'రెగ్యులర్' చేస్తారా
♦ జింబాబ్వే సిరీస్‌తో ఒరిగిందేమిటి?
♦ అవకాశం అందుకోలేని ఉతప్ప, తివారీ రాయుడు, బిన్నీ సూపర్
జింబాబ్వే సిరీస్‌ను కూడా సీరియస్‌గా చూస్తున్నామని ఎవరు ఎన్ని మాటలు చెప్పినా... సీనియర్ల గైర్హాజరులో ద్వితీయ శ్రేణి ఆటగాళ్లకు అవకాశమిచ్చి వారిని పరీక్షించడమే పర్యటన ముఖ్య ఉద్దేశం అనేది స్పష్టం. అయితే ‘సీనియర్లు’ మాత్రమే ఈ పర్యటనను బాగా వినియోగించుకున్నారు. కొత్త వాళ్లంత దాదాపుగా నిరాశపరిచారు. జింబాబ్వేలో రాయుడు, బిన్నీల ప్రదర్శన తర్వాతైనా వీళ్లని ‘రెగ్యులర్’ తుది జట్టులో ఉంచుతారా..!
జింబాబ్వేతో వన్డే సిరీస్‌లో ఉన్న ఆటగాళ్లలో రెగ్యులర్ జట్టు సభ్యులను మినహాయిస్తే మనీశ్ పాండే ఒక్కడే పూర్తిగా కొత్త ఆటగాడు. మిగతా వారంతా అడపాదడపా జట్టులోకి వస్తూ పోతున్నవారే. హర్భజన్ సింగ్ లాంటి ఆటగాడికి ఈ ప్రదర్శనతో తేడా రాకపోవచ్చు కానీ...మిగతా వారు తమ సామర్థ్యాన్ని నిరూపించుకునేందుకు తగిన అవకాశమిది. జింబాబ్వేలాంటి జట్టుతో ప్రదర్శన నేరుగా ప్రధాన జట్టులోకి తీసుకెళ్తుందని చెప్పలేకపోయినా...బాగా ఆడితే తామూ రేసులో ఉన్నామనే సందేశాన్ని ఇస్తుంది.
ఆ ఇద్దరూ అదుర్స్
‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచిన తెలుగు కుర్రాడు అంబటి రాయుడు ప్రతిభ కు మరింత గుర్తింపు తెచ్చిన సిరీస్ ఇది. తొలి వన్డేలో అద్భుతమైన సెంచరీతో జట్టును గెలిపించిన రాయుడు, రెండో వన్డేలోనూ రాణించాడు. దురదృష్టవశా త్తూ మూడో మ్యాచ్ ఆడకపోయినా, ఇకపై జట్టులో రెగ్యులర్ ఆటగాడిగా అతనికి ఇది చోటును ఖాయం చేయవచ్చు. ముఖ్యంగా ప్రపంచకప్‌లో మొత్తం బెంచీకే పరిమితమైన అతను, తనకు దక్కిన అవకాశాలు మాత్రం బాగా ఉపయోగించుకోగలడని తేలింది. 31 వన్డేల తర్వాత 45కు పైగా బ్యాటింగ్ సగటు అతని ఆత్మవిశ్వాసాన్ని పెంచే విషయం. ఇక పర్యాటకుడిగానే చాలా సిరీస్‌లు పూర్తి చేసుకున్న స్టువర్ట్ బిన్నీ ఎట్టకేలకు తన ఆల్‌రౌండర్ పేరును నిలబెట్టే ప్రయత్నం చేశాడు.
120 పరుగులతో పాటు 6 వికెట్లు తీసి మెరుగైన ప్రదర్శన కనబర్చిన బిన్నీ జట్టులో రవీం ద్ర జడేజా స్థానానికి చెక్ పెట్టేందుకు చేరువయ్యాడు. బిన్నీ నిలకడ ఇలాగే కొనసాగితే భారత్‌కు అదనపు పేసర్ ప్రత్యామ్నాయం అందుబాటులో ఉంటుంది. మరో వైపు కోల్పోయిన తన ఫామ్‌ను, తన వేగాన్ని అందుకునేందుకు భువనేశ్వర్‌కు ఈ సిరీస్ ఉపయోగపడింది. ముఖ్యంగా రెండో వన్డేలో తొలి స్పెల్ (6-3-19-2) పాత భువీని గుర్తుకు తెచ్చింది. ఇతర బౌలర్లలో అక్షర్, మోహిత్ ఫర్వాలేదనే ప్రదర్శన ఇవ్వగా, ధావల్ విఫలమయ్యాడు. హర్భజన్ తన అనుభవంతో ప్రత్యర్థి బ్యాట్స్‌మన్ కట్టడి చేయగలిగినా ఈ 4 వికెట్లు అతని వన్డే భవిష్యత్తుకు భరోసా ఇవ్వలేవు.
