గన్నవరంలో రాళ్లు, చెప్పులు విసిరిన యార్లగడ్డ అనుచరులు
తేలప్రోలులో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడి
అవనిగడ్డలో మహిళపై దాడి.. కాలు విరగ్గొట్టిన జనసేన నాయకులు
సాక్షి, మచిలీపట్నం/జగ్గయ్యపేట అర్బన్/ఉంగటూరు: కృష్ణాజిల్లాలో టీడీపీ నాయకులు గన్నవరం, పెనమలూరు, అవనిగడ్డ నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీపై దాడులకు పాల్పడ్డారు. గన్నవరం మండలం ముస్తాబాద్ వద్ద యార్లగడ్డ వెంకట్రావు వర్గీయులు, వైఎస్సార్‌సీపీ కేడర్‌ను రెచ్చగొట్టడంతో తోపులాట జరిగింది. విషయం తెలుసుకున్న వల్లభనేని వంశీ అక్కడికి చేరుకోవడంతో ఒకరిపై ఒకరు చెప్పులు, రాళ్లు విసురుకున్నారు.
⇒ ఉంగుటూరు మండలం తేలప్రోలు జెడ్పీహైస్కూల్‌లో ఉన్న 271, 273, 274, 275 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల నమోదు పరీశీలించేందుకు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెంకట్రావు తన అనుచరులతో ర్యాలీగా చేరుకున్నారు. ఆ తర్వాత రోడ్డుపైకి వచ్చిన ఆయన వైఎస్సార్‌సీపీ నాయకులను రెచ్చగొట్టేలా వల్లభనేని వంశీని, సీఎం జగన్‌ను అసభ్యపదజాలంతో దూషించారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య వాదోపవాదనలు చేరడంతో దాడికి పాల్పడ్డారు.
వల్లభనేని వంశీమోహన్ అక్కడకు చేరుకుని కవ్వింపు చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడిలో గ్రామానికి చెందిన విశ్వనాథపల్లి రవికుమార్, ప్రత్తిపాటి జీవన్‌కుమార్, భీమవరపు యతేంద్ర రామకృష్ణ, తదితరులు తీవ్రంగా గాయపడ్డాడు. వారంతా అవుటుపల్లిలోని పిన్నమనేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
⇒ అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవిలంకలో వైఎస్సార్‌సీపీ నాయకుడైన మండల బీసీ సెల్ కన్వీనర్ రాజులపాటి నాగేశ్వరరావు, ఆయన కుమార్తె కేసాని తేజశ్రీలపై జనసేన నాయకులు దాడికి దిగారు. తండ్రిని కొడుతుండగా కుమార్తె తేజశ్రీ అడ్డుకునే ప్రయత్నం చేయగా, ఆమెపై దాడి చేసి కాలు విరగ్గొట్టారు.
కౌన్సిలర్ భర్తపై టీడీపీ గూండాల దాడి
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణంలో సోమవారం పోలింగ్ బూత్‌లోకి వెళ్లిన 16వ వార్డు కౌన్సిలర్ తన్నీరు నాగమణి భర్త, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన విభాగం సంయుక్త కార్యదర్శి తన్నీరు నాగేంద్రపై స్థానిక టీడీపీ గూండాలు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో నాగేంద్ర ముఖం, తలపై తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక చెరువుబజారులోని బీసీ కమ్యూనిటీ భవన్‌లో ఏర్పాటుచేసిన 33వ పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేందుకు ఒక మానసిక దివ్యాంగుడికి సహాయంగా అతని కుటుంబ సభ్యుని అనుమతించాలని తన్నీరు నాగేంద్ర ప్రిసైడింగ్ అధికారి అనుమతి తీసుకునేందుకు బూత్‌లోకి వెళ్లారు.
అదే సమయంలో స్థానిక టీడీపీ వ్యక్తులు నడిగొండ్ల సతీష్, తాళ్లూరి సోమయ్య, అతని కుమారుడు తాళ్లూరి వెంకటేశ్వర్లు, ఉత్తపళ్ల వెంకటేశ్వర్లు ఆయనపై దాడికి పాల్పడ్డారు. కాగా ఈ ఘటనకు అరగంట ముందు మాజీ ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య సోదరుడు శ్రీరాం చినబాబు అదే బూత్ వద్దకు వచ్చి టీడీపీ నాయకులతో మంతనాలు జరిపాడనీ, ఆయన సూచనతోనే ఈ దాడి జరిగిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సోదరుడు సామినేని రవిచంద్, ఉదయభాను కుమారుడు సామినేని వెంకటకృష్ణ ప్రసాద్, ఉదయభాను కుమార్తె పద్మ ప్రియాంక, మున్సిపల్ మాజీ చైర్మన్ ఇంటూరి రాజగోపాల్(చిన్నా), పార్టీ పట్టణ అధ్యక్షుడు ఆకుల శ్రీకాంత్(బాజి) ఇరువర్గాలను విడదీసేందుకు ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో ఎమ్మెల్యే ఉదయభాను సోదరి చాముండేశ్వరి(బేబి)ని కూడ దుండగులు తోసేయడంతో ఆమె కింద పడి కాలుకు ఫ్రాక్చర్ అయింది.
Comments
Please login to add a commentAdd a comment