5న యాదాద్రికి రాష్ట్రపతి రాక
రాష్ట్రపతి వెంట గవర్నర్, సీఎం కూడా..
ఏర్పాట్లలో నిమగ్నమైన అధికారులు
భువనగిరి : భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ నెల 5వ తేదీన యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకోవడానికి వస్తున్నారు. రా్రష్టపతి రాక ఖరారు కావడంతో జిల్లా అధికారయంత్రాంగం గురువారం ఏర్పాట్లను ప్రారంభించింది. విడిది కోసం హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి ఈనెల 3 వ తేదీన యాదగిరిగుట్టకు రావాలని సీఎం కేసీఆర్ ఆహ్వానించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమాన్ని ఆయన చేతుల మీదుగా ప్రారంభించాలని సీఎం రాష్ట్రపతిని కోరారు.దీంతో ఉన్నత స్థాయి అధికారుల బృందం ఇప్పటికే యాదగిరిగుట్ట, వడాయిగూడెం పరిసర ప్రాంతాలను పరిశీలించారు. రాష్ట్రపతి రక్షణ బాధ్యతలను చూసే అధికారులుసైతం వచ్చి ఇక్కడి పరిసరాలను పరిశీలించారు.
అయితే రాష్ట్రపతి 3 వ తేదీన రావడం వీలుకాదని తేలిపోవడంతో ఇక ఆయన పర్యటన లేదన్న ప్రచారం జరిగింది. తాజాగా 5 వతేదీన రాష్ట్రపతి వస్తున్నారన్న సమాచారం అందడంతో గురువారం ఉదయం అధికారులు యాదగిరిగుట్టకు చేరుకుని గుట్టతో పాటు రాష్ట్రపతి వచ్చే హెలికాప్టర్ దిగే హెలిప్యాడ్ ప్రాంతాన్ని పరిశీలించారు. మధ్యాహ్నం రక్షణ శాఖకు చెందిన రెండు హెలికాప్టర్‌లు ట్రయల్ రన్ నిర్వహించాయి. హైదరాబాద్‌నుంచి వచ్చి వడాయిగూడెంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ల వద్ద ల్యాండ్ అయ్యాయి. అనంతరం తిరిగి హైదరాబాద్ వె ళ్లాయి. రాష్ట్రపతి రాక సందర్భంగా వచ్చే హెలికాప్టర్‌లకు హెలిప్యాడ్‌ల వద్ద తీసుకోవాల్సిన పటిష్టమైన రక్షణ చర్యలను ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అధికారులు స్థానిక అధికారులకు వివరించారు.
అన్ని ఏర్పాట్లు
రాష్ట్రపతిరాకకోసం యాదగిరిగుట్టపై అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. దేవస్థానానికి చెందిన ఉద్యోగుల డ్రెస్ కోడ్ వంటి అంశాలను పరిశీలిస్తున్నారు. గతంలో రాష్ట్రపతులు వచ్చిన సందర్భంగా దేవస్థానం తీసుకున్న జాగ్రత్తల ఆధారంగా దేవస్థానం అధికారులు చర్యలు ప్రారంభించారు.
ట్రయల్ రన్ నిర్వహించిన ఎయిర్‌ఫోర్స్ అధికారులు
రాష్ట్రపతి రాక సందర్భంగా యాదగిరిగుట్ట శివారులోగల భువనగిరి మండలంలోని వడాయిగూడెంలో అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. రాష్ట్ర పతి వచ్చే హెలికాప్టర్ , గవ ర్నర్, సీఎం వచ్చే హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే స్థలాలై విషయమై ఇండియన్ ఏయిర్‌ఫోర్స్ అధికారులు సిబ్బందితో చర్చించారు. హైదరాబాద్‌నుంచి వచ్చిన తొలి హెలికాప్టర్ 12. 40 నిమిషాలకు ఇక్కడికి చేరుకోగా రెండవది 15 నిమిషాలకు ఇక్కడి వచ్చింది. దీంతో అందులో వచ్చిన రక్షణ సిబ్బంది అక్కడ ఉన్న జేసీ, ఏఎస్పీని వివరాలు అడి గి తెలుసుకున్నారు. అనంతరం 2 గంటల సమయంలో తిరిగి వెళ్లి పోయారు. ఈకార్యక్రమంలో జేసీ డాక్టర్ సత్యనారాయణ, ఎఎస్సీ గంగారాం, ఆర్డీవో ఎన్. మధుసూదన్, డీఎస్సీ మోహన్‌రెడ్డి, తహసీల్దార్‌లు వెంకట్‌రెడ్డి, రామకృష్ణ, సీఐ రఘువీర్‌రెడ్డి, ఆర్‌ఆండ్‌బీ, అటవీ శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు.
యాదాద్రిని దర్శించనున్న 3వ రాష్ర్టపతి
నల్లగొండ : యాదాద్రి లక్ష్మీనర్సింహ స్వామిని దర్శించిన రాష్ట్రపతుల్లో మూడవ వ్యక్తి ప్రణబ్ ముఖర్జీ కానున్నారని కలెక్టర్ సత్యనారాయణరెడ్డి విలేకరులకు తెలిపారు. స్వామివారిని దర్శించుకున్న రాష్ట్రపతుల్లో మొదటి వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్ కాగా, రెండో వారు డాక్టర్ శంకర్ దయాళ్‌శర్శ.. ఈయన రెండు సార్లు స్వామి సందర్శనార్థం వచ్చారు.. కాగా నాలుగోసారి దర్శించుకోకున్న మూడో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అని కలెక్టర్ పేర్కొన్నారు.
పర్యటన సాగేదిలా..
భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ నెల 5 న ఉదయం 10.30 గంటలకు సికింద్రాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా బయలు దేరుతారు. 11.10 గంటలకు యాదగిరిగుట్టకు చేరుకుంటారు, అక్కడి నుంచి రోడ్డు మార్గాన యాదాద్రికి చేరుకుని లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుంటారు. అనంతరం 15 నిమిషాల పాటు స్వామివారి సన్నిధానంలో విశ్రాంతి తీసుకుంటారు. అనంతరం హెలికాప్టర్‌లో తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్తారు. ఈ వివరాలను కలెక్టర్ సత్యనారాయణరెడ్డి వెల్లడించారు.