YSR District Electricity Employees Union
-
'విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి'
హైదరాబాద్: వైఎస్ఆర్ విద్యుత్ ఉద్యోగుల యూనియన్‌పై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని మాజీ ఎమ్మెల్యే, యూనియన్ అధ్యక్షుడు కారుమూరి నాగేశ్వరరావు ఆరోపించారు. సోమవారం వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్ విద్యుత్ ఉద్యోగుల యూనియన్ సమావేశానికి 13 జిల్లాల యూనియన్ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యుత్ ఉద్యోగుల న్యాయపరమైన కోర్కెలను నెరవేర్చలేదని అన్నారు. అలాగే వైఎస్ఆర్ విద్యుత్ ఉద్యోగుల యూనియన్‌పై ప్రభుత్వం కక్షసాధింపు ధోరణిలో వ్యవహరిస్తూ.. యూనియన్‌లోని ఉద్యోగులను ఇప్పటికీ రెగ్యులరైజ్ చేయలేదని ఆరోపించారు. ప్రభుత్వం తక్షణమే విద్యుత్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. -
ప్రభుత్వంపై పోరుకు పార్టీ అండ
వైఎస్ అవినాష్‌రెడ్డి పులివెందుల: ప్రభుత్వంపై చేసే పోరాటాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ఆయనను వైఎస్ఆర్ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు కలిశారు. ఈ సందర్భంగా విద్యుత్ కార్మికులకు చెందిన పలు సమస్యలను ఆయనతో ఏకరువు పెట్టారు. దీనిపై ఆయన మాట్లాడుతూ సమస్యలను జగనన్న దృష్టికి తీసుకెళ్లి అసెంబ్లీలో ప్రస్తావించేలా కృషి చేస్తానని, అలాగే ప్రభుత్వంపై విద్యుత్ కార్మికులు చేసే పోరాటాలకు పార్టీ తరపున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రజలతో మమేకం : శనివారం వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ప్రజలతో మమేకమయ్యారు. వివిధ సమస్యలతో తన వద్దకు వచ్చిన ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి అధికారులకు ఫోన్లు చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, నల్లచెరువుపల్లె జనార్ధన్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రసూల్ తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ విద్యుత్ ఉద్యోగుల సంఘంలో ఏపీ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ విలీనం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పవర్ ఎంప్లాయీస్ యూనియన్(రిజిస్టర్డ్ నెంబర్ హెచ్-129) వైఎస్సార్ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్‌లో విలీనమైంది. బుధవారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో విలీన కార్యక్రమం జరిగింది. యూనియన్ నాయకులందరికీ జగన్ పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. 2012 నుంచి కొనసాగుతున్న హెచ్-129 యూనియన్‌లో రాష్ట్రవ్యాప్తంగా వివిధ విద్యుత్ సంస్థలకు చెందిన 2,000 మంది సభ్యులుగా ఉన్నారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయ సాధనకు తమ యూనియన్ను వైఎస్సార్ విద్యుత్ ఎంప్లాయీస్లో విలీనం చేశామని యూనియన్ అధ్యక్షుడు జి.వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి వి.సుధాకర్‌రెడ్డి తెలిపారు. వైఎస్సార్సీపీ మాత్రమే కార్మికులు, ఉద్యోగుల ప్రయోజనాలను పరి రక్షిస్తుందని విశ్వసిస్తున్నట్లు చెప్పారు. కార్మిక, ఉద్యోగ వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న టీడీపీ ప్రభుత్వంపై ట్రేడ్‌యూనియన్ తరపున పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధమవుతామని వైఎస్సార్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు గౌతమ్‌రెడ్డి ప్రకటించారు. వైఎస్సార్ టీ యూసీలో చురుగ్గా ఉన్న ఉద్యోగులను తణుకు, తాడేపల్లిగూడెం, ఉభయగోదావరి జిల్లాల్లో సుదూర ప్రాం తాలకు బదిలీ చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం బదిలీల్లో లంచాలను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. ఈ కారక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి కూడా పాల్గొన్నారు. -
వైఎస్సార్ విద్యుత్ యూనియన్ను బలోపేతం చేయాలి
