yendala laxminarayana
-
చర్చకు రెడీ: హరీష్ రావుకు ప్రతి సవాల్
సాక్షి, కరీంనగర్: మంత్రి హరీష్ రావు విసిరిన సవాల్‌ను తాను స్వీకరిస్తున్నానని, చర్చకు ఎక్కడికి రావాలో చెప్పాలంటూ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు యెండల లక్ష్మీ నారాయణ చాలెంజ్ చేశారు. రేషన్ బియ్యం, అంగన్ వాడీ పౌష్టికాహారంలో కేంద్రం వాటా ఎంత.. రాష్ట్ర వాటా ఎంతో చర్చిద్దామా అంటూ ప్రశ్నలు సంధించారు. దుబ్బాక ఉప ఎన్నిక నేపథ్యంలో మంత్రి హరీష్ రావు, బీజేపీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన విషయం తెలిసిందే. బీజేపీ నాయకుల గోబెల్స్ ప్రచారానికి అడ్డు అదుపు లేకుండా పోతుందని, ప్రజలను మభ్యపెట్టేలా అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. (చదవండి: మంత్రి హరీశ్‌రావుకు డీకే అరుణ సవాల్) అదే విధంగా, బీడీ కార్మికులకు కేంద్రం ఏం సాయం చేస్తుందో చర్చకు ఎక్కడైనా సిద్ధమే అని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు సవాల్ విసిరారు. రూ.1600 కాదు, పదహారు పైసలు కూడా కేంద్రం ఇవ్వడంలేదుని తెలిపారు. రూ.1600 ఇస్తున్నట్లు రుజువు చేస్తే సిద్ధిపేట ఎమ్మెల్యే, మంత్రి పదవులకు రాజీనామా చేస్తానని అన్నారు. రుజువు చేయలేకపోతే కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ రాజీనామా చేయాలన్నారు. ఈ విషయంపై తాజాగా స్పందించిన యెండల లక్ష్మీ నారాయణ.. కేంద్ర ఆవాసయోజన, కృషి వికాస్ యోజన కింద కేంద్రం ఇచ్చిన నిధులు ఏం చేశారో చెప్పాలని హరీష్‌ను ప్రశ్నించారు. ‘‘క్రిష్ వికాస్ యోజన కింద కేంద్రం 850 కోట్ల రూపాయలిస్తే.. వాటిని ట్రాక్టర్ల రూపంలో టీఆర్ఎస్ కార్యకర్తలకు ఇచ్చిన వాటిపైన చర్చిద్దామా?. ప్రతి అంశంలో కేంద్రం వాటా ఏంటో చెప్పేందుకు నేను సిద్ధం, హరిష్ రావు సిద్ధమా? కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఒక ఎకరాకు నీళ్ళు ఇస్తే ఎంత ఖర్చు అవుతుందో హరీష్ రావు చెప్పాలి. గ్రామ పంచాయితీలకు 10 వేల ట్రాక్టర్ లు కొంటె అందులో ఎక్కువశాతం మహేంద్ర ట్రాక్టర్లు ఎందుకు ఉన్నాయో హరీష్ రావు చెప్పాలి’’ అని ప్రశ్నల వర్షం కురిపించారు. ‘‘బీజేపి కార్పొరేటర్ ఎక్కడో ప్రెజెంటేషన్‌లో తప్పుదొర్లితే, దాన్ని పట్టుకుని రాష్ట్ర ఆర్ధిక మంత్రిగా హరీష్ రావు మాట్లాడమేమిటి.. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు, సీఎం స్వంత జిల్లాలో సరైన గుణపాఠం ఎదురు కాబోతోంది’’ అని చురకలు అంటించారు. ఆర్థిక మంత్రి హరీష్ రావు సౌమ్యంగా.. కూల్‌గా సవాళ్లు విసిరారు.. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఆయనను చర్చకు రమ్మని ప్రతిసవాల్ విసురుతున్నా అని యెండల పేర్కొన్నారు.(చదవండి: బీజేపీ దివాలాకోరు రాజకీయాలకు పరాకాష్ట) -
