కోల్‌కతా/గువాహటి: పశ్చిమ బెంగాల్, అసోం రాష్ట్రాల్లో రెండో విడత పోలింగ్ కొనసాగుతుంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు బెంగాల్‌లో 37.42 శాతం, అసోంలో 33.24 శాతం పోలింగ్ నమోదైంది. 294 అసెంబ్లీ స్థానాలున్న బెంగాల్‌లో ఎనిమిది విడతల్లో, 126 అసెంబ్లీ స్థానాలున్న అసోంలో మూడు విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే మార్చి 27న తొలి విడత ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. రెండు రాష్ట్రాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. బెంగాల్‌లో రెండో విడతలో 30 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుండగా.. 171 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 75,94,549 మంది ఓటర్లు వారి భవితవ్యం నిర్ణయించనున్నారు. ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆయా నియోజకవర్గాల పరిధిలో 10,620 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇవాళ ఓటింగ్ జరిగే అన్ని ప్రాంతాలను సున్నితమైనవిగా ఎన్నికల కమిషన్ ప్రకటించింది.
అస్సాంలో..
రెండో దశలో ఎన్నికలు జరగనున్న 39 స్థానాల్లో మొత్తం 345 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. బీజేపీ 34 సీట్లలో, మిత్రపక్షాలైన అస్సాం గణ పరిషత్ 6 స్థానాల్లో, యూపీపీఎల్ 3 సీట్లలో పోటీ చేస్తున్నాయి. రెండు స్థానాల్లో బీజేపీ, ఏజీపీ మధ్య, రెండు స్థానాల్లో బీజేపీ, యూపీపీఎల్ మధ్య స్నేహపూర్వక పోటీ నెలకొని ఉంది. మహా కూటమి నుంచి కాంగ్రెస్ 28 సీట్లలో, ఏఐయూడీఎఫ్ 7 స్థానాల్లో, బీపీఎఫ్ 4 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. కొత్తగా ఏర్పడిన అస్సాం జాతీయ పరిషత్ 19 స్థానాల్లో అభ్యర్థులను నిలిపింది. 25 స్థానాల్లో ఎన్డీయే, మహా కూటమి మధ్య ద్విముఖ పోటీ నెలకొన్నది. ఈ రెండో దశ ఎన్నికల బరిలో ఐదుగురు మంత్రులు, డిప్యూటీ స్పీకర్ ఉన్నారు.
ఈ రెండో దశ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ బరిలో నిలిచిన నందిగ్రామ్ నియోజకవర్గంపైననే అందరి దృష్టి ఉంది. మమతను ఓడించాలనే లక్ష్యంతో ఉన్న బీజేపీ అగ్ర నేతలు ఈ స్థానంలో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.మమతకు పోటీగా ఒకప్పటి ఆమె విశ్వసనీయ సహచరుడు, టీఎంసీ నుంచి బీజేపీలోకి వచ్చిన సువేందు అధికారిని బీజేపీ పోటీలో నిలిపిన విషయం తెలిసిందే. బెంగాల్‌లో 30 స్థానాలకు గానూ మొత్తం 191 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వారి భవితవ్యాన్ని 75 లక్షల మంది ఓటర్లు తేల్చనున్నారు. మొత్తం 10,620 పోలింగ్ బూత్‌లను సమస్యాత్మకమైనవిగా ఎన్నికల సంఘం నిర్ధారించి, ఆయా బూత్‌ల వద్ద అదనపు బలగాలను నిలిపింది.
తూర్పు మెదినీపుర్(9), పశ్చిమ మెదినీపుర్(9), దక్షిణ 24 పరగణ(4), బంకురా(8) జిల్లాల్లో ఈ రెండో దశ ఎన్నికలు జరుగుతున్నాయి. టీఎంసీ, బీజేపీలు మొత్తం 30 స్థానాల్లో అభ్యర్థులను నిలిపాయి. సీపీఎం 15, కాంగ్రెస్ 13, ఐఎస్‌ఎఫ్ 2 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. రెండో దశ ఎన్నికలు జరుగుతున్న దాదాపు అన్ని నియోజకవర్గాల్లో మమతా బెనర్జీ ప్రచారం నిర్వహించారు. కాలికి గాయమైన ఆమె వీల్‌చెయిర్‌పైననే ఈ ప్రచారంలో పాల్గొన్నారు. బీజేపీ ప్రచారంలో అగ్రనేతలు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా తదితరులు పాల్గొన్నారు.
చదవండి:
భారీ పోలింగ్ మా విజయానికి సంకేతం
Comments
Please login to add a commentAdd a comment