డిస్కం నాయకులు రమేష్, బాలాజీ నెల్లూరు (రవాణా): సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ పరిధిలో వైఎస్సార్ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ బలోపేతం చేయాలని డిస్కం అధ్యక్ష, కార్యదర్శులు రమేష్, బాలాజీ పిలుపునిచ్చారు. స్థానిక ఓ హోటల్లో ఆదివారం నెల్లూరు రీజనల్ వైఎస్సార్ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులతో సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ డిస్కం పరిధిలో నిత్యం విద్యుత్ ప్రమాదాలు చోటు చేసుకోవడం వల్ల రోజుల పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయన్నారు. మృతుల సంఖ్య తగ్గిం చేందుకు యూనియన్ పరంగా కృషి చేస్తామన్నారు. విద్యుత్ ఉద్యోగులు, కార్మికులు ఏడాదికి రూ. 1000 చెల్లిస్తే ప్రమాదాల్లో మరణించిన కుటుంబీకులకు బీమా కింద రూ. 20 లక్షలు పరి హారం ఇచ్చేందుకు ఎస్బీఐ, ఎస్బీహెచ్ ముందుకు వచ్చాయన్నారు. 2004 నుంచి రావాల్సిన జీపీఎఫ్, ఈపీఎప్‌లకు కృషి చేస్తామన్నారు. కాంట్రాక్టు కార్మికులకు బ్యాంకు ల ద్వారా వేతనం అందజేయాలని డిమాండ్ చేశారు. పదవీ విరమణలో వయో పరిమితి అన్ని శాఖలకు ఒకే తరహా విధానాన్ని ప్రవేశపెట్టాలన్నారు. ఉద్యోగులకు పీఆర్సీ కోసం ఉద్యమించినట్లు చెప్పారు. యూనియన్ నాయకుడు రమణారెడ్డి మాట్లాడుతూ గతంలో 2010లో వేతన సవరణలు జరిగాయన్నారు. మళ్లీ గడువు పూర్తయి 8 నెలలు కావస్తున్నా వేతన సవరణలు జరగలేదన్నారు. అన్ని యూనియన్లలో అవినీతికి పాల్పడ్డ నాయుకులు ఉన్నత పదవులు అనుభవిస్తున్నారని చెప్పారు. జిల్లా నాయకుడు శివయ్య మాట్లాడుతూ పనిచేసే యూనియన్‌గా వైఎస్సార్ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ ఎదగాలని ఆకాంక్షించారు. విశ్రాంత ఉద్యోగి వెంకటరావు మాట్లాడుతూ అనుభవం లేని నాయకత్వం వల్లే సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. వైఎస్సార్ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ రీజనల్ నూతన కమిటీ వైఎస్సార్ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ నెల్లూరు రీజనల్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నగరంలోని ఓ హాటల్లో ఆదివారం సమావేశమైన డిస్కం అధ్య, కార్యదర్శుల సమక్షంలో కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. రీజనల్ అధ్యక్షుడిగా కె.రమణారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎంవీ రమణయ్య, ప్రధాన కార్యదర్శిగా జీవీ శివయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రీజనల్ ఉపాధ్యక్షులుగా సీహెచ్ సాంబశివరావు, కె.దేవదాసు, కోశాధికారిగా ఎస్కే షాహిద్, కార్యనిర్వాహక కార్యదర్శిగా ఎన్వీ కార్తిక్, సహాయ కార్యదర్శులుగా సీహెచ్ సురేష్‌బాబు, ఎం.సుభాన్‌బేగ్‌లను ఎన్నుకున్నారు. -
వైఎస్సార్ సీపీ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ ఆవిర్భావం
తిరుపతి అర్బన్: వైఎస్సార్ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ నూతన కార్యవర్గం ఎన్నిక సోమవారం జరిగింది. తిరపతి సమీపంలోని దుర్గసముద్రం ధర్మరాజుల గుడి వద్ద జరిగిన సమావేశానికి వైఎస్సార్ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పాండురంగారెడ్డి అధ్యక్షత వహించారు. ఎనిమిది జిల్లాలకు సంబంధించి డిస్కం అధ్యక్షులుగా తిరుపతి ఈఆర్వో-టి2 సీనియర్ అసిస్టెంట్ ఆర్.రమేష్‌బాబు, తిరుపతి కన్స్ట్రక్షన్ డివిజన్ సీనియర్ అసిస్టెంట్ బి.బాలాజి కార్యదర్శిగా ఏకగ్రీవంగా నామినేట్ అయ్యారు. రాబోయే డిస్కం ఎన్నికల వరకు వీరు వైఎస్సార్ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ ఆఫీస్‌బేరర్లుగా పనిచేస్తారని, డిస్కం ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో కీలకపాత్ర పోషిస్తారని పాండురంగారెడ్డి తెలిపారు. నూతనంగా ఎన్నికైన ఈ కార్యవర్గం రీజినల్ కార్యవర్గాన్ని ఎన్నుకుంది. చిత్తూరు ఈఆర్వో-టి సీనియర్ అసిస్టెంట్ బి.వెంకోబరావు రీజనల్ అధ్యక్షులుగా, తిరుపతి రూరల్ సెక్షన్ లైన్‌మేన్ ఎస్.జయప్రకాష్‌ను రీజనల్ కార్యదర్శిగా ఎన్నుకున్నారు. వీరు జరగబోవు రీజనల్ ఎన్నికల వరకు పై పదవులలో కొనసాగుతారని వైఎస్సార్సీపీ డిస్కం అధ్యక్షులు రమేష్‌బాబు తెలిపారు. వైఎస్సార్సీపీ ఆశయాలకు, సిద్ధాంతాలకు అనుగుంణంగా పనిచేస్తూ, విద్యుత్ కార్మికుల హక్కుల సాధనకు చిత్తశుద్ధితో పోరాడుతామని నూతన కార్యవర్గం వెల్లడించింది.