స్మార్ట్‌సిటీగా ఒంగోలు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: వెనుకబడిన జిల్లాలోని ఒంగోలు నగరాన్ని కేంద్ర ప్రభుత్వం స్మార్ట్‌సిటీగా అభివృద్ధి చేసే అవకాశం ఉందని ఎంపీ వె వీ సుబ్బారెడ్డి అన్నారు. కేంద్రం వంద పట్టణాలను స్మార్ట్‌సిటీలుగా అభివృద్ధి చేయనున్నట్లు బడ్జెట్లో ప్రస్తావించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దీనికోసం ఇప్పటికే కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడిని కలిసి వివరించానని, ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు.
సోమవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దొనకొండ ప్రాంతంలో రాజధాని పెడితే జిల్లా వెనుకబాటుతనాన్ని తగ్గించవచ్చని ఇక్కడి మేధావులు ఒక నివేదిక సిద్ధం చేసి ఇచ్చారని, దీన్ని శివరామకృష్ణన్ కమిటీకి అందజేసినట్లు తెలిపారు. అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయాలని, వ్యవసాయేతర భూములు అందుబాటులో ఉన్న దొనకొండ, గుంటూరు జిల్లా వినుకొండ ప్రాంతాలను కూడా కమిటీ సందర్శించాలని ఆయన కోరారు.
వెనుకబడిన పశ్చిమ ప్రకాశంలో జాతీయ స్థాయి విద్యాసంస్థలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాలని డిమాండ్ చేశారు. యర్రగొండపాలెం ఎమ్మెల్యే డేవిడ్‌రాజు విజ్ఞప్తి మేరకు ఒంగోలు నగరానికి మంజూరైన కేంద్రీయ విద్యాలయం-2ను పెద్దారవీడు మండలంలో ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ విజయకుమార్‌ను కోరానని ఆయన కూడా సానుకూలంగా స్పందించారని చెప్పారు. ప్రతి గ్రామంలో ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేయాలని, గ్రామాల్లో రక్షిత మంచినీటి పథకాలకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తే ఎంపీ లాడ్స్‌తో పాటు ఆర్డబ్ల్యూఎస్ ద్వారా అభివృద్ధి చేద్దామని కలెక్టర్‌కు సూచించినట్లు సుబ్బారెడ్డి తెలిపారు.
రాష్ట్ర పునర్విభజన బిల్లులో రాష్ట్రంలోని వెనుకబడిన మండలాలను అభివృద్ధి చేస్తామని ప్రతిపాదించారని, అందులో 14 మండలాలు ప్రకాశం జిల్లావి ఉన్నాయని, వీటితోపాటు మరికొన్ని మండలాలను చేర్చడం కోసం కేంద్రానికి ప్రతిపాదనలు ఇవ్వనున్నట్లు ఎంపీ తెలిపారు. జిల్లా రైతులు కష్టాల్లో ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. శనగ రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉందన్నారు. 2012-13, 2013-14 సంవత్సరాల్లో పండించిన పంట ఇప్పటికీ అమ్ముడు పోలేదన్నారు.
ఇప్పటికే జిల్లాలోని కోల్డ్ స్టోరేజీల్లో 21 లక్షల క్వింటాళ్ల శనగ నిల్వలు పేరుకుపోయాయని చెప్పారు. తక్షణమే శనగ రైతులను ఆదుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావాలని ఆయన కోరారు. నాఫెడ్, మార్క్‌ఫెడ్ ద్వారా శనగ కొనుగోలు కేంద్రాలు తెరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఉత్తరాది ప్రాంతాల వారు బయట నుంచి శనగలు తక్కువ ధరకు దిగుమతి చేసుకోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. రైతులను ఢిల్లీకి తీసుకువెళ్లి కేంద్ర వాణిజ్యశాఖ మంత్రిని కలవనున్నట్లు సుబ్బారెడ్డి తెలిపారు.
శనగను దిగుమతి చేసుకోవడం ఆపాలని, లేనిపక్షంలో వాటిపై దిగుమతి సుంకం పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. పొగాకు రైతులు కూడా సరైన గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఎక్కువ పంట పండిస్తే బోర్డు వారు భారీగా జరిమానా విధిస్తున్నారని, దీన్ని తగ్గించాలని ఆయన కోరారు. సుబాబుల్, జామాయిల్‌కు కూడా గిట్టుబాటు ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమావేశంలో ఎమ్మెల్యేలు పాలపర్తి డేవిడ్‌రాజు, ఆదిమూలపు సురేష్, పార్టీ జిల్లా అధ్యక్షుడు నూకసాని బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
ఎంపీ వైవీని కలిసిన
వివిధ సంఘాల నాయకులు
రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని రైతు సంఘాల నాయకులు ఎంపీ వైవీ సుబ్బారెడ్డిని కోరారు. ఈ మేరకు ఎంపీని ఆయన కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందజేశారు. శనగకు గిట్టుబాటు ధర లేక రైతులు కష్టాల్లో ఉన్నారని, వారి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. శనగలు రెండేళ్లుగా కోల్డ్ స్టోరేజీల్లో మగ్గుతున్నాయని, వాటిపై తీసుకున్న రుణానికి గడువు ముగియడంతో బ్యాంకర్లు నోటీసులు ఇస్తున్నారని ఎంపీకి వివరించారు. ‘రెండు నెలల్లో అధికారంలోకి వస్తాం.
శనగ రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామ’ని చంద్రబాబు ఎన్నికలకు ముందు చెప్పారని, అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటినా శనగ రైతులను పట్టించుకోలేదని రైతు సంఘం నాయకులు ఎంపీ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీని కలిసిన వారిలో వైఎస్సార్ సీపీ రైతు విభాగం జిల్లా కన్వీనర్ మారెడ్డి సుబ్బారెడ్డి, రైతు సంఘం నేత దుగ్గినేని గోపీనాథ్ తదితరులు ఉన్నారు.
ఎన్జీఓ హోమ్‌ను త్వరలో సందర్శిస్తా..
ఎన్జీఓ నాయకులు సోమవారం ఎంపీ వైవీ సుబ్బారెడ్డిని ఆయన కార్యాలయంలో కలిసి వారి సమస్యలను వివరించారు. ఎన్జీఓ హోం నిర్మాణం రెండు అంతస్తుల శ్లాబ్ పూర్తి చేశామని, మిగిలిన నిర్మాణానికి అవసరమైన నిధులు ఇప్పించాలని ఎంపీని కోరారు. దీనిపై స్పందించిన ఎంపీ ఎన్జీఓ హోంను త్వరలోనే సందర్శించి తప్పకుండా నిధులు ఏర్పాటు చేస్తానని భరోసా ఇచ్చారు. వినతి పత్రం అందజేసిన వారిలో ఎన్జీఓ సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, కార్యదర్శి కె. శరత్‌బాబు, సహాధ్యక్షుడు స్వాములు, పట్టణ అధ్యక్షులు వలి, కృష్ణారెడ్డి, ఆర్గనైజింగ్‌సెక్రటరీ శివకుమార్ తదితరులు ఉన్నారు.