ఉట్టిపడిన కళా వైభవం..
అనంతపురం కల్చరల్ : భరతనాట్యం, కూచిపూడి వంటి శాస్త్రీయ నృత్యాలు.. గరగాటం, పేరిణీ శివతాండవం, గొరవయ్యలు వంటి ప్రాచీన కళారూపాలు.. వన్ యాక్ట్ ప్లే.. ఇలా ప్రతి దాంట్లో వివిధ కళాశాలలకు చెందిన యువతీయువకులు తమదైన ప్రతిభతో అదరగొట్టారు. గురువారం స్థానిక ఆర్ట్స్ కళాశాల వేదికగా డివిజన్ స్థాయి ఘనంగా యువజనోత్సవాలు జరిగాయి. యువజన సంక్షేమ శాఖ, ఆన్సెట్ సంయుక్త ఆధ్వర్యంలో సాగిన కార్యక్రమంలో పలు కళాశాలల విద్యార్థులు తమ ప్రతిభను చాటారు.
జిల్లాకు చెందిన ఆరభి బృందం పలు బహుమతులను గెలుచుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో యువజన సంక్షేమ శాఖాధికారి వెంకటేశం, సహాయ అధికారి భవానీ, ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రంగస్వామి, ఎన్ఎస్ఎస్ అధికారి సుధాకర్ తదితరులు మాట్లాడారు. యువతలోని ప్రతిభను వెలికితీయడానికే యువజనోత్సవాలు నిర్వహిస్తున్నామని, గెలుపోటములను సమానంగా తీసుకోవాలని సూచించారు.