yadgarpalli
-
యాద్గార్పల్లి చిన్న చెరువు ఆక్రమణ
మిర్యాలగూడ : కోట్ల రూపాయల విలువైన యాద్గార్పల్లి చిన్న చెరువు ఆక్రమణకు గురైంది. కనీసం చెరువు ఆనవాళ్లు కూడా లేకుండా పోయాయి. ఆక్రమిత స్థలంలో వరినాట్లు వేసుకోవడంతోపాటు రోడ్డు వెంట ఆక్రమించుకున్న స్థలంలో వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. మిర్యాలగూడ మండలంలోని యాద్గార్పల్లిలోని రోడ్డు వెంటనే ఉన్న ఈ చెరువు విస్తీర్ణం 16 ఎకరాలు. ప్రస్తుతం చెరువు శిఖం భూమి ఏ మాత్రం మిగల్లేదు. ప్రస్తుతం ఆ గ్రామంలో ఎకరం భూమి 50 లక్షల రూపాయల విలువ చేస్తుంది. సుమారు 8 కోట్ల రూపాయల విలువైన చెరువు శిఖం భూమి ఆక్రమణకు గురైంది. చెరువు శిఖంలో కొంత భూమి ఉండగా దానిలో ఒక సంఘ కార్యాలయం ఏర్పాటు చేయడానికి గాను మట్టి పోయిస్తున్నారు. డబ్బులు వసూలు చేస్తున్న మధ్యవర్తులు చెరువు ఆక్రమణకు సంబందించి అధికారులు ఎవరు కూడా తమ వద్దకు రాకుండా ఉండేందుకు గాను డబ్బులు ఇవ్వాలని మధ్యవర్తులు ఆక్రమితదారులనుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమాచారం. చెరువు శిఖంలో సాగు చేసుకుంటున్న వారితోపాటు రోడ్డు వెంట ఉన్న వారు సైతం డబ్బులు ఇచ్చినట్లు తెలిసింది. పరిశీలించిన అధికారులు యాద్గార్పల్లి చిన్న చెరువును రెవెన్యూ అధికారులు, ఐబీ అధికారులు గురువారం సందర్శించారు. తహసీల్దార్ మాలి కృష్ణారెడ్డి మాట్లాడుతూ చెరువు ఆనవాళ్లు లేకుండా ఆక్రమించుకున్నారని పేర్కొన్నారు. ఈ విషయంపై ఆక్రమితదారులందరికి నోటీసులు ఇస్తామని, అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు. విలువైన చెరువు భూమిని ఆక్రమించుకున్న వారందరిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన వెంట నీటిపారుదల శాఖ ఎఈ విజయలక్ష్మి, ఆర్ఐ, వీఆర్ఓ ఉన్నారు. -
యాద్గార్పల్లి రోడ్డుకు మరమ్మతులు
మిర్యాలగూడ రూరల్: మిర్యాలగూడ పట్టణం నుంచి యాద్గార్పల్లి వెళ్లే రహదారిని ఆర్ఎండ్బీ అధికారులు మరమ్మతులు చేసి శుక్రవారం రాకపోకలను పురుద్ధరించారు. ఈ నెల 13న కురిసిన భారీ వర్షం వల్ల యాద్గార్పల్లి చెరువు నుంచి వరద నీరు రావడంతో రోడ్డు కొట్టుకుపోయి రాకపోకలు నిలిచిపోయిన విషయం విధితమే. దీంతో యాద్గార్పల్లి, ఊట్లపల్లి, తడకమళ్ల, తక్కెళ్లపహాడ్, క్వాపల్లి గ్రామాలకు మిర్యాలగూడకు గతనాలుగు రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకొన్న ఆర్ఎండ్ బీ అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టారు. -
సాగర్జలాలతో చెరువులు నింపాలి
యాద్గార్పల్లి (మిర్యాలగూడ రూరల్) : నాగార్జునసాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేసి ఆయకట్టు ప్రాంతంలో ఉన్న చెరువులను నింపాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశాడు. సీపీఎం, సీపీఐ, ఎంసీపీఐ, టీడీపీ ఆధ్వర్యంలో సోమవారం మండలంంలో యాద్గార్పల్లిలో గల పందిళ్లపల్లి చెరువు (పెద్దచెరువు)లో చేపట్టిన ధర్నాలో ఆయన మాట్లాడారు. గత కొన్ని దశాబ్దాలుగా ఎండని యాద్గార్పల్లి చెరువుతోపాటు ఆయకట్టులోని చెరువులన్నీ ఎండిపోడంతో బోర్లు, బావుల్లో భూగ ర్భజలాలు తగ్గాయన్నారను. ఈ నేపథ్యంలో నీటిని విడుదల చేస్తే సాగు, తాగు నీరు అందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం డివిజన్ కార్యదర్శి వీరేపల్లి వెంకటేశ్వర్లు, ఎంసీపీఐ జిల్లా కార్యదర్శి వస్కుల మట్టయ్య, సీపీఐ ,సీపీఎం మండల కార్యదర్శులు బంటు వెంకటేశ్వర్లు, పగిడోజు రామ్మూర్తి, రైతుసంఘం డివిజన్ కార్యదర్శి గార్ల ఇంద్రారెడ్డి, రాయకులు గోవింద రెడ్డి, శ్రీనివాసాచారి, పరశురాములు, గౌతంరెడ్డి, రామకృష్ణ, సీతారాములు, భరత్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.