Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today

Top Stories

ప్రధాన వార్తలు

Defence Minister Rajnath Singh Assurance On Pahalgam Attack Retaliation1
భారత్‌-పాక్‌ ఉద్రిక్తతల వేళ.. రాజ్‌నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ: పహల్గామ్ ఉగ్రదాడితో భారత్-పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పాక్‌తో యుద్ధం తప్పదని వార్తలు వస్తున్న వేళ.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రజలు ఏం కోరుకుంటున్నారో అది జరిగి కచ్చితంగా జరిగి తీరుతుందంటూ తేల్చి చెప్పారు. అందుకు తాను హామీ ఇస్తున్నానన్నారు. ఢిల్లీలో జరిగిన సంస్కృతి జాగరణ్‌ మహోత్సవ్‌ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశారాయన.‘‘మోదీ వర్కింగ్ స్టైల్, అంకితభావం గురించి అందరికీ తెలుసు. మన దేశంపై దాడి చేసిన వారికి తగిన బుద్ధి చెప్పడం నా బాధ్యత’’ అంటూ కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. భారత్‌ను దెబ్బతీయడానికి దుస్సాహసం చేసిన వారికి ధీటైన రీతిలో సమాధానం ఇస్తామంటూ వార్నింగ్‌ ఇచ్చారు. మరో వైపు, భారత్‌, పాకిస్తాన్‌ సరిహద్దుల్లో ఉద్రిక్తతల వేళ.. ప్రధాని మోదీ.. జాతీయ భద్రతా సలహాదారు, ఎయిర్‌చీఫ్‌ మార్షల్‌ ఏపీ సింగ్‌తో తాజాగా సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.ఇక, సరిహద్దుల్లో ఉద్రిక్తత కారణంగా ప్రధాని మోదీ.. వరస భేటీలు అవుతున్నారు. ఇప్పటికే త్రివిధ దళాల అధికారులతో భేటీ అయ్యారు. ఇదిలా ఉండగా.. భారత్‌, పాకిస్తాన్‌ మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతున్న వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ సైనిక దళాలకు ఆయుధాలను సరఫరా చేసే మ్యునిషన్స్‌ ఇండియా లిమిటెడ్‌కు చెందిన రెండు ఆయుధ కర్మాగారాల సిబ్బందికి సెలవులు రద్దు చేశారు. మహారాష్ట్రలోని చంద్రపుర్‌ జిల్లా కర్మాగారంతోపాటు మధ్యప్రదేశ్‌లోని జబల్‌పుర్‌ జిల్లా ఖమరియాలో ఉన్న ఆర్డినన్స్‌ ఫ్యాక్టరీ సిబ్బందికి శుక్రవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.

Telangana firefighting system works up to 18 floors but Buildings above 50 floors2
నిప్పుకు తెలుసు.. నీళ్లు రావని..