బీజేపీ నూతన రాష్ట్ర కమిటీ నియామకం
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో బలపడేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో విజయం సాధించిన కాషాయ దళం అదే ఊపును కొనసాగించాలని వ్యూహాలు రచిస్తోంది. దీనిలో భాగంగానే కరీంనగర్ ఎంపీగా గెలుపొందిన బండి సంజయ్‌ను ఇప్పటికే నూతన అధ్యక్షుడిగా నియమించింది. అనంతరం రాష్ట్ర పార్టీ నాయకత్వాన్ని పటిష్టం చేయాలని భావించింది. ఈ క్రమంలోనే సంజయ్ తన కొత్త టీమ్‌ను నియమించారు. 8 మందిని పార్టీ ఉపాధ్యక్షులుగా, నలుగురిని ప్రధాన కర్యదర్శులుగా, మరో ఎనిమిది మందిని కార్యదర్శులుగా నియమించారు. ఈ మేరకు ఆదివారం బండి సంజయ్ నూతన కమిటీని ప్రకటించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నూతన రాష్ట్ర ఉపాధ్యక్షులు 1) డా. విజయ రామారావు (మాజీ ఎమ్మెల్యే) 2) చింతల రామచంద్రారెడ్డి (మాజీ ఎమ్మెల్యే) 3) సంకినేని వెంకటేశ్వరరావు (మాజీ ఎమ్మెల్యే) 4) యెండల లక్ష్మీ నారాయణ (మాజీ ఎమ్మెల్యే) 5) ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ (మాజీ ఎమ్మెల్యే) 6) యెన్నం శ్రీనివాస్ రెడ్డి (మాజీ ఎమ్మెల్యే) 7) మనోహర్ రెడ్డి 8) శోభారాణి ప్రధాన కార్యదర్శులు ప్రేమేందర్ రెడ్డి ప్రదీప్ కుమార్ ఎమ్. శ్రీనివాసులు కార్యదర్శులు రఘునందన్ రావు ప్రకాష్ రెడ్డి శ్రీనివాస్ గౌడ్ బొమ్మ జయ శ్రీ పల్లె గంగారెడ్డి కుంజ సత్యవతి మాధవి ఉమరాణి -
బీజేపీకి షాక్.. శివసేన నుంచి పోటీ
సాక్షి, నిజామాబాద్ : రెబల్స్ బెడద మహాకూటమినే కాదు బీజేపీకి కూడా వెంటాడుతోంది. ఈ పార్టీ నుంచి టికెట్ అశించిన నిజామాబాద్ బీజేపీ సీనియర్ నేత, నియోజకవర్గ ఇన్ఛార్జ్ సూర్యనారాయణ గుప్తా సీటు రాకపోవడంతో నిజామాబాద్ అర్బన్ నుంచి బీజేపీ రెబల్‌గా పోటీకి దిగారు. శివసేన పార్టీ తరుఫున బరిలోకి దిగిన గుప్తా సోమవారం కాషాయ జెండాల నడుమ భారీ ర్యాలీని నిర్వహించి నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ బలంగా భావించే ఈస్థానంలో ఆపార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మినారాయణ పోటీపడుతున్నారు. గుప్తా రెబల్‌గా బరిలోకి దిగడంతో ఈస్థానంలో బీజేపీకి పెద్దదెబ్బగా ఈ పార్టీ నేతలు భావిస్తున్నారు. మహారాష్ట్రకు చెందిన శివసేన పార్టీ తరుఫున తెలంగాణలో పోటీ చేస్తున్న ఏకైక అభ్యర్థి నారాయణ గుప్తానే కావడం విశేషం. ఇదిలావుండగా ఆయన రాజీనామాను బీజేపీ అధిష్టానం ఇంకా ఆమోదించలేదని.. గుప్తాకు శ్రమను గుర్తించి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి కృష్ణసాగర్ గుప్తా తెలిపారు. -
బీజేపీలో నటి రేష్మాకు కీలక పదవి!
