‘సిరిసిల్ల’ సోలార్ ప్లాంట్‌లో ప్రమాదం
సిరిసిల్లటౌన్(రాజన్న సిరిసిల్ల): సోలార్‌ప్లాంటులో ట్రాన్స్ఫార్మర్ బిగిస్తుండగా జరిగిన ప్రమాదంలో ఓ ఎలక్ట్రికల్ డిప్యూటీ మేనేజర్ దుర్మరణం చెందాడు. ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్‌లో బుధవారం జరిగింది. నామాపూర్‌లో ఆరునెలలుగా సోలార్ పవర్ ప్లాంట్ పనులు జరుగుతున్నాయి. స్టెర్లింగ్ విల్సన్ కంపెనీ ఆధ్వర్యంలో ముంబయి నుంచి 30మంది ఉద్యోగుల బృందం వచ్చి పనిచేస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ప్లాంటులో ట్రాన్స్ఫార్మర్ను గద్దెపై కూర్చోపెట్టడానికి క్రేన్‌తో ప్రయత్నాలు ప్రారంభించారు.
ఈ క్రమంలో హఠాత్తుగా క్రేన్ హైడ్రాలిక్ ఊడిపోయి డిప్యూటీ మేనేజర్ యోగేశ్ విశ్వనాథ్ పూజారి, మరో ఉద్యోగి మనీశ్‌రెడ్డిపై పడింది. తీవ్రంగా గాయపడిన వారిద్దరినీ సహోద్యోగులు వెంటనే ముస్తాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రికి చేరుకునేలోగానే విశ్వనాథ్‌పూజారి మరణించినట్లు వైద్యులు తెలిపారు. మనీశ్‌రెడ్డి గాయాలపాలైనా ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. విశ్వనాథ్‌పూజారి కుటుంబ సభ్యులు ముంబాయిలోనే ఉంటారని స్థానికులు తెలిపారు. ప్లాంటు నిర్వాహకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రవీణ్ తెలిపారు.