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ విశ్వనగరంలా మారుతోంది. సిటీ నలువైపులా శరవేగంగా విస్తరిస్తోంది. ఆకాశాన్నంటుతున్నాయా..అన్నట్టుగా బహుళ అంతస్తుల భవనాలు పెరిగిపోతున్నాయి. 50 అంతస్తులకు మించి కూడా భవన నిర్మాణాలు జరుగుతున్నాయి. నగర అభివృద్ధికి చిహ్నాలుగా నిలుస్తున్న ఈ ఆకాశ హర్మ్యాలు.. అంతర్జాతీయంగా హైదరాబాద్‌ ఖ్యాతిని మరింత పెంచుతున్నాయి. ఇదంతా బాగానే ఉంది. మరి ఈ బహుళ అంతస్తుల భవనాలు ఎంతవరకు భద్రం? ముఖ్యంగా ఏ కారణంతోనైనా, ఊహించని విధంగా ఏదైనా అగ్నిప్రమాదం జరిగితే పరిస్థితి ఏమిటి? ప్రమాదాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు తగిన వ్యవస్థ వాటిల్లో ఉంటోందా? మన అగ్నిమాపక శాఖ సామర్థ్యం ఎంతవరకు ఉంది? 40–50 అంతస్తుల వరకు కూడా మంటలను ఆర్పగలిగే, వాటిల్లో ఉండే వారిని రక్షించగలిగే అధునాతన అగ్నిమాపక పరికరాలు ఉన్నాయా? అనే ప్రశ్నలకు సమాధానాలు కొంత ఆందోళన కలిగించే విధంగానే ఉన్నాయి. ఇప్పుడున్న అరకొర రక్షణ వ్యవస్థలు, ఆయా భవనాల్లోని సొంత భద్రతా ఏర్పాట్లు, వాటి పర్యవేక్షణ పరిగణనలోకి తీసుకుంటే హైరైజ్‌ నివాస, వాణిజ్య సముదాయాలన్నీ ఒకింత డేంజర్‌లో ఉన్నట్టుగానే చెప్పాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్‌ విశ్వనగరంలా మారుతున్నా.. రాష్ట్ర అగ్నిమాపక శాఖ వద్ద కేవలం 18 అంతస్తుల వరకు మాత్రమే ఫైర్‌ ఫైటింగ్‌ వ్యవస్థ ఉన్న నేపథ్యంలో ఆపై అంతస్తుల్లో ప్రమాదం జరిగితే కష్టమేనని, ఆయా భవనాల్లో ఉన్న సొంత రక్షణ వ్యవస్థపైనే అంతా ఆధారపడి ఉంటుందని అంటున్నారు. బహుళ అంతస్తుల భవనాల్లో ప్రమాదాలను ఎదుర్కోవడానికి అగ్నిమాపక శాఖ సన్నద్ధత ఎంత?, భవనాల్లో ఎలాంటి రక్షణ వ్యవస్థ ఉండాలి? పర్యవేక్షణ మాటేమిటి? యాజమానుల బాధ్యతలేమిటి? తదితర అంశాలపై ‘సాక్షి’ప్రత్యేక కథనం. జీ ప్లస్‌ 5 దాటితే అనుమతి తప్పనిసరి హైదరాబాద్‌లో జీ ప్లస్‌ 5 అంతస్తులకు (నివాస సముదాయాలు) పైబడిన భవనాలన్నిటికీ అగ్నిమాపక శాఖ అనుమతి తప్పనిసరి. అదే వాణిజ్య, ఇతర భవనాలు జీ ప్లస్‌ 4 మించితే అగ్నిమాపక శాఖ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో నగరంలోని అన్ని హైరైజ్‌ భవనాలకూ అగ్నిమాపక శాఖే అనుమతులు ఇస్తోంది. భవనం డిజైన్, నిర్మాణం, తర్వాత ఆక్యుపెన్సీ తదితర అన్ని సందర్భాల్లో అన్నీ పరిశీలించాకే ఎన్‌ఓసీ (నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌) మంజూరు చేస్తున్నారు. ఒకసారి ఎన్‌ఓసీ వచి్చన తర్వాత యజమానులు ఐదేళ్లకు ఒకసారి దాన్ని రెన్యువల్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఆయా భవనాల్లో ఫైర్‌ సేఫ్టీ ప్రమాణాలు సరిగ్గా ఉన్నాయో లేదో పరిశీలించిన తర్వాతే అధికారులు రెన్యువల్‌ చేయాల్సి ఉంటుంది. అయితే అనుమతులు మంజూరు చేస్తున్న అధికారులు, ఆ తర్వాత పూర్తిస్థాయిలో పర్యవేక్షించడం లేదనే విమర్శలున్నాయి. అగ్నిమాపక శాఖలో దాదాపు 40 శాతం ఉద్యోగాలు ఖాళీగా ఉండడం ఈ పరిస్థితికి కారణమనే వాదన ఉంది. పత్రి నెలా 11వ తేదీన జిల్లా సహాయ అగ్నిమాపక అధికారి (ఏడీఎఫ్‌ఓ), 23న డీఎఫ్‌ఓలు భవనాలు ఆకస్మిక తనిఖీలు చేస్తుంటారు. సిబ్బంది కొరత నేపథ్యంలో భవనాల సంఖ్య మేరకు తనిఖీలు ఉండటం లేదనే విమర్శలు ఉన్నాయి. మన అగ్నిమాపక శాఖ సన్నద్ధత ఎలా ఉంది? తెలంగాణ మొత్తం కలిపి 147 ఫైర్‌ స్టేషన్లు ఉన్నాయి..జీహెచ్‌ఎంసీ పరిధిలో 34 ఫైర్‌ స్టేషన్లు, 3 అవుట్‌ పోస్ట్‌లు ఉన్నాయి. అగ్నిప్రమాదాల సమయంలో వెంటనే రంగంలోకి దిగేలా సుశిక్షితులైన అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉన్నారు. హైదరాబాద్‌లో 55 మీటర్ల ఎత్తు వరకు అంటే 18 అంతస్తుల వరకు వెళ్లగలిగే బ్రాంటో స్కై లిఫ్ట్‌లు రెండు ఉన్నాయి. వీటికి అదనంగా 133 వాటర్‌ టెండర్లు (ఫైర్‌ ఇంజిన్లు), 5 నీటి సరఫరా లారీలు, 56 మల్టీపర్పస్‌ టెండర్లు, 10 అడ్వాన్స్‌డ్‌ వాటర్‌ టెండర్లు, 17 వాటర్‌ బౌజర్లు సహా కీలక పరికరాలు ఉన్నాయి. ఇక 18 అంతస్తులకు మించిన భవనాల్లో అంతర్గతంగా ఉండే ఫైర్‌ పంపులు, నీళ్ల ట్యాంకులు, ఇతర వ్యవస్థలను ఉపయోగించుకుని అగ్నిమాపక సిబ్బంది ఫైర్‌ ఫైటింగ్‌ చేయాల్సి ఉంటుంది. బిల్డర్లు, నిర్వాహకుల బాధ్యతలేమిటి? – భవనం భద్రతను బిల్డింగ్‌ నిర్వాహకులు, యజమానులు విధిగా పర్యవేక్షించాలి. – సాధారణ సెక్యూరిటీ మాదిరిగా ప్రైవేటు ఫైర్‌ ఆఫీసర్లు, ఫైర్‌ గార్డులను నియమించుకోవాలి. – బిల్డర్లు ప్రతి ఆకాశ హర్మ్యంలో విధిగా ఓ రెస్క్యూ ప్లేస్‌ పెట్టాలి. ఆ భవనంలో అంతస్తులను బట్టి నాలుగు ఫ్లోర్లకు ఒక రెస్క్యూ ప్రాంతాన్ని ఏర్పాటు చేసుకోవాలి. – ప్రత్యేకంగా ఫైర్‌ లిఫ్ట్‌ ఉండాలి. అగ్నిప్రమాదాల సమయంలో ఫైర్‌ సిబ్బంది మాత్రమే దీన్ని వాడతారు. దీనికి పవర్‌ సప్లై ప్రత్యేకంగా ఉండాలి. – నిర్వాహకులకు ఎమర్జెన్సీ ప్లాన్‌ తప్పనిసరిగా ఉండాలి. అగ్నిప్రమాదం జరిగితే ఎవరు ఎలా స్పందించాలనే ప్రణాళిక ఉండాలి. – భవనాల్లో నివాసం ఉండేవారికి, పనిచేసే సిబ్బందికి అగ్నిప్రమాదాల సమయంలో ఎలా స్పందించాలనే దానిపై తరచూ శిక్షణ ఇవ్వాలి. – ఫైర్‌ అలారమ్‌లు, స్మోక్‌ డిటెక్టర్లు, వాటర్‌ స్ప్రింక్లర్లు సరిగా పనిచేస్తున్నాయా..లేదా చూసుకోవాలి. – అయితే చాలా భవనాల్లో.. నిర్మాణం, ఆక్యుపెన్సీ సమయంలో ఉండే ఫైర్‌ ఫైటింగ్‌ పరికరాలు...కొన్నాళ్ల తర్వాత పనిచేసే స్థితిలో ఉండడం లేదన్న విమర్శలు ఉండటం గమనార్హం. ఢిల్లీ, మహారాష్ట్రల్లో మెరుగ్గా.. ఫైర్‌ సేఫ్టీ అంశంలో మన దేశంలో ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి. అక్కడ ఫైర్‌ సేఫ్టీకి సంబంధించిన చట్టాల అమలు పక్కాగా ఉండడంతో పాటు అగ్ని ప్రమాదాల నియంత్రణ మెరుగ్గా ఉంది. ఢిల్లీలో 110 మీటర్ల స్కైలిఫ్ట్‌లు నాలుగు అందుబాటులో ఉన్నాయి. పైర్‌ ఫైటింగ్‌ పరికరాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో నిబంధనల అమలులో మహారాష్ట్ర ముందంజలో ఉంది. ఢిల్లీ, ముంబై నగరాల్లో 50 అంతస్తుల వరకు చేరుకునే ఫైర్‌ ఫైటింగ్‌ వ్యవస్థ ఉన్నట్లు సమాచారం. విదేశాల్లో పటిష్ట వ్యవస్థలు సింగపూర్, దుబాయ్, అమెరికా, ఆ్రస్టేలియా, జర్మనీ, జపాన్, కెనడా, లండన్‌ దేశాల్లో ప్రపంచంలోనే అత్యంత పక్కాగా అగ్నిమాపక వ్యవస్థ ఉంది. ఈ దేశాల్లో ఫైర్‌ స్టేషన్లు అన్ని ప్రాంతాలకు సమీపంలో అందుబాటులో ఉంటాయి. ఫైర్‌ ఫైటింగ్‌లోనూ ఆయా దేశాల సిబ్బంది ముందుంటున్నారు. పౌరులందరికీ అగ్ని ప్రమాదాల సమయంలో ఎలా వ్యవహరించాలో పూర్తి అవగాహన కలి్పస్తారు. ఏదైనా భవనం వినియోగంలోకి వచి్చన తర్వాత కూడా అగ్నిమాపక శాఖ కీలక పాత్ర పోషిస్తుంటుంది. తరచూ తనిఖీలు, ఫైర్‌ మాక్‌ డ్రిల్స్‌ పక్కాగా కొనసాగుతుంటాయి. ఫైర్‌ ఫైటింగ్‌ ఆఫీసర్లను నియమించుకోవాలి కార్యాలయాలు, ఆసుపత్రులు ఇలా ప్రతి బహుళ అంతస్తుల భవనాల్లోనూ అగ్నిప్రమాదాల సమయంలో వెంటనే స్పందించేలా, ఫైర్‌ ఫైటింగ్‌కు సంబంధించిన పరికరాల మెయింటెనెన్స్‌ కోసం ప్రత్యేకంగా ఫైర్‌ సేఫ్టీ ఆఫీసర్లను పెట్టుకోవాలి. వీరందరికీ అగ్నిమాపక శాఖ ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. ఈ వ్యవస్థ ప్రమాదం జరిగిన మొదటి రెండు గంటలపాటు ఫైర్‌ ఫైటింగ్‌కు ఉపయోగపడుతుంది. ప్రాణ నష్టం నివారించలన్నదే దీని ముఖ్య ఉద్దేశం. ఆ తర్వాత అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలు పూర్తిస్థాయిలో ఆర్పే పనితో, ప్రజా రక్షణ చర్యలు చేపడతారు. రాష్ట్రంలో ఉన్న అగ్నిమాపక వాహనాలు, పరికరాలు ఎలాంటి పరిస్థితి అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయి. – వై.నాగిరెడ్డి, డీజీ, అగ్నిమాపక శాఖ తరచూ తనిఖీలు ఎంతో అవసరం బహుళ అంతస్తుల భవనాలకు డిజైన్‌ చేయడంలో ఫైర్‌ సేఫ్టీ అంశం కూడా అత్యంత కీలకమైనది. డిజైన్‌లో ఉన్నట్టుగా నిర్మాణం జరిగిందా లేదా? ఫైర్‌ సేఫ్టీ నిబంధనల ప్రకారం అన్నీ సక్రమంగా ఉన్నాయా? అన్నది ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ ఇచ్చే సమయంలో అధికారులు తనిఖీ చేయాలి. ఆ తర్వాత కూడా తరచూ తనిఖీలు నిర్వహించాలి. నివాస సముదాయాల్లో కంటే హైరైజ్‌ కమర్షియల్‌ బిల్డింగ్స్‌లో అగ్ని ప్రమాదాల రిస్క్‌ ఎంతో ఎక్కువ. ప్రమాదం జరిగితే నష్టం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాణిజ్య భవనాల విషయంలో అదనపు జాగ్రత్తలు మరింత అవసరం. – భిక్షపతి, మాజీ డైరెక్టర్‌ జనరల్, నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ మెయింటినెన్స్‌ పట్టించుకోక పోతే కష్టమే.. మన దగ్గర వేగంగా అభివృద్ధి జరగడం, ఆ మేరకు బహుళ అంతస్తులు వస్తుండటం ఎంతో సంతోషించదగ్గ విషయం. బిల్డింగ్‌ డిజైన్లలో, నిర్మాణంలో.. ఫైర్‌సేఫ్టీ నిబంధనలు పాటిస్తున్నాం. కానీ ఒకసారి నిర్మాణం పూర్తయిన తర్వాత ఫైర్‌సేఫ్టీని పట్టించుకోవడం లేదు. ఫైర్‌ ఫైటింగ్‌ పరికరాల మెయింటినెన్స్‌పై అటు ప్రభుత్వ విభాగాలు కానీ, ఇటు భవన యజమానులు కానీ అస్సలు పట్టించుకోవడం లేదు. కాబట్టి మన హైరైజ్‌ భవనాలు డేంజర్‌లో ఉన్నట్టే. ఫైర్‌ వ్యవస్థను పటిష్టం చేసేందుకు అవసరమైతే ఫైర్‌ సేఫ్టీకి సంబంధించి డెవలపర్స్‌ నుంచి ఫీజులు వసూలు చేసినా ఫర్వాలేదు కానీ అవసరమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఆధునీకరించాలి. ప్రతి ఆరు నెలలకు ఫైర్‌ ఫైటింగ్‌ పరకరాలు తనిఖీ చేసే వ్యవస్థ ఉండాలి. రెసిడెంట్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్లకు, భవనాల యజమానులకు బాధ్యత అప్పగించి ప్రభుత్వ విభాగాలు తప్పుకోవడం సరికాదు. – సీఏ ప్రసాద్, ప్రెసిడెంట్, ప్రీ ఇంజినీర్డ్‌ స్ట్రక్చర్స్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా హైరైజ్‌ బిల్డింగుల్లో ఉండాల్సినవేమిటి? ⇒ నేషనల్‌ బిల్డింగ్‌ కోడ్‌ (ఎన్‌బీసీ) ప్రకారం.. ఎత్తైన భవనాల్లో స్మోక్‌ డిటెక్టర్లు, వాటర్‌ స్ప్రింక్లర్లు, ఫస్ట్‌ ఎయిడ్‌ ఫైర్‌ ఫైటింగ్‌ సిస్టమ్‌ (తక్షణ రక్షణ వ్యవస్థ), తగిన నీటి సరఫరా సౌకర్యం, ఫైర్‌ పంపులు, ఫైర్‌ ఎస్కేప్‌ మార్గాలు, ఫైర్‌మెన్‌ లిఫ్ట్, సర్వీస్‌ షాఫ్ట్‌ ఎన్‌క్లోజర్‌లు, ప్రత్యేక విద్యుత్‌ వ్యవస్థ తప్పక ఉండాలి. నివాస సముదాయాలైనా, ఇతర భవనాలైనా ఇవన్నీ తప్పనిసరి. ఇలా అన్ని దశల్లోనూ అగ్నిమాపక వ్యవస్థ సరిగా ఉందా? లేదా? అన్నది అత్యంత కీలకం. వ్యవస్థ ఇలా పనిచేయాలి ⇒ భవనం ఎత్తు ఆధారంగా పెద్ద పెద్ద ఎలక్ట్రిక్‌ పంపులు, నీటిని చల్లేలా పూర్తి వ్యవస్థ ఉండాలి. ప్రమాదం జరిగిన వెంటనే ఈ ఎలక్ట్రిక్‌ పంపులు పనిచేయడం ప్రారంభం కావాలి. ⇒ ఒకవేళ విద్యుత్‌ సరఫరా నిలిచిపోతే ప్రత్యామ్నాయంగా జనరేటర్ల వ్యవస్థ కూడా ఉండాలి. ఇదీ పని చేయకపోతే డీజిల్‌ పంపు కూడా అందుబాటులో ఉండాలి. ఇవన్నీ కూడా కనీసం రెండు గంటల పాటు మంటలను నిలువరించి, నివాసితులు సురక్షితంగా బయటపడేందుకు వీలుగా ఉండాలి.

