yuvajana congress
-
‘టీఆర్ఎస్ నేతలను రోడ్లపై తిరగనివ్వం’
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ ఫలితాల అవకతవకలకు బాధ్యులైనవారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ భారత జాతీయ విద్యార్థి సంఘం (ఎన్ఎస్యూఐ), యువజన కాం గ్రెస్ ఆధ్వర్యంలో 48 గంటల దీక్ష ప్రారంభమైంది. గురువారం ఉదయం రెండు విభాగాల రాష్ట్ర అధ్యక్షులు బల్మూరి వెంకట్, అనిల్‌కుమార్‌యాదవ్‌లతోపాటు పలువురు నేతలు గాంధీభవన్ వేదికగా దీక్షకు కూర్చున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఏఐసీసీ కిసాన్ సెల్ వైస్‌చైర్మన్ కోదండరెడ్డి ఈ దీక్షను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్నారు. 10 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన ఇంటర్ ఫలితాల్లో తప్పులు జరిగితే బాధ్యులపై చర్యలు తీసుకోకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారని మండిపడ్డారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు విశ్రమించబోమన్నారు. ప్రభు త్వం ఆందోళనలు జరగకుండా నిర్బంధాలు విధిస్తోందని విమర్శించారు. విద్యార్థుల చావుల కోసమేనా?: వెంకట్ ఇంటర్‌బోర్డు చేసిన తప్పులపై ఎన్నిసార్లు వినతిపత్రాలిచ్చినా పట్టించుకోలేదని ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ ఆరోపించారు. విద్యార్థుల చావుల కోసమే తెలంగాణ సాధించుకున్నట్టు ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటర్ ఫలితాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇంటర్ విద్యార్థులకు న్యాయం చేయకపోతే టీఆర్ఎస్ నేతలను రోడ్లపై తిరగనివ్వబోమని హెచ్చరించా రు. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ మాట్లాడుతూ ఉన్నతశిఖరాలను అధిరోహించాలనుకునే విద్యార్థుల కలలు కల్లలయ్యేం దుకు ప్రభుత్వ అసమర్థతే కారణమని విమర్శించారు. దీక్షకు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరెళ్ల శారద, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్, టీపీసీసీ అధికార ప్రతినిధులు ఇందిరా శోభన్, సతీశ్ మాదిగ సంఘీభావం తెలిపారు. దొంగల చేతికే తాళం ఇస్తారా: రేవంత్ ఇంటర్ బోర్డు ఫలితాల్లో తప్పు చేసిన గ్లోబరీనా సంస్థకే మళ్లీ రీవెరిఫికేషన్ బాధ్యతలు ఇవ్వడం దొంగ చేతికే తాళం చెవి ఇచ్చినట్టుందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి విమర్శించారు. గ్లోబరీనా సంస్థపై చర్యలు తీసుకోవాల్సింది పోయి కాపాడే ప్రయత్నం చేస్తున్నారన్నారు. దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఇంటర్ బోర్డులో అక్రమాలు జరిగాయని నిరూపిం చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని రేవంత్ చెప్పారు. -
మోదీ ప్రభుత్వానికి మూడింది
అబిడ్స్ : కేంద్రంలో ప్రజావ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని సాగనంపే రోజులు సమీపిస్తున్నాయని రాష్ట్ర యువజన కాంగ్రెస్ అ«ధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన భారత్ బచావో ఆందోళన్‌లో పాల్గొనేందుకు ఆయన నగరం నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలతో తరలివెళ్లారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ..... పెట్రోల్, డీజిల్ ధరలు 60 ఏళ్లలో పెరగని విధంగా మోదీ ప్రభుత్వం పెంచిందన్నారు. దీంతో ప్రజలపై ధరల ప్రభావం తీవ్రంగా పడిందన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారన్నారు. -
రాహుల్ జీ.. మీరు కళ్లు తెరవాలి: కాంగ్రెస్ నేత
కేరళ: కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై కేరళ యువజన కాంగ్రెస్ నేత ఒకరు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ముందుండి పార్టీని నడిపించాలనే ఆసక్తి లేకపోతే రాహుల్ వెంటనే బాధ్యతల నుంచి వైదొలగాలని కోరారు. ఈ మేరకు మంగళవారం కేరళ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సీఆర్ మహేష్ తన ఫేస్బుక్ ఖాతాలో ఈ వ్యాఖ్యలు చేశారు. ‘రాహుల్ జీ.. మీరు కళ్లు తెరవాలి. దేశవ్యాప్తంగా బలమైన మూలాలున్న కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఎలా ప్రజల మనస్సుల్లో నుంచి కనుమరుగవుతుందో చూడాలి’ అన్నారు. పార్టీ యువజన విభాగం నుంచి అంచెలంచెలుగా సీడబ్ల్యూసీ స్థాయికి ఎదిగిన సీనియర్ నేత ఏకే ఆంటోనీ మౌనముని మాదిరి ఉండిపోయారని వ్యాఖ్యానించారు. కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) అధ్యక్షుడు వీఎం.సుధీరన్ పదవి నుంచి వైదొలగటంతో నాయకుడు లేకుండా కేపీసీసీ పక్షం రోజులుగా కొనసాగుతోందని చెప్పారు. సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం వైఫల్యాలపై ప్రజల్లోకి వెళ్లాల్సిన సమయంలో ఇలా ఉండటం గర్హనీయమన్నారు. జాతీయ, రాష్ట్ర స్థాయిలో పార్టీ తీవ్ర సంక్షోభంలో ఉండిపోగా నాయకత్వం చేష్టలుడిగి చూస్తోందని ఆరోపించారు. -
మిర్యాలగూడ కౌన్సిలర్‌పై దాడి
మిర్యాలగూడ: యువజన కాంగ్రెస్ మండల కార్యవర్గ ఎన్నికల సందర్భంగా నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. వివరాలు...స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో శనివారం ఉదయం 10 గంటలకు యువజన కాంగ్రెస్ మండల కార్యవర్గాన్ని ఎన్నుకోవాల్సి ఉంది. అయితే, 9 గంటలకే అక్కడికి చేరుకున్న శ్రేణులు బాహాబాహీకి దిగాయి. ఈ కొట్లాటలో పట్టణ కౌన్సిలర్ ఇలియాస్ పై ప్రత్యర్థి వర్గం దాడికి దిగింది. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలిసిన కౌన్సిలర్లు అక్కడికి చేరుకుని, ఆయనకు మద్దతు తెలిపారు. దాడికి పాల్పడిన వారిని శిక్షించకుంటే పదవులకు రాజీనామా చేస్తామని 22 మంది కౌన్సిలర్లు హెచ్చరిస్తున్నారు.