణ బిల్లుకు బదులు రాజ్యాంగ సవరణ ద్వారా బిల్లు తెచ్చినా మేం మద్దతు ఇస్తాం. రాజ్యాంగ సవరణకు కూడా ఆమోదం తెలుపుతాం. లోపాలున్న బిల్లు తేవద్దు. అసలైన బిల్లు తీసుకురండి. (వీటిపై రాజ్యసభలో సవరణలు కోరతామని పార్లమెంట్ బయట చెప్పారు.)