‘ఎల్లంపల్లి’ గేట్ల ఎత్తివేత
18 టీఎంసీలకు తగ్గని ప్రాజెక్ట్ నీటి మట్టం
భారీగా చేరుతున్న వరద నీరు..
147.38 మీటర్లకు చేరిన నీరు
మంచిర్యాల రూరల్ : ఎల్లంపల్లి శ్రీపాదసాగర్ ప్రాజెక్ట్ గేట్ల ఎత్తివేత వరుసగా రెండో రోజు గురువారమూ కొనసాగింది. కురుస్తున్న భారీ వర్షాలతోపాటు కడెం ప్రాజెక్ట్ గేట్ల ఎత్తివేత, ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న భారీ వరద నీటితో ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌కు భారీగా నీరు చేరుతోంది. ప్రాజెక్ట్ నీటిమట్టం 148 మీటర్లు కాగా ప్రస్తుతం 147.38 మీటర్లకు చేరింది. 20.175 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి గాను ప్రాజెక్ట్‌లో 18.45 టీఎంసీల నీరుంది. 24,197 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో వస్తుండగా.. 16,400 క్యూసెక్కులు గేట్ల ద్వారా వదులుతున్నారు. హైదరాబాద్ మెట్రోవాటర్ వర్క్స్(సుజల స్రవంతి పథకం) ద్వారా గ్రేటర్ హైదరాబాద్‌కు 158 క్యూసెక్కులు, ఎన్టీపీసీకి నీటిని తరలిస్తున్నారు.
అర్ధరాత్రి పది గేట్ల ఎత్తివేత..
ప్రాజెక్ట్‌కు భారీగా వరద నీరు చేరుతుండడంతో బుధవారం అర్ధరాత్రి పది గేట్లు ఎత్తారు. గురువారం ఉదయం, సాయంత్రం వేళల్లో ఆరు గేట్లు ఎత్తి నీటిని గోదావరి నదిలోకి వదిలారు. 16,400 క్యూసెక్కుల నీరు గోదావరి నదిలో కలుస్తోందని ప్రాజెక్ట్ ఎస్ఈ విజయభాస్కర్, డీఈ పార్వతీశ్వర్ తెలిపారు.
ఆసిఫాబాద్‌లో..
ఆసిఫాబాద్ : భారీ వర్షాలకు ఎగువ ప్రాంతం నుంచి ప్రాజెక్టులో నీరు చేరడంతో గురువారమూ మండలంలోని కొమురం భీమ్, వట్టివాగు ప్రాజెక్టుల్లో ఒక్కో గేటు ఎత్తారు. పెరిగిన నీటి ప్రవాహంతో ‘భీమ్’ ప్రాజెక్టులో 239.35 మీటర్లు నీటిమట్టం, ఇన్‌ఫ్లో, ఔట్ ఫ్లో 480 క్యూసెక్కులు, వట్టివాగు ప్రాజెక్టులో నీటిమట్టం 286.6 మీటర్లు, ఇన్‌ఫ్లో 1610 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 2400 క్యూసెక్కులు ఉంది.