సాక్షి, హైదరాబాద్ : తనకు అవకాశం ఇస్తే భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభ్యర్థిగా మహబూబాబాద్ లోక్‌సభ స్థానానికి పోటీ చేస్తానని టాలీవుడ్ నటి, ‘ఈ రోజుల్లో’ ఫేం రేష్మా రాథోడ్ అన్నారు. తనను యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శిగా నియమించడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశమిస్తే తప్పకుండా వినియోగించుకుంటానని నటి ధీమా వ్యక్తం చేశారు. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ జయంతి రోజున ఆమె బీజేపీలో చేరిన విషయం విదితమే. ప్రజల సమస్యలతో పాటు స్థానిక అవసరాలేమిటో తెలుసుకునేందుకు పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల్లో పర్యటించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆమె స్పష్టం చేశారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా శుక్రవారం హైదరాబాద్‌కు విచ్చేసిన సందర్భంగా ఆయనను కలుసుకుని ఘన స్వాగతం పలికిన వారిలో రేష్మ కూడా ఉన్నారు. బీజేపీ మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన హారితహారం, డబుల్ బెడ్రూమ్, ఇతర పథకాల అమలు సరిగా లేదని విమర్శించారు. 12,751 గ్రామ పంచాయతీలకుగానూ కేవలం 3,494 పంచాయతీలకు మాత్రమే కార్యదర్శులను నియమించారని గుర్తుచేశారు. హరితహారం కార్యక్రమం నిర్వహించాలని గ్రామ కార్యదర్శులకు బాధ్యత అప్పగించారనీ, అసలు అది ఎలా సాధ్యమవుతుందని టీఆర్ఎస్ సర్కార్‌ను ప్రశ్నించారు. హరితహారం క్షేత్రస్థాయిలో మాత్రం కనిపించడం లేదన్నారు. మరుగుదొడ్ల నిర్మాణానికి సంబంధించిన బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం ఇంకా చెల్లించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తయినా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కట్టించలేకపోయారని పేర్కొన్నారు. 1,121 కోట్ల రూపాయాలు పట్టణ గృహ నిర్మాణానికి, 190 కోట్ల రూపాయలు గ్రామీణ గృహ నిర్మాణానికి కేంద్రం ఇచ్చిందని ఈ సందర్భంగా యెండల గుర్తుచేశారు. ఇప్పటివరకు డబుల్ బెడ్రూం ఇళ్లకు 2,121 కోట్లు ఖర్చు చేశారని, ఇందులో 800 కోట్లు కూడా తెలంగాణ ప్రభుత్వం ఖర్చు పెట్టలేదని యెండల లక్ష్మీనారాయణ అన్నారు. -
నిజామాబాద్ - ముగ్గురు టీ వాదుల ముక్కోణపు పోటీ
తెలంగాణ జిల్లాల్లో అత్యంత ఆసక్తికరమైన పోటీ ఏది అని అడిగితే ఎవరైనా చూపించేది నిజామాబాద్ వైపే. ఎందుకంటే అక్కడ నుంచి తెలంగాణ రాజకీయాల్లో నవతార కల్వకుంట్ల కవిత తొలిసారి బ్యాలెట్ పోటీలోకి దిగారు. ఇప్పటి వరకూ ఎన్నికల్లో పోటీ చేయని ఆమెపై రెండు సార్లు ఎంపీగా గెలిచిన మధు యాష్కి గౌడ్, రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఎండల లక్ష్మీనారాయణ పోటీలో ఉన్నారు. కవిత టీఆర్ ఎస్ నుంచి, మధు యాష్కి కాంగ్రెస్ నుంచి, ఎండల బిజెపి నుంచి పోటీ పడుతున్నారు. అటు మహారాష్ట్ర, ఇటు కర్నాటకలతో సరిహద్దు షేర్ చేసుకునే నిజామాబాద్ లో అంకాపూర్ లాంటి అత్యంత ధనిక ఊర్లు, అతి వెనుకబాటుతనంలో బాధపడే గాంధారి లాంటి ఊర్లు కలగలిసి ఉన్నాయి. ముస్లిం, మరాఠీ, లంబాడీ వర్గాలతో పాటు, కొన్ని ప్రాంతాల్లో మున్నూరు కాపులు పుష్కలంగా ఉన్నారు. ముగ్గురూ తెలంగాణవాదులేః తెలంగాణ వాదం అత్యంత బలంగా ఉన్న జిల్లాల్లో నిజామాబాద్ ఒకటి. ముగ్గురు అభ్యర్థులూ వీరతెలంగాణ వాదులే. కవిత తెలంగాణ జాగృతిని స్థాపించి బతుకమ్మ, తెలంగాణ సంస్కృతిని ప్రోత్సహించారు. కేసీఆర్ కుమార్తెగా ఆమెకు తెలంగాణ వాదం