Nandigram
-
బెంగాల్ సీఎం మమతకు ఊహించని షాక్.. భారీ విజయం అందుకున్న బీజేపీ
బెంగాల్ రాజకీయాల్లో అధికార టీఎంసీ, బీజేపీ మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమనే వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల నుంచి రెండు పార్టీల నేతల మధ్య మాటల వార్ ఇంకా నడుస్తూనే ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన బెంగాల్లో కాషాయ జెండా ఎగురవేయాలన్న బీజేపీకి చేదు అనుభవమే ఎదురైనప్పటికీ సీట్ల విషయం మాత్రం పుంజుకుంది. ఇదిలా ఉండగా, తాజాగా అధికార టీఎంసీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మమతా బెనర్జీకి బీజేపీ గట్టి షాకిచ్చింది. పూర్బా మేదినీపూర్ జిల్లాలోని నందిగ్రామ్‌లో జరిగిన సహకార సంఘం ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం సాధించింది. గతంలో ఇక్కడ అధికార తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉండేది. కాగా ఆదివారం భేకుటియా సమబే కృషి సమితికి జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఊహించని విధంగా భారీ విజయాన్ని అందుకుంది. ఎన్నికల్లో 12 సీట్లకు గానూ 11 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. ఇక, ఈ ఎన్నికల్లో అధికార టీఎంసీ ఒక్క సీటుకే పరిమితమైంది. మరోవైపు.. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నందిగ్రామ్ నుంచి బరిలోకి దిగిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీని బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి ఓడించారు. ఇక, బీజేపీ విజయంపై సువేందు అధికారి స్పందిస్తూ.. బీజేపీని గెలిపించినందుకు నందిగ్రామ్ నియోజకవర్గం, భేకుటియా సమబే కృషి ఉన్నయన్ సమితి సహకార సంఘం ఓటర్లందరికీ ధన్యవాదాలు. ఇలాంటి విజయాలు భవిష్యత్తులో గొప్ప విజయానికి బాటలు వేస్తాయి అని కామెంట్స్ చేశారు. Big SETBACK for Mamata Banerjee, BJP wins 11 out of 12 seats in Nandigram co-operative body election Nandigram: Bhekutia Samabay Krishi Samity, which was held by Mamata Banerjee's Trinamool Congress (TMC) for a long time, took over by the Saffron camphttps://t.co/q55vSFd14i — Selvam 🚩 (@tisaiyan) September 19, 2022 -
నందిగ్రామ్ ఫలితంపై కోర్టును ఆశ్రయిస్తా: దీదీ
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ ఎన్నికల ఫలితాల అనంతరం మమతా బెనర్జీ తొలిసారి మీడియా సమావేశం నిర్వహించారు. విజయం అనంతరం దీదీ హింసాత్మక చర్యలకు దిగారంటూ.. బీజేపీ చేస్తోన్న ఆరోపణలని ఆమె ఖండించారు. కాషాయపార్టీ ప్రచారం చేస్తోన్న ఫోటోలు పాతవన్నారు. నందిగ్రామ్ ఫలితంపై దీదీ స్పందించారు. కౌంటింగ్‌లో అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించిన దీదీ.. దీనిపై కోర్టును ఆశ్రయిస్తానని తెలిపారు. జర్నలిస్ట్‌లను కోవిడ్ వారియర్స్‌గా ప్రకటించారు దీదీ. ఈ సందర్భంగా దీదీ మాట్లాడుతూ.. ‘‘మనం విజయం సాధించాం. ఇది బెంగాల్ ప్రజల విజయం. అయితే జనాలకు నాదొక విన్నపం. మనం శాంతియుతంగా ఉందాం. ఎన్నికల వేళ బీజేపీ, కేంద్ర బలగాలు మనలను చాలా ఇబ్బందులకు గురి చేశాయి. కానీ ఇప్పటికి కూడా మనం హింసకు పాల్పడవద్దు. మీరు ప్రశాంతంగా ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీకు ఏమైనా ఫిర్యాదులు ఉంటే, పోలీసులకు నివేదించండి. వారిలో కొందరు బీజేపీ కోసం పనిచేసి ఉండవచ్చు. దాని గురించి తర్వాత ఆలోచిస్తాను. ఈ రోజు రాత్రి 7 గంటలకు గవర్నర్‌ను కలవనున్నాను’’ అన్నారు దీదీ. నందిగ్రామ్ ఓట్ల లెక్కింపుపై దీదీ సందేహాలు వ్యక్తం చేశారు. ఆమె మాట్లాడుతూ.. ‘‘4 గంటలపాటు సర్వర్‌లో సమస్య ఉందని ఈసీ చెప్పింది. నేను గెలిచినట్లు తెలిసి గవర్నర్ అభినందనలు కూడా తెలిపారు.రీకౌంటింగ్‌కు అనుమతి ఇవ్వొద్దని ఆర్వోను బెదిరించారు. రీ కౌంటింగ్ నిర్వహిస్తే ప్రాణాపాయం ఉందని ఆర్వో అన్నట్లు తెలిసింది.ఆర్వో రాసిన లేఖ విషయం ఒకరు నాకు ఎస్ఎంఎస్ పంపారు. అండతోనే సువేంద్ గెలిచారు’’ అని మమత ఆరోపించారు. చదవండి: గెలవలేదుకానీ.. గణనీయంగా పుంజుకున్న బీజేపీ -
Nandigram: నందిగ్రామ్.. హై టెన్షన్
కోల్‌కతా: తృణమూల్ చీఫ్ మమతా బెనర్జీ తొలిసారి బరిలో నిలిచిన పశ్చి మ బెంగాల్‌లోని నందిగ్రామ్ నియోజకవర్గ ఫలితాలు నరాలు తెగే ఉత్కంఠత రేపాయి. కౌంటింగ్ కొనసాగుతున్న కొద్దీ మమతా బెనర్జీ, బీజేపీ నేత సువేంధు అధికారి మధ్య క్షణ క్షణం మారిపోతున్న ఓట్ల మెజారిటీ... మొత్తం రాష్ట్ర ఎన్నికల ఘట్టంలోనే అత్యంత ప్రధానమైనదిగా నిలిచింది. ఇద్దరు ప్రధాన పార్టీల ప్రత్యర్థుల మధ్య అటూ ఇటూ దోబూచులాడిన మెజారిటీ.. చివరకు సువేంధు అధికారిని వరించింది. మమతా బెనర్జీపై స్వల్ప ఆధిక్యంతో గెలిచినట్లు ఎన్నికల సంఘం ఎట్టకేలకు ప్రకటించింది. అయితే, నందిగ్రామ్ ఫలితాలపై తాను కోర్టుకు వెళ్తానని మమతా ప్రకటించారు. అంతకుముందు ఆదివారం ఉదయం కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమవగా కొద్దిసేపటికే సువేంధు మమత కంటే ఆధిక్యంలోకి వచ్చారు.ఆ తర్వాత సువేంధు మెజారిటీ ఏకంగా ఎనిమిది వేల దాకా వెళ్లింది. మధ్యాహ్నందాకా సువేంధుదే పైచేయి. మధ్యాహ్నం నుంచి నెమ్మదిగా పుంజుకుని మమత ఆధిక్యంలోకి వచ్చారు. ఆ తర్వాత మళ్లీ ఆధిక్యత మరొకరి చెంతకు చేరింది. ఒకానొక దశలో సువేంధు కేవలం ఆరు ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఓట్ల లెక్కింపులో ప్రతీ రౌండ్లో మెజారిటీ సువేంధు, మమత మధ్య మారుతూ వచ్చింది. సువేంధు 1,200 ఓట్ల మెజారిటీలో గెలిచారని వార్తలు రాగా, ఓట్ల లెక్కింపు కొనసాగుతోందని ఎన్నికల సంఘం తెలిపింది. ఆ తర్వాత కొద్దిసేపటికే 1,956 ఓట్ల ఆధిక్యంతో సువేంధు అధికారి గెలిచారని ఎన్నికల సంఘం ప్రకటించింది. త్యాగాలు తప్పవు.. ఈసీ ప్రకటనపై మమతా బెనర్జీ వెంటనే స్పందించారు. ‘‘నందిగ్రామ్‌లో ఓటమిని అంగీకరిస్తున్నాను. మరేం ఫరవాలేదు. అయితే, నందిగ్రామ్‌లో అక్రమాలు జరిగాయని విన్నాను. దీనిపై కోర్టుకు వెళతాను. మనం మొత్తం రాష్ట్రాన్నే గెలిచాం. ఇంతటి ఘన విజయం సాధించినపుడు ‘నందిగ్రామ్’లో ఓటమిలాంటి త్యాగాలు తప్పవు’’ అని ఫలితాల అనంతరం మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. నందిగ్రామ్‌లో రీకౌంటింగ్ జరపాలని ఈసీని టీఎంసీ కోరగా అందుకు ఈసీ నిరాకరించింది. -
