జీవితకాలం నిషేధం విధించాలి
మోదుగుల, లగడపాటిపై క్రిమినల్ కేసులు పెట్టాలని టీ ఎంపీల డిమాండ్
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర పునర్వ్యవస్థీకరణబిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టకుండా అడ్డుకునేందుకు సీమాంధ్ర కాంగ్రెస్, టీడీపీ ఎంపీలు వ్యవహరించిన తీరు దేశం పరువుతీసేలా ఉందని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ధ్వజమెత్తారు. ఎంపీలు లగడపాటి రాజగోపాల్, మోదుగుల వేణుగోపాల్‌రెడ్డిలు గాడ్సేకి ప్రతినిధుల్లా వ్యవహరించారని దుయ్యబట్టారు. వారు ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాలం నిషేధం విధించాలని, ఉగ్రవాద చట్టాల కింద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీ బిల్లు విషయంలో బీజేపీ సీనియర్ నాయకులు అద్వానీ, సుష్మాస్వరాజ్, పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ తలోమాట చెబుతూ తెలంగాణ ప్రజల్లో అనుమానాలు రేకెత్తిస్తున్నారన్నారు. బీజేపీ ద్వంద్వ వైఖరిని మానుకుని తెలంగాణ బిల్లు ఉభయసభల్లో పాస్ అయ్యేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
శుక్రవారం ఢిల్లీలో ఎంపీ పొన్నం ప్రభాకర్ నివాసంలో టీ కాంగ్రెస్ ఎంపీలు గుత్తాసుఖేందర్‌రెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్, పొన్నం ప్రభాకర్, సురేశ్ షెట్కార్, మధుయాష్కీగౌడ్, పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. తానుకూడా ఆత్మరక్షణ కోసమంటూ సభలోకి తుపాకీ తెచ్చి నలుగురిని కాల్చివేస్తే సరైన చర్య అవుతుందా? అని ఎంపీ పొన్నం ప్రశ్నించారు. లగడపాటి చర్యను లోక్‌సత్తా నేత జయప్రకాశ్‌నారాయణ, టీడీపీ అధినేత చంద్రబాబు ఎందుకు ఖండించడం లేదన్నారు. లోక్‌సభలో హోంమంత్రి తెలంగాణ బిల్లు ప్రవేశపెడుతున్నట్టు స్పష్టంగా చెప్పారన్నారు. ఎవరు ఎవరిపై దాడిచేశారో లోక్‌సభ టీవీ ఫుటేజీలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. 2014 ఎన్నికల వరకు తెలంగాణ బిల్లును అడ్డుకుంటే ఇరు ప్రాంతాల్లో 20 ఎంపీ స్థానాలు గెలుచుకోవచ్చని చంద్రబాబు బీజేపీ నేతలకు చెబుతున్నారని ఎంపీ గుత్తా ఆరోపించారు. సభలో జరిగిన విషయాన్ని సీమాంధ్రకాంగ్రెస్ ఎంపీలు గోరంతను కొండంతలు చేసి చెప్పుకుంటున్నారని అంజయ్‌కుమార్ యాదవ్ దుయ్యబట్టారు. చంద్రబాబు అసలు సమన్యాయం అంటే ఏంటో చెప్పాలని సురేశ్‌షెట్కార్ అన్నారు.