వారసత్వ ఆస్తిగా సంక్రమించింది. ఇక మధుయాష్కీ తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర వహించిన కాంగ్రెస్ నేతల్లో ఒకరని ప్రచారం. బిజెపి అభ్యర్థి ఎండల లక్ష్మీనారాయణ తెలంగాణ వాదం కోసం ఎమ్మెల్యే సీటును త్యాగం చేశారు. గత చరిత్ర ఏం చెబుతోందిః గత చరిత్రను చూస్తే కాంగ్రెస్ కి సానుకూలాలు చాలానే ఉన్నాయి. ఇప్పటి వరకూ కాంగ్రెస్ నిజామాబాద్ నుంచి 11 సార్లు గెలిచింది. టీడీపీ మూడు సార్లు గెలిచింది. టీఆర్ ఎస్ 2009 లో తొలిసారి పోటీ చేసింది. ఓడిపోయింది. అయితే టీఆర్ ఎస్ తొలినాళ్లలోనే నిజామాబాద్ జిల్లాపరిషత్ ను గెలుచుకుంది. ఇక 2009 లో టీడీపీకి మూడు, బిజెపికి ఒక అసెంబ్లీ నియోజవర్గాలు వచ్చాయి. కాంగ్రెస్ ఒక సీటు, పీఆర్ పీ ఒక సీటు గెలుచుకున్నాయి. పీఆర్ పీ తరువాత కాంగ్రెస్ లో కలిసిపోయింది. ఈ లెక్కన బిజెపి అభ్యర్థికి అనుకూలంగా ఉండాలి. అయితే తెలంగాణ ఏర్పాటు తరువాత ఈ లెక్కలు పనికిరావు. కవిత కరిష్మా, మధుయాష్కీ పాత పరిచయాలకు, మోడీ మోత మోగిస్తున్న ఎండలకు మధ్యే ప్రధానంగా పోటీ. తెలంగాణ తెచ్చింది మేమేనని మధు యాష్కీ అంటే, తెస్తే చాలదు. అభివృద్ధి చేయాలి. అది టీఆర్ ఎస్ చేస్తుందని కవిత అంటున్నారు. వచ్చేది మోడీ ప్రభుత్వం కాబట్టి మాకే ఓటేయండి అని ఎండల అంటున్నారు. ప్రధాన సమస్యలుః నిజామాబాద్ గోదావరి ముఖద్వారం లాంటిది. మన రాష్ట్రంలోకి గోదారమ్మ ఇక్కడి నుంచే వస్తుంది. పోచంపాడు, అలీసాగర్, నిజాంసాగర్ వంటి ప్రాజెక్టులు కొంత ఏరియాని సస్యశ్యామలం చేసిన మాట ఎంత నిజమో, లెండి, గుత్ప, కౌలాస్ నాలా వంటి ప్రాజెక్టులు పెండింగ్ లో ఉండటం వల్ల వస్తున్న సమస్యలూ అంతే వాస్తవం. నియోజకవర్గంలో నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బోధన్, బాల్కండ, ఆర్మూర్, కొరాటియాలతో పాటు కరీంనగర్ లోని జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఏప్రిల్ 30 కి నిజామాబాద్ ఎవరి ఖాతాలోకి వెళ్తుందో తేలిపోతుంది. -
'కాంగ్రెస్ జేజమ్మలు దిగొచ్చినా రాయల తెలంగాణను తేలేరు'
హైదరాబాద్: ఎంఐఎం పార్టీ రాయల తెలంగాణను అడిగిందని తెలంగాణ ప్రజల ఆకాంక్షను బలిపెడతారా? అంటూ కాంగ్రెస్ అధిష్టానంపై రాష్ట్ర బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. పూటకో డ్రామా ఆడుతూ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే సహించే ప్రసక్తి లేదని హెచ్చరించారు. హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఇస్తున్నామని చెప్పి ఇప్పుడీ సరికొత్త రాగమేంటని ప్రశ్నించారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి నేతలు యెండల లక్ష్మీనారాయణ, యన్నం శ్రీనివాసరెడ్డి, డాక్టర్ టి.రాజేశ్వరరావు, అరుణా జ్యోతి, బండారు దత్తాత్రేయ తదితరులు బుధవారం ఇక్కడ మీడియాతో మాట్లాడారు. వందల ఏళ్ల చరిత్ర, సంస్కృతి ఉన్న రాయలసీమ సెంటిమెంటును దెబ్బతీస్తారాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘బ్రేకులు, లీకులతో ప్రజలను గందరగోళపరుస్తారా? కబడ్దార్’ అని హెచ్చరించారు. కాంగ్రెస్ జేజమ్మలు దిగొచ్చినా రాయల తెలంగాణను తేలేరన్నారు. జేఏసీ భాగస్వామ్య పార్టీగా గురువారం నాటి బంద్‌కు మద్దతిస్తున్నట్టు తెలిపారు. ఇదిలావుంటే, కర్నూలుకు చెందిన డీ భీమలింగేశ్వరరావు నాయకత్వంలో పలువురు బీజేపీలో చేరారు. ప్రపంచ రోలర్ స్కేటింగ్ చాంపియన్ పోటీలో పసిడి పతకాన్ని సాధించిన హైదరాబాద్ యువకుడు అనూప్ కుమార్ యామాను నేతలు ఘనంగా సత్కరించారు.