నా తదుపరి పోరు దాని మీదనే: దీదీ
కోల్‌కతా: రసవత్తరంగా సాగిన నందిగ్రామ్ కౌంటింగ్‌లో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ విజయం సాధించారు. బీజేపీ నాయకుడు సువేందు అధికారిపై 1200 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు దీదీ. నందిగ్రామ్ ఫలితం అనంతరం మమత మీడియాతో మాట్లాడారు. ఇది బెంగాల్ ప్రజల విజయం అన్నారు. తనను గెలిపించిన బెంగాల్ ప్రజలకు దీదీ కృతజ్ఞతలు తెలిపారు. విజయం ముఖ్యం కాదు.. కరోనాను ఎదుర్కొవడమే ప్రధానం అన్నారు. ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలని సూచించారు. తన తదుపరి పోరాటం కోవిడ్ మీదనే అన్నారు దీదీ. ఇక నందిగ్రామ్ బరిలో మమత కేవలం 1,200 స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. ఇక పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ దూసుకుపోతుంది. ఇప్పటి వరకు వచ్చిన ఫలితాల ప్రకారం టీఎంసీ 215 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. బీజేపీ 74 చోట్ల ఆధిక్యంలో ఉంది. చదవండి: మమతా మ్యాజిక్: బీజేపీ ప్రధాన కార్యదర్శి స్పందన -
దీదీ నందిగ్రామ్‌లో క్లీన్‌బౌల్డ్: మోదీ
బర్ధమాన్: పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇన్నింగ్స్ ముగిసిందని బీజేపీ అగ్రనేత, ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో సోమవారం ఆయన క్రికెట్ పరిభాషలో కాసేపు మాట్లాడారు. గడచిన నాలుగు విడతల ఎన్నికల్లో బెంగాల్ ప్రజలు ఫోర్లు, సిక్సులు కొట్టారని, బీజేపీ సెంచరీ కొట్టేసిందని వ్యాఖ్యానించారు. సగం మ్యాచ్‌లోనే టీఎంసీని ప్రజలు ఊడ్చేశారన్నారు. ‘ఓటర్లు దీదీని నందిగ్రామ్‌లో క్లీన్‌బౌల్డ్ చేశారు. బెంగాల్లో ఆమె ఇన్నింగ్స్ ముగిసింది. ఆమె మొత్తం టీమ్‌ను కూడా గ్రౌండ్ నుంచి వెళ్లిపోవాలని ప్రజలు తేల్చేశారు’ అని ప్రధాని వ్యాఖ్యానించారు. ఒక టీఎంసీ నాయకురాలు దళితులను ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలతో బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆత్మ క్షోభిస్తుందన్నారు. రాష్ట్రంలోని షెడ్యూల్డ్ కులాల వారిని భిక్షగాళ్లు అని ఇటీవల టీఎంసీ మహిళానేత, ఆ పార్టీ తరఫున అభ్యర్థిగా ఉన్న సుజాత మోండల్ వ్యాఖ్యానించినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ‘దీదీ తనను తాను రాయల్ బెంగాల్ టైగర్ అని చెప్పుకుంటారు. ఆలాంటి టైగర్ అనుమతి లేకుండా పార్టీ నేత ఆ వ్యాఖ్యలు చేయగలరా? అలాంటి మాటలతో బాబాసాహెబ్ అంబేద్కర్ ఆత్మ క్షోభిస్తుంది. మమత బెనర్జీ కనీసం ఆ వ్యాఖ్యలను ఖండించలేదు. క్షమాపణ చెప్పలేదు’ అన్నారు. దళితులను అవమానించి మమత పెద్ద తప్పు చేశారన్నారు. బంగ్లాదేశ్‌లో తాను మథువా సామాజిక వర్గానికి చెందిన సంస్కర్త హరిచంద్ ఠాకూర్ జన్మస్థలాన్ని సందర్శించడాన్ని మమత తప్పుబట్టారని మథువా వర్గం బలంగా ఉన్న కల్యానిలో జరిగిన సభలో ప్రధాని పేర్కొన్నారు. ఒక్కసారి అధికారం కోల్పోతే తిరిగి రాలేనన్న విషయం మమతకు అర్థమైందని వ్యాఖ్యానించారు. -
‘కాలు నొప్పి ఏమైంది దీదీ.. ఈ డ్యాన్స్ ఏంటి’
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఎలాగైనా సరే రాష్ట్రంలో పాగా వేయాలని బీజేపీ చూస్తుంటే.. కాషాయ పార్టీని బెంగాల్ దరిదాపుల్లోకి కూడా రానివ్వకూడదనే కృత నిశ్చయంతో ఉన్నారు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ‘‘బీజేపీ మీద తిరుగలేని పోరాటం చేసే ఏకైక వ్యక్తి దీదీ. అలాంటి మమతా కూడా ఈ సారి భయపడ్డారు.. అందుకే ఆమెకు అలవాటు లేని పనులు చేస్తున్నారు’’ అనే మాటలు వినిపిస్తున్నాయి. నందిగ్రామ్‌లో నామినేషన్ వేసి తిరిగి వస్తుండగా మమతకు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. తనపై దాడి జరిగిందని దీదీ ఆరోపిస్తుండగా.. జనం పెద్ద ఎత్తున రావడంతోనే ఆమెకు ప్రమాదం జరిగిందని స్థానికులు చెప్పారు. ఇక నాటి నుంచి మమత వీల్ చైర్లోనే కనిపిస్తున్నారు. ఈ విషయం ఆమెను అభిమానించే వారికి నచ్చడం లేదు. కాళికలా ఉండే మమతా ఇలా సానుభూతి కోసం ప్రయత్నించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఇలా చర్చ జరుగుతుండగానే తాజాగా మమతా బెనర్జీకి సంబంధించి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ట్విట్టర్లో ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. ఇంతకు ఈ వీడియోలో ఏం ఉందంటే.. మమతా రెండు కాళ్లను వెనకకు, ముందుకు ఆడిస్తూ రిలాక్స్ అవుతున్నారు. ప్రమాదంలో కట్టుకట్టిన కాలును కూడా చాలా సింపుల్‌గా కదిలిస్తున్నారు. ఈ సంఘటన ఎక్కడ చోటు చేసుకుందనే దాని గురించి ఎలాంటి సమాచారం లేదు. కానీ ఈ వీడియో చూసిన తర్వాత బీజేపీ నాయకులు దీదీని ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు బీజేపీ నాయకులు. ‘‘కాలుకి దెబ్బ తగిలింది.. కుట్రపూరితంగానే నాపై దాడి చేశారని ఆరోపించావ్.. మరి ఇదేంటి దీదీ’’ అని ప్రశ్నిస్తున్నారు. ‘‘డ్రామాలు ఆపేయ్.. జనాలకు నీ గురించి తెలిసిపోయింది... సింపతీ కోసం ఎంత ప్రయత్నించినా వృథా’’ అంటూ ట్రోల్ చేస్తున్నారు. టీఎంసీ చెత్త రాజకీయాలకు నిదర్శనం ఈ వీడియో అంటూ విమర్శిస్తున్నారు బీజేపీ నాయకులు. చదవండి: నేను పులి: ‘నందిగ్రామ్’లో మమతా బెనర్జీ గర్జన -
నేనేం బీజేపీలో లేను
దిన్హట/నాటాబరి: నందిగ్రామ్‌లో తన విజయం ఖాయమని, వేరే స్థానం నుంచి పోటీ చేయమని ప్రధాని నరేంద్రమోదీ తనకు సలహా ఇవ్వాల్సిన అవసరం లేదని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ పేర్కొన్నారు. నందిగ్రామ్‌లో మమత ఓడిపోబోతున్నారని, అందుకే ఆమె వేరే స్థానం నుంచి కూడా పోటీ చేస్తారేమోనని ప్రధాని మోదీ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ‘ముందు మీ పార్టీకి చెందిన హోం మంత్రిని కంట్రోల్ చేయండి. నన్ను నియంత్రించేందుకు, నాకు సలహా ఇచ్చేందుకు నేనేం మీ పార్టీ మెంబర్‌ను కాదు’ అని మమత జవాబిచ్చారు. మమత శుక్రవారం ప్రచారంలో పాల్గొన్నారు. పశ్చిమబెంగాల్లో ఎన్నికలను నిర్వహిస్తోంది ఎన్నికల సంఘం కాదని, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ ఎన్నికలను నిర్వహిస్తున్నారని వ్యాఖ్యానించారు. ‘200 స్థానాల్లో టీఎంసీ గెలవాలి. లేదంటే ఎమ్మెల్యేలుగా గెల్చిన కొందరు ద్రోహులను బీజేపీ వాళ్లు కొనేస్తారు’ అని హెచ్చరించారు. మెజారిటీ భారీగా లేకపోతే తమ పార్టీ ఎమ్మెల్యేలు అమ్ముడుపోయే అవకాశముందని మమత పరోక్షంగా వ్యాఖ్యానించడం విశేషం. ఎలాంటి బెదిరింపులకు, ప్రలోభాలకు లొంగని బలమైన వారు టీఎంసీ తరఫున పోలింగ్ ఏజెంట్లుగా ఉండాలని సూచించారు. తమిళనాడులో అమిత్ షా ఆదేశాల మేరకు డీఎంకే చీఫ్ స్టాలిన్ బంధువులు, ఇతర నాయకుల ఇళ్లపై ఆదాయ పన్ను దాడులు జరుగుతున్నాయని విమర్శించారు. -
