కేం‍ద్ర బలగాల అదుపులో నందిగ్రామ్‌: ఈసీ | 22 Companies Of Central Forces To Be Deployed In Bengal Nandigram On Poll Day | Sakshi
Sakshi News home page

ఆ రోజు నందిగ్రామ్‌ను కేంద్ర బలగాలతో కప్పనున్న ఈసీ

Published Wed, Mar 31 2021 3:57 PM | Last Updated on Wed, Mar 31 2021 4:03 PM

22 Companies Of Central Forces To Be Deployed In Bengal Nandigram On Poll Day - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: నందిగ్రామ్‌ ఈ పేరు పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలు మెదలైనప్పటి నుంచి ఎదో ఓ రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. దశాబ్దాల వామపక్ష పాలనకు చరమగీతం పాడుతూ, మమతా బెనర్జీని అధికార పీఠంపై కూర్చోపెట్టడంలో కీలకంగా మారిన నందిగ్రామ్‌.. 14 ఏళ్ల తర్వాత మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో కేంద్ర బిందువైంది. పశ్చిమ బెంగాల్‌లో మొదటి దశ పోలింగ్‌ తరువాత ఇప్పుడు అందరి దృష్టి నందిగ్రామ్‌పైనే ఉంది. అంత కీలకం కాబట్టే ఎలక్షన్‌ కమీషన్‌ కేంద్ర బలగాలతో పోలింగ్‌ రోజున ఈ నియోజకవర్గాన్ని పూర్తిగా తమ అదుపులో ఉంచనున్నట్లు తెలిపింది. 

ఎన్నికల రోజైన ఏప్రిల్‌ 1న 22 కేంద్ర బలగాల కంపెనీల సిబ్బందితో పాటు, 22 క్యూఆర్‌టి టీం (అత్యవసరంగా స్పందించే కూటమి) నందిగ్రామ్‌లో విధులు నిర్వహించబోతున్నారు. వీరు పోలింగ్‌ ప్రదేశాలలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పర్యవేక్షించడమే ప్రధాన ఎజెండాగా పని చేయనున్నట్లు ఈసీ తెలిపింది. కంపెనీగా పిలువబడే ఈ కేంద్ర బలగాలలో 100 మంది సిబ్బంది ఉంటారు. అదనంగా కోల్‌కత్తాలోని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కార్యాలయంలోని ఒక ప్రత్యేక బృందం కూడా నందిగ్రామ్ పరిస్థితిని పర్యవేక్షించనున్నట్లు తెలిపారు.

నందిగ్రామ్కు సంబంధించి మొత్తం 355 పోలింగ్ బూత్‌లు ఉన్నాయి, వాటిలో 75 శాతం కేంద్రాలకు వెబ్‌కాస్టింగ్ సౌకర్యాన్నిఏర్పాటు చేశారు. దీంతో సమస్యాత్మక ప్రాంతాలన్ని దీని ద్వారా నిరంతరం పర్యవేక్షించే అవకాశం ఉంటుంది. నందిగ్రామ్‌లో ఎక్కడ కూడా హింసకు తావులేకుండా, ప్రజాస్వామ్యబద్ధంగా పోలింగ్ జరగడం కోసం అన్నిఏర్పాట్లను పూర్తి చేసినట్లు కమీషన్‌ అధికారి తెలిపారు.

 ఎందుకు నందిగ్రామ్‌కే ఇంత భద్రత
 చాలా సంవత్సరాల పాటు మమతకు కుడిభుజంగా ఉన్న సుబేందు ఒక్కసారిగా ప్లేటు మార్చేసి బీజేపీలోకి ఫిరాయించిన సంగతి తెలిసిందే. ఫిరాయించిన సుబేందు ఊరికే ఉండకుండా ధైర్యముంటే తనపై నందిగ్రామ్ నుంచి పోటీచేసి గెలవాలంటు మమతకు సవాలు విసిరారు. మామాలుగానే మమత ఫైర్‌ బ్రాండ్‌గా పేరుంది, దీంతో ఈ సవాలును స్వీకరించడంతో నందిగ్రామ్‌ ప్రతిష్టాత్మకంగా మారింది. సుబేందు కుటుంబానికి నందిగ్రామ్ చుట్టుపక్కలున్న దాదాపు 40 నియోజకవర్గాల్లో మంచి పట్టుంది. ఇంతటి సుబేందే ఓడిపోతే బీజేపీకి దిక్కెవరు ? అసలు సుబేందు కుటుంబాన్ని చూసుకునే నరేంద్రమోడి, అమిత్ బెంగాల్లో మమతపై రెచ్చిపోతున్నారు. ఎలాగైనా నందిగ్రామ్‌ గెలిచి తన సత్తా చాటాలని తీవ్రంగా శ్రమిస్తోంది. రెండోదశ ఎన్నికలో నందిగ్రామ్ కూడా ఉండటంతో పోలింగ్ అయ్యేవరకు మమత ఈ‌ నియోజకవర్గంలోనే క్యాంపువేశారు.  ప్రస్తుతం  ఒకవైపు కేంద్రబలగాలు మరోవైపు రాష్ట్ర పోలీసులు నియోజకవర్గం మొత్తం దిగేశారు. మొత్తానికి ఈ ఎన్నికల్లో నందిగ్రామ్‌ నియోజకవర్గం గెలుపు కోసం నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్న ఈ వార్‌ లో విజయంతో ఎవరిదో తెలియాలంటే ఫలితాలు వెలువడే వరకు వేచి చూడాల్సిందే.  ( చదవండి : West Bengal Election 2021: ‘నందిగ్రామ్‌’ పోరు రసవత్తరం )

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement