రాహుల్ జీ.. మీరు కళ్లు తెరవాలి: కాంగ్రెస్ నేత
రాహుల్ జీ.. మీరు కళ్లు తెరవాలి: కాంగ్రెస్ నేత
Published Tue, Mar 21 2017 3:35 PM | Last Updated on Tue, Sep 5 2017 6:42 AM
కేరళ: కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ‍్యక్షుడు రాహుల్ గాంధీపై కేరళ యువజన కాంగ్రెస్ నేత ఒకరు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ముందుండి పార్టీని నడిపించాలనే ఆసక్తి లేకపోతే రాహుల్ వెంటనే బాధ్యతల నుంచి వైదొలగాలని కోరారు. ఈ మేరకు మంగళవారం కేరళ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సీఆర్ మహేష్ తన ఫేస్‌బుక్ ఖాతాలో ఈ వ్యాఖ్యలు చేశారు. ‘రాహుల్ జీ.. మీరు కళ్లు తెరవాలి. దేశవ్యాప్తంగా బలమైన మూలాలున్న కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఎలా ప్రజల మనస్సుల్లో నుంచి కనుమరుగవుతుందో చూడాలి’ అన్నారు.
పార్టీ యువజన విభాగం నుంచి అంచెలంచెలుగా సీడబ్ల్యూసీ స్థాయికి ఎదిగిన సీనియర్ నేత ఏకే ఆంటోనీ మౌనముని మాదిరి ఉండిపోయారని వ్యాఖ్యానించారు. కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) అధ్యక్షుడు వీఎం.సుధీరన్ పదవి నుంచి వైదొలగటంతో నాయకుడు లేకుండా కేపీసీసీ పక్షం రోజులుగా కొనసాగుతోందని చెప్పారు. సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం వైఫల్యాలపై ప్రజల్లోకి వెళ్లాల్సిన సమయంలో ఇలా ఉండటం గర్హనీయమన్నారు. జాతీయ, రాష్ట్ర స్థాయిలో పార్టీ తీవ్ర సంక్షోభంలో ఉండిపోగా నాయకత్వం చేష్టలుడిగి చూస్తోందని ఆరోపించారు.
Advertisement
Advertisement