ఆమె పులిలా పోరాడింది
ముంబై: పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ పులిలా పోరాడిందని, ఆమె విజేతగా అవతరించడం ఖాయమని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. గురువారం ముంబైలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ఇప్పుడు జరగబోయే కేరళ, తమిళనాడు, అస్సాం, బెంగాల్ (నాలుగు రాష్ట్రాల) ఎన్నికలు జాతీయ రాజకీయాలను నిర్ణయిస్తాయని ఎంపీ అభిప్రాయపడ్డారు. ప్రధానంగా అస్సాం, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలు ముఖ్యపాత్ర పోషిస్తాయని అన్నారు. అస్సాంలో బీజేపీ అధికారంలో ఉందని, అయితే కాంగ్రెస్ గట్టిగా పోరాటం చేసిందని ప్రశంసించారు. మమతా బెనర్జీ లేఖపై మీడియా ప్రశ్నించినపుడు సీఎం ఉద్ధవ్‌కు కూడా లేఖ వచ్చిందని, ఎన్నికల తర్వాత పొత్తులపై చర్చించే అవకాశం ఉందన్నారు. ఇక పశ్చిమబెంగాల్లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు నిజమైన మహాభారతం కంటే భయంకరంగా ఉన్నాయని రౌత్ ఆందోళన వ్యక్తంచేశారు. బెంగాల్ ఎన్నికలను దేశం మొత్తం పరిశీలిస్తోందని, ప్రజలు కూడా తెలివైనవారేనని ఎంపీ వ్యాఖ్యానించారు. ఇక ఇటీవల సంజయ్‌పై బాలాసాహెబ్ థోరాట్ చేసిన విమర్శలపై స్పందిస్తూ.. యూపీఏ నాయకత్వాన్ని సోనియా నుంచి శరద్ పవార్‌కు అప్పగించాలని అనలేదని, కేవలం యూపీఏను గాడిలో పెట్టాలనే వ్యాఖ్యానించానని ఎంపీ స్పష్టంచేశారు. -
నందిగ్రామ్‌లో స్వల్ప ఘర్షణలు
నందిగ్రామ్/గువాహటి: పశ్చిమబెంగాల్లో గురువారం జరిగిన రెండో దశ ఎన్నికల్లో స్వల్పంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. అక్రమాలు జరిగాయని, కేంద్ర బలగాలు బీజేపీకి అనుకూలంగా వ్యవహరించాయని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ ఆరోపించారు. ఆమె బరిలో నిలిచిన నందిగ్రామ్‌లో గురువారం పోలింగ్ జరిగింది. కేంద్ర మంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు నందిగ్రామ్ నియోజకవర్గంలో సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ బలగాలు బీజేపీకి ఓట్లు పడేలా సహకరించాయని మమత పేర్కొన్నారు. ఎన్నికల సంఘం టీఎంసీ, ఇతర పార్టీల ఫిర్యాదులపై స్పందించడం లేదని, అమిత్ ఆదేశాలనే పాటిస్తోందన్నారు. తన ఆందోళన అంతా ప్రజాస్వామ్యంపై బీజేపీ చేస్తున్న దాడి గురించేనని ఆమె వ్యాఖ్యానించారు. మమతా బెనర్జీ, ఆమె ప్రత్యర్థి అయిన బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి పలు పోలింగ్ బూత్‌లకు వెళ్లి, ఓటింగ్ సరళిని పరిశీలించారు. నందిగ్రామ్‌లో విజయం తనదేనని, ఇక్కడి ప్రజలంతా తనవారేనని, గ్రామాలకు, గ్రామాలే బీజేపీకి ఓటేశాయని సువేందు అధికారి పేర్కొన్నారు. రాష్ట్రంలోని 30 స్థానాల్లో జరిగిన రెండో దశలో ఎన్నికల్లో కూడా 80 శాతానికి పైగా ఓటింగ్ నమోదయింది. సాయంత్రం ఐదు గంటల వరకు రాష్ట్రంలో 80.53% ఓటింగ్ నమోదయిందని ఈసీ వెల్లడించింది. ఎన్నికల సంఘం పక్షపాత ధోరణిలో వ్యవహరిస్తోందని, తమ ఫిర్యాదులను పట్టించుకోవడం లేదని మమత బెనర్జీ ఆరోపించారు. ‘ఉదయం నుంచి 63 ఫిర్యాదులు చేశాం. ఏ ఒక్క ఫిర్యాదు పైనా చర్యలు తీసుకోలేదు. అమిత్ షా ఆదేశాలను మాత్రమే ఈసీ పాటిస్తోంది. దీనిపై మేం కోర్టుకు వెళ్తాం. వేరే రాష్ట్రాల నుంచి గూండాలను తీసుకువచ్చి గందరగోళం చేస్తున్నారు’ అని బోయల్లో బూత్ నెంబర్ 7 బయట కూర్చున్న మమతా పేర్కొన్నారు. బీజేపీ గూండాలు బూత్‌ల స్వాధీనానికి, దొంగ ఓట్లకు పాల్పడుతున్నారన్నారు. టీఎంసీ తరఫున ఏజెంట్లుగా ఉండవద్దని గత రాత్రి తమ పోలింగ్ ఏజెంట్లను బీజేపీ నాయకులు బెదిరించారని మమత ఆరోపించారు. బోయల్లో తమ ఓట్లను వేయనీయడం లేదని పలువురు ఓటర్లు, టీఎంసీ కార్యకర్తలు ఆమెకు ఫిర్యాదు చేయడంతో, ఆ బూత్ వద్ద ఆమె దాదాపు రెండు గంటల పాటు కూర్చున్నారు. బోయల్‌కు మమత చేరుకోగానే అక్కడి బీజేపీ కార్యకర్తలు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. టీఎంసీ కార్యకర్తలు వారిని అడ్డుకోవడంతో ఘర్షణ చోటు చేసుకుంది. దీనిపై గవర్నర్ జగదీప్‌కు ఫోన్ చేసి మమత ఫిర్యాదు చేశారు. కేంద్ర బలగాలు తమను పోలింగ్ బూత్‌లకు వెళ్లనివ్వడం లేదని ఆరోపిస్తూ నందిగ్రామ్ బ్లాక్ 1 రోడ్డును టీఎంసీ కార్యకర్తలు దిగ్బంధించారు. సువేందు అధికారి కారుపై కొందరు దాడి చేశారు. టాకాపుర, సతేంగబరిల్లో ఆయనపై రాళ్లు రువ్వారు. కేశ్పూర్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి తన్మయ్ ఘోష్ కారును కొందరు ధ్వంసం చేశారు. నందిగ్రామ్ ఘటనలపై ప్రధాని మోదీ స్పందిస్తూ.. అక్కడ మమత బెనర్జీ ఓడిపోతున్నారని అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. పోలింగ్‌ను అడ్డుకోలేదు నందిగ్రామ్‌లో పోలింగ్ బూత్ నెంబర్ 7లో పోలిం గ్ సక్రమంగా కొనసాగిందని, అక్కడ ఎవ రూ ఓటర్లను అడ్డుకోలేదని ఎన్నికల సంఘం స్ప ష్టం చేసింది. ఈ మేరకు తమకు ఎన్నికల ప్రత్యేక పరిశీలకుల నుంచి సమాచారం అందిందని పేర్కొంది. అస్సాంలో.. అస్సాంలో రెండో దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 39 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో సాయంత్రం ఐదు గంటల వరకు 77.21% ఓటింగ్ నమోదయింది. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో వెంటనే వాటిని మార్చారు. దాదాపు అన్ని బూత్‌ల్లో ఓటర్లు కోవిడ్ 19 నిబంధనలను పాటిస్తూ ఓటింగ్‌లో పాల్గొన్నారు. మమత వచ్చిన పోలింగ్ కేంద్రం వద్ద వ్యతిరేక నినాదాలు చేస్తున్న గ్రామస్తులు -
దీదీ మరో చోట పోటీ చేస్తున్నారా?
జెయ్‌నగర్/ఉలుబేరియా: పశ్చిమ బెంగాల్ అంతటా బీజేపీ ప్రభంజనం కనిపిస్తోందని, అసెంబ్లీ ఎన్నికల్లో 294 సీట్లకు గాను 200కుపైగా సీట్లు సొంతం చేసుకోబోతున్నామని ప్రధాని∙మోదీ తేల్చిచెప్పారు. ఆయన గురువారం బెంగాల్‌లోని జెయ్‌నగర్, ఉలుబేరియాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మే 2వ తేదీన మమతా బెనర్జీ గద్దె దిగడం ఖాయమని మోదీ స్పష్టం చేశారు. ప్రజలు ఎన్నికల్లో పాల్గొనడం లేదని, రాష్ట్ర అభివృద్ధి కోసం బాటలు పరుస్తున్నారని చెప్పారు. ‘గోడలపై రాసిన రాతలు చదవండి. బెంగాల్ ప్రజలు మిమ్మల్ని శిక్షించబోతున్నారు’ అని మమతనుద్దేశించి వ్యాఖ్యానించారు. నందిగ్రామ్‌లో పరాజయం తప్పదని తేలడంతో చివరి దశ ఎన్నికలు జరిగే స్థానం నుంచి పోటీ చేయడానికి నామినేషన్ వేయాలని మమత నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయని, అవి నిజమో కాదో చెప్పాలన్నారు. ఎక్కడికి వెళ్లినా దీదీకిఓటమి తప్పదన్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా ప్రజలు ఆమెకు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. బెంగాల్లో ఇటీవలే బీజేపీ కార్యకర్త తల్లిని దారుణంగా హత్య చేశారని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి ఘోరం జరిగిన తర్వాత ప్రజలు కూల్‌గా ఉండాలని మమత చెబుతున్నారని, టీఎంసీ నేతలు, కార్యకర్తలు శూల్‌గా(శూలం) మారి ప్రజలను బాధిస్తున్నారని ధ్వజమెత్తారు. ‘అక్రమంగా వలస వచ్చినవారు మీకు సొంత మనషులు. స్వదేశంలోని ప్రజలను బయటివాళ్లు, టూరిస్టులు అంటారా? సొంత ప్రజలపై వివక్ష చూపడం మానుకోండి’ అని హితవు పలికారు. చేసిన ప్రమాణం మరిచారా? బిహార్, ఉత్తరప్రదేశ్ ప్రజలకు వ్యతిరేకంగా మమతా బెనర్జీ విమర్శలు చేయడం దారుణమని ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగం చేసిన ప్రమాణం ఇలాంటి విమర్శలను అనుమతించదని గుర్తుచేశారు. భవానీపూర్ అసెంబ్లీ స్థానాన్ని విడిచిపెట్టి, నందిగ్రామ్‌ను ఎంచుకోవడం ద్వారా పెద్ద తప్పు చేశానన్న నిజాన్ని మమతా బెనర్జీ గ్రహించారని చెప్పారు. నందిగ్రామ్‌లో దీదీకి ఓటమి తప్పదన్నారు. ఆమెకు బెంగాల్ అనేది ఒక ఆట స్థలమని, బీజేపీకి అభివృద్ధి, విద్యా, పరిశ్రమల మైదానం కాబోతోందని వ్యాఖ్యానించారు. జైశ్రీరామ్‌ను సహించలేదు అవసరం కొద్దీ ప్రదర్శించే కాలానుగుణ విశ్వాసాలపై తనకు విశ్వాసం లేదని వ్యాఖ్యానించారు. ‘జైశ్రీరామ్ అని నినదిస్తే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సహించలేదు. దుర్గా విగ్రహాల నిమజ్జనాలపై అసహనం వ్యక్తం చేశారు. ప్రజలు కాషాయం బట్టలు, నుదుటిపై తిలకం ధరించడం, పిలక పెంచుకోవడం పట్ల తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి అభ్యంతరాలున్నాయి. అలాంటి వారిని రాక్షసులుగా సంబోధిస్తోంది’’ అని విమర్శించారు. తాను ఇటీవల బంగ్లాదేశ్ పర్యటించడం, అక్కడి దేవాలయాలను సందర్శించడం ఎన్నికల ప్రవర్తనా నియామవళిని ఉల్లంఘించడమే అవుతుందంటూ తృణమూల్ కాంగ్రెస్ చేసిన ఆరోపణలను మోదీ తిప్పికొట్టారు. జిశోరేశ్వరి కాళీ మందిరాన్ని సందర్శించడం, శ్రీహరిచంద్ ఠాకూర్‌కు నివాళులర్పించడం తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. మన నమ్మకాలు, సంప్రదాయాలను తాము గర్వకారణంగా భావిస్తామని అన్నారు. మీనాక్షి ఆలయంలో మోదీ మోదీ గురువారం తమిళనాడులోని, మదురైలో ఉన్న ప్రఖ్యాత మీనాక్షి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రధానికి ఆలయ పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. సంప్రదాయ చొక్కా, ధోవతి, అంగవస్త్రం ధరించి ప్రధాని ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. నేడు మదురై, కన్యాకుమారిల్లో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. తమిళనాడులో ఏప్రిల్ 6న ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. కన్యాకుమారి లోక్‌సభ ఉప ఎన్నికలోనూ బీజేపీ పోటీ చేస్తోంది. గెలుపు మమతదే: తృణమూల్ సీఎం మమతా బెనర్జీ నందిగ్రామ్‌లో కచ్చితంగా ఓడిపోతారని, అందుకే మరో స్థానాన్ని వెతుక్కుంటున్నారని ప్రధాని మోదీ చేసిన విమర్శలపై తృణమూల్ కాంగ్రెస్ వర్గాలు స్పందించాయి. నందిగ్రామ్‌లో దీదీ ఓడిపోయే ప్రసక్తే లేదని, మరో స్థానం నుంచి పోటీ చేసే ప్రశ్నే లేదని ప్రకటించాయి. -
ముగిసిన నందిగ్రామ్ పోరు
మొత్తానికి కొన్ని చెదురుమదురు ఘటనలతో పశ్చిమబెంగాల్లోని రెండో దశ పోలింగ్ గురువారం ముగిసింది. ఇతర నియోజకవర్గాల మాటెలావున్నా రెండో దశలో అందరి కళ్లూ నందిగ్రామ్‌పైనే వున్నాయి. మూడు దశాబ్దాలక్రితమే ఫైర్‌బ్రాండ్ ఇమేజ్‌తో దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అందరి ఊహలకూ భిన్నంగా ఆ ఒక్క స్థానాన్నే ఎంచుకుని పోటీ చేస్తుండటం ఇందుకు కారణం. అక్కడ పోలైన ఓట్ల శాతం 80 శాతం పైగా వుందంటే పోరాటం ఎంత హోరాహోరీగా సాగిందో అర్థమవుతుంది. ఎనిమిది దశల బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌లో గత నెల 27న 30 స్థానాలకు తొలి దశ పూర్తయింది. రెండో దశలో గురువారం నందిగ్రామ్తోసహా 30 నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. నందిగ్రామ్ పరిధిలోని పోలింగ్ కేంద్రాలన్నిటినీ మమత చక్రాల కుర్చీలో స్వయంగా సందర్శించటం, తమ పార్టీ పోలింగ్ ఏజెంట్లను అనుమతించటంలేదని ఆరోపణలొచ్చినచోట ఎన్నికల అధికారులను కదిలించి పరిస్థితి చక్కదిద్దటం మాత్రమే కాదు... సాధారణ ఓటర్లను బీజేపీ అడ్డగిస్తున్నదని ఆరోపణలొచ్చిన బోయల్ పోలింగ్ కేంద్రం దగ్గర రెండు గంటలపాటు వుండి పర్యవేక్షించటం గమనిస్తే ఆమె పట్టుదలేమిటో అర్థమవుతుంది. ఈ ఎన్నికల్లో మమత అంతా తానై పోరాడారు. రాష్ట్రంలో ఆమెతో సరితూగగలిగినవారు ఎవరూ లేరనే చెప్పాలి. అందుకే బీజేపీ సర్వశక్తులూ ఒడ్డింది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్లతోసహా అతిరథ మహారథులను బీజేపీ మోహరించింది. నందిగ్రామ్ బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి సొంత నియోజకవర్గం కావటం, ఆయన నిన్న మొన్నటివరకూ తృణమూల్‌లో కీలక నేతగా వుండటం కారణంగా అక్కడి ఓటర్లు ఎటు మొగ్గాలో తేల్చుకోవటానికి చాలానే కష్టపడివుంటారు. పంట భూములను అప్పటి లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం భూసేకరణ ద్వారా స్వాధీనం చేసుకోవటానికి ప్రయత్నించినప్పుడు 2007లో సాగించిన పోరులో సువేందు కీలకపాత్ర పోషిం చారు. అప్పట్లో రైతులకు సన్నిహితుడయ్యారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా ఆ నియోజకవర్గ అభివృద్ధికి ఆయన బాగా పాటుబడ్డారని చెబుతారు. అందుకే ఆయన్ను పార్టీలో వుంచటానికి మమత శత విధాల ప్రయత్నించారు. ఆయన తమ వైపు మొగ్గు చూపకపోతే బీజేపీ బహుశా ఇంత హోరాహోరీ పోరాటానికి సిద్ధపడేది కాదు. అధికారానికి రాబోయేది తామే అన్నంత హడావుడి చేసేది కాదు. ఆ స్థాయిలో బీజేపీ హడావుడి చేయకుంటే మమత సైతం అంత పట్టుదలగా తన సొంత నియో జకవర్గాన్ని వదిలి నందిగ్రామ్‌కు కదిలివచ్చేవారు