Netanyahu's Multiple Strike Warning After Houthi Attack3
‘మీరు ఒక్క క్షిపణి దాడి చేశారు.. ఇక మేమేంటో చూపిస్తాం’

టెల్ అవీవ్: తమ దేశంపై హౌతీ రెబల్స్ చేసిన క్షిపణ దాడికి అంతకుమించి ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతాన్యాహూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇక తాము ఏంటో చూపిస్తామంటూ హౌతీ తిరుగుబాటుదారులను ఉద్దేశించి ‘ఎక్స్’ వేదికగా హెచ్చరించారు. ‘ మీరు ఒక క్షిపణి దాడిని మాపై ప్రయోగించారు. దానికి ప్రతీకారం ఎలా ఉంటుందో ఇక నుంచి చూస్తారు. మీరు చేసిన దాడుల కంటే ఏడు రెట్లు అధికంగా మా దాడి ఉంటుంది. గాజాలో ఉన్న పాలస్తీయుల పట్ల సానుభూతి నాటకంతో డ్రామాలు చేస్తున్నారు. మేము గతంలో మీపై యుద్ధం చేశాం. భవిష్యత్ లో కూడా చేస్తూనే ఉంటాం. మీలాగ ఒక్క దాడి కాదు. క్షిపణుల వర్షం కురిపిస్తాం. యూఎస్ తో సమన్వయం చేసకుంటూ ముందుకెళ్తాం. మేము, యూఎస్ కలిసి మిమ్మల్ని అంతమొందిస్తాం’ అని మాట్లాడిన వీడియో ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు ఇజ్రాయిల్ ప్రధాని.צפו בעדכון חשוב ממני אליכם >> pic.twitter.com/hLLodqVnPz— Benjamin Netanyahu - בנימין נתניהו (@netanyahu) May 4, 2025 కాగా, హౌతీ తిరుగుబాటు దారుటు ఇజ్రాయిల్‌పై బాలిస్టిక్ మిస్సైల్‌తో విరుచుకుపడ్డారు. ఆదివారం. ఇజ్రాయిల్‌లో అతిపెద్ద విమానాశ్రయమైన టెల్ అవీవ్‌లోని బెన్ గురియన్ ఎయిర్‌పోర్ట్‌పైకి క్షిపణితో ఎటాక్‌ చేశారు. దీంతో ఒక్కసారిగా ఇజ్రాయిల్‌ ప్రజల్లో భయాందోళనలకు గురయ్యారు. ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ 3 నుంచి కేవలం 75 మీటర్ల దూరంలోనే క్షిపణి పడింది. మిస్సైల్‌ ధాటికి 25 మీటర్ల లోతైన భారీ గొయ్యి ఏర్పడింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇజ్రాయిల్‌కి ఉన్న శక్తివంతమైన నాలుగు అంచెల ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను దాటుకుని క్షిపణి దాడి జరగడం సంచలనం కలిగిస్తోంది. క్షిపణి విమానాశ్రయం సమీపంలో పడకుండా అడ్డగించిన అనేక ప్రయత్నాలు విఫలమయ్యాయని ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) తెలిపింది. ఒక్కసారిగా మిస్సైల్ దాడి జరగడంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. ఈ దాడిలో 8 మంది గాయపడినట్లు ఇజ్రాయిల్ అధికారులు వెల్లడించారు.