మళ్లీ మళ్లీ విఫలం
భవిష్యత్తు కోసం జింబాబ్వే టూర్‌ను ఉపయోగించుకోవాల్సిన ఇద్దరు బ్యాట్స్‌మెన్ రాబిన్ ఉతప్ప, మనోజ్ తివారి దానిని పూర్తిగా వృథా చేసుకున్నారు. రెగ్యులర్ వికెట్ కీపర్ కాకపోయినా, ఐపీఎల్ అనుభవంతో కీపర్‌గా నిలదొక్కుకునే ప్రయత్నంలో ఉన్న ఉతప్ప 44 పరుగులే చేసి నిరాశపర్చాడు. ధోని లేని సమయంలో ఉతప్ప బ్యాటింగ్‌లో సత్తా చాటితే మరిన్ని అవకాశాలు దక్కేవి. ఇక సరిగ్గా సంవత్సరం తర్వాత టీమ్‌లోకి వచ్చిన మనోజ్ తివారి కేవలం 34 పరుగులు చేసి చాన్స్‌ను వృథా చేశాడు. ఎన్ని పునరాగమనాలు చేసినా టీమిండియాలో నిలదొక్కుకునే స్థాయి ఆట మాత్రం ఒక్కసారి కనబర్చలేదు. 30 ఏళ్లకు చేరువలో ఉన్న వీరిద్దరు ఇకపై మళ్లీ టీమిండియాలోకి రావడం అంత సులువు కాదు. కేదార్ జాదవ్ శతకం అతనిపై కొంత దృష్టి పడేలా చేయగా... ఫస్ట్‌క్లాస్‌లో అద్భుత రికార్డు ఉన్న మనీశ్ పాండే తన తొలి మ్యాచ్‌లో రాణించి ఆకట్టుకున్నాడు.
రహానే రాణించాడా..?
మరోవైపు తొలిసారి టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించిన రహానే నాయకత్వంలో చెప్పుకోదగ్గ అంశాలు ఏమీ లేవు. 3-0తో క్లీన్‌స్వీప్ చేసినా వ్యూహ, ప్రతివ్యూహాల అవసరం పెద్దగా కనిపించలేదు. పైగా ఓపెనర్‌గా అతను చేసిన ప్రయత్నం విఫలంగానే చెప్పవచ్చు. 72 స్ట్రైక్‌రేట్‌తో సాగిన అతని బ్యాటింగ్ అటు రోహిత్ (82), ధావన్ (90)లకు పోటీ ఇచ్చే అవకాశం లేదు. రెండో వన్డేలో హాఫ్ సెంచరీ చేసినా...తాను ఎదుర్కొన్న 83 బంతుల్లో 45 డాట్ బాల్స్ ఉండటం ధోని విమర్శకు న్యాయం చేసినట్లయింది! మొత్తంగా చూస్తే ఈ సిరీస్‌తో బ్యాటింగ్ పరంగా పెద్దగా టీమిండియాకు ప్రయోజనం కలిగించే సంచలనం ఏదీ నమోదు కాలేదు. అయితే మనీశ్ పాండే రూపంలో ఒక కొత్త ఆటగాడు వెలుగులోకి రాగా, బౌలింగ్‌లో మాత్రం ఎవరూ నిరూపించుకునే ప్రదర్శన ఇవ్వలేదు.
- సాక్షి క్రీడా విభాగం
శ్రీలంకతో టెస్టులకు భారత జట్టు ఎంపిక 23న
ముంబై: వచ్చే నెలలో శ్రీలంకతో టెస్టు సిరీస్‌లో తలపడే భారత క్రికెట్ జట్టును ఈ నెల 23న ప్రకటించనున్నారు. సందీప్ పాటిల్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఇందు కోసం ఢిల్లీలో సమావేశం కానుం ది. విరాట్ కోహ్లి కెప్టెన్‌గా పూర్తి స్థాయి జట్టు ఈ సిరీస్‌లో బరిలోకి దిగే అవకాశం ఉంది. శ్రీలంకతో సిరీస్‌లో భాగంగా భారత జట్టు మూడు టెస్టులు ఆడుతుంది. ఆగస్టు 12న తొలి టెస్టు గాలేలో ఆరంభమవుతుంది. టెస్టుల కోసం ఐదేళ్ల తర్వాత శ్రీలంకలో భారత్ పర్యటిస్తోంది.