కాదు. ఏమైతేనేం అగ్నికి వాయువు తోడైనట్టు బీజేపీ–సువేందుల కాంబినేషన్ బెంగాల్ ఎన్నికలపై ఉత్కంఠను అనేక రెట్లు పెంచితే... సువేందుతో తాడో పేడో తేల్చకోవటానికి మమత రావటం నందిగ్రామ్‌కు ఓ ప్రత్యేకతను తీసుకొచ్చింది. మమత రాకపోయివుంటే ఆ స్థానం నిస్సందేహంగా సువేందు సొంతమే. ఆ సంగతలావుంచి రాష్ట్రంలో బీజేపీ బలపడటానికి మమత మొదటగా తనను తాను నిందించుకోవాలి. సీపీఎం శ్రేణులు తమ పార్టీవారిని బతకనీయటం లేదని, వారు తమిళనాడు వంటి దూరప్రాంతాలకు పోయి జీవనం సాగించవలసివస్తోందని లెఫ్ట్ ఫ్రంట్ హయాంలో మమత ఆరోపించేవారు. కానీ అధికార పీఠం అందుకున్నాక తమ పార్టీ శ్రేణులపైనా అలాంటి ఆరోపణలే వస్తున్నాయని గుర్తించలేకపోయారు. అవి ఏ స్థాయికి చేరాయంటే ఒకప్పటి వామపక్షాల కార్యకర్తలు తమకెదురవుతున్న వేధింపులు భరించలేక బీజేపీని ఆశ్రయించాల్సివచ్చింది. తమకు మినహా వేరెవరికీ పునాదులు లేకుండా చేయాలన్న లక్ష్యంతోనే తృణమూల్ ఈ పని చేస్తోందని ప్రత్యర్థి పార్టీలు చాన్నాళ్లుగా ఆరోపిస్తు న్నాయి. సంక్షేమంతో, అభివృద్ధితో ప్రజానీకం ఆదరాభిమానాలు పొంది ప్రత్యర్థుల్ని అధిగమిం చటం వేరు... ఫిరాయింపులతో, బెదిరింపులతో దాన్ని సాధించాలనుకోవటం వేరు. ప్రత్యర్థి పార్టీ లకు పునాది లేకుండా చేయటానికి రెండో మార్గాన్ని ఎంచుకుంటే, ఆ ఖాళీ నింపేందుకు మరొక పార్టీ రంగం మీదికొస్తుంది. తృణమూల్ అధికారంలోకి రావటంలో కీలకపాత్ర పోషించిన నందిగ్రామ్ ఉద్యమంలో పాల్గొన్నవారికీ, అప్పట్లో జాడతెలియకుండా పోయినవారి కుటుంబాలకూ 14 ఏళ్ల తర్వాతగానీ ఆర్థిక ఆసరా కల్పించలేకపోవటం తృణమూల్ పాలన తీరుకు అద్దం పడుతుంది. కనుక రాష్ట్రంలో బీజేపీ బలపడటం వెనకున్న కారణాలేమిటో మమత ఆత్మవిమర్శ చేసుకోవాల్సి వుంటుంది. సాగుతున్న పాలనపై తమ మనోభీష్టాన్ని వ్యక్తం చేయటానికీ, సమర్థవంతులైన ప్రతినిధులను ఎంచుకోవటానికీ ఎన్నికలను ప్రజలు ఒక సందర్భంగా భావిస్తారు. కానీ గత కొన్ని దశాబ్దాలుగా మన దేశంలో ఆ ఎన్నికలు కాస్తా వైరి వర్గాల బలప్రదర్శనలుగా మారుతున్నాయి. పరస్పర దూష ణలకు వేదికలవుతున్నాయి. మద్యం, డబ్బు ప్రవహించటం... డాబూ దర్పం చూపటం, సవాళ్లు, ప్రతి సవాళ్లతో సాధారణ ప్రజానీకంలో అనవసర ఉద్రిక్తతలు సృష్టించటం మినహా ఎన్నికలు సాధి స్తున్నదేమీ వుండటం లేదు. పార్టీల మేనిఫెస్టోల్లో సాగు సంస్కరణలు, పెట్రో ధరల పెంపు వంటివి కనబడవు. ఇతరేతర అంశాల ఆసరాతో గద్దెనెక్కాక అవన్నీ జనంమీద స్వారీ చేస్తాయి. ఈ పరిస్థితి మారితేనే ఎన్నికలు అర్ధవంతమవుతాయి. అందులో అసలైన ప్రజాభీష్టం వ్యక్తమవుతుంది. -
బెంగాల్, అస్సాం రెండో విడత పోలింగ్
కోల్‌కతా/గువాహటి: పశ్చిమ బెంగాల్, అసోం రాష్ట్రాల్లో రెండో విడత పోలింగ్ కొనసాగుతుంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు బెంగాల్లో 37.42 శాతం, అసోంలో 33.24 శాతం పోలింగ్ నమోదైంది. 294 అసెంబ్లీ స్థానాలున్న బెంగాల్లో ఎనిమిది విడతల్లో, 126 అసెంబ్లీ స్థానాలున్న అసోంలో మూడు విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే మార్చి 27న తొలి విడత ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. రెండు రాష్ట్రాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. బెంగాల్లో రెండో విడతలో 30 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుండగా.. 171 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 75,94,549 మంది ఓటర్లు వారి భవితవ్యం నిర్ణయించనున్నారు. ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆయా నియోజకవర్గాల పరిధిలో 10,620 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇవాళ ఓటింగ్ జరిగే అన్ని ప్రాంతాలను సున్నితమైనవిగా ఎన్నికల కమిషన్ ప్రకటించింది. అస్సాంలో.. రెండో దశలో ఎన్నికలు జరగనున్న 39 స్థానాల్లో మొత్తం 345 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. బీజేపీ 34 సీట్లలో, మిత్రపక్షాలైన అస్సాం గణ పరిషత్ 6 స్థానాల్లో, యూపీపీఎల్ 3 సీట్లలో పోటీ చేస్తున్నాయి. రెండు స్థానాల్లో బీజేపీ, ఏజీపీ మధ్య, రెండు స్థానాల్లో బీజేపీ, యూపీపీఎల్ మధ్య స్నేహపూర్వక పోటీ నెలకొని ఉంది. మహా కూటమి నుంచి కాంగ్రెస్ 28 సీట్లలో, ఏఐయూడీఎఫ్ 7 స్థానాల్లో, బీపీఎఫ్ 4 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. కొత్తగా ఏర్పడిన అస్సాం జాతీయ పరిషత్ 19 స్థానాల్లో అభ్యర్థులను నిలిపింది. 25 స్థానాల్లో ఎన్డీయే, మహా కూటమి మధ్య ద్విముఖ పోటీ నెలకొన్నది. ఈ రెండో దశ ఎన్నికల బరిలో ఐదుగురు మంత్రులు, డిప్యూటీ స్పీకర్ ఉన్నారు. ఈ రెండో దశ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ బరిలో నిలిచిన నందిగ్రామ్ నియోజకవర్గంపైననే అందరి దృష్టి ఉంది. మమతను ఓడించాలనే లక్ష్యంతో ఉన్న బీజేపీ అగ్ర నేతలు ఈ స్థానంలో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.మమతకు పోటీగా ఒకప్పటి ఆమె విశ్వసనీయ సహచరుడు, టీఎంసీ నుంచి బీజేపీలోకి వచ్చిన సువేందు అధికారిని బీజేపీ పోటీలో నిలిపిన విషయం తెలిసిందే. బెంగాల్లో 30 స్థానాలకు గానూ మొత్తం 191 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వారి భవితవ్యాన్ని 75 లక్షల మంది ఓటర్లు తేల్చనున్నారు. మొత్తం 10,620 పోలింగ్ బూత్‌లను సమస్యాత్మకమైనవిగా ఎన్నికల సంఘం నిర్ధారించి, ఆయా బూత్‌ల వద్ద అదనపు బలగాలను నిలిపింది. తూర్పు మెదినీపుర్(9), పశ్చిమ మెదినీపుర్(9), దక్షిణ 24 పరగణ(4), బంకురా(8) జిల్లాల్లో ఈ రెండో దశ ఎన్నికలు జరుగుతున్నాయి. టీఎంసీ, బీజేపీలు మొత్తం 30 స్థానాల్లో అభ్యర్థులను నిలిపాయి. సీపీఎం 15, కాంగ్రెస్ 13, ఐఎస్ఎఫ్ 2 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. రెండో దశ ఎన్నికలు జరుగుతున్న దాదాపు అన్ని నియోజకవర్గాల్లో మమతా బెనర్జీ ప్రచారం నిర్వహించారు. కాలికి గాయమైన ఆమె వీల్చెయిర్పైననే ఈ ప్రచారంలో పాల్గొన్నారు. బీజేపీ ప్రచారంలో అగ్రనేతలు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా తదితరులు పాల్గొన్నారు. చదవండి: భారీ పోలింగ్ మా విజయానికి సంకేతం నందిగ్రామ్‌లో దీదీ ఓటమి తథ్యం: సర్వే -
బీజేపీ నియంతృత్వాన్ని ఎదిరిద్దాం