Sakshi Editorial On War and peace4
ఉమ్మడి చితిపేర్పు

‘యుద్ధం’ రెండక్షరాల మాటే, ‘శాంతి’ కూడా అంతే! విచిత్రంగా, చావుబతుకులు రెంటినీ ఇముడ్చుకున్నవి కూడా ఆ రెండే; జీవన ప్రవాహానికి రెండు వైపులా కాపుకాసే తీరాలూ, మనిషిని ఇరువైపులా మోహరించిన భిన్న ధ్రువాలూ అవే; వాటి మధ్యనే మానవ సంచారం. లియో తొలు స్తాయ్‌ ‘వార్‌ అండ్‌ పీస్‌’ పేరుతో, నిర్దిష్ట స్థలకాలాల నేపథ్యంతో రచించిన ఐతిహాసిక నవలలో మార్చి మార్చి జరిగే ఆ సంచారాన్ని అత్యద్భుతంగా, ఆర్ద్రంగా కళ్ళకు కట్టిస్తాడు. యుద్ధమూ, శాంతీ మనిషితోనే పుట్టి ఉంటాయి. బహుశా మనిషి తొలి యుద్ధం సాటిమనిషితో కాదు, ప్రకృతి శక్తులతో! అది బతకడానికి మొదలైన యుద్ధం; మనుషులొకరి నొకరు చంపుకునే యుద్ధం ఆ తర్వాత వచ్చింది; నాగరికత ముదిరినకొద్దీ అది మహాయుద్ధాల స్థాయికి చేరింది.శాంతి అన్నది యుద్ధమనే రెండు క్రూర సింహాల మధ్య ఇరుక్కున్న బెదురుచూపుల లేడికూనా, మండు టెడారిలో అక్కడక్కడ మరులుగొలిపే శీతలజలచ్ఛాయా అయింది. మనిషి ఒంటిగా ఉన్నప్పుడు బతకనిచ్చే, బతుకునిచ్చే శాంతినే కోరుకుంటాడు; పదిమందిలో ఒకడైనప్పుడే యుద్ధపిపాసి అవుతాడు. ఈ చంచలత్వం మనిషి స్వభావంలోనే ఉంది. తన శాంతి యుత అస్తిత్వానికే చేటు వచ్చినప్పుడు చావో, రేవో తేల్చుకోవాలనుకోవడం సహేతుకమే; కానీ ఏదో ఒక విస్తరణ దాహంతో రక్తపుటేరులు పారించడంలోనే ఎక్కువ చరిత్ర మూటగట్టుకున్నాడు. తన లక్షల సంవత్సరాల మనుగడలో శాంతియుత సహజీవనంపై ఇంతవరకు ఏకీభావానికి రాలేక పోయాడు. అతని అనేకానేక విజయాలను నిలువునా వెక్కిరించే మహా వైఫల్యం అదే. ప్రకృతి ప్రణాళికలో లేని బలవంతపు చావును కొని తెచ్చుకునే వికటించిన తెలివి మనిషిది. ప్రపంచ సాహిత్యంలోని అనేక శిఖరాయమాన రచనల్లో యుద్ధమే ఇతివృత్తం. దేశ కాలాలు, భాషా సంస్కృతులు వేరైనా అవి ఒక్కలానే యుద్ధభాష మాట్లాడాయి, యుద్ధ సంస్కృతిని చిత్రించాయి; యుద్ధం తెచ్చిపెట్టే అపార విధ్వంసంపై, సృష్టించే దుఃఖసముద్రాలపై ఒక్క గుండెతోనే స్పందించాయి. యుద్ధాలను గర్హించే పాత్రలకూ, ఆకాశానికెత్తే పాత్రలకూ కూడా ఒకే గౌరవాన్ని కట్టబెట్టాయి. యుద్ధాలు తగవంటూనే పోరాడి ప్రాణాలు బలిపెట్టిన వీరులకు హారతి పట్టాయి. మహాభారతాన్నే తీసుకుంటే, యుద్ధం వద్దన్నవారు కూడా యుద్ధంలోకి దిగిపోయినప్పుడు, విదురుడొక్కడే ఒంటరిగా ఒడ్డున మిగిలిపోతాడు. అంతవరకు కురుపాండవులుభయుల శ్రేయస్సునూ కోరుకున్న భీష్మ పితామహుడు యుద్ధంలో పాండవ పక్షాన్ని నిర్దాక్షిణ్యంగా నరికి పోగులుపెడతాడు. చస్తే యుద్ధంలోనే చావాలి, ఇంట్లో రోగమొచ్చి చావడం కన్నా పాపమేదీ ఉండదని ఉద్బోధిస్తాడు. అర్జునుడు తనను చంపుతానని ప్రతిజ్ఞ చేసినప్పుడు ప్రాణభయంతో వచ్చి తనను కలిసిన సైంధ వునితో ఆచార్య ద్రోణుడూ అదే అంటాడు; ‘మృత్యువుకెందుకు భయపడుతున్నావు, వెళ్ళి యుద్ధం చేయి, ఎవరూ భూమ్మీద శాశ్వతం కాదు, అందరూ పోయేవాళ్ళే’ నంటాడు. ‘వార్‌ అండ్‌ పీస్‌’లో మరియా దిమిత్రెవ్నా అనే పాత్ర, తన కొడుకులు నలుగురు సైన్యంలో ఉన్నారనీ, అయినా తనకు చింత లేదనీ, చావనేది ఇంట్లో పడుకుని ఉన్నా వస్తుందనీ సగర్వంగా అంటుంది. యుద్ధానికి ఎందుకు సిద్ధమవుతున్నావని పియర్‌ అనే పాత్ర తన మిత్రుడు ప్రిన్స్‌ ఆంద్రైని అడిగినప్పుడు, ‘ఏమో, ఎందుకో నాకే తెలియదు, ఇప్పుడు జీవిస్తున్న జీవితం నాకు నచ్చడంలే’దని అతనంటాడు. హోమర్‌ కృతి ‘ఇలియడ్‌’లో ట్రాయ్‌ రాకుమారుడు హెక్టర్, అర్జునుడిలానే యుద్ధాన్ని ద్వేషిస్తాడు, తన భార్య శత్రువుకి బానిసగా చిక్కి ఊడిగం చేసే దృశ్యాన్ని ఊహించుకుని కుంగిపోతాడు, అయినా సరే యుద్ధం చేసి అఖిలీస్‌ చేతిలో మరణిస్తాడు. అఖిలీస్‌ చంపడంలోనే వెర్రి ఆనందాన్ని అనుభ విస్తాడు, అదే ఉత్తమోత్తమ పుణ్యకార్యమనుకుంటాడు, ఆ రోజుకి యుద్ధమైపోయాక మళ్ళీ మనిషై పోతాడు. తను రథానికి కట్టి ఈడ్చుకొచ్చిన హెక్టర్‌ మృతదేహాన్ని యాచించడానికి అతని తండ్రి ప్రియామ్‌ వచ్చినప్పుడు, అతణ్ణి సగౌరవంగా ఆహ్వానించి శవాన్ని అప్పగించి పంపిస్తాడు. యుద్ధవ్యతిరేకతా, యుద్ధప్రియత్వాల మధ్య; మానుష, అమానుషత్వాల మధ్య మనిషి ఊగిస లాట ఆశ్చర్యం గొలుపుతుంది; క్షతగాత్రుడై పడున్న శత్రువీరుడు ఆంద్రైని చూసి నెపోలియన్‌ గుండె కరుగుతుంది. తన చేతిలో మరణించిన వాలిపై పడి తారా, రావణునిపై పడి మండోదరీ హృదయ విదారకంగా రోదిస్తున్నప్పుడు రాముడు మ్రాన్పడి ఉండిపోతాడు. ఏ యుద్ధంలోనైనా విజేతలు, పరాజితులన్న తేడా కేవలం సాంకేతికమే; అంతిమ విజయం మృత్యు, విధ్వంసాలదే! విజేత పక్షానికి చెందిన గర్భవతి ఉత్తర, భర్త అభిమన్యుని మరణానికి కన్నీరుమున్నీరవుతుంది. ఉప పాండవులను పోగొట్టుకున్న ద్రౌపది కడుపుకోతా, నూరుగురు కొడుకులను కోల్పోయిన గాంధారి గర్భశోకమూ ఒక్కటే అవుతాయి. నివాసాలు శ్మశానాలవుతాయి, ఊళ్ళు కాలిబూడిదవుతాయి,కొంపలు కొల్లేరవుతాయి, ఖజానాలు ఖాళీ అవుతాయి, శవాల గుట్టల మధ్య బతికున్నవాళ్లు జీవచ్ఛ వాలవుతారు. గాంధారి శోకం శాపమై యదువంశాన్ని పట్టి కుదుపుతుంది, యుద్ధం ఇంకో యుద్ధానికే బీజావాపమవుతుంది, విధ్వంసం మరో విధ్వంసానికే దారి తీయిస్తుంది. శాంతి, రెండు యుద్ధాల మధ్య విరామ చిహ్నమవుతుంది. ఎంతో ఎదిగామనుకునే ఈ రోజున కూడా యుద్ధానికీ, శాంతికీ మధ్య ద్వైదీభావాన్ని మనిషి జయించలేకపోతున్నాడు; ఉండి ఉండి యుద్ధోన్మాది అవుతూనే ఉన్నాడు, భేరీలు మోగిస్తున్నాడు, నినాదాలు ఎలుగెత్తుతున్నాడు! ఇందుకు ఏ ఒక్కరో బాధ్యులు కారు, ఇది సమష్టి వైఫల్యం, ఉమ్మడి చితిపేర్పు.

