దోపిడీకి వ్యతిరేకంగానే టీ డిమాండ్: ఈటెల రాజేందర్
అసెంబ్లీలో టీఆర్‌ఎస్ నేత ఈటెల రాజేందర్
బిల్లుకు అన్ని పక్షాలు మద్దతివ్వాలి
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ర్ట ఏర్పాటుకు గతంలోనే అన్ని పార్టీలు అంగీకరించిన ందున.. ప్రస్తుత విభజన బిల్లుకు అన్ని పక్షాలు మద్దతు ఇవ్వాలని టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్ కోరారు. అన్ని రంగాల్లో తెలంగాణ వెనుకబడి ఉందని, ఈ ప్రాంత ప్రజలు దోపిడీకి గురయ్యారని అందుకే ప్రత్యేక తెలంగాణ డిమాండ్ వచ్చిందని అన్నారు. ఒక్క ఉద్యోగాలనే కాకుండా.. నీరు, నిధులు, ఉపాధి అవకాశాలను సీమాంధ్రులు కొల్లగొట్టారని విమర్శించారు. 50 ఏళ్ల పోరాట ఫలితం దక్కుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. అందుకే తెలంగాణ ఉద్యమానికి నేతృత్వం వహించిన పార్టీగా ఈ బిల్లును సంపూర్ణంగా, సంబరంగా ఆహ్వానిస్తున్నామన్నారు. ముసాయిదా బిల్లుపై శుక్రవారం శాసనసభలో జరిగిన చర్చలో టీఆర్‌ఎస్ తరఫున ఈటెల రాజేందర్ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిననాటి నుంచి ఇప్పటి వరకు జరిగిన సంఘటనలను గుర్తు చేస్తూ ప్రసంగించారు.
అంశాల వారీగా తెలంగాణకు ఏ విధంగా నష్టం జరిగిందనే విషయాన్ని వివరించారు. తాము తెలంగాణ రాష్ట్రాన్ని కొత్తగా కోరడం లేదని, గతంలో ఉన్న రాష్ట్రాన్నే తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఆంధ్రా ప్రాంత నేతలు తెలంగాణ భూములను సొంతం చేసుకోవడం తప్ప, ఎన్నడూ ఇక్కడి అభివృద్ధిని కాంక్షంచలేదని విమర్శించారు. యాభై ఏళ్ల సమైక్యరాష్ట్రంలో ఒక్కసారి తప్ప ఎప్పుడూ అడ్వకేట్ జనరల్‌ను తెల ంగాణ ప్రాంతం వారిని నియమించలేదన్నారు. జడ్జీల నియామకంలోనూ అన్యాయం జరిగిందని, 610 జీవో అమలు విఫలం అయిందని గుర్తు చేశారు.
చర్చ లేకుండానే ఆమోదించాలి: గండ్ర
తెలంగాణ ఏర్పాటుకు కేంద్రం రాజ్యాంగబద్ధంగానే అడుగులు వేస్తోందని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి అసెంబ్లీలో పేర్కొన్నారు. అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే విభజనకు కేంద్రం సిద్ధమైందని, అసెంబ్లీలో ఎలాంటి చర్చ లేకుండానే తెలంగాణ బిల్లుకు ఆమోదం తెలిపి రాష్ట్రపతికి పంపాలని కోరారు.