న్యూఢిల్లీ/నందిగ్రామ్: బీజేపీ, ఆ పార్టీ నేతృత్వంలో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యంపై, రాజ్యాంగంపై, సమాఖ్య స్ఫూర్తిపై వరుస దాడులు చేస్తున్నాయని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. స్వాతంత్య్రం తరువాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు మునుపెన్నడూ లేనంత దిగువకు దిగజారాయని పేర్కొన్నారు. బీజేపీ నియంతృత్వంపై కలసికట్టుగా పోరాడుదామని విపక్ష నేతలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీయేతర పార్టీల నేతలకు ఆమె రాసిన లేఖను బుధవారం టీఎంసీ విడుదల చేసింది. ‘ఈ లేఖను మీతో పాటు దేశంలోని బీజేపీయేతర పార్టీల నాయకులకు రాస్తున్నాను. ప్రజాస్వామ్యంపై, సమాఖ్య విధానంపై బీజేపీ, కేంద్ర ప్రభుత్వం వరుస దాడులకు పాల్పడుతోంది. ఇది చాలా ఆందోళనకర అంశం. ఈ పరిస్థితుల్లో బీజేపీకి వ్యతిరేకంగా కలిసి పోరాడాల్సిన, ఒక ప్రత్యామ్నాయ వేదికను ప్రజలకు అందించాల్సిన సమయం ఆసన్నమైంది’ అని కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ సహా విపక్ష నాయకులకు రాసిన లేఖలో మమత పేర్కొన్నారు. ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్(ఎల్జీ)కి అపరిమిత అధికారం, ఢిల్లీ ప్రభుత్వమంటే ఎల్జీనే అని స్పష్టం చేసే చట్టంపై లేఖలో మమత మండిపడ్డారు. ‘ఆ చట్టంతో ప్రజలు ఎన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రం అధికారాలను లాగేసుకుంది. ఆ అధికారాలను తన ప్రతినిధి అయిన ఎల్జీ చేతిలో పెట్టింది. ఎల్జీని అప్రకటిత ఢిల్లీ వైస్రాయ్గా మార్చింది’ అని మమత వివరించారు. ఢిల్లీలో 2014, 2019 ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ.. ప్రజా తీర్పును బీజేపీ అంగీకరించడం లేదన్నారు. ఆ చట్టం భారతదేశ సమాఖ్య విధానంపై జరిపిన ప్రత్యక్ష దాడి అని ఆమె అభివర్ణించారు. సోనియాతో పాటు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, వైఎస్సార్సీపీ చీఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్, సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, జేఎంఎం నేత హేమంత్ సోరెన్, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్, బీజేడీ నాయకుడు నవీన్ పట్నాయక్, నేషనల్ కాన్ఫెరెన్స్‌కు చెందిన ఫారూఖ్ అబ్దుల్లా, పీడీపీ చీఫ్ మెహబూబా, సీపీఐఎంఎల్ నేత దీపాంకర్ భట్టాచార్యలకు మమత ఈ లేఖను పంపించారు. బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు కేంద్రం నిధులు ఇవ్వకుండా వివక్ష చూపుతోందని విమర్శించారు. తద్వారా ఆయా రాష్ట్రాల్లో సంక్షేమ పథకాల అమలును ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటోందన్నారు. రాష్ట్రాలు తమ డిమాండ్లను కేంద్రం దృష్టికి తీసుకువచ్చే జాతీయ అభివృద్ధి మండలి, అంతర్రాష్ట్ర మండలి, ప్రణాళిక సంఘం... తదితర వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలను మున్సిపాలిటీల స్థాయికి కుదించాలని, దేశంలో ఏకపార్టీ అధికార వ్యవస్థ కోసం కుట్ర పన్నుతోందని బీజేపీపై ఆరోపణలు గుప్పించారు. అక్రమ మార్గాల ద్వారా సేకరించిన నిధులను రాష్ట్రాల్లో విపక్ష పార్టీలను అధికారంలో నుంచి కూలదోయడానికి, బీజేపీలోకి ఫిరాయింపులను ప్రోత్సహించడానికి ఉపయోగిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రజల ఆస్తులని, వాటిని ప్రైవేటు పరం చేయాలన్న బీజేపీ ఆలోచన నిర్లక్ష్యపూరితమైందని విమర్శించారు. బీజేపీ నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా పోరాడేందుకు కలిసి రావాలని బీజేపీయేతర పార్టీల నాయకులను ఆమె కోరారు. కలిసికట్టుగా పోరాడితేనే విజయం సాధించగలమని, ఈ అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఈ విషయంలో ఒక కార్యాచరణ రూపొందించే విషయమై చర్చిద్దామని ఆమె ప్రతిపాదించారు. మమత లేఖపై బీజేపీ స్పందించింది. మమత డిక్షనరీలో లేని పదమే ప్రజాస్వామ్యమని వ్యాఖ్యానించింది. మమత ప్రతిపాదనకు పీడీపీ చీఫ్, జమ్మూకశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ నుంచి మద్దతు లభించింది. కోట్లు కుమ్మరిస్తున్నారు ఎన్నికల్లో గెలవడం కోసం బీజేపీ నేతలు కోట్ల రూపాయలను ఓటర్లకు పంచిపెడ్తున్నారని మమతా బెనర్జీ ఆరోపించారు. దీనిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఓటర్లను భయపెట్టేందుకు యూపీ, బిహార్ రాష్ట్రాల నుంచి గూండాలను దింపుతున్నారన్నారు. బీజేపీ నేతలు ఇదంతా బహిరంగంగా చేస్తోంటే.. ఈసీ ఏం చేస్తోందని ప్రశ్నించారు. నందిగ్రామ్‌లో తనపై దాడి చేసిన వారి వివరాలు తెలిశాయని, ఎన్నికల తరువాత ఆ విషయం చూస్తానని పేర్కొన్నారు. మరోవైపు, మమత బెనర్జీపై బీజేపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. బీజేపీ కార్యకర్తలు, మద్దతుదారులను ఆమె బెదిరిస్తున్నారని ఆరోపించారు. -
నందిగ్రామ్‌లో దీదీ ఓటమి తథ్యం: సర్వే
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు మొదటి దశ పూర్తైన సంగతి తెలిసిందే. రెండో దశ ఎన్నికలు ఏప్రిల్ 1న జరగనున్నాయి. ఈ ఎన్నిక పట్ల బెంగాల్ వాసులతో పాటు దేశప్రజలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే రెండో దశ పోలింగ్‌లో మమతా బెనర్జీ పోటీ చేస్తున్న నందిగ్రామ్‌లో కూడా ఓటింగ్ జరగనుంది. పార్టీ నుంచి బయటకు వెళ్లి బీజేపీలో చేరిన సువేందు అధికారి నందిగ్రామ్‌లో మమతతో తలపడనున్నారు. దాంతో దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఆ సంగతి పక్కకు పెడితే గత రెండు మూడు రోజులుగా నందిగ్రామ్ ఫలితాలకు సంబంధించి రెండు, మూడు సర్వేలు బెంగాల్ సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. వీటి సారాంశం ఏంటంటే మమతా బెనర్జీ నందిగ్రామ్‌లో ఘోర పరాజయం చవి చూడబోతున్నారు. సువేందు దీదీని దారుణంగా ఓడించబోతున్నాడని సర్వేలు తెలిపాయి. ఇక్కడ మరో ఆసక్తికర అంశం ఏంటంటే ఈ సర్వేలన్నింటిని పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్ సంస్థ ఐ పాక్ నిర్వహించిందనే వార్తలు జనాలను మరింత ఆశ్చర్యచకితులను చేశాయి. ఈ క్రమంలో ఐ పాక్ సంచలన ప్రకటన చేసింది. తమ సంస్థ నిర్వహించినట్లు చెప్పుకుంటున్న సదరు సర్వే ఫేక్ అని స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఐపాక్ ‘‘గత కొద్ది రోజులుగా నందిగ్రామ్ ఓటింగ్‌కు సంబంధించి సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న సర్వే ఫేక్. బీజేపీ నాయకులు, వారి హామీల్లానే ఈ సర్వే కూడా అవాస్తవం. ఇలాంటి ఫేక్ రిపోర్ట్స్‌ను ప్రచారం చేసి జనాలను ప్రభావితం చేయాలని భావిస్తున్నారు. కానీ వారి ప్రయత్నాలు ఫలించవు. అసలు ఐ పాక్ డెస్క్ టాప్‌లను వినియోగించదు.. మరింత స్మార్ట్‌గా ఆలోచించండి’’ అంటూ ట్వీట్ చేసింది. Facing imminent defeat, @BJP4Bengal has now gone down to the level of using FAKE surveys in the name of I-PAC to keep the morale of their workers up!! P.S: In I-PAC, no one uses desktops so at-least be smart in your effort to create fake survey / reports! 😉🤣 pic.twitter.com/lFaOo0DshU — I-PAC (@IndianPAC) March 31, 2021 చదవండి: నేను పులి: ‘నందిగ్రామ్’లో మమతా బెనర్జీ గర్జన -
కేంద్ర బలగాల అదుపులో నందిగ్రామ్: ఈసీ
సాక్షి, న్యూఢిల్లీ: నందిగ్రామ్ ఈ పేరు పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు మెదలైనప్పటి నుంచి ఎదో ఓ రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. దశాబ్దాల వామపక్ష పాలనకు చరమగీతం పాడుతూ, మమతా బెనర్జీని అధికార పీఠంపై కూర్చోపెట్టడంలో కీలకంగా మారిన నందిగ్రామ్.. 14 ఏళ్ల తర్వాత మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో కేంద్ర బిందువైంది. పశ్చిమ బెంగాల్లో మొదటి దశ పోలింగ్ తరువాత ఇప్పుడు అందరి దృష్టి నందిగ్రామ్‌పైనే ఉంది. అంత కీలకం కాబట్టే ఎలక్షన్ కమీషన్ కేంద్ర బలగాలతో పోలింగ్ రోజున ఈ నియోజకవర్గాన్ని పూర్తిగా తమ అదుపులో ఉంచనున్నట్లు తెలిపింది. ఎన్నికల రోజైన ఏప్రిల్ 1న 22 కేంద్ర బలగాల కంపెనీల సిబ్బందితో పాటు, 22 క్యూఆర్టి టీం (అత్యవసరంగా స్పందించే కూటమి) నందిగ్రామ్‌లో విధులు నిర్వహించబోతున్నారు. వీరు పోలింగ్ ప్రదేశాలలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పర్యవేక్షించడమే ప్రధాన ఎజెండాగా పని చేయనున్నట్లు ఈసీ తెలిపింది. కంపెనీగా పిలువబడే ఈ కేంద్ర బలగాలలో 100 మంది సిబ్బంది ఉంటారు. అదనంగా కోల్‌కత్తాలోని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కార్యాలయంలోని ఒక ప్రత్యేక బృందం కూడా నందిగ్రామ్ పరిస్థితిని పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. నందిగ్రామ్‌కు సంబంధించి మొత్తం 355 పోలింగ్ బూత్‌లు ఉన్నాయి, వాటిలో 75 శాతం కేంద్రాలకు వెబ్‌కాస్టింగ్ సౌకర్యాన్నిఏర్పాటు చేశారు. దీంతో సమస్యాత్మక ప్రాంతాలన్ని దీని ద్వారా నిరంతరం పర్యవేక్షించే అవకాశం ఉంటుంది. నందిగ్రామ్‌లో ఎక్కడ కూడా హింసకు తావులేకుండా, ప్రజాస్వామ్యబద్ధంగా పోలింగ్ జరగడం కోసం అన్నిఏర్పాట్లను పూర్తి చేసినట్లు కమీషన్ అధికారి తెలిపారు. ఎందుకు నందిగ్రామ్‌కే ఇంత భద్రత చాలా సంవత్సరాల పాటు మమతకు కుడిభుజంగా ఉన్న సుబేందు ఒక్కసారిగా ప్లేటు మార్చేసి బీజేపీలోకి ఫిరాయించిన సంగతి తెలిసిందే. ఫిరాయించిన సుబేందు ఊరికే ఉండకుండా ధైర్యముంటే తనపై నందిగ్రామ్ నుంచి పోటీచేసి గెలవాలంటు మమతకు సవాలు విసిరారు. మామాలుగానే మమత ఫైర్ బ్రాండ్‌గా పేరుంది, దీంతో ఈ సవాలును స్వీకరించడంతో నందిగ్రామ్ ప్రతిష్టాత్మకంగా మారింది. సుబేందు కుటుంబానికి నందిగ్రామ్ చుట్టుపక్కలున్న దాదాపు 40 నియోజకవర్గాల్లో మంచి పట్టుంది. ఇంతటి సుబేందే ఓడిపోతే బీజేపీకి దిక్కెవరు ? అసలు సుబేందు కుటుంబాన్ని చూసుకునే నరేంద్రమోడి, అమిత్ బెంగాల్లో మమతపై రెచ్చిపోతున్నారు. ఎలాగైనా నందిగ్రామ్ గెలిచి తన సత్తా చాటాలని తీవ్రంగా శ్రమిస్తోంది. రెండోదశ ఎన్నికలో నందిగ్రామ్ కూడా ఉండటంతో పోలింగ్ అయ్యేవరకు మమత ఈ నియోజకవర్గంలోనే క్యాంపువేశారు. ప్రస్తుతం ఒకవైపు కేంద్రబలగాలు మరోవైపు రాష్ట్ర పోలీసులు నియోజకవర్గం మొత్తం దిగేశారు. మొత్తానికి ఈ ఎన్నికల్లో నందిగ్రామ్ నియోజకవర్గం గెలుపు కోసం నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్న ఈ వార్ లో విజయంతో ఎవరిదో తెలియాలంటే ఫలితాలు వెలువడే వరకు వేచి చూడాల్సిందే. ( చదవండి : West Bengal Election 2021: ‘నందిగ్రామ్’ పోరు రసవత్తరం ) -
West Bengal Election 2021: ‘నందిగ్రామ్’ పోరు రసవత్తరం
సాక్షి, న్యూఢిల్లీ: దశాబ్దాల వామపక్ష పాలనకు చరమగీతం పాడుతూ, మమతా బెనర్జీని అధికార పీఠంపై కూర్చోపెట్టడంలో కీలకంగా మారిన నందిగ్రామ్.. 14 ఏళ్ల తర్వాత మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో కేంద్ర బిందువైంది. పశ్చిమ బెంగాల్లో మొదటి దశ పోలింగ్ తరువాత ఇప్పుడు అందరి దృష్టి నందిగ్రామ్‌పైనే ఉంది. ఎందుకంటే ఏప్రిల్ 1న రాష్ట్రంలో జరిగే రెండో దశ ఎన్నికలలో బంకురా, పశ్చిమ మేదినీపూర్, తూర్పు మేదినీపూర్, దక్షిణ 24 పరగణాల పరిధిలోని నాలుగు జిల్లాలలో కలిపి 30 అసెంబ్లీ నియోజకవర్గాలలో పోలింగ్ జరుగనుంది. ఈ దశలో హాట్ టాపిక్‌గా మారిన నందిగ్రామ్ నుంచి బీజేపీ అభ్యర్థి సువేందు అధికారిపై సీఎం మమతా బెనర్జీ పోటీ చేస్తున్నారు. నందిగ్రామ్‌లోనే మకాం వేసిన సువేందును ఢీకొట్టేందుకు టీఎంసీ అభ్యర్థి, సీఎం మమతా బెనర్జీ సోమ, మంగళవారాల్లో రెండు రోజుల వ్యవధిలో 6 ర్యాలీల్లో పాల్గొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలనే పట్టుదలతో ఉన్న బెనర్జీ నందిగ్రామ్‌లో ఒక ఇంటిని కూడా అద్దెకు తీసుకొని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. మరోవైపు సువేందు అధికారి తరఫున కమలదళం తరపున హోం మంత్రి అమిత్ షా మంగళవారం భారీ రోడ్‌షో నిర్వహించారు. పరస్పరం తీవ్ర ఆరోపణలు ఏప్రిల్ 1వ తేదీన పోలింగ్ జరుగబోయే నందిగ్రామ్‌లో ప్రచారపర్వం మంగళవారం సాయంత్రంతో ముగిసింది. నందిగ్రామ్‌లో పోటీ చేస్తున్న మమతా బెనర్జీని కనీసం 50 వేల ఓట్ల తేడాతో ఓడిస్తానని, లేనిపక్షంలో రాజకీయాలను విడిచి పెడతానని సువేందు అధికారి ప్రతిజ్ఞ చేసిన విషయం తెలిసిందే. ఇటీవల ఒక ర్యాలీలో సువేందు, అతని తండ్రి శిశిర్, సోదరుడు సౌమేందులు విషసర్పాలుగా మారుతారనే విషయం తనకు అర్థం కాలేదని దీదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కీలకంగా ఆ ముగ్గురు నేతలు నందిగ్రామ్‌లో సువేందు హిందుత్వ ఎజెండాతో హిందూ ఓట్ల ఏకీకరణే లక్ష్యంగా దూసుకెళ్తుండగా, మమతా బెనర్జీ తన అభివృద్ధి పనులతో పాటు, అధికారి కుటుంబాన్ని టార్గెట్‌గా చేసుకొని ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ జనాభాలో 30 శాతం ఉన్న ముస్లిం ఓట్లు తమకే పడతాయని దీదీ నమ్మకంతో ఉన్నారు. 2016లో టీఎంసీ టికెట్‌తో 68 వేల ఓట్లతో సువేందు గెలిచారు. అయితే పోలింగ్‌కు ఇంకా కొద్ది రోజులు మాత్రమే సమయం ఉండడంతో బీజేపీ, టీఎంసీలు స్థానికంగా పేరున్న నాయకులు సుఫియాన్ షేక్, అబూ తాహెర్, మేఘనాథ్ పాల్‌లకు సంబంధించిన సమస్యలపై పోరాడుతున్నాయి. ఒక సమయంలో ఈ ముగ్గురు నాయకులు సువేందుకు చాలా దగ్గరగా ఉండేవారు. మారిన పరిణామాల నేపథ్యంలో అబూ తాహెర్, సుఫియాన్ షేక్ మమతా బెనర్జీకి అండగా నిలబడగా, మేఘనాథ్ పాల్ సువేందుతో కొనసాగుతున్నారు. అయితే సువేందుకు వీరిద్దరు దూరమైన తర్వాత తాహెర్, షేక్‌లపై కొనసాగుతున్న కేసులపై దర్యాప్తు జరపాలంటూ ఇటీవల కోర్టులో పిటిషన్ దాఖలైంది. మరోవైపు మేఘనాథ్ పాల్ ఇంట్లో సువేందు గుండాలు దాక్కున్నారని ఆరోపిస్తూ టీఎంసీ ఇప్పటికే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ ముగ్గురు స్థానిక నాయకులు నందిగ్రామ్‌లో ఎవరు గెలవాలన్న అంశంపై గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తారు. ఉద్ధండులు వర్సెస్ ఫైర్‌బ్రాండ్ మరోవైపు ఇద్దరు ఉద్ధండులను ధీటుగా ఎదుర్కొనేందుకు వామపక్షాలు ఫైర్ బ్రాండ్‌గా పేరున్న డివైఎఫ్ నాయకురాలు మీనాక్షి ముఖర్జీని బరిలోకి దింపాయి. ఆమె ఒకప్పుడు వామపక్షాల కంచుకోట అయిన నందిగ్రామ్‌లో తిరిగి ఎర్రజెండా రెపరెపలాడించేందుకు గ్రామాల్లో పర్యటిస్తూ ప్రచారాన్ని చేస్తున్నారు. ఇటీవల సౌతఖాలీ, గార్చక్రబేరియా, కాళిచరణ్, సోనాచురా బజార్, తఖాలీ వంటి ప్రాంతాల్లో మీనాక్షి ప్రచార ర్యాలీలు చేపట్టారు. అంతేగాక 2011లో వామపక్ష కూటమి ప్రభుత్వం పడిపోవడానికి కారణమైన నందిగ్రామ్ భూసేకరణ అంశాన్ని అప్పుడు వ్యతిరేకించిన భూమి ఉచ్చేద్ ప్రతిరోధ్ కమిటీలోని ప్రముఖులు మీనాక్షికి మద్దతు ఇస్తున్నారు. బెంగాల్, అస్సాంలలో ముగిసిన ప్రచారం కోల్‌కతా/గువాహటి: పశ్చిమబెంగాల్, అస్సాంలలో ఏప్రిల్ ఒకటో తేదీన జరగనున్న రెండో దశ పోలింగ్‌కు మంగళవారం సాయంత్రంతో ప్రచారం ముగిసింది. అస్సాం అసెంబ్లీలోని 126 సీట్లకుగాను 39 స్థానాలకు, బెంగాల్‌లోని 284 నియోజకవర్గాలకు గాను 30 చోట్ల ఏప్రిల్ ఒకటో తేదీన పోలింగ్ జరగనుంది. అస్సాంలో రెండోదశలో అదృష్టాన్ని పరీక్షించుకోనున్న 345 మంది అభ్యర్థుల్లో 174 మంది స్వతంత్రులున్నారు. మొత్తం 345 మందిలో 37 మందికి నేర చరిత్ర ఉండగా అందులో 30 మందిపై తీవ్ర నేరారోపణలున్నాయి. నేర చరితుల్లో బీజేపీకి చెందిన 11 మంది, కాంగ్రెస్, ఏఐయూడీఎఫ్‌కు చెందిన ఐదుగురు చొప్పున ఉండటం గమనార్హం. అదేవిధంగా, బెంగాల్‌లోని నాలుగు జిల్లాల్లో రెండోదశ పోలింగ్ జరిగే 30 నియోజకవర్గాల్లో 171 మంది బరిలో నిలిచారు. పోలింగ్ బందోబస్తు కోసం 651 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసులను రంగంలోకిదించారు. -