Sakshi Guest Column On Caste census by Central government decision5
కులగణన... చరిత్రాత్మక నిర్ణయం

జనాభా లెక్కలతో పాటు కులగణన చేపట్టాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం చాలామందిని ఆశ్చర్యపరిచింది. కులగణన నిర్వహించా లన్న ప్రతిపక్షాల డిమాండ్‌కు కేంద్రం తలొ గ్గిందని కూడా కొందరు సామాజిక రాజకీయ వేత్తలు భావిస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ అగ్ర నేత రాహుల్‌ గాంధీ ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. ఏమైనా కులగణన ప్రకటన చరిత్రాత్మక రాజకీయ ప్రకటన అని భావించవచ్చు. అంబేడ్కర్, రామ్‌ మనోహర్‌ లోహియా భారతదేశంలో కుల గణన జరగాలని ఎంతో పోరాడారు. నిజానికి బీసీల కులగణన లేక పోవటం వల్ల బహుజనుల సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక రంగాల్లో న్యాయం జరగలేదు. ఓబీసీల జీవన వ్యవస్థ ఆర్థిక సరళీకరణ, ప్రపంచీకరణ, పాశ్చాత్యీకరణ వలన విధ్వంసం అవుతూ... వారు జీవించే హక్కులు మృగ్యమవుతున్న తరుణంలో ఈ ప్రకటన రావడం ముదావహం.మారిన పార్టీల అవగాహనఈ ప్రకటన తర్వాత దేశంలోని రాజకీయ, సామాజిక విశ్లేషకు లకు అనేక ప్రశ్నలు ముందుకొచ్చాయి. ఆర్‌ఎస్‌ఎస్, విశ్వహిందూ పరిషత్‌ కులగణన ప్రస్తావన వచ్చినప్పుడల్లా వ్యతిరేకించాయి. ఇప్పుడు వాళ్లు మనస్ఫూర్తిగా అంగీకరిస్తారా లేదా అనేది చూడాలి. బిహార్, బెంగాల్, తమిళనాడుల్లో జరగబోయే ఎన్నికల కోసం ఈ ప్రకటన జరిగిందా అనే మరో ప్రశ్న అందరి ముందుకు వచ్చింది. సాక్షాత్తూ పార్లమెంటులోనే బీజేపీ ఎంపీలు కులగణనను వ్యతిరేకిస్తూ మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. భారతదేశ పాలకవర్గం... బ్రాహ్మణ, బనియా, భూస్వామ్య కూటమిగా ఉందనేది స్పష్టం. ఈ విషయాన్ని అనేక సందర్భాల్లో అంబేడ్కర్, లోహియా, పెరియార్‌ రామస్వామి చెబుతూనే వచ్చారు. ‘లండన్‌ హౌజ్‌ ఆఫ్‌ కామన్స్‌’లో అంబేడ్కర్‌ శత జయంతి సందర్భంగా... భారత మాజీ ప్రధానమంత్రి వీపీ సింగ్‌ నాతో మాట్లా డుతూ బీసీల రాజకీయ, సామాజిక సంస్కరణల విషయంలో జవహర్‌లాల్‌ నెహ్రూ, ఇందిరాగాంధీ వ్యతిరేకంగా వ్యవహరించార ని అన్నారు. మండల్‌ కమిషన్‌ రిపోర్టును ఇందిరాగాంధీ అమలు జరపలేదు. దీనికోసం వీపీ సింగ్‌ చొరవ చూపారనేది సత్యం. ఈ విషయాలను వీపీ సింగ్, శరద్‌ యాదవ్, రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ అనేక సందర్భాల్లో, ముఖ్యంగా చుండూరు పోరాటం సందర్భంలో నాతో చర్చించడం జరిగింది. బీజేపీ అధికారంలోకి రాక ముందున్న తన ప్రవర్తనను కాంగ్రెస్‌... బీజేపీ అధికారంలోకి వచ్చాక మార్చుకున్నట్లు అర్థమవుతోంది. నెహ్రూ, ఇందిరాగాంధీ కంటే కూడా సామాజిక, రాజకీయ విషయాల్లోనూ; దళిత బహుజన దృక్పథంలోనూ రాహుల్‌ గాంధీ అవగాహన భిన్నంగా ఉంది. ఆయనపై సబాల్ట్రన్‌ స్టడీస్‌ ప్రభావం కనిపిస్తుంది. తమిళనాడు ప్రభుత్వం రిజర్వేషన్ల విషయంలో ఒక అడుగు ముందుకు వేసి 50 శాతానికి పైగా రిజర్వేషన్లు అమలు చేసేందుకు పూనుకున్నప్పుడు, వీపీ సింగ్‌ ప్రభుత్వ మండల్‌ నివేదికలను అమలు జరపడానికి పూనుకున్నప్పుడు రిజర్వే షన్లకు వ్యతిరేకంగా పోరాటం నడిపినవారు ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ వారేనన్నది స్పష్టమే. కుల నిర్మాణ చట్రంఒక రాజకీయ పథకంపై ఓ తీర్పు ఇవ్వడానికి ముందు దానికి సంబంధించిన ప్రాథమిక ప్రణాళికను పరిశీలించడం తప్పనిసరి. ‘ప్రాథమిక ప్రణాళిక’ అంటే ఏ సమాజానికైతే రాజకీయ పథకాన్ని వర్తింపజేయాలని అనుకుంటున్నారో, ఆ సమాజపు నిర్మాణమే ప్రాథ మిక ప్రణాళిక అని చెప్పవచ్చు. సామాజిక నిర్మాణంపై రాజకీయ నిర్మాణం ఆధారపడి ఉందని చెప్పడానికి ఎటువంటి సమర్థనా అవసరం లేదు. వాస్తవానికి రాజకీయ నిర్మాణంపై సామాజిక నిర్మాణం ఎక్కువ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. రాజకీయ నిర్మాణం పని చేసే తీరును అది మార్చవచ్చు, నిరర్థకం చేయవచ్చు లేదా అపహాస్యం పాలు కూడా చేయవచ్చు. భారతదేశ విషయంలో సామాజిక నిర్మాణం అనేది కుల వ్యవస్థపై నిర్మితమై ఉంది. కుల స్వభావం గురించి ఎవరికీ వివరించాల్సిన అవసరం లేదు. కానీ కులవ్యవస్థకు ఉన్న కొన్ని ప్రత్యేక లక్షణాలను గుర్తించి తీరాలి. కులాలు ఎలా పంపిణీ అయ్యాయి అంటే... ప్రతి ప్రాంతంలోనూ ఒక ప్రధాన కులమూ, కొన్ని చిన్న కులాలూ ఉన్నాయి. జనాభా రీత్యా ప్రధాన కులంతో పోల్చినప్పుడు చిన్నవి కావడం వల్లనూ, గ్రామంలో ఉన్న భూమిలో ఎక్కువ భాగం సొంతం చేసుకున్నటువంటి ప్రధాన కులంపై ఆర్థికంగా ఆధారపడి ఉండటం వల్లనూ... ఈ చిన్న కులాలు ప్రధాన కులానికి లోబడి ఉండేవిగా ఉన్నాయి. కేవలం అసమానతే కులవ్యవస్థ ప్రత్యేకత కాదు. క్రమబద్ధంగా శ్రేణీకరించిన అసమానతతో అది ప్రభావితమై ఉంది. కులాలు ఒకదానిపై మరొకటి ఉంటాయి. అదొక రకమైన ఆరోహణా క్రమపు ద్వేషమూ, అవరోహణా క్రమపు ఏవగింపూ కలిగి ఉన్నాయి. కులమనేది సామాజిక, సాంస్కృతిక, తాత్త్విక జీవన వ్యవస్థల నుండి ఆ యా కాలాలలో పరిణామం చెందుతూ వచ్చి కుల నిర్మూలనా దశకు చేరుకుంటుందని అంబేడ్కర్‌ భావించారు. అందుకే ఆయన కులనిర్మూలనా ప్రణాళికను రూపొందించారు. కులనిర్మూలనా సంస్కృతి కార్యక్రమ ప్రతిపాదనలు చేశారు. ఈ నేపథ్యంలో దేశంలో కుల గణనే కాక, కుల ఆర్థిక గణన కూడా చేయగలిగితే... భారతదేశ సామాజిక, ఆర్థికపరమైన నిజ స్వరూపం బయటకు వస్తుంది. అప్పుడే ఏ కులానికి ఎంత సంపద ఉందన్నది బయటకు వస్తుంది. మొత్తం మీద నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వలన భారతదేశంలో తప్పక గుణాత్మకమైన మార్పు వస్తుందనీ; బీసీలు, దళితులలో... ఆర్థిక, సామాజిక, రాజకీయ చైతన్యం పెరుగుతుందనీ ఆశించాల్సిన చారి త్రక సందర్భం ఇది. సానుకూల దృక్పథమే భారతదేశ భవితవ్యానికీ, దళిత బహుజన రాజకీయ విప్లవానికీ దోహదం చేస్తుందన్నది వాస్తవం.డా‘‘ కత్తి పద్మారావువ్యాసకర్త దళితోద్యమ నాయకులు ‘ 98497 41695

Sakshi Guest Column On Pope Francis6
మానవీయ మతగురువు

నేను ఒకసారైనా పోప్‌ ఫ్రాన్సిస్‌ని కలిసి ఉండాల్సింది. ఆయన విషయంలో తప్ప, ఇతర ప్రముఖుల గురించి ఎప్పుడూ ఇలా అనుకోలేదు. పోప్‌ ముఖంలో ఎప్పుడూ కరుణ, ఆప్యాయత, ఆనందం ఉట్టిపడుతూ ఉండేవి. ఆయన నవ్వుతూ ఉండేవారు. నవ్విన ప్రతిసారీ ఆ కళ్లు వెలుగులు ప్రసరించేవి. అది పెదవుల మీద చిందే మామూలు మందహాసం కాదు. గుండె లోతుల్లోంచి వచ్చినట్లుంటుంది. సహజమైనది. చిన్నారుల పట్ల ఆయన ఎంతో వాత్సల్యం ప్రదర్శించేవారు. అందులోనూ నిజాయతీ కనిపించేది. పోప్‌ మరణం తర్వాత నేను ఆయన గురించి తెలియని ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. వాటితోనే నాకాయన ఎంతో ప్రేమాస్పదుడు అయ్యారు.క్యాథలిక్‌ చరిత్రలో పరమ పూజ్యుడిగా గుర్తింపు పొందిన సెయింట్‌ ఫ్రాన్సిస్‌ పేరును పోప్‌ తన ‘పాపల్‌ నేమ్‌’గా స్వీకరించారు. ఆ ఇటాలియన్‌ మార్మికుడి మాదిరిగానే పోప్‌ అతి నిరాడంబరంగా జీవించారు. పోప్‌ అధికారిక నివాసమైన వ్యాటికన్‌ ప్యాలెస్‌ను (దీన్నే గ్రాండ్‌ పాపల్‌ హోమ్‌ అంటారు) కాదని అక్కడి అతిథి గృహంలోని ఓ చిన్న రెండు గదుల అపార్టుమెంటులో ఉన్నారు. ఆయన ఎంత సాదాసీదాగా ఉండేవారంటే, తను వేసుకునే బ్రౌన్‌ కలర్‌ షూస్‌ బాగా నలిగిపోయి ఉండేవి. గార్డులతో కలిసి బ్రేక్‌ఫాస్ట్‌ చేయడం ఆయనకు పరిపాటి. కార్మికులు తినే క్యాంటిన్‌లోనే తరచూ భోజనం చేసేవారు. ప్రీస్ట్‌ కావటానికి ముందు బ్యూనస్‌ ఎయిర్స్‌ (అర్జెంటీనా)లో ఫ్రాన్సిస్‌ ఒక బౌన్సర్‌ ఉద్యోగం చేశాడంటే నమ్మగలరా? ఇతర ప్రీస్టుల కంటే భిన్నంగా ఉండటా నికి బహుశా అదొక కారణం అయ్యుంటుంది. పేదల పక్షం ఉండటమే ఈ పోప్‌ తత్వం. వారి కళ్లలో ఆయనకు చర్చి కనబడేది. కాబట్టే ఆయన్ను మురికివాడల బిషప్పు అని పిలుచుకునేవారు.2023 అక్టోబరులో ఇజ్రాయెల్‌–హమాస్‌ యుద్ధం మొదలైనప్పటి ఉదంతమిది: గాజాలో హోలీ ఫెయిత్‌ చర్చి ఉంది. ఆ ఏకైక క్యాథలిక్‌ చర్చిలోనే క్రైస్తవులు, ముస్లిములు తల దాచుకున్నారు. వారి కోసం ప్రార్థించడానికి, వారికి ఊరడింపుగా ఉండటానికి పోప్‌ రాత్రి సమయాల్లో వాటికన్‌ నుంచి ఫోన్‌ చేసేవారు. ప్రపంచానికి తెలియని ఇలాంటి ఎన్నో అద్భుతమైన పనులు ఆయన చేశారు. వాటిలో ఇదొకటి. ఎలాంటి ప్రచార ఆర్భాటం లేకుండా తాను అనుకున్నది చేయడం సెయింట్‌ ఫ్రాన్సిస్‌ స్వభావం. అలా ఉండటానికే పోప్‌ ఫ్రాన్సిస్‌ కూడా ఇష్టపడేవారు. ఈ విషయాలు తెలిసిన ఆయన సన్నిహితులు సైతం వాటిని అందరి దృష్టికీ తెచ్చేందుకు ప్రయత్నించకపోవడం నాకు ఆశ్చర్యం కలిగించింది. స్వలింగ సంపర్కం పట్ల క్యాథలిక్‌ చర్చి వైఖరి కఠినంగా ఉంటుంది. ఈ కాఠిన్యాన్ని సడలించిన మొట్ట మొదటి పోప్‌... ఫ్రాన్సిస్సే! తన విమర్శకులను ఉద్దేశించి, మంచో చెడో ‘‘తీర్పు చెప్పడానికి నేనెవరిని?’’ అని ప్రశ్నించారు. విడాకులు తీసుకున్నవారు, పునర్వి వాహం చేసుకున్నవారు ‘సాక్రమెంటు’ స్వీకరించడంలో తప్పు లేదని చెప్పిన మొదటి పోప్‌ కూడా ఆయనే. నలుగురు మితవాద కార్డినల్స్‌ బాహాటంగా వ్యతిరేకించినప్పటికీ పోప్‌ తన అభిమతం మార్చుకోలేదు.గర్భనిరోధం, గర్భస్రావం, స్వలింగ వివాహాలు, ట్రాన్స్‌జెండర్లకు గుర్తింపు వంటి అంశాల్లో ఆయన సంప్రదాయానికి లోబడి వ్యవహరించారు. ఏదేమైనా, ఆనవాయితీలను అధిగమించి నూతన భావనలు ప్రవేశపెట్టడాన్నే ఆయన ఇష్టపడేవారు. ఎంత తిరిగినా మళ్లీ అక్కడకే వస్తాం... పోప్‌ ఫ్రాన్సిస్‌ సామాన్య జనం గురించి తపన పడేవాడు. వలసదారులు, శరణార్థుల సమస్యపై ఆయన తీసుకున్న వైఖరి దీన్ని రుజువు చేస్తుంది. పోప్‌ హోదాలో తన తొలి పర్యటనకు ల్యాంపెడుజా అనే ఇటలీ ద్వీపాన్ని ఎంచుకున్నారు. ఉత్తర అమెరికా అక్రమ వలసదారు లను కలిసి వారి సమస్య పరిష్కరించడమే ఈ పర్యటన ఉద్దేశం. తాను జబ్బు పడటానికి కొన్ని వారాల ముందు కూడా, అక్రమ వలసదారులను నేరస్థులుగా పరిగణిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చేపట్టిన విధానాలను పోప్‌ విమర్శించారు. మరే ఇతర దేశాధిపతీ ఇంతగా తెగించి ఉండడని వ్యాఖ్యానించారు. ఇస్లాంతో అధికారికంగా చర్చ జరిపిన మొట్ట మొదటి పోప్‌ కూడా ఆయనే. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)లో ఆయన బహిరంగ ‘మాస్‌’ నిర్వ హించారు. అరబ్‌ ద్వీపకల్పంలో ఇలా చేయడం ఇదే ప్రథమం. ఈ మతాంతర సౌభ్రాతృత్వ చర్యల మీద మితవాదులు దాడి చేశారు. వారిని ఆయన అసలు పట్టించుకోలేదు. పోప్‌ జీవితంలో వైఫల్యాలు లేవని చెప్పలేం. ముఖ్యంగా వాటికన్‌ మీద అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు ఆ వ్యవహారంలో సమర్థంగా వ్యవహరించలేక పోయారు. ఈ కేసులో కార్డినల్‌ ఏంజెలో బెచూ మీద ఆరోపణలు రుజువు అయ్యాయి. 2023లో జైలు శిక్ష కూడా పడింది. అంతిమంగా, పోప్‌ ఈ సమస్యను విస్తృత స్థాయిలో ఎదుర్కోలేక పోయారనే చెప్పాలి. ఒకటి మాత్రం వాస్తవం, ఆయన ముందున్న వారెవరూ ఆయన కంటే సమర్థులు కారు. ఏమైనప్పటికీ, ఫ్రాన్సిస్‌ తన తర్వాత కూడా క్యాథలిక్‌ చర్చ్‌ తన ఆకాంక్షలకు అనుగుణంగా నడిచేలా జాగ్రత్తపడ్డారు. ఆయన వారసుడిని ఎన్నుకునే అర్హత 135 మంది కార్డినల్స్‌కు ఉంటుంది. వారిలో 108 మందిని తనే నియమించారు. అందులో యూరోపి యన్లు 53 మంది కాగా, 82 మంది ఆసియా, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా, నార్త్‌ అమెరికా, ఓసియానియా (ఆస్ట్రేలియా సహా అనేక ఇతర పసిఫిక్‌ దీవులు) ప్రాంతాల వారే! అంటే, ఆయన వారసుడు మరో యూరపే తరుడు అవుతాడా? అవకాశాలు అలానే ఉన్నాయి.కరణ్‌ థాపర్‌ వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌

Riyan Parag Blames Own Approach for RR 1 Run loss to KKR We Were Not Clinical7
నా బ్యాటింగ్‌ అద్బుతమే.. కానీ మా వాళ్లే అలా!.. అతడైతే గ్రేట్‌: రియాన్‌

ఐపీఎల్‌-2025 (IPL 2025)లో రాజస్తాన్‌ రాయల్స్‌కు చేదు అనుభవం ఎదురైంది. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (KKR vs RR)తో ఆదివారం నాటి మ్యాచ్‌లో ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. ఈ నేపథ్యంలో రాయల్స్‌ కెప్టెన్‌ రియాన్‌ పరాగ్‌ (Riyan Parag)తీవ్ర విచారం వ్యక్తం చేశాడు.అప్పటికి నా బ్యాటింగ్‌ అద్భుతమే..తాను ఆఖరి వరకు క్రీజులో ఉండి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని పరాగ్‌ పేర్కొన్నాడు. ‘‘నేను అవుట్‌ కావడం తీవ్ర నిరాశపరిచింది. ఆఖరి రెండు ఓవర్ల వరకు క్రీజులో ఉండాలని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నా. కానీ దురదృష్టవశాత్తూ 18వ ఓవర్లోనే అవుటయ్యా.16, 17 ఓవర్లలో మేము ఎక్కువగా పరుగులు రాబట్టలేకపోయాం. విజయ సమీకరణం విషయంలో నేను సరైన విధంగా లెక్కలు వేసుకోలేకపోయాను. మ్యాచ్‌ను విజయంతో ముగించి ఉంటే ఎంతో బాగుండేది.అవుటయ్యేంత వరకు నేను అద్భుతంగా బ్యాటింగ్‌ చేశాను. ఓడిపోయిన కెప్టెన్‌గా ఇంటర్వ్యూకు వెళ్లకూడదని నాకు నేనే పదే పదే చెప్పుకొన్నా’’ అని రియాన్‌ పరాగ్‌ ఉద్వేగానికి లోనయ్యాడు.మా ప్రదర్శన గొప్పగా లేదుఅదే విధంగా జట్టు ప్రదర్శన గురించి మాట్లాడుతూ.. ‘‘ఆఖరి ఆరు ఓవర్లలో మాకు మరింత మెరుగైన ఆప్షన్లు దొరికి ఉంటే బాగుండేది. ముఖ్యంగా బౌలర్ల విషయం గురించి చెబుతున్నా. ఏదేమైనా పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడం వల్ల ఫలితం ఏమీ ఉండదు.మ్యాచ్‌ను పూర్తి చేసి ఉంటే ఇలా మాట్లాడుకోవాల్సి వచ్చేది కాదు. రసెల్‌ ఒక సమయంలో 10 బంతుల్లో రెండు పరుగుల వద్ద ఉన్నాడు. ఆ తర్వాత అతడు బ్యాట్‌ ఝులిపించిన తీరు చూడటానికి ముచ్చటగా అనిపించింది.ఈ మైదానంలో సులువుగానే సిక్సర్లు కొట్టవచ్చు. వికెట్‌ కాస్త ట్రికీగా ఉన్నా.. పర్లేదు కాస్త మెరుగైందే. అందుకే నా ప్రణాళికలు చక్కగా అమలు చేసుకుంటూ ముందుకు సాగాను. మైదానంలో మా ప్రదర్శన అంత గొప్పగా ఏమీ లేదు. అందుకే నేను ఇక్కడ ఇలా నిలబడాల్సి వచ్చింది’’ అని రియాన్‌ పరాగ్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు.కాగా ఈడెన్‌ గార్డెన్స్‌లో కేకేఆర్‌తో మ్యాచ్‌లో టాస్‌ ఓడిన రాజస్తాన్‌ తొలుత బౌలింగ్‌ చేసింది. ఓపెనర్‌ సునిల్‌ నరైన్‌ (11)ను అవుట్‌ చేసి యుధ్‌వీర్‌ శుభారంభమే అందించాడు. కానీ మరో ఓపెనర్‌ రహ్మనుల్లా గుర్బాజ్‌ (35), కెప్టెన్‌ అజింక్య రహానే (30) ఇన్నింగ్స్‌ గాడిన పెట్టారు.ఈ క్రమంలో అంగ్‌క్రిష్‌ రఘువన్షీ (44) కూడా వీరికి సహకారం అందించగా.. ఆండ్రీ రసెల్‌, రింకూ సింగ్‌ పూర్తిగా గేరు మార్చేశారు. ఇద్దరూ విధ్వంసకర బ్యాటింగ్‌తో విరుచుకుపడి.. కేకేఆర్‌ స్కోరును 200 దాటించారు.రసెల్‌ (25 బంతుల్లో 57 నాటౌట్‌), రింకూ (6 బంతుల్లో 19 నాటౌట్‌) మెరుపుల కారణంగా 20 ఓవర్లు పూర్తయ్యేసరికి.. కేకేఆర్‌ కేవలం నాలుగు వికెట్ల నష్టానికి 206 పరుగులు సాధించింది. రాజస్తాన్‌ బౌలర్లలో యుధ్‌వీర్‌ సింగ్‌, మహీశ్‌ తీక్షణ, రియాన్‌ పరాగ్‌, జోఫ్రా ఆర్చర్‌ ఒక్కో వికెట్‌ తమ ఖాతాలో వేసుకున్నారు.ఇక లక్ష్య ఛేదనలో రాజస్తాన్‌ రాయల్స్‌ కేకేఆర్‌ బౌలర్ల దెబ్బకు టాపార్డర్‌ కుదేలైంది. ఓపెనర్లలో యశస్వి జైస్వాల్‌ (34) ఫర్వాలేదనిపించగా.. వైభవ్‌ సూర్యవంశీ(4) మరోసారి నిరాశపరిచాడు. ఇక కునాల్‌ సింగ్‌ రాథోడ్‌, ధ్రువ్‌ జురెల్‌, వనిందు హసరంగ డకౌట్‌ అయ్యారు.ఈ క్రమంలో జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉన్న వేళ రియాన్‌ పరాగ్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. కేవలం 45 బంతుల్లోనే 95 పరుగులతో జట్టును విజయం దిశగా నడిపించాడు. అతడికి తోడుగా షిమ్రన్‌ హెట్‌మెయిర్‌ (29) కాసేపు నిలబడగా.. రియాన్‌ అవుటైన తర్వాత కథ మారిపోయింది.పద్దెమినిదవ ఓవర్‌ నాలుగో బంతికి హర్షిత్‌ రాణా బౌలింగ్‌లో వైభవ్‌ అరోరాకు క్యాచ్‌ ఇచ్చి రియాన్‌ పెవిలియన్‌ చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన జోఫ్రా ఆర్చర్‌ (12) శుభమ్‌ దూబే (14 బంతుల్లో 25 నాటౌట్‌)తో కలిసి స్కోరు బోర్డును ముందు నడిపాడు. ఇద్దరూ కలిసి సింగిల్స్‌ , డబుల్స్‌ తీస్తూ పందొమ్మిదో ఓవర్లో 11 పరుగులు స్కోరు చేశారు.ఈ క్రమంలో ఆఖరి ఓవర్లో రాజస్తాన్‌ విజయానికి 22 పరుగులు అవసరం కాగా.. 2, 1, 6, 4, 6 స్కోరు చేసి రాజస్తాన్‌ శిబిరంలో ఆశలు రేకెత్తించారు. అయితే, ఆఖరి బంతికి మూడు పరుగులు అవసరం కాగా ఆర్చర్‌ రనౌట్‌ కావడంతో కథ కంచికి చేరుకుండానే ముగిసిపోయింది. చదవండి: IND vs SL: టీమిండియాకు చేదు అనుభవం.. లంక చేతిలో ఓటమిSent the ball to enjoy the view 🏔😍Shashank Singh and Prabhsimran Singh with an entertaining partnership tonight 💪Scorecard ▶ https://t.co/YuAePC273s#TATAIPL | #PBKSvLSG pic.twitter.com/9WqFWRd3zt— IndianPremierLeague (@IPL) May 4, 2025