నందిగ్రామ్ లో హై వోల్టేజ్ పొలిటికల్ వార్
-
నేను పులి: ‘నందిగ్రామ్’లో మమతా బెనర్జీ గర్జన
కోల్కత్తా: అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా రెండో దశ పోలింగ్ ఏప్రిల్ 1వ తేదీన జరగనుంది. పశ్చిమ బెంగాల్లో ఈ రెండో దశ పోలింగ్‌లో ప్రముఖులు పోటీ చేస్తున్న స్థానాలు ఉన్నాయి. దీంతో ప్రచారంలో ఆఖరి రోజు సోమవారం హోరాహోరీగా ప్రచారం సాగింది. ఈ సందర్భంగా మమతా బెనర్జీ తాను పోటీ చేస్తున్న నందిగ్రామ్‌లో చక్రాల కుర్చీపైనే కూర్చుని భారీ బహిరంగ సభ నిర్వహించారు. చక్రాల కుర్చీలో కూర్చునే 8 కిలోమీటర్ల భారీ ర్యాలీలో మమత పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ తీరుపై గర్జించారు. బీజేపీని టార్గెట్‌గా చేసుకుని మాట్లాడిన మమత అనంతరం తన పదేళ్ల పాలనను వివరించారు. ‘నేను బెంగాల్ టైగర్’ను అంటూ మమతా బెనర్జీ ప్రకటించారు. తన ముందు ప్రత్యర్థులు పనికి రారు అని పేర్కొన్నారు. నాపై దాడి చేయడానికి ఉత్తరప్రదేశ్, బిహార్ నుంచి గూండాలను రప్పిస్తున్నారని బీజేపీపై మండిపడ్డారు. ప్రేమించే సంస్కృతి లేనివారు రాజకీయాలకు పనికి రారు అని హితవు పలికారు. వారి దాడులను తాను సింహంలాగా స్పందిస్తానని మమతా చెప్పారు. ఈ సందర్భంగా తనను తాను ‘రాయల్ బెంగాల్ టైగర్’గా మమతా అభివర్ణించుకున్నారు. ఉత్తరప్రదేశ్, బిహార్ గూండాలు వస్తే గిన్నెలు, పాత్రలతో దాడి చేయండి అని మమతా మహిళలకు పిలుపునిచ్చారు. మమతాకు పోటీగా ఆమె మాజీ అనుచరుడు సువేందు అధికారి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అందుకే నందిగ్రామ్ నియోజకవర్గం హాట్ టాపిక్‌గా మారింది. ఈ స్థానానికి రెండో దశలో భాగంగా ఏప్రిల్ 1వ తేదీన పోలింగ్ జరగనుంది. దీంతో రెండు రోజుల ముందట ప్రచారం ముగిసింది. -
బీజేపీ గూండాలను తరమండి
కోల్‌కతా/నందిగ్రామ్: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోకుండా చేయడానికి బీజేపీ కుట్రలు పన్నుతోందని, బయటి నుంచి గూండాలను దిగుమతి చేస్తోందని తృణమూల్ చీఫ్ మమతా బెనర్జీ ఆరోపించారు. గరిటెలు, అట్లకాడలు, వంట పాత్రలతో బీజేపీ గూండాలను తరిమికొట్టాలని మహిళలకు పిలుపునిచ్చారు. పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలోని నారాయణగఢ్, పింగ్లాలో శనివారం ఎన్నికల ప్రచార సభల్లో ఆమె ప్రసంగించారు. నందిగ్రామ్‌లో తనపై బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సువేందు అధికారిపై మరోసారి విరుచుకుపడ్డారు. ఆయన కుటుంబ సభ్యులు ద్రోహులని దుయ్యబట్టారు. సువేందు అధికారి కుటుంబ సభ్యుడొకరు శుక్రవారం రాత్రి ఓటర్లకు డబ్బులు పంచుతూ దొరికిపోయాడని అన్నారు. అతడిని మహిళలు పట్టుకొని పోలీసులకు అప్పగించారని చెప్పారు. బయటి నుంచి వచ్చిన మరో 30 మంది గూండాలను కూడా మహిళలు పోలీసులకు అప్పగించారని పేర్కొన్నారు. నందిగ్రామ్‌లో ద్రోహులపై కన్నేశా: అసెంబ్లీ ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి మమతా బెనర్జీ విజ్ఞప్తి చేశారు. నందిగ్రామ్‌లో మీర్ జాఫర్లపై(ద్రోహులు) ఓ కన్నేసి ఉంచానని వ్యాఖ్యానించారు. సువేందు అధికారికి, అతడి సోదరులకు మంచి పదవులు కట్టబెట్టానని గుర్తుచేశారు. అయినప్పటికీ వారు తృణమూల్ కాంగ్రెస్‌ను దగా చేసి, బీజేపీలో చేరారని విమర్శించారు. డబ్బుకు అమ్ముడుపోయారని ధ్వజమెత్తారు. బీజేపీ, తృణమూల్ కార్యకర్తల ఘర్షణ పూర్బ మేదినీపూర్ జిల్లాలోని నందిగ్రామ్‌లో శనివారం బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారని పోలీసులు వెల్లడించారు. సీఎం మమతా బెనర్జీ పోటీ చేస్తున్న నందిగ్రామ్ స్థానంలో ఏప్రిల్ 1న ఎన్నికలు జరుగనున్నాయి. బీజేపీ బయటి నుంచి తీసుకొచ్చిన రౌడీలు తమపై దాడి చేశారని మమతా బెనర్జీ ఎలక్షన్ ఏజెంట్ షేక్ సూఫియాన్ ఆరోపించారు. తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు ముగ్గురు గాయాలపాలయ్యారని అన్నారు. -
మమత ఆడియో కలకలం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆమె మాట్లాడినట్లుగా చెబుతున్న ఓ ఆడియో క్లిప్‌ను ప్రతిపక్ష బీజేపీ శనివారం విడుదల చేసింది. నందిగ్రామ్‌కు చెందిన బీజేపీ నేత ప్రళయ్ పాల్‌తో ఆమె మాట్లాడినట్లు, మళ్లీ తృణమూల్ కాంగ్రెస్‌లో చేరాలని, తన గెలుపునకు సహకరించాలని అభ్యర్థిస్తున్నట్లుగా ఈ ఆడియోలో ఉండడం కలకలం రేపుతోంది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ నందిగ్రామ్ స్థానం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక్కడ ఆమెపై బీజేపీ అభ్యర్థిగా సువేందు అధికారి బరిలోకి దిగుతున్నారు. ఇద్దరూ బలమైన అభ్యర్థులే కావడంతో నందిగ్రామ్‌పై అందరి దృష్టి పడింది. ప్రళయ్ పాల్ గతంలో తృణమూల్ కాంగ్రెస్‌లో క్రియాశీలకంగా పనిచేశాడు. సువేందు అధికారితో కలిసి బీజేపీలో చేరాడు. ప్రళయ్ పాల్‌తో మమతా బెనర్జీ వ్యక్తిగతంగా మాట్లాడినట్లు బీజేపీ చెబుతోంది. ఆడియో క్లిప్‌లో ఏముందంటే.. ‘నందిగ్రామ్‌లో నేను నెగ్గడానికి సహకరించు. నీకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయని నాకు తెలుసు. ఇకపై నీకు ఏం కావాలన్నా నేను చూసుకుంటా’’ అని మమత హామీ ఇవ్వగా, ప్రళయ్ పాల్ స్పందిస్తూ.. ‘‘దీదీ (అక్కా).. మీరు నాకు ఫోన్ చేశారు. అది చాలు. సువేందు అధికారికి ద్రోహం చేయలేను’ అని పేర్కొన్నాడు. ఈ ఆడియో విషయంలో ప్రళయ్ పాల్ మీడియాతో మాట్లాడాడు. ప్రస్తుతం బీజేపీ కోసం పనిచేస్తున్నానని, ఆ పార్టీని మోసం చేయలేనని అన్నాడు. ఎలక్టోరల్ అధికారికి బీజేపీ ఫిర్యాదు మమతా బెనర్జీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, తమ పార్టీ నేతలను ప్రలోభాలకు గురి చేస్తున్నారని బీజేపీ ఆరోపించింది. బీజేపీ ప్రధాన కార్యదర్శి ౖMðలాశ్ విజయ్ వర్గీయా నేతృత్వంలో ఓ బృందం బెంగాల్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌ను కలిసింది. ఆడియో క్లిప్‌ను అందజేసింది. ఈ ఆడియో క్లిప్ వాస్తవికతపై తృణమూల్ కాంగ్రెస్ అనుమానాలు వ్యక్తం చేసింది. ప్రళయ్ పాల్ గతంలో తమ పార్టీ నాయకుడేనని, అతడితో మాట్లాడి, సాయం కోరితే తప్పేముందని ఆ పార్టీ నేత కునాల్ ప్రశ్నించారు. రాజకీయాల్లో ఇదంతా సహజమేనని తేల్చిచెప్పారు.