Blaze In Secunderabad Patny Centre SBI Admin Building8
ప్యాట్నీ సెంటర్‌ ఎస్‌బీఐ బిల్డింగ్‌లో భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్: సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ లో ఆదివారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్యాట్నీ సెంటర్ ఎస్ బీఐ అడ్మిన్ బిల్డింగ్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఐదవ ఫ్లోర్ పూర్తిగా మంటల్లో చిక్కుకుంది. దాంతో సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మూడు ఫైరింజన్ల సాయంతో అక్కడకు వచ్చి మంటలను అదుపు చేస్తున్నారు. అయితే మంటలు ఆర్పడం కష్టతరంగా మారుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగిందని అధికారులు భావిస్తున్నారు. విలువైన ఫైల్స్ దగ్ధమౌతున్నట్లు సమాచారం. బిల్డింగ్ లో ఎవరైనా ఉన్నారా.. లేదా అనేది తెలియాల్సి ఉంది. ఆదివారం సెలవు కావడంతో పెను ప్రమాదం తప్పింది.

Indian Railways Announces Nationwide Digital Clock Design Competition Full Details9
ఇండియన్ రైల్వే కీలక ప్రకటన: గెలిచినోళ్లకు రూ.5 లక్షల ప్రైజ్

భారతదేశంలో రైల్వే స్టేషన్లలో కొత్త డిజిటల్ గడియారాలను రూపొందించడానికి ఇండియన్ రేల్వే దేశవ్యాప్తంగా ఒక పోటీ ప్రకటించింది. రైల్వే ప్లాట్‌ఫామ్‌లలో, స్టేషన్ ప్రాంగణాలలో ఉపయోగించే గడియారాలు ఒకే విధంగా ఉండాలనే ఉద్దేశ్యంతో రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.ఈ పోటీలో పాల్గొనేవారిని ''ప్రొఫెషనల్స్, కళాశాల/విశ్వవిద్యాలయ విద్యార్థులు, పాఠశాల విద్యార్థులు (12వ తరగతి వరకు)'' అని మూడు వర్గాలుగా విభజించడం జరుగుతుంది. ఈ పోటీలో పాల్గొనేవారు తమ డిజైన్‌లను 2025 మే 1 నుంచి మే 31 మధ్య ఆన్‌లైన్‌లో (contest.pr@rb.railnet.gov.in) సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.ఈ పోటీ గురించి రైల్వే బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ 'దిలీప్ కుమార్' మాట్లాడుతూ.. గెలుపొందిన విజేతకు.. మొదటి బహుమతి రూ. 5 లక్షలు అందిస్తామని వెల్లడించారు. అంతే కాకుండా మూడు విభాగాలలో ఇదుమందికి కన్సోలేషన్ బహుమతులుగా రూ. 5000 చొప్పున ఇవ్వనున్నట్లు స్పష్టంగా చేశారు.ఈ పోటీలో పాల్గొనేవారు తమ డిజైన్లను.. హై రిజల్యూషన్‌లో, ఎలాంటి వాటర్ మార్క్ లేదా లోగో వంటివి లేకుండా, ఒరిజినాలిటీ సర్టిఫికెట్‌తో సబ్మిట్ చేయాలని దిలీప్ కుమార్ పేర్కొన్నారు. డిజైన్ వెనుక ఉన్న థీమ్.. ఆలోచనను వివరించే కాన్సెప్ట్ నోట్ కూడా ఉండాలి. మీరు సబ్మిట్ చేసే డిజైన్స్ అసలైనవిగా ఉండాలి, వాటిపై ఎలాంటి కాపీరైట్స్ ఉండకూడదని ఆయన వివరించారు.ఇదీ చదవండి: ఏప్రిల్‌లో 4.80 లక్షల సేల్స్: ఈ బ్రాండ్ వాహనాలకే డిమాండ్!పాఠశాల విభాగంలో పాల్గొనే విద్యార్థులు స్టూడెంట్ ఐడీ కార్డును సైతం అప్‌లోడ్ చేయాలి. కళాశాల విభాగంలో ప్రస్తుతం ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా కళాశాలలో చేరిన వ్యక్తులు సంబంధిత ఐడీ కార్డును అందించాలి. మిగిలినవారు ప్రొఫెషనల్ కేటగిరీ కిందకు వస్తారని ఆయన అన్నారు.

APSDMA Warns Heavy Rains In Few Areas Of AP10
ఏపీకి భారీ వర్ష సూచన. పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ

విశాఖ : రాబోవు ‍ కొన్ని గంటల్లో ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) వెల్లడించింది. దాంతో పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేశారు. కోస్తా, రాయలసీమలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది.గంటలకు 60 నుంచి 80 కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీయవచ్చని పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉన్నట్లు స్పష్టం చేసింది. దాంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో రానున్న కొన్ని గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) హెచ్చరించింది. ఈ మేరకు కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.ఐదు జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌రాగల రెండు మూడు గంటల వ్యవధిలో ప్రకాశం, కృష్ణా, బాపట్ల, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వర్షాలతో పాటు పిడుగులు పడే ప్రమాదం ఉందని, గంటకు 60 నుంచి 85 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనవసరంగా బయటకు రాకూడదని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని విజ్ఞప్తి చేశారు విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ, రోణంకి కూర్మనాథ్,పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్మరోవైపు అల్లూరి సీతారామరాజు, విజయనగరం, అనకాపల్లి, విశాఖపట్నం, కాకినాడ, కోనసీమ జిల్లాలతో పాటు వాటి పరిసర ప్రాంతాల్లోనూ వర్షాలు పడే సూచనలున్నాయని ఏపీఎస్డీఎంఏ తెలిపింది. ఈ ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక్కడ పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్నట్లు ఆయన తెలిపారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement